Pages

Sunday, July 15, 2012

రాష్ట్రపతి ఎన్నికల రాజకీయాలుభారత రాష్ట్రపతి ఎన్నిక ఈ సారి తీవ్ర రూపం తీసుకున్నదని ఎన్‌డిఎ అభ్యర్థి పి.ఎ.సంగ్మా వ్యాఖ్యానించారు గాని వాస్తవంలో యుపిఎ అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ విజయావకాశాల స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధినేత ఇందిరాగాంధీయే వైఖరి మార్చుకున్న 1969 ఎన్నికలను మినహాయిస్తే ఇంత వరకూ అధికార పక్ష అభ్యర్థి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిపోయిన దాఖలాలు లేవు. ఇందుకు చట్ట సభల బలాబలాలు ఒక కారణమైతే రాజకీయ పార్టీల విన్యాసాలు మరో కారణం. ఇన్నిటి మధ్యనా వామపక్షాలు,అందులోనూ సిపిఎం ఎప్పుడూ ఒక నిర్దిష్ట వైఖరితో వ్యవహరిస్తూ వస్తున్నది. అత్యున్నతమైన ఆ రాజ్యాంగ బాధ్యత స్వీకరించే వ్యక్తి అభివృద్ది నిరోధక మతతత్వ నేపథ్యం కలిగి వుండరాదన్న సూత్రానికి సంబంధించి సిపిఎం ఎన్నడూ వెనక్కు పోలేదు. ఇప్పుడు ప్రణబ్‌ ముఖర్జీని బలపర్చాలని తీసుకున్న నిర్ణయంలోనూ అదే హేతువు కనిపిస్తుంది. ఇప్పుడు కూడా చాలా పార్టీలు తమ వైఖరి తేల్చుకోలేక తర్జనభర్జన పడుతుండగా సిపిఎం అలాటి శషభిషలు లేకుండా తన విధానం సూటిగా ప్రకటించిందంటే అదే కారణం.
భారత రాష్ట్రపతిని రాజ్యాంగ రీత్యా అధికారాలు లేని రబ్బరు స్టాంపుగా అభివర్ణిస్తుంటారు. బ్రిటిష్‌ రాణితో పోలుస్తుంటారు. పార్లమెంటరీ వ్యవస్థ క్యాబినెట్‌ పాలనా విధానం వున్న మాట నిజమే అయినా రాష్ట్రపతి స్థానం అంత అప్రధానమైనది గాని లాంఛనమైనదిగానీ కాదు. దేశాన్ని పాలించవలసిన ప్రభుత్వాధినేతను ఆహ్వానించవలసింది రాష్ట్రపతి మాత్రమే. ఏదో ఒక పార్టీకి గుత్తాధిపత్యం వుండే కాలం పోయి మిశ్రమ ఫ్రభుత్వాలు వచ్చాక ఈ విషయంలో రాష్ట్రపతి విచక్షణాధికారం చాలా చాలా కీలకమై
పోయింది. 1979లో చరణ్‌ సింగ్‌ను నీలం సంజీవరెడ్డి ఆహ్వానించడం, 1991లో వెంకట్రామన్‌ జాతీయ ప్రభుత్వంకై అన్నిపార్టీలతో మాట్లాడ్డం, 1996లో శంకర్‌దయాళ్‌ శర్మ మొదట వాజ్‌పేయిని ఆహ్వానిస్తే 13 రోజుల్లో కూలిపోవడం ఇవన్నీ వివాదాస్పద నిర్ణయాలుగా మారాయి. రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన వంటి అంశాలు సరేసరి. 1989లో బిజెపి బలం గణనీయంగా పెరిగిన తర్వాత రాష్ట్రపతి స్థానం మరింత కీలకంగా మారింది.