Pages

Saturday, July 7, 2012

జ్ఞాపకాల నేపథ్యంలో అయోధ్య నిజాలు


బాబరీ మసీదు విధ్వంసం సందర్భంలో నాటి ప్రధాని పి.వి.నరసింహారావు పాత్రపై మరోసారి దుమారం చెలరేగుతున్నది.వరుసగా వెల్లడవుతున్న వాస్తవాలు ఆ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి.అందులోనూ చాలా ముఖ్యమైన వ్యక్తులే నాటి ఘటనలను ఏకరువు పెట్టడం వల్ల కాదని నమ్మకంగా ఖండించలేని స్థితిలో కాంగ్రెస్‌ నాయకత్వం చిక్కుకుపోతున్నది. మాజీ కేంద్ర మంత్రి అర్జున్‌ సింగ్‌ జ్ఞాపకాలు ఆయన మరణానంతరం ప్రచురితమైన ఆయన జ్ఞాపకాలు ఇందుకు కారణమైనాయి.ఆ మరుసటి రోజునే ప్రముఖ పాత్రికేయుడు కులదీప్‌ నయ్యర్‌ పుస్తకం భాగాలు విడుదలవడంతో ఇది మరింత తీవ్రమైంది. కాకపోతే ఈ మొత్తం వ్యవహారాన్ని కేవలం ఆయన వ్యక్తిగత వ్యవహారంగా పరిమితం చేసే ప్రయత్నం కూడా జరుగుతున్నది.పివికి, సోనియా కుటుంబానికి మధ్య వైరుధ్యం కోణంలో ఎక్కువ మంది దీన్ని చిత్రిస్తున్నా కాంగ్రెస్‌ రాజకీయ విన్యాసాలు దేశ లౌకిక పునాదుల కోణం నుంచి చూడాల్సిన అవసరం ఎక్కువగా వుంది.
1992 డిసెంబర్‌ 6 వ తేదీన అద్వానీ ప్రభృతుల సమక్షంలో బాబరీ మసీదు విధ్వంసం జరగడం దేశాన్ని ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంత పరచింది. దేశ లౌకిక విలువలకు విఘాతం కలిగింది. తర్వాత మత కలహాలు చెలరేగాయి. అయితే రామజన్మభూమి ఆందోళన పేరుతో జరిగిన ఆ విధ్వంసాన్ని పివి ప్రభుత్వం ఆపలేకపోవడం తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. నాటి రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మ దేశ చరిత్రలోనే లేని విధంగా బహిరంగ ప్రకటన చేస్తూ ప్రభుత్వాన్ని తక్షణ చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించారు. ఈ ఘటనలపై నియమితమైన లిబర్‌హాన్‌ కమిషన్‌ 48 సార్లు గడువు పొడగించిన తర్వాత పదహారున్నర సంవవత్సరాలకు నివేదిక సమర్పించింది. అందులో పివి తప్పు లేదని కితాబునివ్వడంపై తీవ్ర విమర్శలొచ్చాయి.
రాజకీయ లబ్ది కోసం రామజన్మభూమి వివాదాన్ని రగుల్కొల్పిన బిజెపి నేత అద్వానీ ఆయన వెనక వున్న సంఘ పరివార్‌ల పాత్ర ఒకటైతే ఆ దారుణాన్ని అనుమతించడంలో నాటి పివి ప్రభుత్వ పాత్ర కూడా తక్కువ కాదు. నవంబరులో జరిగిన జాతీయ సమగ్రతా మండలి సమావేశంలోనే ఈ సమస్యను సాకల్యంగా చర్చించిన అఖిల పక్షాలు పరిస్థితిని అదుపు చేయడానికి ఏ చర్యనైనా తీసుకోవడానికి ప్రధానికి అధికారమిస్తూ ఏకగ్రీవ
తీర్మానం ఆమోదించాయి. ఆ తీర్మానం ప్రతిపాదించిన నాటి సిపిఎం ప్రధాన కార్యదర్శి హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ ఈ సంగతి చాలా సార్లుచెప్పారు. అవసరమైతే రాష్ట్రంలోని కళ్యాణ్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని అందరూ సూచించారు. అయినా ప్రధాని కావాలనే నిష్క్రియగా వుండిపోయారు. నిర్లిప్తతలో మునిగి పోయారు. సుప్రీం కోర్టులోనూ దీనిపై వాదోపవాదాలు నడిచాయి. చివరకు నాటి ముఖ్యమంత్రి కరసేవ లాంఛనంగా జరుగుతుందే తప్ప ఎలాటి తీవ్ర పరిణామాలు వుండబోవని మాట ఇచ్చి దారి తప్పించారు.