అయిదు ముఖ్యమైన పదవులకు పంపకాలు చకచకా పూర్తి చేయడం పాలకపక్ష వ్యూహంలో కొత్త దశను సూచిస్తుంది. అలాగే వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా విన్యాసాలు చేసిన నాయకుల స్వభావాన్నీ వెల్లడిస్తుంది. దీనిపై కేవలం ప్రాంతీయ కోణాల నుంచి భాష్యాలు చెప్పేవారు చెబుతుండగానే అధికార పక్షీయులు మాత్రం మిగిలిన పదవుల పంపకంలో స్థానం కోసం పడిగాపులు కాస్తున్నారు. దాదాపు రెండేళ్ల నుంచి రాష్ట్రంలో సాగుతున్న రాజకీయ క్రీడకు పరాకాష్ట అనదగిన ప్రహసనమిది. స్పీకర్‌గా నాదెండ్ల మనోహర్, డిప్యూటీ స్పీకర్‌గా భట్టి విక్రమార్క ఎన్నికవదంతో తమ ప్రభుత్వం బలం నిరూపించుకున్నట్టు కాంగ్రెస్ నేతలు చేసే వాదన కేవలం సాంకేతికమైందే తప్ప సంఖ్యలు
బలపర్చేది కాదు. మజ్లిస్ మద్దతు, అంతకన్నా ముందు ప్రజారాజ్యం విలీనం, ఇవి గాక జగన్ వర్గీయులు కూడా గుండుగుత్తగా వత్తాసు నివ్వడం ఇన్ని అయిన తర్వాత కూడా వచ్చిన ఆధిక్యత పరిమితమే. ఆ కోణం నుంచి చూస్తే ప్రభుత్వానికి గల సంఖ్యా పరమైన మద్దతు సుఖవంతంగా లేదనేని స్పష్టం. ఎవరు ఏ కారణంతో అటూ ఇటూ అయినా బండి వాటు పడుతుంది. కనకనే ఢిల్లీ పెద్దలు ముందు ఇల్లు చక్క బెట్టుకోవడానికి పాకులాడుతున్నారు.
ఉప ముఖ్యమంత్రిగా దామోదర రాజనరసింహ ఎంపిక కాగా పిసిసీ పీఠంపై బొత్స సత్యనారాయణ అత్యదిక హంగూ ఆర్బాటాలతో ఆసీనులయ్యారు... త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయడంతో పాటు అనేక ఇతర పదవులలో కూడా కాంగ్రెస్ వాదులకే అవకాశమిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బహిరంగంగానే ఆశల హరివిల్లును ఆవిష్కరించారు. అంటే మొత్తంపైన కాంగ్రెస్ వాదులు పదవుల వేటలో తలమునకలవడం అనివార్యమని ఇవన్నీ స్పష్టం చేస్తున్నాయి. ఈ అన్ని సందర్భాల్లోనూ కాంగ్రెస్ నేతలు నిధులు గుమ్మరిస్తున్నట్టు సేవలు గొప్పగా సాగిపోతున్నట్టు సమస్యల్లా ప్రచారం లేకపోవడమేనన్నట్టు చెప్పుకుంటున్నారు. కాని మరో వైపు నుంచి చూస్తే విత్తనాల కోసం వెతలు పడుతున్న రైతులు, కుక్క కాటుకు కన్నుమూస్తున్న మనుషులూ కనిపిస్తున్నారు.ఆంధ్ర ప్రదేశ్‌ను అవరించిన అవ్యవస్థ, అనిశ్చితి నానాట తీవ్రమవుతున్నాయి. బొత్స నియామకం పాలక పక్షంలో ఏ పర్యవసానాలకు దారి తీస్తుందా అని వారికి వారే అంచనాలు వేసుకుంటున్నారు.