అక్కడ వుండే వ్యక్తి మతతత్వం పట్ల ఏ మాత్రం మెతక వైఖరి చూపించినా దేశానికే హాని కలిగే పరిస్థితి. అందుకే సిపిఎం ఈ అంశానికి ప్రథమ ప్రాధాన్యత నిస్తూ వస్తున్నది. వాస్తవానికి 1969 లో వివిగిరి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగినప్పుడు ఆయనకు ఇందిరాగాంధీ మద్దతు వున్నా సిపిఎం కూడా బలపర్చినందువల్లనే సంజీవరెడ్డి ఓడిపాయారు. నిజానికి ఆ సమయంలో సిపిఐ కాంగ్రెసతో వెండగ్‌ా సిపిఎం తీవ్రంగా పోరాడుతున్నది. అయినా సిండికేట్‌ తరపున సంజీవరెడ్డి గెలవడాన్ని అనుమతించరాదని భావించి స్వతంత్ర అభ్యర్థిగా వున్న కార్మిక నేత గిరిని బలపర్చింది. 1977 వచ్చే సరికి అదే సంజీవరెడ్డి జనతా పార్టీ తరపున గెలిచి స్పీకర్‌ స్థానంలో వుండి ఏకగ్రీవ అభ్యర్థిగా అందరి మద్దతు పొందగలిగారు.1982లో జైల్‌సింగ్‌,1987లో వెంకట్రామన్‌ ఎవరి మద్దతు అవసరం లేకుండానే కాంగ్రెస్‌ తరపున గెలవగలిగారు. వామపక్షాలు,ప్రాంతీయ పార్టీలు లాంచనంగా పోటీకి నిలిపాయి.
1992 నాటికి ఈ పరిస్థితి మారింది. కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టి లేని స్థితిలో శంకర్‌దయాళ్‌ శర్మను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపితే బిజెపి తెలుగు దేశం తదితర పార్టీలు జిజిస్వెల్‌ను ఆయనపై పోటీ పెట్టాయి. బిజెపి బలం బాగా పెరిగిన నాటి స్థితిలో శర్మను గెలిపించడం అవసరమని వామపక్షాలు భావించాయి గాని ఆర్‌ఎస్‌పి ఓటింగుకు దూరంగా వుండిపోయింది. లౌకిక వాది అయిన శర్మ ఆ స్థానంలో వున్నారు గనకే అయోధ్య విధ్వంసాన్ని తీవ్రంగా ఖండించడమే గాక తర్వాత నిర్లిప్తంగా వున్న పివినరసింహారావు ప్రభుత్వాన్ని ముల్లుగర్రతో పొడిచి మరీ రంగంలోకి దింపారు. అదే తర్వాత కాలంలో వామపక్షేతర పార్టీలన్నిటి అభ్యర్థిగా రాష్ట్రపతి అయిన అబ్దుల్‌ కలాం ఆజాద్‌(ఆయన శాస్త్రజ్ఞుడని మైనారిటీ అని పదవిలో కూచోబెట్టినా అసలు సంగతి ఆయన సంఘ పరివార్‌కు ఆమోదయోగ్యుడు. వారి చిర కాలవాంఛ అయిన అణు బాంబును చేసి పెట్టిన వాడు) గుజరాత్‌లో భయానక మత మారణకాండ జరిగినా పెదవి మెదపలేదు! ఈ మధ్య కలాం రాసిన జ్ఞాపకాల్లో ప్రధాని వాజ్‌పేయి తనను గుజరాత్‌ పర్యటనకు వెళ్లవద్దని వారించేందుకు ప్రయత్నించినట్టు అయినా వెళ్లినట్టు రాశారు.వాస్తవానికి వెళ్లి చేసింది మోడీని పొగడ్డమే. (కనీసం వాజ్‌పేయి కన్నీళ్లు పెట్టుకుని కవితలు రాసి కాస్తయినా స్పందన చూపించారు. మోడీని మార్చాలని కూడా ప్రతిపాదించి వెనక్కు తగ్గారు.) లౌకిక విలువల ప్రాధాన్యత ఏమిటో ఇక్కడే తెలుస్తుంది. శర్మ అభ్యర్థిత్వం సమస్య వచ్చినప్పుడే దళితుడు ఆ పదవిలోకి రావాలన్న ప్రతిపాదన వచ్చింది. సిపిఎం అప్పుడు చొరవ తీసుకుని కె.ఆర్‌.