Pages

Wednesday, June 8, 2011

బొత్స ఎంపిక.... ప్రాంతీయ జోస్యాలు వృథా


పీసీసీ పీఠాధిపతిగా బొత్స సత్యనారాయణ నియామకం ద్వారా ఆంధ్ర ప్రదేశ్‌ భవిష్యత్తుపై అనిశ్చితిని తొలగించడం కంటే అంతర్గత పరిస్థితిని చక్కదిద్దుకోవడానికే అధిష్టానం ప్రాధాన్యత నిస్తున్నట్టు విదితమైంది. చాలా కాలంగా రాష్ట్ర రాజకీయాలలో ఒక కేంద్ర బిందువుగా మారాలని వేచి వున్న బొత్స ఈప్సితం నెరవేరినట్టే చెప్పాలి. ఆయన నియామకం తెలంగాణా విభజనకు అనుకూలమని దాన్ని కోరుకునే వారు, జగన్‌ను కట్టడి చేయడానికే నని ఆయనను వ్యతిరేకించే వాళ్లు, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి సమాంతర కేంద్రాన్ని అనుమతించడమేనని మరికొందరు ఇలా పరి పరి విధాల వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్‌ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడుగా వుండి సకుటుంబంగా కాంగ్రెస్‌లో ఆధిపత్యం చాలాయిస్తున్న బొత్స రాజకీయ సత్తా గురించి
ఎవరికీ సందేహాలుండవు. మొదట్లో వోక్స్‌ వ్యాగన్‌ వ్యవహారం ఇరుకున పెట్టినా తర్వాత మళ్లీ చేతికి చమురు అంటుకోకుండా చేసుకున్న చాకచక్యమూ అందరికీ తెలుసు. గత నాలుగు ప్రభుత్వాలలోనూ నోరున్న మంత్రిగా ముందు పీఠిన నిలబడి పార్టీ ఇరకాటంలో పడినప్పుడల్లా ఎదురుదాడితో సమర్థించే సమర్థతా ఆయన పుష్కలంగా ప్రదర్శించారు. అధిష్టానం దృష్టిలో ఇవన్నీ అర్హతలే కావడంలో సందేహమేమీ లేదు గాని వీటిలో కెల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ను ఎదుర్కోవడం అన్న అంశమే ప్రధానమై వుండాలి. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలలో కూడా జగన్‌ బయిటకు వెళ్లాడు గనక అందరి పట్టా వ్యవహరించినట్టే ఆయన పట్టా వుంటామని చెప్పడంలో అదే ఆంతర్యం అనుకోవాలి..
స్పీకర్‌గా నాదెండ్ల మనోహర్‌, డిప్యూటీ స్పీకర్‌గా భట్టి విక్రమార్క ఎన్నికవదంతో తమ ప్రభుత్వం బలం నిరూపించుకున్నట్టు కాంగ్రెస్‌ నేతలు చేసే వాదన కేవలం సాంకేతికమైందే తప్ప సంఖ్యలు బలపర్చేది కాదు. మజ్లిస్‌ మద్దతు, అంతకన్నా ముందు ప్రజారాజ్యం విలీనం, ఇవి గాక జగన్‌ వర్గీయులు కూడా గుండుగుత్తగా వత్తాసు నివ్వడం ఇన్ని అయిన తర్వాత కూడా వచ్చిన ఆధిక్యత పరిమితమే. తమ వ్యతిరేకత ప్రభుత్వం పైన గాని వ్యక్తిగతంగా మనోహర్‌పైన కాదని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు కూడా. ఆ కోణం నుంచి చూస్తే ప్రభుత్వానికి గల సంఖ్యా పరమైన మద్దతు సుఖవంతంగా లేదనేని స్పష్టం. ఎవరు ఏ కారణంతో అటూ ఇటూ అయినా బండి వాటు పడుతుంది. కనకనే ఢిల్లీ పెద్దలు ముందు ఇల్లు చక్క బెట్టుకోవడానికి పాకులాడుతున్నారు. గాంధీ భవన్‌లో గడుసు పిండం వుంటేనే సచివాలయానికి క్షేమమని నిర్ధారణకు వచ్చారు.ఈ క్రమంలో రెంటికీ వైరుధ్యాలు పొడసూపే అవకాశమూ కలిగించారు. వర్గ పరమైన విధేయతలతో ప్రభుత్వాన్ని కాపాడుకుంటారనే ఆశ ప్రదర్శించారు. అయితే రాష్ట్ర రాజకీయాలను అనిశ్చితం చేసిన తమ విధానాలు మారకుండా కేవలం కాయకల్ప చికిత్సలతోనే కాంగ్రెస్‌ బాగుపడిపోతుందనుకోవడం అవాస్తవికతే.ఆ సృహ వుండటం వల్లనే అవిశ్వాస తీర్మానానికి అస్కారం లేకుండానే సభను నిరవధిక ముగింపు పలికి కాలం కొనుక్కోగలిగారు. మరి తదుపరి సమావేశం నాటికి బొత్స ఏమైనా మార్పు తీసుకురావాలంటే అంత తేలికైన పని కాదు.