కళ్యాణ్‌ సింగ్‌ తనను మోసం చేశాడని తర్వాత పివి ఆరోపించారు గాని వాస్తవంలో జరిగేది అదేనని దేశంలో అందరికీ తెలుసు. బాబరీ మసీదును కూలగొట్టడం తథ్యమని తాను పివిని ముందే హెచ్చరించానని అర్జున్‌ సింగ్‌ తన జ్ఞాపకాలలో రాశారు. అయితే ఆయన ఆ విషయం చర్చించడానికి ఏ మాత్రం ఆసక్తి చూపించలేదట! తీరా ఘటన జరిగిన రోజునైతే ఆయనతో మాట్లాడేందుకు ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా ఆయన ఎవరితో మాట్లాడదలచ లేదని జవాబు వచ్చిందట. ఆ విధ్వంసానికి నిరసనగా అర్జున్‌ సింగ్‌ అప్పట్లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఇక నాటి హౌంమంత్రి ఎస్‌బిచవాన్‌ కూడా లిబర్‌ హాన్‌ కమిషన్‌ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో ఇలాటి వ్యాఖ్యలే చేశారు. ఆ రోజున ప్రధాని టీవీ చూసుకుంటూ కూచున్నారని ఆయన చెప్పారు. మణిశంకర్‌ అయ్యర్‌ కూడా నాటి పివి పాత్రను విమర్శించారు. స్వయంగా రాహుల్‌ గాంధీ యుపి పర్యటన సందర్భంగా తమ కుటుంబం అధికారంలో వుంటే ఆ ఘటన జరిగేది కాదన్నారు.
ఈ నేపథ్యంలో కులదీప్‌ నయ్యర్‌ పుస్తకంలో వెల్లడించిన అంశాలు మరింత వివాదానికి కారణమైనాయి. ఆ రోజున కరసేవకుల దాడి మొదలు కాగానే పివి పూజా మందిరంలో చేరి తలుపులు వేసుకున్నారని, ఆకఱి రాయి కూడా కూలిపోయిందని తెలిసిన తర్వాతనే బయిటకు వచ్చారని సోషలిస్టు నేత మధులిమాయే తనకు చెప్పినట్టు కులదీప్‌ నయ్యర్‌ రాశారు. డిసెంబర్‌ 6 తర్వాత పివి సీనియర్‌ పాత్రికేయులతో ఎమన్నారో కూడా పేర్కొన్నారు. ఇవన్నీ ఇంచుమించు ఒకే విధంగా వున్నాయి.
వీటిని అలా వుంచి సాక్షాత్తూ పివి జ్ఞాపకాలకే వస్తే- 1992 అయోధ్య ఘటనలపై ఆయన ఒక పుస్తకమే రాశారు. ఆ పత్రాలు వగైరా పొందుపర్చారు. ఆ రోజున యుపి ప్రభుత్వాన్ని బర్తరప్‌ చేస్తే చాలా తీవ్ర పరిణామాలు కలిగేవి గనకే తాను చేయలేదని ఆయన వాదించారు. లిబర్‌ హాన్‌ కమిషన్‌ ముందు కూడా తన ఉదాసీనతను సమర్థించుకుంటూ మాట్లాడారు. తాను విదేశీ పర్యటనకు వెళ్తూ అర్జున్‌ సింగ్‌, ఎస్‌బిచవాన్‌,మాధవరావు సింధియాలతో కూడిన మంత్రివర్గ బృందానికి అధికారం ఇస్తే వారు తగు చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. డిసెంబర్‌ 5న తమ కేబినెట్‌ హౌం శాఖ కార్యదర్శి మాధవ్‌ గోల్చే ఒక తక్షణ కార్యాచరణ పథకాన్ని సిద్ధం చేసినా కావాలనే అమలు చేయలేదని సమర్థించుకున్నారు. 
అర్జున్‌ సింగ్‌,కులదీప్‌ నయ్యర్‌ వంటి వారి మాటలు కాస్త అటూ ఇటూ వున్నా ఆ రోజున ప్రధానిగా పివి నిర్లిప్తత వహించి ఆ ఘోరాన్ని అనుమతించారని వీటన్నిటిని బట్టి స్పష్టం అవుతూనే వుంది. కనక పివిపై ఎవరికి ఎంత భక్తి అభిమానం వున్నా ఆ ఘటన తీవ్రతను ఆయన వైఫల్యాన్ని దాని వెనక కుటిల నీతిని కప్పిపుచ్చడం సాధ్యం కాదు. అదే సమయంలో ఆయనను వ్యక్తిగతంగా విడదీసి విమర్శించి కాంగ్రెస్‌ రాజకీయ బాధ్యతను, ఆయనకన్నా ముందు రాజీవ్‌ గాంధీ హయాంలో జరిగిన పరిణామ క్రమాన్ని దాటేయాలనుకోవడం కూడా కుదిరేపని కాదు.
