Pages

Sunday, April 1, 2012

ఆత్మహత్యల ఆదర్శీకరణ అవాంఛనీయం


ఇప్పుడు తెలంగాణా ప్రాంతంలో ఆత్మహత్యల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్న అంశం. ఆత్మహత్యలు వద్దంటూ టిఆర్‌ఎస్‌ తదితర పార్టీల నాయకత్వంలో ఒక ప్రదర్శన జరిగింది. ఒక టీవీ ఛానెల్‌ చర్చ నిర్వహించింది. హౌం మంత్రి చిదంబరం కూడా ఈ సమస్యను ప్రస్తావించారు. ఈ ఆత్మహత్యలకు ఎవరు కారణమనే దానిపైన, ఎవరు ఏమన్నారనేదానిపైన కూడా వివాదాలు నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి తనకు ఆపాదించిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటన చేయాల్సి వచ్చింది. ఈ విధంగా ఆత్మహత్యలపై అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజకీయంగా సామాజికంగా వాటి మూల కారణాలు శోధించి నిరోధించడం అన్నిటికన్నా ముఖ్యం. ఉప ఎన్నికల ఫలితాలు గమనించిన వారంతా ఉద్వేగాలు ఉద్రేకాలు కాస్త తగ్గుముఖం పట్టి సాధారణ రాజకీయ వాతావరణం ఏర్పడుతున్నదని భావించిన తరుణంలో ఈ పరిస్థితి రావడం నిజంగా బాధాకరం. ఒక ప్రతికూల పరిణామం. చనిపోయిన వారి పట్ల సానుభూతి తెల్పుతూనే రాజకీయ ఉద్యమాలలో ఆత్మహత్యల చర్చ కేంద్ర బిందువుగా మారకుండా జాగ్రత్తపడాల్సి వుంటుంది. ఈ ధోరణి కేవలం తెలంగాణా సమస్యకే పరిమితం కాదు గనక రేపు మరో సందర్బంలోనూ ఇలా జరగొచ్చు. అది కుటుంబాలకు సమాజానికి కూడా శ్రేయస్కరం కాదు.కనక పదే పదే అసహాయ భావనతో ఆత్మహత్య చేసుకున్న వారిని ఆదర్శీకరించే వైఖరి రాకుండా ఆయా సంఘాల , పార్టీల నాయకులు చూసుకోవాలి.బలిదానాలు వంటి మాటలు మీడియాలో ఎక్కువగా వాడుతున్న తీరును కూడా పున: పరిశీలించుకోవాలి. ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఖండించాలి గాని దాని వల్ల ఆత్మహత్య చేసుకున్నారని పదే పదే చెప్పడం ఒక విధంగా సమర్థనగా కనిపించవచ్చు.కొందరు స్వార్థపరులైన వారు ఒక వైపున ఖండిస్తూ వద్దని సలహాలు చెబుతూనే వాటి చుట్టూనే చర్చ తిప్పుతుంటారు. ఇదే కాలంలో రెండు వేల మంది రైతులు ఆర్థిక అవస్తలతో ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా ఇవి కొనసాగుతున్నాయి. అంతకు ముందు చేనేత కార్మికుల కుటుంబాలలోనూ ఆకలి చావులే గాక ఆత్మహత్యలు చూశాం. ఆ అన్ని ఘటనలలోనూ సంబంధిత సంఘాలు ఆత్మ విశ్వాసం తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదని చెప్పాయే తప్ప దాని చుట్టూ చర్చ నడవలేదు. ఇప్పుడు మాత్రం గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఏ చర్చకు కూచున్నా పిల్లలు చనిపోతున్నారంటూ మొదలవుతున్నది. ప్రాంతీయ వాదాలతోనే పిల్లలు ప్రాణాలు తీసుకునే పరిస్థితి సాగనిస్తే రేపు మరింత తీవ్రమైన వ్యక్తిగతమైన సవాళ్లు వస్తే వీరు తట్టుకోగలుగుతారా?విభజన జరిగినా జరక్కపోయినా అది ప్రాణాలు తీసుకోవలసినంత మౌలిక సమస్య కాదని, దాంతోనే జీవితాలు తలకిందులుగా మారిపోవని కూడా మన యువతకు స్పష్టమైన అవగాహన కలిగించడం అవసరం. ఏ సమస్యకైనా ఆత్మహత్య తరుణోపాయం గాని సమర్థనీయం గాని కాదు. లోగడ ఇలాటి ఒక సందర్భంలో చనిపోయిన యువకుడిని జెఎసి చైర్మన్‌ కోదండరామ్‌ భగత్‌ సింగ్‌తో పోలిస్తే నేను ఖండిస్తూ రాశాను. పైగా భగత్‌ సింగ్‌ ఆత్మహత్య ఏ పరిస్థితుల్లోనూ తగదంటూ రాసిన భాగాన్ని వుటంకించాను. తర్వాతి రోజు నమస్తే తెలంగాణాలో నేనిచ్చిన కొటేషన్‌ను పునర్ముద్రించడం సంతోషం కలిగించింది.కనక వద్దనుకుంటూనే ఆత్మహత్యలతో విమర్శలు ఆరంభించడం మానుకోవాలి.అలాగే ఆత్మహత్య చేసుకున్న వారి వ్యక్తిగత నేపథ్యాన్ని పరిసరాలలో పరిస్థితులను కుటుంబాల తీరు తెన్నులను నిశితంగా పరిశీలించేట్టయితే భవిష్యత్తులో నిరోధించే చర్యలు తీసుకోవచ్చు.

