Pages

Sunday, April 8, 2012

ఉప ఎన్నికల ముంగిట్లో వురుములుఉప ఎన్నికల తర్వాత ప్రభుత్వం పడిపోతుందని, మధ్యంతర ఎ న్నికలు వస్తాయని వైఎస్‌ఆర్‌ పార్టీ నేత అంబటి రాంబాబు జోస్యం చెప్పడంలో గొప్ప రాజకీయ వ్యూహం వుంది. ఈ ఉప ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే ఉత్కంఠతో ఎదురు చూస్తూ భవిష్యత్తు పథకాలు సిద్ధం చేసుకుంటున్న ఇతర పార్టీల ముఖ్యంగా కాంగ్రెస్‌ తెలుగు దేశం పార్టీల నేతలను ఇప్పుడే ఆకర్షించడం ఇందులో ఉద్దేశం. అలాటి వారి స్తయిర్యాన్ని మరింత దెబ్బతీసి నిష్క్రమణను వేగిరపర్చాలని జగన్‌ పార్టీ వారు అనుకుంటున్నారు. అప్పుడు ఎన్నికలలో తమకు అనుకూలత పెరుగుతుందని వారి అంచనా. వైఎస్‌ రాజశేఖర రెడ్డిని కూడా విమర్శించాలని కాంగ్రెస్‌లో అనుకుంటున్నట్టు కథనాలు వచ్చాయి గనక ఇప్పుడే ఎదురు దాడి తీవ్రం చేసి విమర్శలు పెద్దగా రాకుండా నిరోధించాలన్న ఆలోచన కూడా వుండొచ్చు. ఒక వైపున వైఎస్‌ హయాంలో పొరబాట్లు జరగలేదని వాదిస్తూనే మరో వైపున ఆయన కాలంలో మంత్రులకు బాధ్యత లేదా అని తాము చేస్తున్న వాదనలోని అసంగత్వం వారికి అర్తం కాలేదనీ కాదు. ఎదో విధంగా ఎదురు దాడి చేస్తూ ప్రజల్లో ఆదరణను పెంచుకోవడం ఇతర పార్టీల నేతలు చెల్లాచెదురు చేయడం వారి లక్ష్యం. అయితే ఈ అతిధీమాకు కారణం మాత్రం కాంగ్రెస్‌ తీరు తెన్నులే.