ఈ కాలంలో ఏ నియామకం లేదా నిర్ణయం జరిగినా అది రాష్ట్ర విభజనకు అనుకూలమా ప్రతికూలమా అని జోస్యాలు చెప్పడం పరిపాటిగా మారింది. బొత్స నియామకం అనుకూలమైనట్టు తెలంగాణా కాంగ్రెస్ వాదులు చెప్పుకుంటే ఈ ప్రాంతానికి ఎందుకు ఇవ్వలేదని టిఆర్‌ఎస్ నేతలు విహెచ్ వంటి కాంగ్రెస్ వాదులు విమర్శించారు. ఏది ఏమైనా ఇది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమే గనక దీనివల్ల ఒరిగేది తరిగేది కూడా ఏమీ వుండదు. గతంలో రెండు సార్లు డిఎస్ పిసిసి అద్యక్షుడుగా వున్నప్పుడు కూడా ఈ విమర్శకులు ఆయనపై అస్త్రాలు సంధిస్తూనే వచ్చారు. ఉప ఎన్నికల్లోనూ ఘోర పరాజయం పాలు చేశారు. రాజకీయాలు ప్రయోజనాల ప్రాతిపదికన నడుస్తాయి తప్ప ప్రాంతాలకు బట్టి కాదనేది వాస్తవం. తెలుగుదేశం సభలపై టిఆర్‌ఎస్ దాడులు కూడా ఈ విధమైన ప్రయోజనాల ఘర్షణనే ప్రతిబింబిస్తున్నాయి. కాంగ్రెస్ తెలుగు దేశం పార్టీలు ద్వంద్వ వైఖరి అనుసరించడం నిజమే అయినా దాన్ని బట్టి సభలపై దాడులు చేయడం సమంజసం అనిపించుకోదు. మహానాడు తర్వాత స్పష్టత వచ్చిందంటున్న తెలుగుదేశం నేతలు అంతర్గతంగా తమ వ్యూహంలో వున్న అస్పష్టతను కప్పిపుచ్చలేరు కూడా. కాకపోతే కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పెద్దలను కలుసుకోవడంలో కాలక్షేపం చేస్తుంటే తెలుగుదేశం నేతలు ఢిల్లీపైన, కెసిఆర్‌పైన ధ్వజమెత్తుతున్నారు. టిఆర్‌ఎస్ దాడులను ఎదుర్కొని సభలు జరుపుకోవడం ఒకటైతే వారిని మించి ప్రాంతీయ వాదాన్ని ప్రతిధ్వనించడం విచిత్రమే.టిఆర్‌ఎస్ నేతలు ఉద్రేకాలు రెచ్చగొట్టరాదని పదే పదే చెప్పిన కొందరు నేతలు ఇప్పుడు తాము అల్లకల్లోలం సృష్టించైనా బిల్లు తీసుకువస్తామనడం వారి పార్టీలోనే ప్రశ్నార్థకం కాకతప్పదు. ఈ సభనే జెఎసి గుర్తించని నేపథ్యంలో జెండాలు లేకుండా అందరం రాజినామాలు చేద్దామని పిలుపునివ్వడం కూడా ఆ కోవలోకే వస్తుంది.
ప్రధానిని తెలంగాణా కాంగ్రెస్ నేతలు కలిసినప్పుడు కూడా ఏ విధమైన కాలపరిమితిని గాని విధాన స్పష్టతను గాని ఇవ్వక పోవడంలో పాలక పక్షం ఆలోచనా ధోరణి తెలుస్తుంది. కాంగ్రెస్ నేతలు కూడా ఏ కొద్ది మంది మినహా రాజినామాల భాషలో మాట్లాడ్డం లేదు.తెలుగు దేశం చెబుతున్న ప్రతిపాదనను జెఎసి స్వీకరించే అవకాశమూ లేదు. బిజెపి విషయానికి వస్తే ఒకరు రాజినామా చేసి మళ్లీ గెలుపొందగా మరో శాసనసభ్యుడైన కిషన్ రెడ్డి రాష్ట్ర పార్టీ అద్యక్షుడుగా రాజినామాకు సిద్దంగా లేరు. కనక జెఎసితో కలసి పయనిస్తున్న రాజకీయ పక్షం టిఆర్‌ఎస్ మాత్రమే కనిపిస్తున్నది. ఇటీవలనే రాజినామాలు ఉప ఎన్నికలు జరిగిపోయిన నేపథ్యంలో ఆ పార్టీ వారు మళ్లీ రాజినామాలంటే ప్రజల ప్రతిస్పందన ఎలా వుండేది వూహించవచ్చు. రాజకీయ వైరుధ్యాలు వెన్నాడుతున్నంత కాలం రాజినామాల గురించిన మాటలు ప్రచారానికే పరిమితం కావచ్చు తప్ప ఫలితం ఇవ్వవు. పైగా 1960,70 లలో రాజినామాలతోనే కేంద్రం తలవంచిన ఉదంతాలు కూడా లేవు. ఎవరైనా రాజినామాలు చేస్తే ఆ స్థానాలను ఇతరులు పోటీ చేయకుండా వదిలేయడమూ గతంలో జరగలేదు. కనక ఇది సుస్పష్టంగా రాజకీయ ప్రయోజనాల ఘర్షణ తప్ప ప్రాంతాల సమస్య మాత్రమే కాదు.
