Pages

Saturday, December 29, 2012

ఢిల్లీ టు తిరుపతి - తెలుగు భాష, రాష్ట్రంచరిత్రలో యాదృచ్చికంగా కనిపించే అంశాల మధ్య వాస్తవికమైన అంతస్సంబంధం వుంటుంది. తెలుగు భాషా వికాసం కోసం తిరుపతిలో మహాసభలూ, తెలుగు రాష్ట్ర భవిష్యత్తుపై ఢిల్లీలో అగ్రనేతల అఖిలపక్ష సమావేశం ఏక కాలంలో జరగడం అలాటి ఒక సందర్భం.
ముందు అత్యంత కీలకమైన ఢిల్లీ అఖిలపక్ష సమావేశం సంగతి తీసుకుంటే గతంలో జరిగిన రెండు సమావేశాలకు దీనికి స్పష్టమైన తేడా కనిపిస్తుంది. 2009 డిసెంబర్‌ 9, 23 తేదీలలో చేసిన ప్రకటనల తర్వాత ఏర్పడిన పరిస్థితిని చర్చించి ఒక పరిష్కారం కనుగొనడంపై మొదటి సమావేశం జరిగింది. శాంతి భద్రతలు కాపాడి పరిష్కారం కోసం కృషి చేయాలని అంగీకారం కుదిరింది. ఆ మేరకు శ్రీకృష్ణ కమిటీ ఏర్పడి తనదైన అధ్యయనం చేసి ఆరు అంశాలతో ఒక నివేదిక సమర్పించింది. దాన్ని చర్చించేందుకు తర్వాత మరో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆ కమిటీ నివేదికపట్ల అభిప్రాయం చెప్పకుండానే కేంద్రం పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలను సాకుగా చూపి తన మాయాజాలం కొనసాగించింది. అయితే ఈ సమావేశంలో అలాటి ప్రయత్నానికి ఆస్కారం లేకుండా ముకుతాడు వేయడంలో ప్రతిపక్షాలు విజయం సాధించాయి. మీడియా కథనాల ప్రకారం చూస్తే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు కాంగ్రెస్‌ వైఖరి చెప్పకుండా ఇతరులను అడగడం ఏమిటని నిలదీయడం, కాల పరిమితి లేకపోతే కుదరదని పట్టుపట్టడం హౌంమంత్రి ప్రకటన చేయకతప్పని స్థితికి దారి తీసింది. రాష్ట్ర విభజన వద్దనీ, భాషా ప్రయుక్త సూత్రాన్ని కొనసాగించాలని దేశవ్యాపితంగా చెబుతున్న సూత్రాన్నే సిపిఎం ఇక్కడా గట్టిగా పునరుద్గాటిస్తున్నది.మిగిలిన అనేక పార్టీలు వూగిసలాటలకు గురైనా సిపిఎం నికరంగా ఒక్కమాటమీదే వుందన్న వాస్తవం అందరూ ఆమోదించిన పరిస్థితి.ఆ నైతిక దృఢత్వమే రాఘవులు గొంతుకు బలం చేకూర్చడం సహజం. ఇతర పార్టీలు కూడా అదే వైఖరి ప్రకటించిన తర్వాత హౌం మంత్రి లేదా కేంద్రం తలపెట్టిన కాలయాపన తతంగం సాగని స్థితి. ఫలితంగా వచ్చిందే నెల రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామన్న మాట.
సమావేశంలో వివిధ పార్టీలు అనుసరించిన వైఖరి వాటి ధోరణికి ప్రతిబింబంగానే వుంది. టిఆర్‌ఎస్‌ ఇటీవలి వరకూ కాంగ్రెస్‌పై అపారమైన నమ్మకం ప్రకటిస్తూ విలీనం వరకూ ప్రతిపాదించి విమర్శలకు గురైంది. ఈసారి అఖిలపక్షం ప్రయోజనంపైనా పరిపరివిధాల వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలనుంచి వచ్చాయి. తమ జాబితాలో కోదండరాంను తీసుకుపోతామని చెప్పిని అదీ చెల్లుబాటు కాలేదు. చివరకు రాష్ట్రం వస్తుందనే ఆశ భ్రమ లేకుండానే వెళ్తున్నామని కెసిఆర్‌ ముందే ప్రకటించి వెళ్లారు. అందుకు తగినట్టే సమావేశం ముగిసిన తర్వాత అందరూ ఎంతోకొంత సానుకూల సంకేతాలున్నట్టు మాట్లాడితే కెసిఆర్‌ మాత్రం పూర్తిగా ప్రతికూలత ప్రకటించి బంద్‌కు కూడా
పిలుపునిచ్చారు.కేంద్రం రెండవ ఎస్‌ఆర్‌సిని వేయడం లేదా ప్రాంతీయ మండలిని ఏర్పరచి ప్యాకేజీని ప్రకటించడం వంటి పరిష్కారాలు చేబట్టవచ్చుననే సందేహంతోనే టిఆర్‌ఎస్‌ ఈ వ్యూహం అనుసరిస్తోందని మీడియా కథనాలు ఇచ్చింది. కాకపోతే గతంలో తను అనేక గడువులు ప్రకటించి విఫలమైన కెసిఆర్‌ ఈ సారి కేంద్రం నెల రోజులు గడువు ప్రకటిస్తే తోసిపుచ్చడం ఇక్కడ విశేషం. ఇలాటి సమావేశాల్లో ఇది వరకు కెసిఆర్‌ ప్రత్యేకాకర్షణగా వుంటే ఈ సారి ఆ స్థానం అలా కొనసాగలేదని మీడియా చేసిన విశ్లేషణల్లో వాస్తవం లేకపోలేదు.