అంతర్గత కలహాలతో అట్టుడుకుతున్న అధికార పార్టీ వ్యవహారాలు ఈ వారం మరింత అధ్వాన్న స్తితికి చేరాయి. కాంగ్రెస్‌ నేతలకు మంత్రులకే పరిమితం కాకుండా అధికార యంత్రాంగాన్ని కూడా ప్రత్యక్షంగా ప్రభావితం చేసే దశకు చేరాయి. అనిశ్చితి, అవినీతి ఆరోపణల విషయంలో హడావుడి ఎంత జరిగినా అంతిమంగా ప్రభుత్వ పరిరక్షణ రాజకీయ ప్రయోజనాల సాధనకే అధిష్టానం తాపత్రయపడుతున్నదని తేలిపోయింది. పైగా ఈ వ్యవహారాలన్ని కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశమంతటి దృష్టినీ ఆకర్షించి పరువు
తీశాయి. రాష్ట్రానికి అనధికార రాజకీయ అధినేతగా వున్న గులాం నబీ ఆజాద ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ, పిసిసి అద్యక్షుడు(మంత్రి కూడా) బొత్స సత్యనారాయణలతో ్‌ నాలుగు గంటల పాటు జరిపిన చర్చలు చివరకు మొక్కుబడి సయోధ్యతో ముగిశాయి. ఇందుకు మూల్యంగా లిక్కర్‌ మాఫియాపై దర్యాప్తు జరుపుతున్న ఎసిబి ప్రత్యేక విభాగం సిట్‌ బాధ్యుడు శ్రీనివాసరెడ్డిని బదిలీ చేయడమూ జరిగిపోయింది. ఎవరికి వారు దస్త్రాలతో సహా హాజరై బహిరంగ అంతర్యుద్దాలు చేసుకున్న ఈ తతంగం చివరకు బొత్స తమ మధ్య తగాదాలే లేవని చెప్పడంతో ప్రహసన ప్రాయంగా ముగిసింది. శ్రీనివాసరెడ్డి ఎవరో తనకు తెలియదని బొత్స చెప్పడం ఆయనే ఒప్పుకోలేనంత పేలవమైన వాదనగా తయారైంది. ఆయనే మరోవైపున ప్రమోషన్‌ మీద (అర్థంతరంగా అర్థరాత్రి) బదిలీ చేయడం వల్ల ఆయన బలిపశువయ్యాడనడం సరికాదని గట్టిగానే వాదించారు. ఇక ఎసిబి అధిపతి భూబతిబాబు శ్రీనివాసరెడ్డిని రిలీవ్‌ చేయబోనని భీష్మించడం ఇదంతా ప్రభుత్వ యంత్రాంగాన్ని గందరగోళపర్చడమే గాక అవినీతిపై గట్టిగా వ్యవహరించడానికి వెనుకాడే పరిస్తితిని తెచ్చి పెట్టింది. తాను సెలవుపై వెళ్లినట్టు వచ్చిన కథనాలను భూబదిబాబు ఖండించారు. శ్రీనివాసరెడ్డి కూడా సర్దుబాటు వ్యాఖ్యలతో కొత్త బాధ్యతలు చేపట్టారు. మరో వైపున ఎసిబి దాడులు ప్రత్యేకించి విజయనగరంలో సాగుతూనే వున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అంతమాత్రాన కాంగ్రెస్‌లో కలహాలు అవినీతిని విషయంలో ఒత్తిళ్లు మటుమాయమై పోయాయనుకోలేము.
నిజంగానే పొరబాటు లేదా?
ఏ కేసులో ఎవరికి ఎంత ప్రమేయం వుంది లేదు తేలాలంటే సమగ్రమైన దర్యాప్తును నిరాటంకంగా జరగనివ్వాలి.బొత్సను లేదా మరొకరిని దెబ్బ తీయడానికి ముఖ్యమంత్రి కిరణ్‌ ఉద్దేశపూర్వకంగానే ఈ దాడులు నిర్వహించారనేది ఆయన వ్యతిరేకుల ఆరోపణ. అది నిజమే అనుకున్నా ఆ క్రమంలో దర్యాప్తుకు సహకరించి నిజాయితీ నిరూపించుకోవాలే గాని ముందే వులిక్కి పడటం ఉక్రోషం వెలిబుచ్చడం ఎందుకు? బొత్స సన్నిహితులతో మొదలై ఒక దశలో ఎక్సయిజ్‌ శాఖా మంత్రి మోపిదేవి వెంకట రమణ చుట్టూ తిరిగిన ఈ దర్యాప్తు వ్యవహారం శాసనసభకు కూడా కుదిపేసింది. అక్కడ ముఖ్యమంత్రి మంత్రులను పరోక్షంగా సమర్తిస్తూనే దర్యాప్తు పూర్తి చేసి తీరతామని ప్రకటించారు. ఆ మేరకు ఈ నెల 16న కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేయవలసి వుంది.