కాంగ్రెస్‌లో సంస్థాగత అధికారం కన్నా సర్కారీ సవారు కీలకమని స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే తేలిపోయింది. కేంద్రంలోనైతే ప్రస్తుత సందర్భాన్ని మినహాయిస్తే ప్రధాని, పార్టీ అద్యక్షుడూ ఒక్కరే వుండటం అలిఖిత సూత్రమై పోయింది.ఇప్పుడు కూడా అసలైన అధికారమంతా 10 జనపథ్‌లోనే వుంటుందని అందరికీ తెలుసు. కాని రాష్ట్రాలకువచ్చే సరికి నాయకుల మధ్య వైరుధ్యాలను ఉపయోగించుకుని పెత్తనం చేయడానికి అధిష్టానం ఉద్దేశ పూర్వకంగానే భిన్న ధృవాల వంటి వారిని ఈ పదవులకు ఎంపిక చేస్తుంటుంది. వైఎస్‌ డిఎస్‌ల మధ్యన కూడా ఆ మాటకొస్తే పెద్ద సఖ్యత వుండని చెప్పడానికి లేదు. మాది విజయవంతమైన జోడి అని డిఎస్‌ చెప్పే మాటను వైఎస్‌ పెద్దగా ఆమోదించిందీ లేదు. ఆ విజయమంతా ఆయన ఖాతాలోనే వేయడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. తెలంగాణా విభజన కోసం ఉద్యమం వచ్చాక డిఎస్‌ పరిస్తితి మరింతి ఇరకాటంలో పడిపోయింది. నిజామాబాద్‌లోనే ఘోర పరాజయం తర్వాత మరింత పలచబడింది. ప్రాంతీయ విధేయత, పార్టీ నేతృత్వం ఈ రెంటికీ మధ్యన పొంతన లేక పోవదంతో గాంధీ భవన్‌ కాపలా మాత్రమే మిగిలింది. రెండు సార్లు ఆయన అంతకు ముందు కేశవ రావు పిసిసి అద్యక్ష పీఠం అలంకరించిన తర్వాత ఇప్పుడు బొత్సకు రావడంలో పెద్ద ఆశ్యర్యం ఏమీ కనిపించదు. పీసీపీ పదవికీ, సీఎం పదవీ రెండు ప్రాంతాల వారికి కేటాయించాలన్న అనధికార అవగాహనను వుల్లంఘించిన సందర్భాలు గతంలో కూడా చాలా వున్నాయి. అధిష్టానం మాటే వేదమైన చోట ఇలాటివి సర్వసాధారణం.
సాంకేతిక నిబంధనలు పాటించినంత మాత్రాన సమతుల్యత నిజంగా వచ్చేసిందని చెప్పడం కష్టం. ఉదాహరణకు ఇప్పుడు ముఖ్యమైన పదవులలో ఏవీ తమ ప్రాంతానికి రాలేదని టిఆర్‌ఎస్‌ నాయకులు, విహెచ్‌ వంటి కాంగ్రెస్‌ వాదులు అంటున్నారు. సాంకేతికంగా చూస్తే పెద్ద మనుషుల ఒప్పందం పాటించినట్టు చెప్పే అవకాశం వున్నా సంతృప్తి కలిగించడం లేదనేది ఇక్కడ కనిపించే వాస్తవం. పదవులు ఒక ప్రాంతానికి వచ్చినంత మాత్రాన న్యాయం జరిగినట్టే భావించేట్టయితే తెలంగాణా ప్రాంతానికి ప్రధాని,రాయలసీమకు రాష్ట్రపతి పదవులే దక్కాయి! వాటివల్ల వెనక బాటు పోయిందీ లేదు. పైగా ఒక వైపున వున్న పదవులకే రాజినామాలివ్వాలంటూ మరో వైపున కొత్త పదవులు రాలేదని ఆరోపించడం పరస్పరం పొసిగేది కాదు. రాష్ట్ర పంపకం సమస్యను పక్కన పెట్టి పదవులు పంపకంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవాలనే సనాతన నీతినే అధిష్టానం అనుసరించడం కళ్లముందు కనిపిస్తున్నది. కనక బొత్స రావడం రాష్ట్ర విభజనకు అనుకూలమని ప్రతికూలమని లేనిపోని వూహాగానాలు చేయడం జోస్యాలు చెప్పడం అనవసరం, అసందర్భం. ఒకవేళ ఆయన నిన్న చెప్పిన భావాలనే ఇప్పుడు పునరావృతం చేస్తారనుకోవడం అమాయకత్వం. ప్రస్తుత బాధ్యతలను బట్టి భవిష్యత్తు ఆకాంక్షలను బట్టి ఆయన నడుచుకుంటారు తప్ప ప్రాంతాలను బట్టి కాదు.