నారాయణన్‌ పేరును ముందుకు తెచ్చింది. ఆయన మొదట ఉపరాష్ట్రపతిగానూ ఏక గ్రీవంగా ఎన్నికైనందున తర్వాత రాష్ట్రపతి కావడం చాలా తేలికైంది. వాజ్‌పేయి ప్రభుత్వం అద్యక్ష తరహా పాలనకోసం రాజ్యాంగ వైఫల్యం అంటూ దాడి చేసినపుడు నారాయణన్‌ చాలా సూటిగా దాన్ని ఖండించారు. రాజ్యాంగ స్వర్ణోత్సవ సభలో ఆయన ప్రసంగం ఒక ప్రామాణికత సంతరించుకుంది. అన్ని పార్టీల ఆమోదంతో ఉప రాష్ట్రపతి అయిన కృష్ణకాంత్‌ను రాష్ట్రపతి పదవి ఇస్తామని చెప్పిన వాజ్‌పేయి ఆఖరున ప్లేటు ఫిరాయించడంతో ఆయన గుండె పగిలి మరణించాడంటారు. కలాంను అక్కడ ప్రతిష్టించేందుకు బిజెపి ఇంతగా ఆరాటపడటానికి కారణం స్పష్టం. కాకపోతే అప్పుడు కాంగ్రెస్‌ కూడా బలపర్చింది. వామపక్షాలు మరికొన్ని పార్టీలు కెప్టెన్‌ లక్ష్మీ సైగల్‌ను పోటీకి పెట్టి విస్త్రత ప్రచారం నిర్వహించాయి.
కలాం తర్వాత మరోసారి రాష్ట్రపతి పీఠంపై చర్చ జరిగినప్పుడు మహిళ వుండాలన్న మాట వచ్చింది.అంతిమంగా ప్రతిభా పాటిల్‌ ఆ స్థానం ఆలంకరించగలిగారు. ఆమెకు అన్ని పార్టీలూ మద్దతునిచ్చాయి. ఇలా కాంగ్రెస్‌ బిజెపిలతో సహా అన్ని పార్టీలూ బలపర్చిన సందర్భాలున్నాయి, విభేదించిన ఘట్టాలున్నాయి. ఇప్పుడు జరుగుతున్నది కూడా అందుకు భిన్నమేమీ కాదు. 
కాంగ్రెస్‌ తరపున ప్రణబ్‌ ముఖర్జీ వుంటారని వార్తలు వస్తున్నా ఆ పార్టీనే కావాలని ఎటూ తేల్చకుండా జాగు చేసింది. ఉత్తరోత్తరా ప్రణబ్‌ యుపిఎ అభ్యర్థిగా రావడం, అటు వైపున బిజెపి మరొకరిని నిలబెట్టాలని భావించడం, మూడో అభ్యర్థి రంగంలో లేకపోవడం సంభవించింది. ఈ ఇద్దరు గాక మూడో అభ్యర్థి విస్త్రత మద్దతుతో రంగంలో వుండి వుంటే పరిస్థితి మరోలా వుండేది. అది లేనప్పుడు వామపక్షాలు బిజెపితో కలసి ఓటు చేయడమనే ప్రసక్తి ఎలానూ వుండదు. కాకపోతే సిపిఎం ఆర్‌ఎస్‌పిలు ఓటింగులో పాల్గొనరాదని నిర్ణయించడం వల్ల విభేదాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇలాటి తేడాలు గతంలోనూ వున్నాయి. 1996లో యునైటెడ్‌ ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో ప్రధాని పదవి తీసుకోవడానికి గాని , భాగస్వామిగా చేరడానికి గాని సిపిఎం,ఆర్‌ఎస్‌పి, ఫార్వర్డ్‌బ్లాక్‌లు నిరాకరించగా సిపిఐ మాత్రం చేరింది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లోనూ తెలంగాణా సమస్య విషయంలోనూ తెలుగు దేశంతో సంబంధాల విషయంలోనూ రెండు పార్టీల మధ్య తేడాలున్నాయి. అంతమాత్రాన వామపక్ష ఐక్యత ప్రజా సమస్యలపై సమైక్య పోరాటాలు ఆగబోవని రెండు పార్టీలూ చెబుతూనే