ఇలాటి సమయంలో బొత్స బినామి దుకాణాలు పెట్టించారని ఆరోపణలు రావడం, ఆయన మనస్తాపం చెందినట్టు ఒకటికి రెండు సార్లు చెప్పడం, ఢిల్లీపిలుపు , దానికి ముందే బదిలీ అన్ని చకచకా జరిగిపోయాయి.
ఒక అధికారిని ప్రమోషన్‌పై పంపితే ఏమైంది? కొత్తగా వచ్చిన వారు కూడా దర్యాప్తు కొనసాగిస్తారు కదా? (నిజంగానే సాగిస్తున్నారు కదా..) ప్రభుత్వ నిర్ణయాన్ని అధికారులు అమలు చేయకుండా నిరాకరించడం తప్పు కదా? ఇలా ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌ నేతలు ప్రభుత్వ ప్రతినిధుల వాదనలు వింతగానే గాక విపరీతంగానూ వున్నాయి. అసలు శ్రీనివాసరెడ్డి స్వయానా ఇందులో విశేషమేమీ లేదని చెబుతుంటే విమర్శలెందుకని వారు గడుసుగా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాధికారిగా ఆయనకు వున్న పరిమితులు పరిస్తితులను బట్టి అలా మాట్లాడ్డంలో ఆశ్యర్యం లేదు. పైగా ఇది ఆయన వ్యక్తిగత సమస్య కాదు కూడా. అలా చిత్రించిన వారు కాంగ్రెస్‌ నేతలే. ఒక ఘటన వెనక గల పరిస్తితుల సాక్ష్యాన్ని న్యాయవాస్త్రంలోనే పరిగణనలోకి తీసుకుంటారు గాని ఇక్కడ ఇంత దుమారం రేగినా ఇన్ని కుమ్ములాటలు సాగినా పట్టించుకోకూడదట!ఈ ప్రమోషన్‌ బదిలీ తెర వెనక ఏమీ లేదని నమ్మాల్సిందేనట! ముఖ్యమంత్రి వర్గీయులు ఆయన పారదర్శకంగా వున్నారని చెబుతున్నా తనపైనా మాజీమంత్రి శంకరరావు కేసు వేయనే వేశారు. ఇక పిసిసి అద్యక్షుల వారు కూడా బొగ్గు దిగుమతి కుంభకోణం పేరిట ఏదో దస్త్రం సమర్పించారన్నది కథనం.వీరి మధ్యలో ఉప ముఖ్యమంత్రి రాజ నరసింహ సామాజిక ప్రాంతీయ ప్రాతిపదికన తదుపరి ప్రమోషన్‌ సంపాదించి రాష్ట్ర నేత అవుదామని ఎదురు చూస్తున్నారు.
కాంగ్రెస్‌ తెలుగు దేశం మల్లగుల్లాలు
ఈ అంతర్గత తగాదాను ఎలాగో అదుపు చేసి రేపటి ఉప ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్న చింత తప్ప కాంగ్రెస్‌ నాయకత్వానికి రాష్ట్రాన్ని ప్రజలను వేధిస్తున్న సమస్యలు ఏవీ పట్టలేదు. ఇప్పుడు విద్యుచ్చక్తి ఛార్జీలు విపరీతంగా పెరిగి ప్రజలు ప్రతిఘటన పెరుగుతుంటే వాటిని తగ్గించేందుకు లేదా వివరించేందుకు కూడా ప్రయత్నించలేదు. ప్రాంతీయ సమస్యపై రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితిని అంతమొందించే ప్రకటన గురించి కాస్తయినా ప్రస్తావించలేదు. ఉప ఎన్నికలలో మరోసారి దెబ్బతింటే మనుగడ ఏమవుతుందన్న ఆందోళనే వారిని పట్టిపీడిస్తున్నది. కనకనే కీచులాటల మధ్యనే కాస్సేపు ఇవి మాట్లాడుకుని కలసి కట్టుగా పోరాడతామనే ప్రకటనతో సరిపెట్టారు. ఇంత బాహాటంగా తగాదాలు జరుగుతుంటే పాలన అస్తవ్యస్తం అవతుంటే ప్రజలు ఎలా ఆమోదిస్తారన్న ఆలోచనే అధిష్టానానికి లేదు. ఇందుకు తగినట్టే తిరిగి రాగానే అభ్యర్థుల ఎంపిక,జిల్లాల వారీ సమావేశాలు అంటూ హడావుడి మొదలు పెట్టారు.