రాష్ట్రంలో రాజకీయ పక్షాల మాట అలా వుంచి మళ్లీ కేంద్రం దగ్గరకు వస్తే ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తుపై నిర్ణయం కన్నా అధికారాన్ని కాపాడుకోవడం అంతర్గత సమస్యలను సర్దుబాటు చేసుకోవడం వారి ఎజెండాగా వుంది.ఇప్పటికి వరుసగా ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం చివరగా గులాం నబీ ఆజాద్‌లు, తాజాగా జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో అనిశ్చితిని తొలగించే ఉద్దేశం అధిష్టానానికి లేదని స్పష్టం చేస్తున్నాయి.ఇబ్బందిని దాటేసేందుకు కాంగ్రెస్ నేతలు ఏమి చెప్పినా అధిష్టానం వైఖరి గోడమీద రాతలా కనిపిస్తూనే వుంది. నాటకీయంగా ప్రధానిని కలసి వచ్చిన కాంగ్రెస్ నేతలకు కూడా చర్చిస్తామన్న మాట తప్ప సూచనలేమీ ఇవ్వలేదు. వాస్తవంలో ఉప ముఖ్యమంత్రి పదవి గురించి వారికి నచ్చజెప్పి వుండాలి. ఇంత జరిగాక 15వ తేదీన ప్రణబ్ ముఖర్జీతో భేటీ కావడంపైనా పెద్ద అంచనాలకు ఆస్కారం లేదు..కనక అందుకు సంబంధించి ఇంకా ఏమైనా భ్రమలు కలిగించేందుకు ప్రయత్నించడం ఎవరికీ మేలు చేయదు. అది క్లిష్టమైన సమస్య అని సమయం పడుతుందని ఒకరంటే అందరి భాగస్వామ్యంతో అఖిల పక్షం జరిపి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే అడుగు వేస్తామని మరొకరు అంటున్నారు.శ్రీకృష్ణ కమిటీ ఆరు సిఫార్సులు చేసిందంటున్న ఆజాద్ అందులో మూడింటిని ఆ కమిటీయే కొట్టి వేసిందని తెలియనట్టు ప్రవర్తిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచి తెలంగాణాకు రాజ్యాంగ రక్షణలు కల్పించడం అత్యుత్తమమని కమిటీ సూటిగానే చెప్పింది. కాదంటే విభజన చేయాలన్నది. అప్పట్లో తలో కోణం నుంచి కమిటీ సిఫార్సులను స్వాగతించిన నాయకులు ఇప్పుడు అదే ప్రధాన శత్రువన్నట్టు దాేడి కేంద్రీకరిస్తున్నారు. ఈ విషయంలో అజాద్ మాటే కేంద్రం మాట అనుకుంటే అప్పుడు అఖిలపక్షంతో నిమిత్తం లేకుండా అదే అధికారికంగా ప్రకటించవచ్చు. అంతే గాని కోట్లాది మంది తెలుగు ప్రజల మనోభావాలతో చెలగాటమాడటం తగని పని.. ఎడతెగని ఈ చెలగాటాన్ని విరమించి ఇదమిద్దమైన నిర్ణయం తీసుకోకుండా వ్యక్తుల మార్పుతోనూ పదవుల పందేరంతోనూ పరిస్థితిని అదుపు చేయాలనుకోవడం అధికార పక్షం అత్యాశే అవుతుంది. అలాటి నేపథ్యంలో వాస్తవికంగానూ సంయమనంతోనూ వ్యవహరించాల్సిన బాధ్యత ఇక్కడి నాయకులపైనా వుంటుంది.బొత్స పదవీ ప్రమాణ సందర్భంలో హంగామా ఆయన మాట్టాడిన తీరు చూస్తుంటే కాంగ్రెస్‌లో రెండు అధికార కేంద్రాలు రూపు దాల్చడం స్పష్టంగా కనిపిస్తుంది.బహుశా ఉభయులూ తమ తమ శిబిరాలను కాపాడుకోవడం కోసం ప్రాంతీయ సమీకరణాలను మార్చి వేస్తారని కూడా అధిష్టానం పాచిక వేసి వుండొచ్చు. కాని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తున్న సమస్యలు ప్రభుత్వానికి ఇరకాటంగా పరిణమించడం అనివార్యం. ఇప్పుడు విద్యా సంస్థల పున: ప్రారంభం, వ్యవసాయ సమస్యలు రోజు హౌరెత్తుతున్న వివిధ ఉద్యోగ కార్మిక వర్గాల సమస్యలను పరిష్కరించకపోతే అసంతృప్తి పెరుగుతుందే గాని తరగదు.
No comments:
Post a Comment