Pages

Sunday, December 12, 2010

ప్రజా కవిత్వ వైతాళికుడు

- తెలకపల్లి రవి
 సంప్రదాయం ప్రకారం మనకు మహా రాజశ్రీలు, బ్రహ్మశ్రీలు వున్నారు. రాజులను, స్వాములను సంబోధించేటప్పుడు శ్రీశ్రీశ్రీ అని ఒకటికి రెండు గౌరవ వాచకాలు చేర్చే ఆనవాయితీ కూడా వుంది.

అలాటి అతిశయోక్తులేమీ లేకుండానే సహజ నామంలోనే రెండు శ్రీశ్రీలు ఇముడ్చుకున్న ఒకే ఒక సుప్రసిద్ధుడు శ్రీశ్రీ. శ్రీరంగం శ్రీనివాసరావు. ఇది ఆయన శత జయంతి సంవత్సరం.


1910 ఏప్రిల్‌ 30న పుట్టిన శ్రీశ్రీ శతజయంతి ఉత్సవాలను కేవలం సాహిత్యాభిమానులే కాదు- చైతన్య వంతులైన తెలుగు వారందరూ గొప్పగా స్మరించుకున్నారు. ఎందుకంటే ఆయన ప్రజాకవి. మాగ్జిం గోర్కి 'అమ్మ' నవల ఎంత ప్రభావం చూపిందో 'మహా ప్రస్థానం' ఇంచుమించు అలాటి ప్రభావాన్నే చూపింది.

తెలుగు సాహిత్యాన్ని కవిత్వాన్ని స్థూలంగా విభజించవలసి వస్తే శ్రీశ్రీకి ముందు తర్వాత అనవలసిందే. ఆయనను యుగకర్త అన్నారందుకే. అయితే అది వ్యక్తిగతమైనది కాదు- ప్రజా కవిత్వ యుగం.

శ్రీశ్రీ సమాజగర్భంలో పుట్టి, సంప్రదాయాల సంకెళ్ళు తెంచుకుని సామ్యవాదం వైపు నడిచిన కవి. అందుకే ఆయన కవిత్వ ప్రస్థానం సంపూర్ణమైంది. సార్థకమైంది.

తన కవిత్రయం తిక్కన, వేమన, గురజాడ అని ఆయన చాలా చోట్ల చెప్పుకున్నారు. ఆయన కూడా చాలా మజిలీలు గడిచాడు. మల్లగుల్లాలు పడ్డాడు. 'ఎటు నే చూసిన చటులాలంకారపు మటు మాయల నటనలలో నీ రూపం కనరాదనందువ ఒక్కడనై నా గదిలో కుటిలో చీకటిలో సుక్కిన రోజులు లేవా' అని కవిత్వాన్ని ప్రశ్నించాడు. తెలుగు నాట విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి వారి ప్రభావం, ఇంగ్లీషులో స్విన్‌బర్న్‌ వంటి వారి ప్రేరణ, అన్నిటినీ మించి దుర్భర జీవితానుభవాలు ఇవన్నీ ఆయన కవిత్వాన్ని కొత్త మార్గం పట్టించాయి. సహజ ప్రతిభ, జీవితానుభవమూ, దేశీయ సాహిత్యాధ్యాయనమూ, విదేశీ సాహిత్య స్పర్శ అన్ని కలిసి ఒక మహాకవికి జన్మనిచ్చాయి.