చంద్రబాబు నాయుడు, జగన్‌ కూడా ఇప్పటికే రంగంలోకి దిగారు గనక ఇది సహజమే.అయితే అటు బొత్స ఇటు కిరణ్‌ కూడా ఉప ఎన్నికలు పాలనపై రెఫరెండం కాదని ఒకటికి రెండు సార్లు చెప్పడంలో ముందు జాగ్రత్త స్పష్టమవుతుంది.చంద్రబాబు నాయుడు కూడా మరో కోణంలో ఉప ఎన్నికల పట్ల విముఖత కనపర్చారు.పెరిగిన వ్యయ ప్రయాసలు చూస్తుంటే ఉప ఎన్నికలలో పోటీ చేయాలనిపించడం లేదని నిర్వేదం ప్రకటించారు.ఒక వేళ తెలుగు దేశం గనక గతంలో ఉప ఎన్నికల విజయాలు సాధించి వుంటే చంద్రబాబు ఇలా అనేవారు కాదేమో. వైఎస్‌ఆర్‌ పార్టీని కాంగ్రెస్‌ను రెంటినీ ఎదుర్కొంటామని ధీమాగా చెప్పేబదులు ఇలా సన్నాయి నొక్కులు నొక్కడంలో విశ్వాస లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇదే సమయంలో కొన్ని సర్వేలు వైఎస్‌ఆర్‌ పార్టీకే అంతా విజయం అనుకోవడం సరికాదని చెబుతున్నాయి. ఏమైనా అతి విశ్వాసం ఎవరికీ మంచిది కాదు గనక వైఎస్‌ఆర్‌ పార్టీ కూడా ఆత్మ విమర్శనా పూర్వకంగా వాస్తవికంగా అంచనాలు వేసుకోవడం మంచిది. రాష్ట్రపతి ఎన్నికలకు లోపే ఉప ఎన్నికలు జరిపిస్తామని ప్రధానాధికారి ప్రకటించారు గనక మరో రెండు నెలల్లోనే ఇవి రావచ్చు. 14 వరకూ గెలుస్తామని వైఎస్‌ వర్గీయులు, తల నాలుగు గెలుస్తామని కాంగ్రెస్‌ తెలుగు దేశంలు ఎవరికి తోచిన లెక్కలు వారు చెబుతున్నారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలను బట్టి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి వెళ్లే విషయం నిర్ణయించుకోవాలని చూసేవారు కాంగ్రెస్‌ తెలుగు దేశం పార్టీలు రెంటిలోనూ వున్నారు. అదే సమయంలో అతి భరోసా పనికి రాదని కూడా వైఎస్‌ఆర్‌ పార్టీకి చాలామంది చెబతున్నారు. ఏమైనా అంతిమ ఫలితం ప్రజల తీర్పును బట్టి గాని తేలదు. ఈ లోగా జగన్‌ కేసు మలుపులు కాంగ్రెస్‌లోకి పిలుపులు వగైరా అంశాలు కొత్త మార్పులు తెచ్చే అవకాశం వుంటుంది. అయితే గత వారం దాఖలు చేసిన ఛార్జి షీట్‌కు అనుబంధంగా మరో విడత సమర్పిస్తారని ప్రచారం జరిగినా ఇప్పటివరకూ కాలేదు. జగన్‌ ఇంగ్లీషు ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఛార్జి షీట్‌ను తప్పుపడుతూనే కేంద్రంలో బిజెపి యేతర కూటమిలో చేరి రైల్వేశాఖ లేదా వ్యవసాయ శాఖ తీసుకుంటానని సూచనలు చేస్తున్నారు. యుపిఎతో కలుస్తామన్న మాట తాము ఎప్పుడూ చెబుతూనే వున్నామని ఆ పార్టీతో సంబంధం వున్న ఎంపి ఒకరు ప్రకటిస్తున్నారు.బిజెపిని వ్యతిరేకించడంతో పాటు తమకు మజ్లిస్‌ దగ్గర కావచ్చన్న సూచలను కూడా వారు వదులుతున్నారు. ఇందుకు తగ్గట్టే ఇటీవల కాలంలో మజ్లిస్‌ ప్రభుత్వం నుంచి కాస్త ఎడం పాటించడం కనిపిస్తుంది.

