Pages

Thursday, September 1, 2011

కుయ్యి కుయ్యి .. కుయ్యో కుయ్యో!


వ్యక్తులకైనా వ్యవస్థలకైనా ప్రచారం వల్ల వున్నదానికి మించిన ప్రాధాన్యత లభిస్తుంది. మామూలుగా కుయ్యి కుయ్యి అంటే నవ్వొస్తుంది. కాని ఒకప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆ శబ్దాన్ని అనుకరిస్తూనే ఓటర్లను ఆకట్టుకున్నారు. కుయ్యి కుయ్యి అంటూ 108 వాహనాలు దూసుకొచ్చి ప్రాణాలు నిలబెడుతున్నాయనేది ఆయన ప్రధాన ప్రచార నినాదాల్లో ఒకటి. ఆరోగ్యశ్రీ ద్వారా అపరేషన్లు చేయించడం మరొకటి. ఆచరణలోనూ వీటి ప్రయోజనం కనిపిస్తున్నందువల్ల ప్రజలూ నిజమే అని బలపర్చారు. ఆయన హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించినప్పుడు అదే 108 వాహనం వెళ్లిందని బాధతో అనుకున్నారు కూడా. అప్పుడూ ఇప్పుడూ కూడా ఈ విషయంలో విమర్శలు లేవని కాదు. లోపాలూ లేవని కాదు. అవి ఇప్పుడు పరాకాష్టకు చేరాయి. అందరికీ అత్యవసర చికిత్స అందించేందుకు ఏర్పాటైన 108 వ్యవస్థ తానే ప్రాణాంతక పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. దీనికి కారకులెవరంటే చెప్పడం కష్టం. దాన్ని సృష్టించి అప్పుల పాలు చేసి వదలిపెట్టిన సత్యం రామలింగరాజా? లేక దాన్ని కొనసాగించేందుకు ముందుకొచ్చిన జివికె సంస్థనా? కాక ఒప్పందం ప్రకారం నిధులు ఇవ్వలేదంటున్న ప్రభుత్వమా? 108కి చెందిన 33 ఎకరాల విలువైన భూమిపై ఆశలా?