నూతన భావాలు, భాషా ప్రయోగాలు :
మహాప్రస్థానంలో మొదటి గీతం జయభేరి. 'నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను' అన్నది. 1933లో దీన్ని రాశాడు. అప్పటికి ఆయన తీవ్రమైన టైఫాయిడ్‌ జ్వరంతో పెనుగులాడి బయటపడ్డాడు. ఈ గేయంలో గొప్పతనం ఏమంటే- వ్యక్తి చైతన్యం సమాజ సమిష్టి చైతన్యంతో కలసిపోవడం. నేను వుంటూనే సమాజం కూడా వుండటం. 'నేను సైతం భువన భవనపు బావుటానే పైకి లేస్తాను' అన్న మాటలతో ముగియడంలోనూ గొప్ప స్ఫూర్తి. అయితే ఆ బావుటా ఏది? 'కనబడలేదా మరో ప్రపంచపు హోమజ్వాలల భుగభుగలు, అగ్నికిరీటపు ధగధగలు. ఎర్ర బావుటా నిగనిగలు' అని తర్వాత దాని అరుణారుణ స్వరూపాన్ని ఆయన దర్శించగలిగాడు. 'పులి చంపిన లేడి నెత్తురూ ఎగరేసిన ఎర్రని జండా కావాలోయ్‌ నవకవనానికి' అనగలిగాడు. ఇంతకూ అది రాసేనాటికి తనకు మార్క్సిజం గురించి తెలియదని చాలాసార్లు చెప్పారు. అంటే నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులు తెలియకుండానే ఆయనను సామ్యవాద భావజాలం వైపు నడిపాయి. అప్పుడే తన గురువు గారైన అబ్బూరి రామకృష్ణారావు లండన్‌ నుంచి భారతీయ అభ్యుదయ రచయితల ప్రణాళిక తీసుకొచ్చి ఇచ్చాడు. అదో, లేక మరొక ఇంగ్లీషు ప్రణాళికో చదివి వెంటనే 'ప్రతిజ్ఞ' గేయం రాశాడు. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం తన కవిత్వానికి చిహ్నాలని ప్రకటించాడు. ముద్దుకృష్ణ జ్వాల పత్రికలో చరిత్ర గురించి రాసిన సంపాదకీయం ప్రేరణతో 'దేశ చరిత్రలు' రాశాడు. 'ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం రణ రక్త ప్రవాహసిక్తం' అని నిరసించాడు. తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరో, రాజెక్కిన పల్లకి బోయీలు ఎవ్వరో చూడమన్నాడు. అంతకు ముందు ప్రబంధాల్లో అంగాంగ సౌందర్యాన్ని రాజభోగాలను వర్ణిస్తే శ్రీశ్రీ శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని చాటాడు. రాజులు జమీందార్లకు రచనలు అంకితమిచ్చిన వారికి భిన్నంగా కష్టజీవులకు కర్మవీరులకు తన కవిత్వాన్ని అంకితం చేశాడు. కవిత్వం రాయడానికి రమణీ ప్రియద్యూతిక తెచ్చిఇచ్చు కర్పూర తాంబూలం వగైరాలు కావాలని అల్లసాని పెద్దన అంటే సింధూరం రక్తచందనం బందూకం సంధ్యారాగం కావాలన్నాడు. ఇహలోకం తర్వాత పరలోకం వుంటుందన్న తరతరాల భావనను ఛేదించి ఈ లోకంలో సమానత్వాన్ని సాధించుకోవడం ద్వారా మరోప్రపంచం స్థాపించుకోవాలని అందుకు మహాప్రస్థానం సాగించాలని 'పదండి ముందుకు పదండి తోసుకు' అని పిలుపిచ్చాడు. ఇవన్నీ తెలుగు సాహిత్యానికి కొత్తచూపునూ వూపునూ ఇచ్చాయి.

ప్రజలతో మమేకం:
సంప్రదాయ కవులే కాదు- తనకు గురువైన కృష్ణశాస్త్రి కూడా భావకవిత్వంలో 'దిగిరాను దిగిరాను దివినుండి భువికి' అంటుంటే 'నాకొరకు చెమ్మ గిల్లునయనమ్ము లేదు' అంటుంటే శ్రీశ్రీ మాత్రం 'ఏడవకండేడవకండి, మీ కోసం కలం పట్టి ఆకాశపు దారులెంట హడావుడిగ వెళిపోయే జగన్నాథ రథచక్రాలు భూమార్గం పట్టిస్తా'నన్నాడు. భూ కంపం పుట్టించాడు. అందుకే మహాప్రస్థానానికి యోగ్యతా పత్రం రాసిన చలం 'కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ' అని నిర్వచించాడు. ఈ ప్రజా మమేకత్వమే శ్రీశ్రీని వైతాళికుణ్ణి చేసింది. మహాప్రస్థానంలో 'అపుడే ప్రసవించిన శిశువు' నుంచి 'ముగ్గుబుట్ట వంటి తల భిక్షువర్షీయసీల' వరకూ అందరూ కన్పిస్తారు. జీవితంలో ప్రతిఘట్టానికి అన్వయించుకోదగిన అద్భుత భావచిత్రాలు అగుపిస్తాయి. 'ఉరి తియ్యబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం' అన్నప్పుడు భగత్‌సింగ్‌ నుంచి సద్దాం హుస్సేన్‌ వరకూ కళ్ళ ముందు కదలాడతారు. చెక్‌ దేశపు గనిపనిమనిషీ ఐర్లండు ఓడకళాసీ ఖండాంతర నానాజాతులు పోరాడతారని అన్నప్పుడు ప్రపంచీకరణకు వ్యతిరేకంగా పోరాడే దృశ్యం కళ్ళముందు నిలుస్తుంది.