ఇబ్బందిని దాటేసేందుకు కాంగ్రెస్‌ నేతలు ఏమి చెప్పినా అధిష్టానం వైఖరి గోడమీద రాతలా కనిపిస్తూనే వుంది.15వ తేదీన ప్రణబ్‌ ముఖర్జీతో భేటీ కావడంపైనా పెద్ద అంచనాలకు ఆస్కారం లేదు. ఇప్పటిక వరుసగా ఆయన, చిదంబరం, తాజాగా గులాం నబీ ఆజాద్‌లు చేసిన ప్రకటనలు రాష్ట్ర సంక్షోభాన్ని పరిష్కరించే ఉద్దేశం కేంద్రానికి లేదని స్పష్టంగా వెల్లడించాయి.కనక అందుకు సంబంధించి ఇంకా ఏమైనా భ్రమలు కలిగించేందుకు ప్రయత్నించడం ఎవరికీ మేలు చేయదు. అది క్లిష్టమైన సమస్య అని సమయం పడుతుందని ఒకరంటే అందరి భాగస్వామ్యంతో అఖిల పక్షం జరిపి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే అడుగు వేస్తామని మరొకరు అంటున్నారు.శ్రీకృష్ణ కమిటీ ఆరు సిఫార్సులు చేసిందంటున్న ఆజాద్‌ అందులో మూడింటిని ఆ కమిటీయే కొట్టి వేసిందని తెలియనట్టు ప్రవర్తిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచి తెలంగాణాకు రాజ్యాంగ రక్షణలు కల్పించడం అత్యుత్తమమని కమిటీ సూటిగానే చెప్పింది. కాదంటే విభజన చేయాలన్నది. ఈ రెండు చెప్పడానికి పెద్ద కమిటీ నిపుణులు కావాలా అని అందరూ చప్పరించింది అందుకే. అజాద్‌ మాటే కేంద్రం మాట అనుకుంటే అప్పుడు అఖిలపక్షంతో నిమిత్తం లేకుండా అదే అధికారికంగా ప్రకటించవచ్చు. అంతే గాని కోట్లాది మంది తెలుగు ప్రజల మనోభావాలతో చెలగాటమాడటం తగని పని. దీనివల్ల ప్రాంతాల మధ్య అపార్థాల సంగతి అటుంచి తెలంగాణా ప్రాంతంలోనే జిల్లాల వారిగా పార్టీల మధ్యనా పార్టీలలోనే వ్యక్తుల మధ్యనా వైరుధ్యాలు ఘర్సణలు పెరిగి వివాదాలు ముదురు తున్నాయి. టిడిపి సభలపై టిఆర్‌ఎస్‌ ధ్వజమెత్తడం ఒకటైతే జెఎసి కూడా అదే బాటలో మాట్లాడుతున్నది. కాంగ్రెస్‌లో వివిధ శక్తుల వ్యక్తుల పోకడలు ఏమిటో అంతుపట్టడం లేదు. జగన్‌ వర్గం కూడా తమ వ్యూహాలకు పదను పెట్టుకుంటున్నది. వీటన్నిటికీ ప్రాతిపదిక కేంద్రం అనుసరిస్తున్న సాచివేత దాట వేత వైఖరి మాత్రమే. ఎడతెగని ఈ చెలగాటాన్ని విరమించి ఇదమిద్దమైన నిర్ణయం తీసుకోకుండా వ్యక్తుల మార్పుతోనూ పదవుల పందేరంతోనూ పరిస్థితిని అదుపు చేయాలనుకోవడం అధికార పక్షం అత్యాశే అవుతుంది. అలాటి నేపథ్యంలో వాస్తవికంగానూ సంయమనంతోనూ వ్యవహరించాల్సిన బాధ్యత ఇక్కడి నాయకులపైనా వుంటుంది.
............................................... ........................

No comments:

Post a Comment