Pages

Monday, September 12, 2011

బాలయ్య ..... బావయ్య



నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలని డైలాగు చెప్పిన బాలయ్య సింహౌత్సాహంతో రామరాజ్యం కేసి ఆశగా చూస్తున్నారు. ఈ దశలో ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడంపై రకరకాల వూహాగానాలు సాగుతున్నాయి. జనాకర్షణ గల నటుడుగా ఆయన ప్రకటనను తెలుగుదేశం శ్రేణులు ఆహ్వానించడంలో ఆశ్చర్యం లేదు. అధినేత చంద్రబాబు నాయుడు కూడా స్వాగతించాడు. ఒకప్పుడు అనంతపురంలో ఎన్టీఆర్‌ బాలయ్య నా రాజకీయ వారసుడు అని ప్రకటిస్తే రాజకీయ ప్రకంపనాలు పుట్టాయి.అలాటిచోటనే బాలయ్య ఇప్పుడు ఈ ప్రకటన చేస్తే చంద్రబాబు ఆహ్వానించడం మారిన రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుంది. ఇంతకూ బాలయ్య బావయ్య బాబయ్య ఎవరైనా కుటుంబాల పరిధిలో వారే గనక
మౌలికంగా ఇందులో పెద్ద మార్పులేమీ వుండవు. కాకపోతే హరికృష్ణ ఆయన కుమారుడు జూనియర్‌ ఎన్టీఆర్‌లను దృష్టిలో పెట్టుకునే ఈ ప్రకటన చేయించారన్న మాట ఒకటి వినిపిస్తుంది. వూహాగానాలు ఎలా వున్నా హరికృష్ణ గతంలో స్వంతంగా పార్టీ పెట్టి దెబ్బతిని మళ్లీ వచ్చి చేరారు. జూ.ఎన్టీఆర్‌ హుషారైన యువహీరోగా వెలిగిపోతున్నా ఇప్పటికిప్పుడే దుస్సాహసాలు చేసేందుకు సిద్దం అవుతారని ఎవరూ అనుకోరు. కాకుంటే ఇటీవల కొన్ని సందర్బాలలో ఆయన చేసిన ప్రకటనలు ఆ విధమైన సందేహాలకు అవకాశమిచ్చాయి. దేశంలోనూ రాష్ట్రంలోనూ పాలక పక్షాలలో కుటుంబ సభ్యుల ప్రముఖ పాత్రను గమనంలో పెట్టుకుని చూస్తే తెలుగు దేశంలో ఇవన్నీ జరగడం చాలా సహజమే. ఏడేళ్లుగా ప్రతిపక్షంలో వుండి అనేక ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న తెలుగు దేశం పునాదిని కాపాడుకోవడంపై వీరంతా దృష్టి పెడతారు తప్ప దాన్ని దెబ్బ తీసుకోరు కదా. ఇంతకూ గతంలో తమ ఓటమికి దారి తీసిన తప్పిదాలను సరిదిద్దుకుని, ప్రజల విశ్వాసం పొందడమనేది తెలుగుదేశం ముందున్న పెద్ద సవాలు. ఇటీవలి రాజకీయ పరిణామాలు వారికి కొంత ఉపశమనం కలిగించినా ప్రాంతీయ పరమైన సవాళ్లు, కుటుంబ సంబంధమైన ఒడుదుడుకులు కొనసాగుతున్నట్టే భావించాలి. ఈ నేపథ్యంలోనే బాలయ్య ప్రకటనపై అభిమానుల నుంచి వస్తున్న స్పందన మరింత వూరట కలిగించవచ్చు గాని దాని వల్ల ముందున్న సవాళ్ల తీవ్రత తగ్గదు. కనక బాలయ్య ప్రకటనతోనే తెలుగు దేశం తలకిందులై పోతుందనుకోవడం అవాస్తవికతే అవుతుంది.

No comments:

Post a Comment