Friday, December 31, 2010
శుభా కాంక్షలతో .. రెండు మాటలు
ఈ బ్లాగును చూస్తున్న మిత్రులందరికీ 2011 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
2010 అనేక విధాల ఉద్రిక్తంగా అనిశ్చితంగా నడిచినా తెలుగు ప్రజల శాంతి కాంక్ష, రాజకీయ చైతన్యం 2011లోకి విశ్వాసంగా అడుగు పెట్టే పరిస్థితిని కల్పించాయి. నిరంతర అప్రమత్తతే స్వాతంత్రానికి మూల్యం అన్నట్టు ఆలోచనా పరులైన పౌరులే స్వాతంత్రానికి ప్రజాస్వామ్యానికి పరిరక్షకులు. పరిపాలకుల సార్థపరశక్తుల కుటిలోపాయాలకు పగ్గం వేయగలిగిందీ వారే. కుంభకోణాలు తప్ప లంబ కోణాలకు తావు లేకుండా పోతున్న భారత దేశ పరిస్థితి విశృంఖల సరళీకరణ విధానాల ఫలితమన్న వాస్తవాన్ని గుర్తించడం చాలా అవసరం. తెలిసో తెలియకో చాలా మంది
ఆ విధానాలను కీర్తిస్తూ అవినీతిపై ఆవేదన అగ్రహాలు వెలిబుచ్చుతుంటారు. భూగర్భంలో ఖనిజాలు తవ్వేసి నిజాలు పాతరేస్తున్న పరిస్థితి గాని ఆకాశ వీధిలోని విద్యుదయస్కాంత తరంగాలను కబళించి సెల్ ఫోన్ల పేరిట మురిపిస్తున్న పరిస్థితి గాని యాదృచ్చికమైనవి కావు. మార్కెట్ స్వేచ్చ మోత ఆఖరుకు న్యాయ వ్యవస్థను కూడా చీడ పురుగులా కాటేసిన దృశ్యం కనిపిస్తూనే వుంది.మీడియా నాడి తప్పింది. కనకనే బుద్ధిజీవులైన వారు ఈ పరిణామాలకు కలత చెందినా కలవరం చెందినా ఫలితం లేదు. కళ్లెం వేసేందుకై నడుం కట్టాలి. అవిశ్వాసం పెంచుకోవడం గాక ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించాలి. రత్నగర్భగా పేరు పొందిన భారత దేశ ప్రకృతి సంపదలు మానవ వనరులు దేశ విదేశీ గుత్తాధిపతులకు అక్రమార్జనా పరులకు కబ్జాకోర్లకు కట్టబెట్టి అభివృద్ధి గురించి మాట్లాడ్డం అవినీతిపై శాపనార్థాలు పెట్టడం అర్థరహితం.మారాల్సింది ఈ నమూనా.
మార్కెట్ స్వేచ్చ గురించి ఇంతగా చెప్పే టాటా గారే నీరా రాడియా టేపులు బయిటపెట్టరాదని కోర్టుకు వెళ్లడం దేనికి నిదర్శనం? పరిశోధనాత్మక జర్నలిస్టు పండితుడైన అరుణ్ శౌరి 2 జి స్ప్రెక్ట్రంపై జెపిసి అనవసరం అని చెప్పడం దేనికి? దేవుణ్ని నిత్యం సేవించే పూజారులు కూడా జీతాల కోసం పోరాడక తప్పని పరిస్థితి దేనికి నిదర్శనం? పాలకుల విసిరిన పాచికలలో వివిధ రకాల ప్రాంతీయ ఉద్రిక్తతలు రగిలిస్తున్నా ఇందిరా పార్కు దగ్గర రాష్ట్రమంతటికీ చెందిన వివిధ తరగతుల ప్రజలు ఏకోన్ముఖంగా ప్రతిఘటన సాగించవలసిన స్తితి దేన్ని సూచిస్తుంది? మానవ హక్కుల మంత్ర జపం చేసే అమెరికా వికీలీక్స్‌కు వణికి పోవడం అతన్ని అరెస్టుచేయించడంలో ఎంత కపటం దాగి వుంది? ఈ ప్రశ్నలలోనే సమాధానాలు కూడా వున్నాయి.
చివరగా ప్రాంతీయ సమస్యపై శ్రీకృష్ణ కమిటీని నియమించిన కేంద్రం దాని నివేదికను గురించి తన మాట చెప్పకుండా దాగుడు మూతలు కొనసాగించడంలో రాజకీయ చాణక్యం ఎవరికైనా అర్థమవుతుంది. మొత్తం తెలుగు ప్రజల మనోభావాలతో చెలగాటమాడటం తప్ప పారదర్శకంగా ప్రజాస్వామికంగా తన నిర్ణయం ప్రకటించే ఆలోచన కేంద్ర పాలకులకు కాంగ్రెస్ అధిష్టానానికి లేదని స్పష్టమై పోయింది. ఈ సమయంలో సంయమనంతో వాస్తవికంగా ఆలోచించి వివిధ రకాలైన స్వార్థ పరశక్తులకు పాఠం చెప్పడమే ప్రజల ముందున్న ఏకైక మార్గం. బహుశా 2011లో ఆ ఘట్టం పూర్తి కావచ్చు.
ఇన్ని సమస్యల మధ్యనా సంక్షోభాల మధ్యనా హ్యాపీ న్యూ ఇయర్ ఏమిటంటారా? వ్యక్తిగత స్తాయిలో కాలాన్ని ఎలా వినియోగించుకోవాలో వీక్షించాలో వివరంగానే చర్చించాము. అందుకు ! అదే సమయంలో సమాజ పరంగానూ రాజకీయంగానూ స్వంత ఆలోచనాశక్తితో ఆచరణతో కదిలేందుకు!!
మీ అభిప్రాయాలు ఏమైనా వుంటే సుస్వాగతం. ఏడాది మొదట్టోనే చెప్పేస్తే వాటిని బట్టి తగు మార్పులు చేర్పులు చేసుకోవడానికి వీలవుతుంది.
మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Subscribe to:
Post Comments (Atom)
థ్యాంక్స్ రవి గారు,
ReplyDeleteమీరు ఇంతకు ముందులాగే 2011లో కూడా, మీ నిష్పాక్షిక విశ్లేషణ లతో మమ్మల్ని ఉత్తేజితుల్ని చేస్తుంటారని ఆశిస్తూ,
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
ReplyDeleteSRRao
శిరాకదంబం
happy new year
ReplyDeleteravi garu mi vishleshanalu tulochustuntamu.mi abiprayamchala baundi.
ReplyDelete