వున్నాయి. నిజానికి యుపిఎ ఎన్‌డిఎలు కూటములుగా వున్నా రాష్ట్రపతి ఎన్నికలో ఒక అభిప్రాయానికి రాలేక నిలువునా చీలిపోయాయి. వామపక్షాలు కలసి చర్చించుకోవడం తప్ప జాతీయ స్థాయిలో ఒక కూటమిగా లేవు గనక వాటి మధ్య కొన్ని తేడాలుండటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. కాకపోతే ప్రణబ్‌ ముఖర్జీకి మద్దతు నివ్వడం కాంగ్రెస్‌ పట్ల అనుకూల సంకేతాలిస్తుందన్నట్టు కొంతమంది చేసే వ్యాఖ్యలు అర్థ రహితమైనవి. బెంగాల్‌ రాజకీయాల రీత్యా మమతా బెనర్జీ ప్రణబ్‌ను బలపర్చకపోవడం ఒక ముఖ్యమైన అంశమే అయినా అదొక్కటే ఈ నిర్ణయానికి కారణం కాదనేదిపైన చూసిన చరిత్రను బట్టి అర్థమవుతున్న సత్యం. తనకు కీలకమైన బెంగాల్‌లో రాజకీయ వైరుధ్యాలను సిపిఎం పరిగణనలోకి తీసుకోవడంలో పెద్ద ఆశ్చర్యం కూడా లేదు. 2009లో వామపక్షాల బలం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో స్వంతంగా పోరాడగలిగిన పరిస్థితి ప్రస్తుతం లేదు కూడా. సిపిఎంలో ప్రసేన్‌ జిత్‌ బోస్‌ రాజినామా పెద్ద సంచలనం కలిగిస్తుందన్న అంచనాలు కూడా ఆ వెంటనే బహిష్కరణతో పటాపంచలైనాయి. ఇప్పుడు జెఎన్‌యు లో ఆ పార్టీ శాఖను రద్దు చేసిన సంఘటనను కొంతమంది అతిగా చూపిస్తున్నా నిజానికి ఇవన్నీ టీ కప్పులో తుపానుల వంటివే.ఎందుకంటే ఎస్‌ఎప్‌ఐ నాయకులు కొందరు తమ సంఘ పరిధిని మర్చిపోయి రాజకీయ వివాదాలను దాడికి దిగడం వల్ల దాని నిబంధనావళి ప్రకారం ఆ సంస్థ రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయం అది. ఏ ప్రజాసంఘంలోనైనా ఇంతకన్నా భిన్నంగా జరిగే అవకాశం వుండదు. ఈ ఘటనల వ్యక్తుల పరిధి చాలా పరిమితమైనది. ప్రణబ్‌ ఆర్థిక విధానాలు వగైరాల గురించి కొంతమంది పెద్దలు కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నా ఇవి కొత్తవేమీ కాదు. వాటికి రాష్ట్రపతి పీఠానికి సంబంధం లేదు కూడా.మిశ్రమ ప్రభుత్వాల యుగంలో అక్కడ మతతత్వ అనుకూలవాది కూచోవడం మాత్రం ఏ పరిస్థితుల్లోనూ అనుమతించరానిది. విధానపరమైన సూత్రాలు లేనిపార్టీలు తాత్కాలిక ప్రయోజనాలు స్థానిక అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకోవడంలో తడబడవచ్చు గాని సిపిఎం వంటి పార్టీకి ఆ సమస్య వుండదు. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా రెండవ సారి వస్తున్న హమీద్‌ అన్సారీ కూడా ఆయన లౌకిక నిబద్దత కారణంగానే అర్హత సంపాదించారని చెప్పాలి. బహుశా వచ్చేపర్యాయం ఆయన రాష్ట్రపతి కావడం సహజంగానే జరిగే అవకాశం చాలా వుంటుంది.

No comments:

Post a Comment