ప్రాణాపాయ స్థితిలో వుండే వారికి అత్యవసర చికిత్స చేస్తూ వేగంగా వైద్యశాలకు చేర్చేందుకు 108 చేసిన సేవ చాలా గొప్పదే. విడివిడిగా ఆంబులెన్సులు కాక 802 వాహనాలను ఒకే వ్యవస్థగా సమకూర్చి వైద్యశాలలను కూడా గొలుసుకట్టుగా చేర్చడం వల్ల వెనువెంటనే తీసుకుపోవడానికి వీలు కలిగింది. ఇదంతా నడిపించే 4500 మంది ఉద్యోగుల సేవానిరతివల్ల, శ్రద్ధాసక్తుల వల్ల వందలాది ప్రాణాలు రక్షించబడ్డాయి. ఇది కాదనలేని వాస్తవం. అయితే నిన్న సత్యం లేదా నేడు కెవికె దీన్ని ధార్మిక దృష్టితో చేస్తున్నారన్నది పాక్షిక సత్యమే. ఆ ఖర్చులో 95 శాతం ప్రభుత్వమే భరిస్తుంది. అంటే నిర్వాహక బాధ్యత తీసుకున్నవారు సకాలంలో సక్రమంగా చెల్లిస్తే
కూడా నూటికి అయిదు రూపాయాలు మాత్రమే భరిస్తారు.జివికె సంస్థ ప్రతినిధుల మాటల ప్రకారమే వారు నెల నెలా కోటికి కొంచెం ఎక్కువగా చెల్లిస్తున్నారు. మరో వైపున ఈ వ్యవస్థ మొత్తంపైన వారికే ఆధిపత్యం వుంటుందనేది గమనించాల్సిన విషయం. సత్యం అయితే చాలా కాలం పాటు ప్రభుత్వ చిహ్నం కూడా లేకుండా తన ఘనతగానే 108 నడిపింది. ఒక సందర్భంలో అప్పటి ఆరోగ్య మంత్రి రోశయ్య ప్రభుత్వ గుర్తును కూడా చూపించాలని ఆ ప్రతినిధులను కోరుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా సమకూర్చారనుకున్నా నూటికి అయిదు రూపాయలు మాత్రమే వెచ్చించేవారికి మొత్తం పెత్తనం అప్పగించడం మామూలుగా జరిగేదేనా? తర్వాత కాలంలో సత్యం రామలింగరాజు ఆ ఆస్తులను తాకట్టు పెట్టి రు.42 కోట్లు అప్పు తెచ్చుకున్నట్టు ఆయనపై దర్యాప్తు మొదలైనాక బయిటకు వచ్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనైతే సరిగ్గా నడవదంటూ కార్పొరేట్‌ సమర్థత కోసం సత్యంకు సర్వం ధారాదత్తం చేసిన వారు దీనిపై కాస్తయినా కళ్లు తెరిచిన పాపాన పోలేదు.ఇందుకోసం ప్రభుత్వం ఏటా రు.40 లక్షలు వడ్డీ చెల్లిస్తుండడం ఇంకా విపరీతం.
తర్వాత కాలంలో వైఎస్‌ సూచన మేరకు జివికె సంస్థ 108 బాధ్యతలు చేపట్టింది. ఇందుకోసం తాము 120 కోట్లు వెచ్చించామని ఆ సంస్థ ప్రతినిధి స్వరూప్‌ చెబుతున్నారు.ఆ సంగతి ఎలా వున్నా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదంటున్న జివికె ఫిర్యాదుల నేపథ్యంలో నిర్వహణ మాత్రం లోపభూయిష్టంగా తయారైంది.దాదాపు సగానికి సగం వాహనాలు మరమ్మతుల పేరిట మూలన పడి వుండగా తిరిగే వాటిలో మందుల లభ్యత కూడా 24 శాతానికి తగ్గిపోయింది.రోజుకు ఆరు వేల కేసులకు సహయం చేసింది కాస్త ఇప్పుడు 2500 కు తగ్గిందని ఒక అంచనా. ప్రభుత్వం సహకరించడం లేదని జివికె ఆరోపణ కాగా ఆ సంస్థ తన వాటా విడుదల చేయడం లేదని ప్రభుత్వాధికారులు, సంబంధిత ఉద్యోగ సంఘాల సమాచారం. అన్నిటినీ మించి ఉద్యోగులకూ రెండు మాసాలుగా ి జీతాలు అందడం లేదంటున్నారు. ప్రభుత్వం నిధులు ఇస్తున్నా ఇలా జరుగుతుంటే నిర్వాహకులను ప్రశ్నించాలి. ప్రభుత్వందే తప్పయితే దిద్దుకోవాలి. అంతే గాని కేవలం జివికెకు మాత్రమే సంబంధించిన సమస్య అయినట్టు వ్యవహరించడం పొరబాటు. 108 మాత్రమే గాక 104 పేరిట ఏర్పాటు చేసిన వైద్య సలహా వ్యవస్థకూ ఇదే దుస్థితి ప్రాప్తించింది. వాటిని ఇప్పుడు క్లస్టర్లకు కేటాయించి ప్రాథమిక వైద్య కేంద్రం డాక్టర్లను అనుసంధానం చేయడం వల్ల వైద్య సేవలు మరింత దెబ్బ తినే ప్రమాదం ఏర్పడింది.ఇక్కడా వుద్యోగుల బాధలు వర్ణనాతీతంగా వున్నాయి.అత్యవసర సేవలు కాదు గనక వీరి గోడు అసలే వినేవారు లేరు.