సిపిఐ బిజెపి కూడా విభజనను సూటిగా బలపర్చినా వాటి వైఖరిలో ఆసక్తికరమైన అంశాలున్నాయి. ఉమ్మడి కమ్యూనిస్టుపార్టీ భాషా సూత్రానికే కట్టుబడింది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు విభజన ఉద్యమాల సందర్బంలోనూ కమ్యూనిస్టులు సమైక్యతకే కట్టుబడ్డారు.ఈ సారి అనేక చర్చల తర్వాత సిపిఐ విభజన కోర్కెను బలపర్చాలని నిర్ణయించుకుంటూనే ఇది ఒక మినహాయింపు మాత్రమేనని వివరించింది. అయితే నిర్ణయం తీసుకున్నాక మాత్రం అన్ని దశల్లోనూ ఆ కోర్కెనే వినిపిస్తున్నది. ఉప ఎన్నికలలోకూడా టిఆర్‌ఎస్‌ను బలపర్చింది. బిజెపి స్వతహాగా చిన్న రాష్ట్రాలు తన విధానమని అంటూనే తెలంగాణా సమస్యపై అనేక ఆలోచనలు చేసింది. ఎపిలో విభజనను బలపరుస్తున్న ఆ పార్టీ తను బలంగా వున్న యుపిలో మాత్రం శాసనసభ తీర్మానం చేసినా రాష్ట్ర విభజన కోర్కెను వ్యతిరేకించింది. మజ్లిస్‌ సమైక్యతకు కట్టుబడి వుందని అంటున్నా హైదరాబాదుపైనే దాని కేంద్రీకరణ అని అందరికీ తెలుసు. హైదరాబాదుతో కూడిన రాయలతెలంగాణా అన్న నినాదానికి మజ్లిస్‌ అనుకూలం.
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ది మరో తరహా. తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ కోస్తాలో జగన్‌ అన్న ప్రచారం ఉభయులూ ఉత్సాహంగానే చేశారు.తెలంగాణా ప్రజల మనోభావాన్ని గౌరవిస్తామని తాము కడపలో తీర్మానం చేశామంటారు.తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తి తమకే వుందని చెబుతారు.పరకాల వంటి చోట్ల హౌరాహౌరీ పోరాటమే గాక ఇతర చోట్ల కూడా కొన్ని ఘర్షణలు చేశారు. ఇంతా అయ్యాక ఇప్పుడు అఖిలపక్షంలో ఇదమిద్దంగా ఏమీ చెప్పకుండా కేంద్రమే నిర్ణయించాలన్న మాటతో సరిపెట్టి తమ బాధ్యత లేకుండా చేసుకున్నారు.
తెలుగుదేశం నేతలు ఈ సారి స్పష్టమైన వైఖరితో వెళ్లామని ఉత్సాహంగా వున్నట్టు కనిపిస్తుంది.మేము మా వైఖరిని 2008లోనే చెప్పాము. ఆ లేఖ వెనక్కు తీసుకోలేదు అన్నది వారి వాదన. 2008లో లేఖ ఇచ్చిన వాస్తవాన్ని కాదనడం గాని ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోవడం గాని కుదిరేపనులు కాదు. మాట మాత్రంగా అలా చెప్పినా ప్రభావం తీవ్రంగా వుంటుందని వారికి తెలుసు.కనకనే అయిదేళ్ల తర్వాత అనేక పరిణామాల తర్వాత కూడా ఆ లేఖ చుట్టూనే వాదనలు చేస్తూ అదే స్పష్టత అని చెబుతున్నారు. ఆ లేఖకు ఇప్పటికీ కట్టుబడి వున్నామని సూటిగా చెప్పకపోవడంలోని రాజకీయం ఏమిటో అందరికీ తెలుసు. ఈ ' స్పష్టత' తమకు రాజకీయంగా మేలు చేస్తుందని వారు అనుకుంటున్నా అది ఏ మేరకు పలించేది ఆచరణలో చూడాలి.
ఇక చివరగా కాంగ్రెస్‌ విషయానికి వస్తే వారూ 2009 ప్రకటనను ఉటంకిస్తూ కాలం గడుపుతున్నారు తప్ప తర్వాతి పరిణామాల అనంతరం వైఖరి ఏమిటో చెప్పడం లేదు. చెప్పం అని కూడా చెప్పి ఇప్పుడు నెలరోజుల తర్వాత అని సర్దుకున్నారు.దీనిపైనా ఆయా ప్రాంతాల నేతలు తమ వ్యాఖ్యానాలు తాము చేస్తున్నారు. ఏమైనా అంతిమ ప్రకటన వస్తే గాని ఏ సంగతి స్పష్టం కాదు.గత సమావేశాల వలె గాక ఈ సారి కాంగ్రెస్‌తో ఈ మాత్రమైనా చెప్పించడం ఒక సానుకూల పరిణామమే. అయితే ఆ ప్రకటన తడి ఆరకముందే మళ్లీ ప్రాంతీయ విన్యాసాలు ప్రారంభించిన పాలకపక్షం ఎత్తుగడలే సందేహాస్పదంగా వున్నాయి. మంత్రులతో సహా ఆ పార్టీనేతలు సమావేశం ముగిసిన వెంటనే తీవ్రస్వరం వినిపించి అంతలోనే సర్దుకున్నారంటే వారికి అంతర్గత సంకేతాలు అందివుండొచ్చు.ఏమైనా ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా ప్రజల సహనాన్ని పరీక్షించేందుకు ప్రయత్నిస్తే అంతకన్నా దుస్సాహసం వుండదు. అందుకు గుణపాఠమూ తప్పదు.