బిజెపి టిఆర్‌ఎస్‌ల వ్యూహాలు
ఇన్నిటి మధ్యనా తెలుగుదేశం పార్టీ తన స్థానాన్ని కాపాడుకోవడానికి ఉప ఎన్నికలలో కొంతైనా కోలుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. అయితే ఆత్మ విశ్వాస లోపం అనాసక్తి ఆ పార్టీని ఆవరించిన వాస్తవం వారే అంగీకరిస్తున్నారు.మహబూబ్‌ నగర్‌లో విజయం సాధించిన బిజెపి తెలంగాణా ప్రాంతంలో పాగా వేయడానికి ప్రయత్నిస్తుండగానే సంగారెడ్డిలో మతపరమైన ఉద్రిక్తతలు ఆందోళన కలిగించాయి. రెండేళ్ల కిందటనే ప్రారంభించిన హనుమాన్‌ జయంతి సందర్బంలోనూ హైదరాబాదులో చాలా హడావుడి చేయడం, విహెచ్‌పి అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా తన వంతు కవ్వింపు ప్రసంగాలు చేయడం కూడా గమనించదగ్గవి.
ఇది ఇలా వుంటే రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తే తెలంగాణా రాష్ట్ర సమితి కూడా తమ పార్టీతో విలీనానికి వెనుకాడబోదని కాంగ్రెస్‌ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.ఈ మాటను టిఆర్‌ఎస్‌ సీనియర్లు ధృవీకరిస్తున్నారు. కె.చంద్ర శేఖర రావు పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత కూడా ఢిల్లీలోనే మకాం చేసి వుండటం, మంతనాలు జరుపుతుండడం ఇలాటి కథనాలకు బలం చేకూరుస్తున్నది. టిఆర్‌ఎస్‌లో అగ్ర నాయకులు కొందరు ధృవీకరిస్తున్నారు. నాలుగు పార్టీలు అభిప్రాయం చెబితే తప్ప తాము చేసేది లేదని హౌం మంత్రి చిదంబరం ప్రకటన నేపథ్యంలో కూడా టిఆర్‌ఎస్‌ ఇలాటి వూహాగానాలకు అవకాశమివ్వడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. అదే సమయంలో టిఆర్‌ఎస్‌ జెఎసిలతో పాటు నమస్తే తెలంగాణా పత్రికలోనూ చాలా కాలం తర్వాత టి.కాంగ్రెస్‌ నేతలనబడే వారిని కూడా విమర్శించే వైఖరి కనిపిస్తున్నది. తెలుగుదేశం కేంద్రంగా సాగిన విమర్శల వలయంలోకి కాంగ్రెస్‌ను కూడా చేర్చడం ద్వారా అవి ద్విముఖ ప్రయోజనాలు సాధించాలనుకుంటున్నాయి. కాంగ్రెస్‌ నాయకత్వం దగ్గర తామే తెలంగాణా ప్రతినిధులం అని రూఢి చేసుకోవడం, రెండవది వీలైన మేరకు ఇతర పార్టీల పట్టును తగ్గించడం. మహబూబ్‌నగర్‌ ఉప ఎన్నికల ఫలితం కూడా వారి దృష్టిలో వుంది.కనకనే తాము అహౌరాత్రాలు శ్రమించి సజీవంగా వుంచిన తెలంగాణా ఎజెండాను మరెవరో వినియోగించుకోవడాన్ని అనుమతించరాదని అనుకుంటున్నారు. ఒక వేళ కాంగ్రెస్‌ తమ షరతులకు అంగీకరించి విలీనమైతే అదో తీరు తప్ప కాంగ్రెస్‌ జెండాతో మరెవరో తెలంగాణా ఎజెండాను హైజాక్‌ చేసుకోనివ్వరాదనే భావం బలంగా వుంది. కనకనే 24 తర్వాత కాంగ్రెస్‌ తెలుగు దేశంలను లక్ష్యంగా చేసుకుని ప్రజల్లోకి వెళతామని కోదండరాం జెఎసి పక్షాన ప్రకటించారు.
వామపక్షాలు కూడా ఈ సారి అనేక చోట్ల పోటీ చేసే అవకాశముంది. అయితే సిపిఐ సిపిఎంల మధ్య ఏ మేరకు అవగాహన సాధ్యమనేది ఆచరణలో చూడాలి.
ఈ రాజకీయాలు వగైరా ఎలా వున్నా ఇప్పుడు జరిగే ఉప ఎన్నికలు మాత్రం ప్రధానంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ వైపే దృష్టి కేంద్రీకరింపచేస్తాయనేది సత్యం.

