Pages

Saturday, July 7, 2012

సిబిఐకి అభిశంసన- జగన్‌ పార్టీకి ఆనందం?




మాయావతి ఆస్తుల కేసులో సిబిఐ అతిగా వ్యవహరిస్తోందని అత్యున్నత స్థానం అభిశంసించడం ఆసక్తి కరమైన విషయమే కాదు- రాజకీయంగా జగన్‌ పార్టీ వైఎస్‌ఆర్‌సిపికి చాలా ఆనందకరమే అనుకోవచ్చు. అవినీతి ఆరోపణలపై విచారణ నెదుర్కోక తప్పదనీ, ఉప ఎన్నికల్లో విజయం సాధించినంత మాత్రాన నిర్దోషిత్వం ప్రాప్తించదని నేను చాలా సార్లు చెప్పాను, రాశాను. అయితే ప్రతిసారీ సిబిఐ పాత్రపైనా ప్రశ్నలు వస్తుంటాయి.వ్యక్తిగతంగా జెడి లక్ష్మినారాయణపై ఆ పార్టీ దాడి కేంద్రీకరించడం వల్ల ఈ ఆరోపణల స్వభావం మారిపోతుంటుంది.వాస్తవంలో సిబిఐ ఎప్పుడూ వివాదాలకు అతీతంగా లేదు. రాజ్యాంగ రీత్యానే అది కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషీలోనే పనిచేస్తుంటుంది.అలాటప్పుడు రాజకీయాల క్రినీడలు దానిపై పడవని అనుకోవడానికి లేదు. వాజ్‌పేయి ప్రభుత్వం వుండగా అయోధ్య ఘటనలో అద్వానీపై కేసులు ఎత్తివేసి తనపై కొనసాగిస్తున్నందుకు నాటి కేంద్ర మంత్రి మురళీమనోహర్‌ జోషి స్వయానా రాజీనామా చేశారు. మాయావతి, ములాయం, లాలూ వంటి వారి విషయంలోనూ ఈ విధమైన ఉదాహరణలున్నాయి. కేరళలో సిపిఎం కార్యదర్శి పినరాయి విజయన్‌పై పాత కేసు తిరగదోడిన ఘటనలోనూ వైఫల్యం ఎదురైంది. మాజీ సిబిఐ డైరెక్టర్‌ జోగిందర్‌ సింగ్‌ స్వయంగా ఈ విధమైన వివాదాలను ఉదహరించారు. వీటిని సాకుగా చూపించి జగన్‌పై ఆరోపణలన్ని అసత్యాలంటూ ఒప్పుకోవడం సాధ్యం కాదు గాని సిబిఐ తీరుపై విమర్శలకు ఆస్కారం లేదని మాత్రం చెప్పలేము.మాయావతిపై తాజ్‌ కారిడార్‌ వ్యవహారంలో కేసు దర్యాప్తు చేయమంటే ఆస్తుల కేసు ఎందుకు చేశారని సుప్రీం కోర్టు అక్షింతలు వేసింది.అయితే నాలుగేళ్లుగా అనేక దఫాలుగా నడుస్తున్నప్పుడు ఎందుకు అనుమతించారనే ప్రశ్నకు మాత్రం జవాబు ఆశించలేము. జగన్‌ మోహన రెడ్డి కేసు కూడా హుటాహుటిన ముగిసిపోయేది కాదని గతంలోనే రాశాను. ఇందులోనూ అనేక మలుపులు చూడవలసే వుంటుంది. వాటిలో రాజకీయమైనవీ, న్యాయ సంబంధమైనవీ కూడా వుండొచ్చు.ఆ మలుపులు ఇరు వైపులా వుండొచ్చు కూడా. కాంగ్రెస్‌ తెలుగు దేశంలు కూడా ఈ వాస్తవాన్ని గుర్తించబట్టే దీర్ఘ కాలిక వ్యూహాల రూపకల్పనకు తంటాలు పడుతున్నాయి.. అయితే ఉభయ పార్టీలూ కూడా విధానపరంగా తమ లోపాలు తప్పులు ఒప్పుకోవడానికి సిద్ధం కావడం లేదు.కేవలం ప్రచారంతో నెట్టుకుపోతే సరిపోతుందన్న భావన ఆ రెండు పార్టీలలో ఇంకా వుంది గనకే ముఖ్యమంత్రి కిరణ్‌ ఇందిరమ్మ రాజ్యం, ప్రతిపక్ష నేత చంద్రబాబు సైకిల్‌ యాత్ర అంటూ హడావుడి పడుతున్నారు. వాస్తవం ఏమిటంటే వాటిని ఆవరించిన విశ్వాస రాహిత్యం అనే రుగ్మత అంతకన్నా తీవ్రమైనది. సిబిఐ దర్యాప్తు కన్నా ఈడీ విచారణలో ఏదో నాటకీయంగా జరిగిపోతుందనే కథనాలు జోరుగా సాగుతున్నాయి గాని ఇటీవలి పరిణామాలను గుర్తు చేసుకుంటే ఇది కూడా సాగలాగబడటం తప్ప తేలేది కాదని అర్థమవుతుంది.

No comments:

Post a Comment