తిరుపతి సభలు
ఇక తెలుగు భాషావికాసం పేరిట తిరుపతిలో జరిగిన సభలు అస్తవ్యస్త నిర్వహణకు అద్దం పట్టాయి. అసలే వివాదాలు ముసురుకున్న తరుణంలో అత్యంత బాద్యతా యుతంగా జరపాల్సిన ఈ సభలను హడావుడి ఆర్భాటాలకు పరిమితం చేయడం బాధ్యతా రాహిత్యమే. కోటానుకోట్లు వ్యయం చేసినా అతిథులకు సాహిత్య వేత్తలకు కాకలు తీరిన కళామూర్తులను సరైన గౌరవం కల్పించలేకపోవడం శోచనీయం.తెలుగు భాషాభిమానులు తరలి రావడం సంతోషకరమైనా బాషా వికాసం కోసం వారికి సరైన పథ నిర్దేశం చేయడంలో ఏకీకృత విధానం లోపించింది. ముఖ్యమంత్రి కొన్ని ప్రకటనలు చేయడం బాగానే వున్నా వాటి అమలు అనుమానాస్పదమే.37 ఏళ్లకిందటి మహాసభలనాటి అధికార బాషా తీర్మానం బూజుపట్టిపోగా ఇప్పుడు ఆ గతి పట్టదన్న పూచీ ఏముంది? పరిస్థితులు అప్పటికంటే ఇప్పుడు ఇంకా అధ్వాన్నంగా వున్నాయన్నది నిర్వివాదాంశం. అసంఖ్యాక భాషాభిమానులు కళా సాహిత్య ప్రియులు ఉపాధ్యాయులు విద్యార్థుల భాగస్వామ్యం లేకుండా భాషా వికాసం కల్ల. అకాడమీల పునరుద్ధరణ, మంత్రిత్వ శాఖ వంటివి పదవులకూ పందేరాలకు ఉపయోగపడతాయి గాని ప్రజల భాషగా తెలుగును ప్రకాశింపచేయలేవు. భాషా వేత్తలు శాసనకర్తలు సామాజికులు సమగ్రదృష్టితో కృషి చేస్తే తెలుగు వెలుగుతుంది తప్ప ప్రచారార్బాటాలతో పని జరగదు. ఇన్ని ఇబ్బందుల మధ్యనా వేలాది మంది తరలి రావడంలో భాషాభిమానం గ్రహించినట్టయితే పాలకులు అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించి వుండేవారు. పిలిచిన పెద్దలకు ప్రయాణ ఖర్చులు భోజన వసతి సదుపాయాలు కూడా కల్పించలేనంత దుస్థితిలో రాష్ట్రం లేదు. ఆ అసౌకర్యం అనౌచిత్యం కేవలం ఏలిన వారి పుణ్యమే. ఈ అస్తవ్యస్త విధానాలు అధికార ఆర్బాటాలనుంచి బయిటపడితే తప్ప తెలుగుకు గాని తెలుగు వారికి గాని మేలు జరగదు.


No comments:

Post a Comment