శ్రీశ్రీ కేవలం భావాల పరంగానే గాక కవిత్వ పరంగానూ గొప్ప వరవడి పెట్టాడు. ఆయనకు ముందే తెలుగులో ప్రజాగీతాలు స్వాతంత్య్ర పోరాట పాటలు వున్నాయి. ఉన్నవ మాలపల్లి నవల కూడా వచ్చింది. అయితే అప్పటికి ప్రపంచ స్థాయిలో పెంపొందిన రచనా శిల్ప నైపుణ్యాలను సంప్రదాయ సాహిత్యంలోని మంచి లక్షణాలను కూడా కలగలపి ఆయన కొత్త బాట వేశారు. ఇది ఆయన ప్రతిభ అధ్యయనాల వల్లనే సాధ్యమైంది. మరో ప్రపంచం, మహాప్రస్థానం మాటలతో సహా చాలా వాటికి కొత్త అర్థాలు తీసుకొచ్చారు. తన కవిత్వం శ్మశానాల వంటి నిఘంటువులు దాటిందని చెప్పుకున్నారు. సంప్రదాయ ప్రతీకలకు నూతనత్వం కల్పించాడు. ఇప్పటికీ పత్రికలలో చిత్రాలలో ఛానెళ్ళలో ఉపయోగించే చాలా పదజాలం శ్రీశ్రీ కవిత్వంలోంచి వచ్చిందే.

సాహితీ సంఘాలు:
సాహిత్య సృజనతో పాటు సామాజికంగానూ ఆయన తన పాత్ర నిర్వహించాడు. మొదటి నుంచి సాహిత్య సంఘాలలో చురుగ్గా వున్నాడు. నవ్యసాహిత్య పరిషత్తు అందులో మొదటిది. తర్వాతి కాలంలో అభ్యుదయ రచయితల సంఘంలో చురుగ్గా వున్నాడు. అది స్తబ్దతలో పడినప్పుడు పునర్నిర్మిణానికి తోడ్పడ్డాడు. రచయితల సంఘానికే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాపితంగా యువజన విద్యార్థి సంఘాల సభల్లో పాల్గొని ఉత్సాహ పర్చాడు. మహా ప్రస్థానం పుస్తక రూపంలో రాక ముందే దానిలోని గేయాలు సామాన్య కార్యకర్తలు కూడా పాడుతుండే వారు. అలా పాడుతున్నప్పుడే నంద్యాలలో భూస్వాములు సహించలేక దాడి చేశారని చండ్ర రాజేశ్వరరావు శ్రీశ్రీ కవిత్వ ప్రజా స్వభావాన్ని ఒక లేఖలో వెల్లడించారు.