1986లో షాబాను కేసు తీర్పు అనంతరం ముస్లిం ఛాందసుల నుంచి వచ్చిన నిరసనకు తలవంచిన రాజీవ్‌ గాంధీ ముస్లిం మహిళల విడాకుల బిల్లు తెచ్చి విమర్శలకు గురైనారు. దానికి విరుగుడు అన్నట్టుగా హిందూ మత ఛాందసులను సంతృప్తి పర్చేందుకు దాదాపు మూడున్నర దశాబ్దాలుగా మూత పడి వున్న బాబరీ మసీదు/ రామజన్మభూమి కట్టడం తాళాలు తెరిపించారు. ఒక స్థానిక మేజిస్ట్రీటు ఏదో తీర్పునిచ్చారని సాకు చూపించి తన తాత నెహ్రూ ఎంతో ఆలోచించి వేయించిన తాళం బద్దలు కొట్టారు.తద్వారా బిజెపికి రామజన్మభూమి అనే ఆయుధం అందించి మతతత్వం రెచ్చగొట్టే అవకాశం అందించారు.ఆ వె ంటనే పాలంపూర్‌ తీర్మానంతో బిజెపి రెచ్చిపోయింది.1988లో అయోధ్య శిలాన్యాస్‌ను అనుమతించిన రాజీవ్‌ గాంధీ 1989 ఎన్నికల ప్రచారాన్ని అయోధ్య నుంచే రామరాజ్యం నినాదంతో ప్రారంభించడం మర్చిపోరానిది. అప్పటికే బోఫోర్సు భూతం వెన్నాడుతున్నందున ఈ చిట్కా ఆయనకు ఉపకరించలేదు గాని బిజెపి బలం పెరగడానికి బాగా అక్కరకు వచ్చింది. ఆ ఎన్నికలలో ప్రజల తీర్పు ఫలితంగా ఏర్పడిన విపిసింగ్‌ నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని బిజెపి అద్వానీ రథయాత్ర పేరిట వెన్నుపోటు పొడిస్తే ఆ సమయంలోనే రాజీవ్‌ గాంధీ కూడా చేతులు కలిపారు. స్వల్ప కాలం చంద్ర శేఖర్‌ తోలుబొమ్మ ప్రభుత్వాన్ని నడిపించి హఠాత్తుగా కూలదోసి ఎన్నికలకు కారకులైనారు.ఆ ఎన్నికల ప్రచారం మధ్యలోనే రాజీవ్‌ గాంధీ దారుణంగా హత్య గావించబడటం వల్ల సోనియా తిరస్కారం తర్వాత పివి ప్రధాని కాగలిగారు. (సోనియా ప్రతిపాదనకు ఆయన తీవ్ర విముఖత చూపారనేది అర్జున్‌ సింగ్‌ ఉపకథ గాని దానికి రాజకీయ ప్రాధాన్యత లేదు.సోనియా మొదట ఉప రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మను ఎంచుకున్నారని ఆయన నిరాకరించాకే పివి అయ్యారని మరో మాజీ కేంద్ర మంత్రి నట్వర్‌ సింగ్‌ తెలిపారు) రాజీవ్‌ హత్య వల్ల లభించిన సానుభూతితో మలి దఫా పోలింగులో కాంగ్రెస్‌ ఓట్లు పెరిగి పెద్ద పార్టీగా వచ్చినా మెజార్టి లేదు గనక పివి అనేక మల్లగుల్లాలు పడుతూ వచ్చారు.ఆ క్రమంలోనే బిజెపితో సఖ్యంగా వుండి ఉప సభాపతి పదవి వారికి అప్పగించారు. వారు కూడా ఆయన ప్రభుత్వ పతనానికి దారి తీసే ఎలాటి తీవ్ర వైఖరి తీసుకోకుండా లాంఛనంగా నిరసన తెల్పుతూ వచ్చారు. బాబరీ విధ్వంసం కూడా ఆ దశలో జరిగిందేనని గుర్తుంచుకోవాలి. నిజానికి అప్పట్లో ఆరెస్సెస్‌ పివిని ప్రశంసిస్తూ వచ్చింది. ఆయన కూడా సంఘపరివార్‌ అధినేత బాలాసాహెబ్‌ దేవరస్‌ను పిలిచి మాట్లాడాలనుకున్నారు.కనక డిసెంబర్‌ 6 ఘటనలు ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించవు. ఆ అవకాశవాద తప్పిదానికి మూల్యం ఏమంటే ఇప్పటి వరకూ కాంగ్రెస్‌ యుపిలో కోలుకోలేకపోవడం. 
పివి నరసింహారావు పాలనా కాలంపై ఇప్పుడు కొందరు పునరంచనాలు వేస్తూ ఆయనకు తగినంత గౌరవం దక్కలేదని వాపోతుంటారు. నెహ్రూ కుటుంబ ఏకచ్చత్రాధిపత్యం వంశ పారంపర్య పాలన పెత్తనం అన్న కోణంలో ఆ మాటలు నిజమైతే కావచ్చు గాని సరళీకరణ విధానాలు,మతతత్వ శక్తులకు దోహదం, అవినీతి విజృంభణ అన్న దృష్టితో చూస్తే మాత్రం ఆయన అనేక విధాల అభిశంసన ఎదుర్కోక తప్పదు. అర్జున్‌ సింగ్‌, కులదీప్‌ నయ్యర్‌ వంటి వారు రాసిన దానిలో సాంకేతికాంశాలు వెతకడం కంటే ఈ చారిత్రిక వాస్తవాన్ని గుర్తించడం ముఖ్యం. అలాగే ఆయనను మాత్రమే విమర్శించి అధికార పక్షం తప్పించుకోవడం సాధ్యం కాదన్నది అంతకన్నా కీలకమైన గుణపాఠం.