6 comments:

  1. చర్చ అసలు వద్దని కాదు గాని మీరన్నట్లు ఇది ఆదర్శం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. అయితే మీడియాలో అతి అన్నింటి లాగే ఇదీ ఉన్నా ప్రజలలో ఈ ఆత్మహత్యా రాజకీయాలపై తగినంత మార్పు చైతన్యం మాత్రం మీడియా అవతలి వాస్తవ జనం లో చర్చ బాగానే జరుగుతున్నది.

    ReplyDelete
  2. నిజమే ఆత్మహత్యలు అవాంఛ నీయమే. ఆత్మహత్యలను ప్రోత్సాహించడం కానీ సమర్థించడం కానీ ఎవరూ చేయకూడదు.

    కొంతమంది తెలంగాణా వ్యతిరేకులు ఆత్మహత్యలను అవహేళన చేయడం, అమర వీరులను కించపరచడం మనం చూస్తున్నాము. దీన్ని ఎవరూ ఖండించరేం?

    ఆధారాలు లేకుండా వారి మరణంపై అనుమానాలు అభాండాలు వేసే వారికి కనీసం సానుభూతి చూపించాలనే ఇంగితం కూడా ఉండదు. చనిపోయిన వ్యక్తులపై వెకిలి వ్యాఖ్యలు చేయడం అతి హేయం.

    ReplyDelete
    Replies
    1. రాజకీయ నిందారోపణలు తప్ప ఆత్మహత్యలు చేసుకున్నవారిని అవమానించే వ్యాఖ్యలు నేనెక్కడా చూసినట్టు లేదు. మీరు ఏవైనా తెలియజేస్తే తప్పక ఖండించవచ్చు. ఆత్మహత్యలు చేసుకునే ధోరణిపై అన్ని కోణాల నుంచి తప్పక పరిశీలన జరగాల్సిన అవసరం వుంది.

      Delete
    2. మీరు చేసారని నేను అనలేదు. అలా చేస్తున్న వారిని తమ లాంటి విజ్యులు ఖండించలేదని మాత్రమె అన్నాను.

      Delete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. కర్ణుడి చావు కు అనేక కారణాలన్నట్టు ఈ ఆత్మహత్య
    లకు కూడా అనేక కారణాలు న్నాయి ....
    అసలు ఇలాంటి విశయం పై చర్చ జరగటం విచారకరం. దురదృష్టం కూడా
    ఈ ఆత్మహత్యలకు మొదటి కారణం శవరాజకీయాల తో ఎదగాలనుకొనే పచ్చి రాజకీ
    యస్వార్థపరులు.....
    ఈ రాజకీయ పిశాచాల అర్థం పర్ఠం లేని రెచ్చగొట్టె ఉపన్యాసాల అమాయకు
    లు బలి అవుతున్నారు ..... వీళ్ళ కు లేని పోని భ్రమలు కల్పించారు....ఈ నాయకులు...
    రాష్ట్రం విడిపోయిన తెల్లవారె సీమాంధ్రులు తట్ట బుట్ట సర్ధుకొని హైద్రాబాదు వదలి
    వెళ్ళీ పోతారని , సక్రెటెరియట్ లో ఉద్వోగాలన్నీ ఖాళీ అవుతాయని ఇక వాటి పై
    దస్తీ వేసుకొని కూర్చోవడమే తరువాయి అన్న తరహాలో ఉపన్యాసాలు సాగాయి
    అవన్నీ నిజమైని నమ్మిన అమాయకులు జరుగుతున్నా కాల హరణాన్ని తట్టు
    కోలేక ఈ ఆత్మహత్యల కు పాల్పడు తున్నారు ....
    ఆ మధ్య ఓ (మహా...?) నాయకుడి ఆకస్మిక మరణంతో మాస్ హిస్టిరియా తోఅనేక మంది ప్రాణాలు కోల్ఫొయారు .... మరి ఈ మరణాలను కూడా బలిదానాలందామా? మరి దాని వల్ల లబ్ది పొందేది ఎవరో
    వివరించక్కరలేదు .... ఈ ఓదార్పు యాత్ర 2050 దాకా సాగుతునే ఉంటుంది
    మహాత్మా గాంధీ మరణించినప్పుడు కూడా ఎక్కడా అత్మహత్యలు చేసుకున్న
    ధాఖలాలు లేవు .....
    నిజాంపిషాచం పరిపాలించే కాలం లో కూడా రాక్షసమూకలైన రజాకర్లను
    చిన్నాచితకా, ముసలి ముతకా ,ఆడా మగా తేడాలు లేకుండా ప్రాణాలకు తెగించి
    పోరాడారే కాని ఎవ్వరూ అత్మ హత్యలు చేసుకోలేదు .....