తెలంగాణ పోరాటం:
ఉద్యమాలతో ఇంతగా ముడిపడిన కారణంగానే ఆయన గురించిన అనేక అపోహలు కూడా ప్రచారంలో ఉన్నాయి. వీర తెలంగాణా పోరాటంపై ఆయన ఏమీ రాయలేదనే విమర్శ వాటిలో ఒకటి. ఆ కాలంలో ఆయన బతుకు తెరువు కోసం నిజాం సహాయకుడి దగ్గర అనువాదకుడిగా పనిచేశాడు. అయితే పోరాటంతో సంఘీభావం ప్రకటిస్తూనే వచ్చారు. కాటూరు యలమర్రు దురంతాలను ఖండిస్తూ ఇతర రచయితలతో కలసి పత్రికలకు లేఖ రాశాడు. మా భూమి నాటకంపై అభినందనలు కురిపిస్తూ విశ్లేషణాత్మకంగా రాశాడు. దానిపై నిషేదాన్ని ఖండించాడు. తెలంగాణా పోరాటంపై ఆరుద్ర రాసిన కావ్యాన్ని ఎంతగానో ప్రశంసిస్తూ ముందు మాట రాశాడు. ఈ నిర్బంధ కాలంలో నిషేదానికి గురైన ప్రజాశక్తి పత్రిక వారపత్రికగా పునఃప్రారంభమైతే ఉత్సాహంగా స్వాగత గీతం రాశారు. ఇవన్నీ ఆయనకూ ఉద్యమానికి ఉన్న అనుబంధాన్ని చెబుతాయి.

1954లో కమ్యూనిస్టు పార్టీ ఆయనను ఉమ్మడి మద్రాసు రాష్ట్రం శాసనమండలి సభ్యుడుగా చేసింది. అయితే రాష్ట్రావతరణంతో ఆ సభ్యత్వం కొద్దికాలంలోనే ముగిసింది.

మధ్యంతర ఎన్నికల మహా పోరాటం :
ఆయన జీవితంలో మిగతా అంశాలన్ని ఒక ఎత్తయితే 1955 ఎన్నికల్లో కమ్యూనిస్టుల పక్షాన నికరంగా నిలబడి ప్రచారం చేయడం మరో ఎత్తు. అభ్యుదయ ముద్ర వేసుకున్న చాలా మంది రచయితలను పాలకవర్గాలు తమవైపు తిప్పుకుని విషపు దాడికి వాడుకున్న ఆ తరుణంలో ఆయన ఒంటరిగా కమ్యూనిస్టులతో పాటు తిరిగాడు. ఆ సందర్భంలోనే సుందరయ్య గారితోపాటు ఒక సభలో మాట్లాడుతుండగా రాళ్ళు వచ్చి పడ్డాయి. అప్పటికే శత్రువర్గాల దుష్ప్రచారాలతో మనసు చెదిరిన మహాకవి ఆ దాడితో పూర్తిగా చిత్త చాంచల్యానికి గురయ్యారు. అయితే కోలుకోగానే మళ్ళీ ఉద్యమంతో నిలబడ్డారు. అభ్యుదయ రచయితల సంఘ పునరుద్ధరణ సభలకు అధ్యక్షత వహించారు. శాంతి ఉద్యమంలో పాల్గొని దేశ దేశాలు పర్యటించారు. కమ్యూనిస్టు ఉద్యమంలో విభజన వచ్చినపుడు శ్రీశ్రీ సిపిఎం వైఖరిని బలపర్చినా గజ్జెల మల్లారెడ్డి సైంధవ పాత్ర వల్ల గందరగోళం ఏర్పడిన సంగతి ఇప్పుడు బహిరంగ రహస్యమే. అయితే తర్వాతి కాలంలో ఆయన జనశక్తి పత్రిక ప్రారంభించినప్పుడు ఘనంగా స్వాగతం పలికాడు. అరెస్టయిన సిపిఎం నాయకుల విడుదల కోసం సాగిన పౌరహక్కులు ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఈలోగా వివిధ కారణాల వల్ల అభ్యుదయ రచయితల ఉద్యమంలో స్తబ్దత ఏర్పడింది. దిగంబర కవిత్వం బయలు దేరింది. ఆయన దాన్ని ఆహ్వానించాడు. తనలో వున్న అరాచకమే వారిలోనూ ఉందని స్పష్టంగానే చెప్పాడు. సిపిఎంలో అతివాద దుస్సాహిసిక నగ్జలైట్‌ చీలిక వచ్చినప్పుడు అది అతివాద బాలారిష్టమని ఆయన మొదట్లో స్పష్టంగానే చెప్పాడు.

