భారత రాష్ట్రపతి ఎన్నిక ఈ సారి తీవ్ర రూపం తీసుకున్నదని ఎన్‌డిఎ అభ్యర్థి పి.ఎ.సంగ్మా వ్యాఖ్యానించారు గాని వాస్తవంలో యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ విజయావకాశాల స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధినేత ఇందిరాగాంధీయే వైఖరి మార్చుకున్న 1969 ఎన్నికలను మినహాయిస్తే ఇంత వరకూ అధికార పక్ష అభ్యర్థి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిపోయిన దాఖలాలు లేవు. ఇందుకు చట్ట సభల బలాబలాలు ఒక కారణమైతే రాజకీయ పార్టీల విన్యాసాలు మరో కారణం. ఇన్నిటి మధ్యనా వామపక్షాలు,అందులోనూ సిపిఎం ఎప్పుడూ ఒక నిర్దిష్ట వైఖరితో వ్యవహరిస్తూ వస్తున్నది. అత్యున్నతమైన ఆ రాజ్యాంగ బాధ్యత స్వీకరించే వ్యక్తి అభివృద్ది నిరోధక మతతత్వ నేపథ్యం కలిగి వుండరాదన్న సూత్రానికి సంబంధించి సిపిఎం ఎన్నడూ వెనక్కు పోలేదు. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీని బలపర్చాలని తీసుకున్న నిర్ణయంలోనూ అదే హేతువు కనిపిస్తుంది. ఇప్పుడు కూడా చాలా పార్టీలు తమ వైఖరి తేల్చుకోలేక తర్జనభర్జన పడుతుండగా సిపిఎం అలాటి శషభిషలు లేకుండా తన విధానం సూటిగా ప్రకటించిందంటే అదే కారణం.
భారత రాష్ట్రపతిని రాజ్యాంగ రీత్యా అధికారాలు లేని రబ్బరు స్టాంపుగా అభివర్ణిస్తుంటారు. బ్రిటిష్ రాణితో పోలుస్తుంటారు. పార్లమెంటరీ వ్యవస్థ క్యాబినెట్ పాలనా విధానం వున్న మాట నిజమే అయినా రాష్ట్రపతి స్థానం అంత అప్రధానమైనది గాని లాంఛనమైనదిగానీ కాదు. దేశాన్ని పాలించవలసిన ప్రభుత్వాధినేతను ఆహ్వానించవలసింది రాష్ట్రపతి మాత్రమే. ఏదో ఒక పార్టీకి గుత్తాధిపత్యం వుండే కాలం పోయి మిశ్రమ ఫ్రభుత్వాలు వచ్చాక ఈ విషయంలో రాష్ట్రపతి విచక్షణాధికారం చాలా చాలా కీలకమై