    వడెసేల రాళ్ళు నింపి ,కళ్ళల్లో కారం కొట్టి నిజాం సైన్యాన్ని పరుగెత్తించిన
    వీర చరిత్ర ఈ తెలంగాణాదీ ....

    రజాకర్ల రాక్షసత్వం గురించి ఏచరిత్ర పుస్తకాల్లో చేర్చలేదు కాని

    రజాకర్ల సృష్టికర్త నైజాం పాఠాలను సిలబస్ లో చేర్చాలి అని ఓ
    మూర్ఖుడు ప్రకటిస్తే ఎవ్వరూ నోరు మెదపరెందుకు .....?

    తెలంగాణా అన్నది పేకాట లో తురుపు ముక్కలాంటిది ప్రతి ఒక్కడు
    ఆ పేరు తో లబ్ది పొందాలని చూస్తున్నారే కాని అమాయకుల అత్మ హత్య
    ల గురించి పట్టించు కునే నాధుడు లేడు.... ఎందు కంటే ప్రాణాలు తీసుకున్నది
    బడుగు పేద వర్గాల వాళ్ళే...

    ఏ రాజకీయ నాయకుల సంతతి అత్మ్హహత్య చేసుకున్నట్టు వినలేదు ...కనలేదు
    ఎందు కంటే వాళ్ళకు వాస్తవాలు తెలుసు ....

    రాజ్యసభ సీటు రాక పోయినా .... గ్రూప్ ల్లో తమకు గుర్థింపు లేదని పించినా
    వేర్పాటు పాట పాడుతారు .... ఈ స్వార్ధపరులు.....

    ఇదంతా ప్రజల బాగు కు కాదు ....

    ఆలు లేదు చూలు లేదు నేను సి.యం ... అంటే నేను సి,యం .... అని వీధి
    కుక్కల్లా కొట్లాడుకుంటున్న నాయకుల చిత్తశుద్ది ప్ర్జజలు నమ్మడం
    మన దుర్భాగ్యం.....

    ఈ ఉద్యమం సంగతి అటుంచితే ఇందులో తిరిగిన చోటా మోటా గల్లీ నాయకులు
    ఈ నాడు కార్లల్లో తిరుగుతునారు ...

    ఏలిన వారి సంగతి చెప్పక్కరలేదు వేల కోట్ల టెండర్లు దక్కించు కున్నరు వారి
    కుటుంబసబ్వ్హులు కోట్లకు పడగలెత్తారు....

    మొన్నటికి మొన్న ఇక్కడ ఆత్మహత్య పరంపర కొన సాగు తుంటే సదరు నాయకులవారు విహార యాత్రల్లో మునిగితేలు తున్నారని "తెలుగు ఒన్ డాట్
    కామ్ " లో ఫోటో తో సహా ప్రచురించారు....

    కాని మన పత్రికలు నిమ్మకు నీరెత్తినట్టు న్నాయి ...

    వాస్తవాలు ప్రజలకు తెలుపుతే , ఈ రంకు రాజకీయనాయకుల అసలు రంగులు
    బైట పెట్టి బాగా ప్రచారం చేస్తే తప్ప కొంతవరకు ఈ ఆత్మ హత్యలను
    అదుపు చేయవచ్చు.....

    ఈ నిజాలన్నీ మాట్లాడానికి ఏ చానల్ కు గాని, పేపర్ కు గాని దమ్ములేదు

    ఇదంతా ఎలా ఉందంటే ....... హంతకుణ్ణి వదిలేసి హతుణ్ణి నిందించడంలాంటిది ....
    from
    m.udaya bhanu

    ReplyDelete