Pages

Saturday, December 29, 2012

జోహార్లు చిట్టి తల్లీ!


పదమూడు రోజుల పాటు మృత్యువుతో హౌరాహౌరీ పోరాడి అలసి సొలసి ఆఖరి శ్వాస విడిచిన గ్యాంగ్‌రేప్‌ బాధిత యువతి కోసం చెమ్మగిల్లని కళ్లేవీ దేశంలో వుండవు. మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం అని కవి రాసిన మాటలు ఇక్కడ మొత్తం దేశానికి వర్తిస్తాయి. దేశాధినేతలు అన్ని పార్టీల ప్రముఖులూ సకల జన సమూహాలు శోకతప్త హృదయాలతో ఆమెకు ఆఖరి నివాళి సమర్పిస్తూనే అత్యాచార భారతాన్ని అంతమొందించాలని ప్రతిజ్ఞబూనుతున్నారంటే ఆమె మరణం ఎంత ప్రభావం చూపిందో తెలుస్తుంది. అమాయకంగా అమానుష ముష్కరులకు బలైనా ఆమె మరణంలోనూ దేశాన్ని మేల్కొలిపే సమర సంకేతం కావడం నేటి కాల పరిస్థితులకు ప్రతిబింబిస్తుంది. ఈ రాక్షస కాండపై రగిలిన ఆగ్రహం, పెల్లుబికిన యువచైతన్యం, మహిళలపై దుర్మార్గాలు సాగించే వారికి ఒక హెచ్చరిక అవుతుంది. నిత్యం మహిళా జపం చేస్తూనే వారి రక్షణ పట్ల ఘోర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ చాలా సందర్భాల్లో నేరస్తులకు గొడుగు పట్టే పాలకవర్గాలను ప్రకంపింపచేస్తుంది. కాపాడకపోగా కలుషిత సంసృతిని వ్యాపింపచేస్తూ ఆ పైన అమ్మాయిలే అన్నిటికీ బాధ్యులని అవాకులు చవాకులు పలికిన వారికి గుణపాఠం చెబుతుంది. ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ తర్వాత కూడా అనేక ఘటనలు జరిగాయి గనక వీటికి ముగింపు వుండదంటూ ఎవరైనా మాట్లాడితే అంతకన్నా పోరబాటు వుండదు. ఎందుకంటే ఏ విషయంలోనైనా ప్రజల సహనానికి ఒక హద్దు వుంటుంది. అది చెరిగిపోయిన తర్వాత మామూలు మనుషులే మహౌధృతంగా విజృంభించి పిడుగుల వర్షం కురిపిస్తారు. ఆధునిక చైతన్యం గల విద్యాధిక యువతీ యువకులు ఫేస్‌బుక్‌ మెసేజ్‌లతోనే లక్షోపలక్షలుగా దేశం నలుమూలలా కదలి వస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. దేశంలో ఇంత కదలిక రావడానికి కారణమైన ఢిల్లీ యువతి అక్షరాలా అమరజీవిగా మిగిలిపోతుంది. అత్యాచారాలపై పోరాడిన ప్రతిసారీ ఆమె గాధ ప్రతిధ్వనిస్తుంది.

No comments:

Post a Comment