కనకనే రాబోయే రోజులలో రాష్ట్ర రాజకీయాలను చాలా నిశితంగా పరిశీలించాల్సిన అవసరమేర్పడుతున్నది.

3 comments:

 1. అభ్యర్ధన :

  నమస్తే!
  ' సేవ' సంస్థ ఆధ్వర్యంలో 'సకల' అంతర్జాల సకుటుంబం (వెబ్సైటు)ను ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. సాహిత్య రంగం, మహిళా రంగం, రాజకీయ రంగం, క్రీడా రంగం, ఆధ్యాత్మిక రంగం, సినిమారంగం, విద్య-ఉపాధి, ఆర్ధిక రంగం, కళారంగం, వైద్యం, హాస్యం, బాల్యం, వంటలు ఇత్యాది రంగాలకు సంబంధించి బ్లాగులు , వెబ్ పత్రికలు, వార్తాపత్రికలు ఉన్నాయా?..
  అయితే.. ఇంకేం ఆలస్యం.. మీ మీ బ్లాగులు, వెబ్ పత్రికలు, వార్తాపత్రికల పేర్లు, URL లు, నిర్వాహకుల పేర్లు, ఇ -మెయిల్ అడ్రెస్, ఫోన్ నెంబర్లతో వెంటనే... sevalive.com@gmail.com మెయిల్ చేయండి. ఇట్టే అంతర్జాల సకుటుంబం లో అనుబంధం (లింక్) చేస్తాం.
  మా ఈ ప్రయత్నానికి సహకరించాలని కోరుతున్నాం.

  వ్యాఖ్యానంలో మా అభ్యర్ధనను విన్నపిస్తున్నందులకు అన్యదా భావించ వద్దని కోరుకొంటూ.. మా విజ్ఞప్తిని పదిమందికి తెలిసేలా సహకరించమని అభ్యర్ధిస్తూ...

  సదా సేవలో,
  -కంచర్ల సుబ్బానాయుడు,
  సంపాదకులు, సేవ
  http://sevalive.com/

  ReplyDelete
 2. YSRCP గెలిస్తే తెలంగాణా వస్తుంది కాబట్టి కాంగ్రేస్సును గెలిపించాలని టీజీ వెంకటేష్ కోరడంపై మీ కామెంటు?

  ReplyDelete
 3. తెర గారి కామెడీ చదివి చాలా రోజులు అయ్యింది. స్వయంశాసన(self-determination)కీ, వేర్పాటువాదం(secessionism)కీ మధ్య తేడా తెలియని తెర గారు దీని గురించి కూడా ఏమి చెపుతారో చూడాలి.

  ReplyDelete