Pages

Tuesday, December 25, 2012

గొంతులో వెలక్కాయ



జగన్‌ కేసులో నిందితులైన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌కు అనుమతి నిరాకరించే ఫైలును మంత్రివర్గానికి తిప్పి పంపడం ద్వారా గవర్నర్‌ నరసింహన్‌ పొరబాటును దిద్దుకునే అవకాశం కల్పించినట్టయింది. రాజ్యాంగం ప్రకారం మంత్రివర్గ నిర్ణయాలను పున: పరిశీలనకై పంపించడం తప్ప పూర్తిగా తిరస్కరించే అధికారం వుండదు. తన విచక్షణను ఉపయోగించే అంశంలో మాత్రం గవర్నర్‌ స్వయంగా నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమంత్రి నియామకం, ఆయనపై గాని మంత్రులపై గాని అవినీతి ఆరోపణలు వస్తే దర్యాప్తుకు అనుమతించే అధికారం గవర్నర్‌కు వుంటుంది. దాన్ని ప్రశ్నించే అవకాశం మంత్రివర్గానికి వుండదు. అందులోనూ ే రాజకీయంగా ప్రభుత్వం, పాలక పక్షం అనుదిన అనిశ్చితిని ఎదుర్కొంటున్న తరుణంలో గవర్నర్‌ ఫైలును తిప్పిపంపడం కూడా పెద్ద సవాలు. ఈ సమయంలో ప్రాసిక్యూషన్‌కు అనుమతించడం తప్ప ప్రభుత్వానికి వేరే ప్రత్యామ్నాయం లేదని మాడభూషి శ్రీధర్‌ వంటి న్యాయ నిపుణులు సోదాహరణంగా వివరిస్తున్నారు. ధర్మానతో పాటు మరో ఆరుగురు మంత్రులు కూడా వివాదాస్పదమైన 26 జీవోల వ్యవహారంలో విచారణ నోటీసులు ఎదుర్కొంటుండగా వాన్‌పిక్‌ కేసుకు సంబంధించి మోపిదేవి వెంకటరమణ ఇప్పటికే అరెస్టయ్యారు. ఈ విషయంలో ప్రభుత్వం ద్వంద్వనీతిని ప్రదర్శించిందన్న విమర్శలు కూడా మూటకట్టుకుంది.
నైతిక నియమావళి కోసమే పదవికి రాజీనామా సమర్పించానని ధర్మాన గొప్పలు చెబుతున్నా ఆయన రాజీనామా ఆమోదం లేదా తిరస్కారం పొందకుండా అలా త్రిశంకు స్థితిలో సుదీర్ఘ కాలం గడిచిపోయింది. ఎట్టకేలకు ఇటీవలనే క్యాబినెట్‌ సమావేశానికి ఆయనకు ఆహ్వానించడం, తిరస్కరణ సంగతి తేలితేనే వస్తానని
బెట్టుచేయడం జరిగాయి. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు ఆరోపణలకు గురైన అమాత్యులందరికీ గుండుగుత్తగా మినహాయింపు ప్రకటిస్తూ వారూ సభ్యులుగా వున్న మంత్రివర్గమే నిర్ణయం తీసుకుంది. అయితే ధర్మానపై ఇప్పటికే ఛార్జిషీట్‌ నమోదైనందున ఆయన విషయం గవర్నర్‌కు వెళ్లింది. బాగా సమయం తీసుకున్న తర్వాత ఆయన ఇప్పుడు దాన్ని తిరుగుటపాలో పంపించేశారు. ధర్మానపై కోర్టులో సిబిఐ పిటిషన్‌ దాఖలు చేస్తూ అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తుకు ప్రత్యేకంగా మంత్రివర్గ అనుమతి అవసరం లేదనీ, మూడు నెలల్లోగా అనుమతి రాకుంటే విచారణ సాగించవచ్చునని పేర్కొంది. గోడదెబ్బ చెంపదెబ్బ లాటి ఈ పరిణామానికి ప్రభుత్వం ఎలా స్పందించేది ఇంకా తెలియదు గాని జరిగిన పొరబాటును ఇప్పుడైనా దిద్దుకోవడం శ్రేయస్కరం.
అసలు జగన్‌ ఆక్రమాస్తుల కేసుపై అనేక విధాల ధ్వజమెత్తుతూ అందుకు మూలకారణంగా చెప్పబడిన జీవోలను వెనకేసుకురావడమే ఒక వైపరీత్యం. వాటిలో తప్పు లేకపోతే వాటి ఆధారంగా అవినీతి ఎలా సాధ్యమన్న ప్రశ్నకు జవాబు చెప్పలేని దురవస్థలో ప్రభుత్వ ప్రతినిధులు రకరకాల పద విన్యాసాలతో పట్టుబడిపోతున్నారు. ఈ కేసులో ఆరోపణలకు గురైన మంత్రులందరినీ ప్రభుత్వమే వెనకేసుకు వస్తే అప్పుడు సిబిఐ వాదనను నేరుగా ఎదుర్కొంటున్నట్టే కదా అన్న సవాలుకూ జవాబు లేదు. వ్యక్తిగతంగా ఆరోపణలు వచ్చినపుడు ప్రభుత్వం ప్రజా ధనంతో కాపాడాల్సిన అగత్యమేమిటి? అందులోనూ మోపిదేవికి ఒక నీతి ధర్మానకు మరోనీతి ఏమిటన్న ప్రశ్న అనేక రూపాల్లో వెంటాడితే ఉక్కిరిబిక్కిరి అయింది. తమది నీతివంతమైన ప్రభుత్వం అని చెప్పుకునే కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఇలా అవినీతి ఆరోపణలకు గురైన వారిని వెనకేసుకురావడం కేవలం ప్రభుత్వ మనుగడకోసమే అయితే అందుకు అధిష్టానం ఆశీస్సులు ఆదేశాలు వున్నాయన్నది మరో సత్యం. ఏది ఏమైనా ఇదంతా కాంగ్రెస్‌ మార్కు రాజకీయ సంసృతికి అద్దం పట్టే నీతిబాహ్య పురాణం. ఈ భాగోతంలో గవర్నర్‌ ఇచ్చిన కొత్త మలుపు నేపథ్యమేమిటో దాని భవితవ్యమేమిటో ఆసక్తికరంగా వుండొచ్చు. అదే సమయంలో అస్తుబిస్తుగా నడుస్తున్న కిరణ్‌ సర్కారు సమస్యల పరంపర మరింత సంక్షుభితం కావడానికి కూడా అనివార్యంగా కనిపిస్తుంది. సిబిఐ దే తప్పు అని బొత్స దాడి ఒక వైపు అసలు ఫైలు పంపించడమే తప్పు అని రవీంద్రారెడ్డి మరోవైపు విమర్శిస్తున్నా గరళకంఠుడిలా భరించడం తప్ప ముఖ్యమంత్రి ఏ చర్య తీసుకునేట్టు కనిపించడం లేదు. గవర్నర్‌ చర్యపై స్పందించకుండా కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు న్యాయస్థానాలపై భారం వేసి కాలం గడపొచ్చు.

No comments:

Post a Comment