విరసం అనంతరం :
1970లో శ్రీశ్రీ షష్టిపూర్తి సాహిత్య రంగంలోనూ సంచలనమైంది. మొదట అరసం ఏర్పాటు చేసిన సత్కారానికి అంగీకరించిన శ్రీశ్రీ తర్వాత నిర్ణయం మార్చుకున్నాడు. దిగంబర కవులు, నగ్జలైట్‌ భావాలు గల కవులు కలిసి ఏర్పర్చిన విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడైనాడు. ఆ విధంగా ఆయన జీవితంలో మరోసారి కొంతకాలం పాటు క్రియాశీల పాత్ర పోషించాడు. పెరిగిన వయస్సుతో పాటు విరసంలో భిన్నాభిప్రాయాల మధ్య ఆయన అనేక మల్లగుల్లాలు పడ్డాడని వారు ప్రచురించిన లేఖలు చెబుతాయి. దీనికి పరాకాష్ట తెలంగాణా ఉద్యమం. విరసం దాన్ని బలపరిస్తే శ్రీశ్రీ వ్యతిరేకించాడు. సిపిఎంతో కలిసి సమైక్యతా సదస్సులో పాల్గొన్నాడు. తర్వాతి కాలంలో జై ఆంధ్ర ఉద్యమాన్ని కూడా ఆయన వ్యతిరేకించాడు. ఈ భిన్నాభిప్రాయాలు ఎమర్జన్సీ తర్వాత బహిరంగమైనాయి. ఆ కాలంలో ఆయన ఇందిరాగాంధీని కీర్తిస్తూ లేఖ రాశాడని విరసం విమర్శించి అధ్యక్ష స్థానం నుంచి తొలగించింది. ఆ సమస్య ఎలా ఉన్నా తన అనుభవంతో శ్రీశ్రీ విరసంపై తీవ్ర వ్యాఖ్యలే చేశాడు. సాహిత్యం కన్నా రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత నివ్వడం, విభజన ఉద్యమాలను బలపర్చడం మంచిది కాదని స్పష్టంగా పేర్కొన్నాడు. దీనిపై చాలా ఉత్తర ప్రత్యుత్తరాలున్నాయి గాని ఇప్పుడు వాటిపై సుదీర్ఘ చర్చ, అవన్నీ అప్రస్తుతం.

శ్రీశ్రీ జీవితం అన్ని దశల్లోనూ విస్త్రతంగా పర్యటిస్తూ సాహిత్యాసక్తి పెరగడానికి దోహదపడ్డారు.

చిరస్మరణీయ స్ఫూర్తి :
1980లో శ్రీశ్రీ సప్తతి నాటికి వాతావరణం చాలా మారింది. షష్టిపూర్తి సందర్భంలో ఏర్పడిన విరసం కాక అరసంకు దగ్గరగా వుండే సాహితీ మిత్రులు కాకినాడలో సప్తతి నిర్వహించారు. ఆరోగ్యం కూడా దెబ్బ తిన్న శ్రీశ్రీ 1983 జూన్‌ 15 వ తేదిన కన్నుమూశారు. తెలుగు నాట మూలమూలనా ఆయన సంతాప సభలు జరిగాయి. ఎమర్జన్సీలో ఆయన రాసిన ఆత్మకథ అనంతం వెలువడింది. చలసాని ప్రసాద్‌ ప్రధాన పాత్రతో విరసం తరపున ఆయన రచనలన్ని 20 సంపుటాలుగా వెలువడ్డాయి. ఇందులో కొన్ని ఇటీవల విశాలాంధ్ర తిరిగి తీసుకొచ్చింది. సినిమా రంగంలోనూ శ్రీశ్రీ చెరగని ముద్ర వేశాడు. ఆయన గీతం తెలుగువీర లేవరా జాతీయ బహుమతి పొందడమే కాక ఆయన చరణాలు నేను సైతం తీసుకుని సుద్దాల అశోక్‌ తేజ రాసిన పాటకు కూడా జాతీయ పురస్కారం లభించింది. ఆయన జీవించి వుండగానే ఆయన కవిత్వమే ఊపిరిగా ఆకలి రాజ్యం చిత్రం వచ్చింది. క్రమేణా ఆయన కవిత్వం పాఠ్యపుస్తకాలలో ప్రవేశించింది. ఆయన కవిత్వంపై ప్రయోగాలపై అనేక మంది పరిశోధనలు చేశారు. చేస్తున్నారు. వాటిలో దళితులు వెనకబడిన తరగతులు ప్రస్తావన లేదనే విమర్శలు వస్తుంటాయి. నేరుగా ఆ ప్రస్తావనలు లేని మాట నిజమని అంగీకరిస్తూనే ఆ కవిత్వం పీడితులందరి పక్షం వహించిందనే సత్యాన్ని చెప్పుకోవలసి వుంటుంది. ఆత్మకథలో ఆయన స్త్రీల గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు, వ్యక్తిగత జీవితాంశాలు చర్చకు వస్తుంటాయి. గాని శత జయంతి సందర్భంలో మన మనసుల్లో మెదిలేది అనుసరణీయమైంది ప్రజలకు అంకితమైన మహాకవి జీవిత సాహిత్యాలు మాత్రమే. వాటినుంచి ఇతరులు నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకోవచ్చు గాని ఆ కారణంగా ఆయన మహత్తర పాత్రను చూడనిరాకరించడం చారిత్రక దృష్టి కాజాలదు. పాక్షిక చిత్రణ వల్ల కూడా ప్రయోజనం వుండదు.

