Pages

Sunday, June 12, 2011

దీనిభావమేమి కేంద్ర మంత్రీ?




భాషా పటిమలోనూ భావ పరిణతిలోనూ సాటిలేని పేరు సంపాదించిన కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ జాతీయ వాదం గురించి చేసిన వ్యాఖ్యలు చాలా విచిత్రంగా వున్నాయి. కాంగ్రెస్‌ జాతీయ పార్టీ తప్ప ప్రాంతీయ ఉప ప్రాంతీయ పార్టీ కాదని తాను అన్న మాటలకూ తెలంగాణా సమస్యకూ సంబంధం లేదని ఆయన తర్వాత వివరణిచ్చారు. అంతటి అనుభవజుఞలకు హైదరాబాదులో మాట్లాడినప్పుడు ఎలాటి ప్రభావం వచ్చేది తెలియదని అనుకోలేము.తర్వాత ఇచ్చిన వివరణ కూడా అరకొరగా వుంది తప్ప సంతృప్తి కలిగించేది కాదు.

1.డిసెంబర్‌ 9 ప్రకటన కేంద్రానిదే తప్ప కాంగ్రెస్‌ది కాదని ఆయన అంటున్నారు. అంటే ఇంత వరకూ
దీనిపై జరిగిన తతంగమంతా ఎలా అర్థం చేసుకోవాలి?
2.కేంద్రం దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేదు గనక క్యాబినెట్‌ మంత్రిగా మాట్లాడకూడదని ఆయన అంటున్నారు. కాని ఆయనను పదే పదే కలిసిన ప్రతినిధి వర్గాల ప్రకటనలకూ భాష్యాలనూ ఎన్నడూ ఖండించకపోవడానికి కారణమేమిటి? ఇటవల కూడా ఆయన తమ మార్గదర్శి అని వారు ప్రకటించిన మాట నిజం కాదా?
3.కేంద్రంలో వున్నది యుపిఎ కూటమి అయినా నాయకత్వం వహించే కాంగ్రెస్‌కు తెలియకుండా చిదంబరం ప్రకటన చేస్తారా?
4.అదే నిజమైతే ఇంత కాలం ఎందుకు ఆవేశకావేశాలు పెరగనిచ్చారు?మాకొక వైఖరి లేదని చెప్పి వుండొచ్చు గదా?
5.ఇప్పటికైనా కాంగ్రెస్‌కు విధానం లేదనే అనుకోవాలా? అలాటప్పుడు ముఖ్యమంత్రి, పిసిసి అద్యక్షుడు ఇతరులసు కేంద్రం నిర్ణయానికి కట్టుబడి వుంటామని రోజు చెబుతున్న మాటల ప్రయోజనమేమిటి?
6.జాతీయ వాద కోణంలో ఈ సమస్యను ఎలా చూడాలో జైపాల్‌ రెడ్డి చెప్పగలరా? అదే నిజమైతే రెండు ప్రాంతాలలో రెండు రకాలుగా విన్యాసాలు చేస్తున్న తమ వారిని ఎందుకు ప్రధాని వారించడం లేదు?
7.తాను క్యాబినెట్‌ హౌదా గనక మాట్లాడలేకపోతున్నానని, సహాయ మంత్రులైతే మాట్లాడవచ్చునని జైపాల్‌ చెప్పిన మాట రాజ్యాంగబద్దమేనా?

ఏమైతేనేం- ప్రణబ్‌, చిదంబరం, అజాద్‌ల ప్రకటనల తర్వాత మరింత అధికారికంగా జైపాల్‌ రెడ్ది కాంగ్రెస్‌ విన్యాసాలను తేటతెల్లం చేశారు. ఈ నేపథ్యంలో తమకు ఏవో హామీలిచ్చారని కాంగ్రెస్‌ నేతలు చెప్పుకోవడం విరమించడం శ్రేయస్కరం. కావాలని అయోమయం సృష్టించిన కేంద్రాన్ని వదలిపెట్టి శ్రీకృష్ణ కమిటీపై ధ్వజమెత్తుతూ సమయం వృథా చేస్తున్న విహెచ్‌ వంటి వారు కూడా వాస్తవాలను వెల్లడించడం మంచిది. కేంద్రం శ్రీకృష్ణ కమిటీ చెప్పింది గనకే ఇదంతా చేస్తున్నదని అనడం అంటే దేశంలో అతి పురాతన పాలక పార్టీ నేతల శక్తి యుక్తులను తక్కవ అంచనా వేయడమే అవుతుంది. ఎందుకంటే ఆ నివేదికను ఆమోదించడానికి తిరస్కరించడానికి కూడా కేంద్రానికి పూర్తి అధికారముంది.

3 comments:

  1. జైపాల్ రెడ్డి ఆలోచించే అట్లా మాట్లాడారు . కేంద్రం తన వైఖరి బయట పెట్టడానికి ఇది రిహార్సల్ .

    ReplyDelete
  2. తెర గారు,
    మీ వెబ్ పేజీలో బూర్జువా, పెట్టుబడి దారీ పాప్ అప్ అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. ఇది నేను ఖండిస్తున్నా..

    ReplyDelete
  3. బిజెపి ఇలా మాట్లాడితే బహుళ నాలుకలు లేవనుకుంటారు. నాడు కాకినాడలో ఒక వోటు, రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేసి తరువాత తెలుగు దేశంతో పొత్తు కోసం ఆ తీర్మానాన్ని మర్చిపోవడం, తిరిగి 2009 డిసెంబర్‌లో ఆ తీర్మానం గుర్తుకి రావడం.

    ReplyDelete