జివికె అధినేత కృష్ణారెడ్డి ముఖ్యమంత్రికి లేఖ రాయడంతో 108 సమస్య బహిరంగ చర్చగా మారడం సహజమే. అంభంలో కుంభం అన్నట్టు మెగాస్టార్‌ చిరంజీవి (కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నాక) తన బ్లడ్‌బ్యాంక్‌ అనుభవంతో 108 నిర్వహణతీసుకోవడానికి ప్రయత్నించినట్టు మరో కథనం.ఇన్నిటి మధ్యనా ముఖ్యమంత్రి జివికెకే దాన్ని అప్పగించనున్నట్టు ప్రకటించేశారు.ఉభయులూ సమస్య ఏమీ లేదంటున్నారు. ఎవరికిచ్చారనే దానికన్నా ఎలా నడపాలనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. కార్పొరేట్‌ భాగస్వామ్యం, దాతృత్వం అన్నవి ఆహ్వానించదగినవే గాని ఆ పేరుతో వారి వాటా నామమాత్రమైనప్పటికీ నిర్వహణ పూర్తిగా వారి చేతుల్లో పెట్టడం తర్క విరుద్ధమైన విషయం. 95 శాతం ఖర్చు భరించేవారిపై 5 శాతం భరించేవారు షరతులు విధించడం ఎక్కడా జరగదు. కాని సరళీకరణ యుగంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య ప్రహసనం అలా వుంటుంది!వ్యాపార సంస్థగా జివికె సమర్థత, మంచి చెడ్డలు ఏమైనప్పటికీ 108 నిర్వహణ తీసుకున్నాక ఆ లోపాలకు బాధ్యత కేవలం ప్రభుత్వానిదేనని చెప్పడం కుదిరేపని కాదు. తమ వాటా అయిదు శాతం చెల్లించేశారా అన్న ప్రశ్నకు కూడా సమాధానం లేదు.ఎమర్జన్సీ మేనేజిమెంటు రిసెర్చి ఇన్‌స్టిట్యూట్‌(ఇఎంఆర్‌ఐ)కోసం మేడ్చల్‌ దగ్గర ప్రభుత్వం కేటాయించిన 33 ఎకరాల భూమితో పాటు ఆ సంస్థలో చేరేవారి ఫీజులు కూడా నిర్వాహకులకే వెళ్తాయి. ప్రజల ప్రాణ రక్షణకు సంబంధించిన ఈ వ్యవస్థ నిర్వహణకు సంబంధించిన జమాఖర్చులను పారదర్శకంగా ప్రజలకు సమర్పిస్తున్నదీ లేదు. ప్రజాస్వామ్య పాలనా పద్దతికి ఎంత మాత్రం సరిపడని ధోరణులివి.సత్యం చేదు అనుభవం తర్వాతనైనా ప్రభుత్వం ఎలాటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూసుకోవలసింది పోయి అలసత్వాన్ని కొనసాగించడం సహించరాని విషయం.
ఆరోగ్యశ్రీ అధ్వాన్నంగా వుందని స్వయంగా ఆరోగ్య మంత్రి డి.ఎల్‌.రవీంద్రారెడ్డి పలు సార్లు చేసిన ప్రకటనలు కూడా కలిపి చూస్తే ఆరోగ్య రంగాన్ని ఎంతటి అనారోగ్యం ఆవరించిందీ అర్థమవుతుంది. ఆరోగ్యశ్రీ కింద 3000 కోట్ల ఖర్చుతో 11 లక్షల ఆపరేషన్లు చేసినట్టు చెబుతూనే ముఖ్యమంత్రి ప్రభుత్వాసుపత్రులు నిర్యక్ష్యానికి గురైనాయని అంగీకరించారు.మన్య ప్రాంతాల్లో మలేరియా నుంచి తెలుగు నగరాల్లో కుక్క కాటు మృతుల వరకూ కూడా మన వైద్య రంగం, ఔషదాల సరఫరా ఎంత ఘోరంగా వున్నదీ తెలియజేస్తున్నాయి.ఎంతసేపూ 108,ఆరోగ్యశ్రీల భజనలోనే మునిగితేలుతూ అంతకన్నా కీలకమైన ప్రజారోగ్య వ్యవస్థను ప్రాథమిక వైద్య రంగాన్ని గాలికి వదిలేసిన ఫలితాలు పేద మధ్యతరగతి వర్గాలను కుదిపేస్తున్నాయి. కాస్త నలతకే హడలిపోయే రోజులు వచ్చాయి. ఆరోగ్యశ్రీ కార్పొరేట్‌ శ్రీ గా మారిందని అందరూ అంగీకరిస్తారు గాని ఇతర విషయాల్లోనూ అలాటి ఫిర్యాదులున్నాయి. ఉదాహరణకు 108లో అత్యవసర చికిత్స వరకూ బాగానే వుంది గాని తర్వాత ఏ కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్తారు అక్కడ ఎంత భారం మోపుతారు అన్నది తర్వాత గాని తేలదు. ప్రభుత్వ వైద్యశాలలను ఖాయిలా పెట్టి పరికరాలను మూలన పెట్టి మందుల సరఫరాను బిగబట్టి నియామకాలను తొక్కిపట్టి పంచ నక్షత్ర వైద్యశాలల పంట పండించడం కన్నా పరిహాసం ఏముంటుంది?కనక మన ఆరోగ్య వ్యవస్థను ఆవరించిన దుర్బాగ్యాన్ని వదిలించకుండా పైపై చిట్కాలతోనూ కార్పొరేట్‌ కంటితుడుపులతోనూ సరిపెట్టడం అసలు వ్యాధిని దాచిపెట్టడమే అవుతుంది. ప్రజావైద్య వ్యవస్థను పటిష్టం చేయడం ఇప్పటి అవసరం. అమెరికాలో అత్యవసర విభాగం 9/11ను దృష్టిలో వుంచుకుని ఒకటి తగ్గించి 10/8 ఖరారు చేసి వుండొచ్చు. కాని ఆ అమెరికాలో కూడా ఆరోగ్య సమస్య పెనుభూతమై ప్రభుత్వాలను వేధిస్తున్నది.(ఇప్పుడు ఆర్థిక సంక్షోభ నివారణకై అప్పు తెచ్చుకోవడానికి కుదిరిన అంగీకారంలోనూ వైద్య వ్యయం హామీల ఖర్చు తగ్గింపు ఒకటి.) ఈ అనుభవాలన్ని గమనంలో వుంచుకుంటే మన వంటి పేద దేశంలో ప్రభుత్వ వైద్యాన్ని పదిమందికి అందేలా చేయడమే పరిష్కారం తప్ప కార్పొరేట్‌ తారకమంత్రం పనికి రాదు. ధర్మాసుపత్రుల్లో అవినీతిని అరికట్టవద్దని ఎవరూ అనరు గాని పంచనక్షత్ర వైద్యశాలలు అధికారికంగా దొరల్లా వసూలు చేసే ఘరానా ఛార్జీలకు బడుగు జనాన్ని గురి చేయడం మాత్రం న్యాయం కాదు. 108 వాహనాల కుయ్యొ కుయ్యోను తగ్గించడంతో పాటు ఏలిన వారు ఈ సమగ్ర పరిష్కారాలు కూడా ప్రారంబించవలసి వుంటుంది. (ఆంధ్రజ్యోతి,గమనం,1,9,11)

No comments:

Post a Comment