పుట్టిన వందేళ్ళ తర్వాత ఇప్పటికీ శ్రీశ్రీ కవితా చరణాలు లేకుండా మీడియా నడవదు. ప్రసంగాలలో ఆయన కవితా వాక్యాలు ఉటంకించబడని రోజు వుండదు. ఆ విధంగా శ్రీశ్రీ మహాప్రస్థానం కొనసాగుతూనే వుంది. ఈ శతజయంతి సందర్భంలో ప్రజాకవిని స్మరిస్తూ రాష్ట్రంలోనూ, వెలుపలా కూడా జరిగిన సభలే ఆయన నిరంతర ప్రభావానికి నిదర్శనాలు.

సాహితీ స్రవంతిలో తెలకపల్లి రవి రాసిన ‘శ్రీశ్రీ సాహిత్యం - సమకాలికత ’ అనే పుస్తకాన్ని ప్రచురించి విస్తృతంగా తీసుకెళ్ళింది. ఇప్పుడు 300 పేజీలతో ‘శ్రీశ్రీ జయభేరి’ పేరిట ఆయన జీవితం, సాహిత్యం, వ్యక్తిత్వాలపై ఆయనే రాసిన పుస్తకం విడుదలవుతోంది. ఇవన్నీ ఆయన అభిమానుల ఆదరణ పొందుతాయని ఆశిస్తున్నాం.

1 comment:

  1. మహాకవి, తెలుగు తేజం శ్రీ శ్రీ గారి శత జయంతి ఉత్సావాలు రాష్ట్రమంతా ఘనంగా జరుగుతూ ముగింపుకు వచ్చాయి. ఆ మహాకవికి నివాళి గా భారత తపాల శాఖా ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేయక పోవటం చాల శోచనీయం. మన రాష్ట్ర ప్రభుత్వం గాని, శ్రీ శ్రీ శత జయంతి జరుపుతున్న అభిమాన సంస్థలు గాని పోస్టల్ స్టాంప్ విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలి. ఆకాశ వీధుల్లో హడావుడిగా వెళ్ళే తెలుగు కవిత్వాన్ని భూమార్గం పట్టించిన మహా కవికి ప్రత్యేక తపాల బిళ్ళ విడుదల చేసేలా మనం కృషి చేయాలి. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ఫిలాటాలి క్లబ్స్ వారు దీనికి పూనుకోవాలి. అలాగే ప్రాంతీయ పరిధిలో శ్రీ శ్రీ గారికి ప్రత్యేక కవరు,క్యాన్సిలేషన్ తో విడుదల చేసి వారికి ఘనంగా నివాళి ఇవ్వాలి.

    ReplyDelete