1 comment:

 1. పీవీ నరసింహారావుది మైనారిటీలో ఉన్న ప్రభుత్వం. ఆకస్మిక నిర్ణయాలూ, కఠిన నిర్ణయాలూ తీసుకుంటే ప్రతిపక్షాలన్నీ కలిసి ప్రభుత్వాన్ని కూలగొడతాయని పీవీ భావించి ఉండవచ్చు అనిపిస్తున్నది.

  పీవీ పాలనలో కాంగ్రెస్, బీజేపీల నడుమ కొంత సఖ్యత ఉన్నదని ఉపసభాపతి పదవి బీజేపీకివ్వడం నిరూపిస్తున్నది. రాష్ట్రాల్లో బీజేపీ ఏం చేసుకున్నా పరవాలేదు, కేంద్రంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం safe గా ఉంటే చాలునని పీవీ భావించి ఉండొచ్చు. భారతదేశంలో సెక్యులరిజం మనుగడ కన్నా కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడే పీవీకి ముఖ్యం అయిపోయిందన్నమాట!!

  అయితే ఇవన్నీ పీవీ సొంత నిర్ణయాలేననీ, ఈ విషయంలో ఆయన కాంగ్రెస్ పెద్దలను గానీ, సోనియాగాంధీని గానీ సంప్రదించకుండానే, ఉదాసీనవైఖరి అవలంబించాలని ఏకపక్షంగా నిర్ణయించేసుకున్నారనీ అనుకోవడం తప్పు!!

  ఈ వ్యవహారంలో సోనియా గాంధీ తప్పేం లేదనీ, ఆవిడ అమాయకురాలనీ అనుకోవడం పొరపాటు!! పీవీని కాకుండా, శంకర్ దయాళ్ శర్మను ప్రధానమంత్రిని చెయ్యడానికి సోనియా ప్రయత్నించింది. అయోధ్య రామమందిరం విధ్వంసం పట్ల పీవీ ఉదాసీనంగా వ్యవహరిస్తుంటే సోనియా ఏం చేసింది??

  ప్రధానమంత్రి ఎవరవ్వాలనే నిర్ణయాన్ని ప్రభావితం చెయ్యగల స్థాయిలో ఉండి కూడా విధ్వంసం తరవాత తక్షణచర్యలు చేపట్టాలనీ, అల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలనీ సోనియా పీవీని ఎందుకు ఆదేశించలేకపోయింది?? ఆనాడు చేతకాక నోరు మూసుకుని ఉండి, ఈనాడు భూమ్యాకాశాలు దద్దరిల్లేటట్టు గగ్గోలు పెట్టడం, తప్పంతా పీవీ మీదకు నెట్టేసి, మేం మాత్రం అమాయకులం అని సోనియా-రాహుల్ భజనకారులు ఫోజు పెట్టడం ఎవరి ప్రయోజనాల కోసం??

  "పీవీ కాబట్టి అట్లా చేశాడు గానీ, మేమైతే అసలు షో అదరగొట్టేసేవాళ్లం" అంటున్న రాహుల్ గాంధీ ఇప్పటికీ రామమందిరం సమస్య మీద ఒక అభిప్రాయం అంటూ వ్యక్తం చెయ్యలేదు.

  ReplyDelete