Pages

Monday, April 2, 2012

ఉభయ కమ్యూనిస్టు పార్టీల మహాసభలుఉభయ కమ్యూనిస్టు పార్టీల జాతీయ మహాసభలు కొద్ది తేడాతో పూర్తవుతున్నాయి. సిపిఐ అఖిల భారత మహాసభలు పాట్నాలో జరిగాయి. అందరూ వూహించినట్టే సురవరం సుదాకరరెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనారు. ఈ సందర్భంగా చాలా పత్రికలు ఛానెళుచండ్ల్ర రాజేశ్వర రావు తర్వాత పాతికేళ్లకు తెలుగు నేత ఎంపిక అని రాశారు.నిజమే. రాజేశ్వరరావు తర్వాత ఇంద్రజిత్‌ గుప్తా ప్రధాన కార్యదర్శి అయ్యారు.ఆయన యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో హౌం మంత్రి అయ్యాక బర్దన్‌ ఆ స్తానంలోకి వచ్చి ఇప్పటి వరకూ కొనసాగారు. భారత కమ్యూనిస్టు ఉద్యమంలో చీలిక తర్వాత సిపిఐకి చండ్ర సిపిఎంకు పుచ్చలపల్లి సుందరయ్య కార్యదర్శులై నడిపించారు. సుందరయ్య సైద్ధాంతిక విభేదాల కారణంగా 1975లో రాజీనామా చేసినా 1977లో ఎమర్జన్నీ ఎత్తివేత తర్వాతే అధికారికంగా ప్రకటించబడింది. మావోయిస్టు పార్టీకి కూడా చాలా కాలం పాటు కొండపల్లిసీతారామయ్య, చండ్ర పుల్లారెడ్డి వంటి వారే అఖిల భారత నాయకత్వం అందిస్తూ వచ్చారు. ఈ విధంగా అన్ని కమ్యూనిస్టు గ్రూపులకు తెలుగు వారే సారథులు కావడం యాదృచ్చికం కాదు. ఇక్కడ ఉద్యమంలో విభజన తీవ్రతనూ ఇక్కడి నేతల ప్రత్యేకతను చెబుతుంది. ఇప్పుడు సుధాకర రెడ్డి ప్రధాన కార్యదర్శి కావడం కూడా ఆ వారసత్వంలో భాగమే అనుకోవాలి. బి.వి.రాఘవులు కూడా పొలిట్‌బ్యూరో సభ్యుడుగా ముఖ్య పాత్ర వహిస్తున్నారు..ఏమైనా
కమ్యూనిస్టు పార్టీలలో వ్యక్తిగతంగా ఎవరు ఎన్నికైనారనేదాన్ని బట్టి సర్వం నడుస్తుందని కాదు. ముందుగా నిర్ణయమైన విధానాల ప్రకారమే వాటి నడక సాగాల్సి వుంటుంది. ఒక వేళ ఆ విధానాలు మార్చుకోవాలంటే మళ్లీ చర్చ జరగాల్సిందే. తప్పొప్పులు తేల్చుకోవాల్సిందే.దీన్ని ఆత్మ విమర్శ అని వారంటే ఇతరులు ఎగతాళి చేస్తుంటారు. ఎంత పెద్ద తప్పులు చేసి కష్టనష్టాలు తెచ్చిపెట్టినా ఒప్పుకోని పార్టీల కన్నా జరిగిన పొరబాట్లను నిష్కర్షగా చెప్పుకునే కమ్యూనిస్టులు ఖచ్చితంగా మెరుగు.ఈ నాడు దేశంలో సిపిఎం సిపిఐ కీలక పాత్రలో లేవన్నది నిజమైనా వాటికి శ్రమ జీవులలో వున్న పునాది చెదిరిపోలేదు. పైగా విధాన పరంగా ప్రత్యామ్నాయాలను చెప్పేది చూపేది ఈ పార్టీలే. మిగిలినవన్నీ ఆర్థిక విధానాలలో అమెరికా అనుకూలతలో ఏమాత్రం తేడా లేనివి. సిపిఐ సిపిఎంల మధ్య తేడాల గురించి చాలానే చెబుతుంటారు గాని ఈ రెండు విషయాల్లో మాత్రం ఉభయ పార్టీలు దాదాపుగా ఒకే విధానంతో నడుస్తున్నాయి.1979 తర్వాత జాతీయ రాజకీయాల్లో ఒకే వైఖరితో కొనసాగుతున్నాయి. ఒకే పార్టీలో వివిధ వర్గాలు కుమ్ములాడుకునే ప్రస్తుత తరుణంలో ఇది అరుదైన విషయమే. అయినా సరే ఉభయ కమ్యూనిస్టు పార్టీల మధ్య తేడాలనే చూపిస్తూ గందరగోళ పరుస్తుంటారు. రెండు పార్టీలు ఎందుకుండాలని సవాళ్లు చేస్తుంటారు. ఇందుకు తగినట్టే కొందరు ఉభయ పార్టీలూ వెను వెంటనే కలసి పోవాలని చెబుతూ అలా జరగనందుకు ఆవేదన చెందుతుంటారు. సిపిఐ నేతలు కొందరు అలాటి వ్యాఖ్యలే చేస్తుండేవారు అయితే సుధాకర రెడ్డి తొలి వ్యాఖ్యలలోనే తాము విలీనానికి ఏమీ ఆతృత పడటం లేదని చెప్పడంలో వాస్తవికత తొంగి చూస్తుంది. ఉభయ పార్టీలు ఉద్యమాలకే ప్రాధాన్యత నివ్వడం అర్జెంటుగా ఏదో ఒక కూటమిని తయారు చేయాలని హడావుడి పడకపోవడం కూడా సరైన నిర్ణయాలు గానే వున్నాయి. సిపిఎం మహాసభలో ఈ సారి సైద్ధాంతిక అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరుగుతున్నది. మారిన పరిస్తితులలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలన్న చర్చ కూడా వుంది. కమ్యూనిస్టులు కాలానుగుణంగా మారడం లేదని తిట్టిపోసే వారు ఈ పత్రాలను చదివి తర్వాత తుది నిర్ణయానలు కూడా పరిశీలిస్తే మార్క్సిస్టుల ఆలోచన ఆచరణ ప్రణాళికలు తెలుస్తాయి. లెక్కకు మిక్కుటంటా అవినీతి భాగోతాలు అక్రమణలు బయిటపడుతున్న నేటి స్థితిలో వామపక్షాలు చెప్పిన ప్రత్యామ్నాయ ప్రజానుకూల విధానాలు తప్పక ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి.ఉద్యమాలలో సమీకరిస్తాయి. సుధాకరరెడ్డికి సంబంధించిన వ్యక్తిగత విషయం ఏమంటే కర్నూలులో చదువుకునే రోజుల్లో ఆయన మేమున్న కార్యాలయ భవనంలోనే వుండేవారట. మా తలిదండ్రులు కూడా పార్టీలో కీలకంగా పనిచేసే వారు. అప్పట్లో చిన్నవాణ్ని గనక అంతా గుర్తు లేకున్నా ఆయన చెప్పాక గుర్తుకు వచ్చింది. సాహిత్య అధ్యయనం చక్కటి పద ప్రయోగం కూడా సుధాకరరెడ్డికి ప్రత్యేకతగా వుంటాయి. వామపక్షాలు ఎదురు దెబ్బ తిన్న నేటి నేపథ్యంలో తమ పార్టీని పటిష్టంగా నిలబెట్టడానికి ఆయన ఏ విధమైన చొరవ ప్రదర్శిస్తారో ఆచరణలో చూడాలి.

No comments:

Post a Comment