Pages

Thursday, April 5, 2012

పార్టీలో కలహాలు, మీడియాపై ఆగ్రహాలు!



ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణల మధ్య అంతర్యుద్ధం బహిరంగ రాజకీయ సమరంగా మారాక ఆలస్యంగా ఢిల్లీకి రావించిన అధిష్టానం ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించే అవకాశం లేదని అందరికీ తెలుసు. ఈ ఇద్దరితో పాటు ఉప ముఖ్యమంత్రి రాజనరసింహ కూడా కీలకంగా భాగం పంచుకోగా జెడిశీలం కూడా పాలు పంచుకున్నట్టు సమాచారం. వీరు ఏం చర్చించారనేదానిపై వూహాగానాలు చేస్తున్నారే గాని నిజంగా ఏం జరిగిందో ఎవరికీ తెలుసని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. బొత్స ఢిల్లీలో మీడియాతో జరిపిన సమావేశంలోనూ అదే ఆరోపణ లేదా అపహాస్యం చేశారు. మీరు ఏదేదో రాసేయడం తప్ప మాకు విభేదాలలు లేవని చెప్పి ఒప్పించేందుకు విఫల యత్నం చేశారు. లిక్కర్‌ మాఫియాపై ఎసిబి దాడులకు సంబంధించి సాగిన సంఘర్షణ ఆఖరుకు సిట్‌ అధిపతి శ్రీనివాసరెడ్డి హఠాత్తుగా బదిలీ చేయడం జరిగిన తర్వాత కూడా ఈ మాటలు నమ్మి వూరుకోవాలంటే ఎలా కుదురుతుంది? అసలు ఈ దాడులు మొదలైనప్పటి నుంచి అసహనాన్ని వ్యక్తం చేస్తున్న వ్యక్తి ఆయనే. దర్యాప్తు చేస్తున్న అధికారిని అర్థంతరంగానే గాక అర్థరాత్రి వేళ కిక్‌డ్‌ అప్‌స్టియర్స్‌ తరహాలో ప్రమోషన్‌ ఇచ్చి పంపేస్తే
అందులో ఏం లేదనుకోవాలా? ప్రమోషన్‌ ఇస్తే బలిపశువు ఎలా అవుతాడని సాంకేతిక ప్రశ్న పేస్తున్ప పిసిసి పీఠాధిపతికి ఈ నేపథ్యం తెలియకనా?ఏ సమస్యలు లేకపోతే ఎసిబి అధిపతి భూపతి బాబు ఎందుకు దీనిపై ఆగ్రహం అభ్యంతరం వ్యక్తం చేయవలసి వచ్చింది?దాచేస్తే దాగని సత్యంలా కనిపిస్తున్న అంతర్గత కలహాలను కప్పిపుచ్చడం కేవలం అధికారిక లాంఛనమేనని వీరే లీకేజీలతో అవతలి వారిని ఇరకాటంలో పెడుతుంటారని అందరికీ తెలుసు. మీడియాకు మరింత బాగా తెలుసు. మీడియాలో చాలా తప్పులు వుండొచ్చు గాని ప్రతి దాన్ని ఆ పేరుతో బుకాయించడం కుదిరేపని కాదు. అంతర్గత తగాదాల సర్దుబాటు కోసం అవినీతిపై దర్యాప్తుకు ఆటంకాలు కలిగించడం జరిగే పోయింది.ఇంతటితోనే త్రిమూర్తులు స్నేహగీతాలు ఆలపించేస్తారని అనుకునేంత అమాయకులెవరూ వుండరు. నిజానికి చాలా కోణాల్లో బొత్స అనుకున్న నిర్నయాలు జరగడంతో పాటు కిరణ్‌ వేగాన్ని దూకుడును అభిశంసించడం కనిపిస్తుంది.చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి ప్రతిపాదనలు ఢిల్లీ ఆమోదం పొండడం లేదనేది కూడా నిజం. అయితే బొత్స వాదిస్తున్న వ్యవహారం కూడా బహిరంగంగా సమర్తించేది కాదు గనక ఏవో అతుకులు పెట్టి పంపించారు. ఉప ఎన్నికల వ్యూహంపై చర్చ చేశామని చెప్పడం ఇంకా హాస్యాస్పదంగా వుంటుంది. ఒక పాలక పక్షం ఉప ఎన్నికలకు ఇంతగా బెంబేలెత్తిపోతున్నదంటే అంతకన్నా బలహీనత ఏముంటుంది?కరెంటు ఛార్జిలు వ్యాట్‌ వాయింపులు నీటి భారాలు ఆస్తి పన్ను మోతలు అన్నిటినీ మించి అవినీతి ఆరోపణలు అస్తిమితాలు ఆంధ్ర ప్రదేశ్‌ను వెన్నాడుతుంటే వాటన్నిటిని వదలిపెట్టి తమ తగాదాలు సర్దుకోవడానికే అధిష్టానం తంటాలు పడుతుండడం అర్థ రహితం. దీనికి ప్రాంతీయ కోణాలు తెలంగాణా కసరత్తులు అంటూ పేర్లు పెట్టడం భ్రమలు కొల్పే ప్రహసనం మాత్రమే. కనక అసలు మార్పులు ఆ ఎన్నికల ఘట్టం ముగిశాకే చూడాల్సి వుంటుంది.అప్పటి వరకూ వినిపించే ఐక్యతా గీతాలు అభినయాలు మాత్రమే!

No comments:

Post a Comment