Pages

Sunday, April 22, 2012

ఉప ఎన్నికలు- ఉభయ కమ్యూనిస్టు పార్టీలు



రానున్న ఉప ఎన్నికలలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చెరొక మార్గం తీసుకున్నాయన్నది ఇప్పుడు మీడియాలో ఒక చర్చగా వుంది. చాలా కాలంగా జగన్‌,తెలంగాణా విభజన అంశాల చుట్టూనే పరిభ్రమించే మీడియా ఎప్పుడైనా కమ్యూనిస్టు పార్టీల గురించిన విషయానికి ప్రాధాన్యత నివ్వడం జరిగిందంటేనే అది ఎన్నికల పొత్తులకు, భిన్నాభిప్రాయాలకు సంబంధించిన సమస్యగా వుంటుంది. ఒకటే పార్టీలో వారు రెండు ప్రాంతాల్లో రెండు రకాలుగా మాట్లాడినా అత్యున్నత స్థాయిలో తగాదాలు పడినా సర్వ సాధారణ అంశంగా నివేదిస్తుంటారు.కాని ి వేర్వేరుగా వున్న రెండు కమ్యూనిస్టు పార్టీలు భిన్నమైన వైఖరి తీసుకుంటే మాత్రం వాటి సైద్దాంతిక నిబద్దతనే ప్రశ్నించే పరిస్తితి వస్తుంది. పరి పరి విధాల వ్యాఖ్యలు వస్తాయి. నిజానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు, సిపిఐ కార్యదర్శి నారాయణ తమ మధ్య అంగీకారం కుదరలేదని స్పష్టంగానే ప్రకటించారు. అయినా ఐక్య కార్యాచరణ ఆగదని కూడా గట్టిగా చెప్పారు. అయినా వ్యాఖ్యలు కొనసాగుతూనే వున్నాయి. కాగా నారాయణ సిపిఎం కు ఏదో రహస్య అజెండా వుందని ఆరోపించగా చంద్రబాబు నాయుడు మాత్రం
స్వంత బలం పెంచుకోవాలని కోరుకోవడం ప్రతిపార్టీకి సహజమని వ్యాఖ్యానించారు. వాటి రాజకీయ నేపథ్యం ఏమైనా నారాయణ వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా కనిపిస్తే చంద్రబాబు స్పందనలో వాస్తవికత గోచరిస్తుంది.

మారిన సిపిఐ వైఖరి
గతంలో తెలంగాణాలో జరిగిన ఉప ఎన్నికలలో వలెనే ఇప్పుడు పరకాలలో సిపిఐ తెలుగుదేశంను బలపర్చడం లేదు. అయితే గతంలో కోవూరులో సిపిఎంను బలపర్చిన ఆ పార్టీ ఇప్పుడు కోస్తా రాయలసీమ జిల్లాల ఉప ఎన్నికలలో తెలుగుదేశంను బలపర్చాలని నిర్ణయించుకుంది. అయిదు చోట్ల పోటీ చేస్తున్న సిపిఎంను బలపర్చకుండా ఆ స్థానాలలో తెలుగు దేశంను బలపరుస్తున్నది. ఈ విధమైన పరిస్థితి గత మూడు దశాబ్దాలలోనూ దాదాపు లేదు. 2009 ఎన్నికలతో సహా పలుసార్లు పొత్తులు సర్దుబాట్లు వున్నా సిపిఐ సిపిఎం పరస్పరం పోటీ పడిన ఉదాహరణలున్నాయి గాని తాము పోటీలో లేనప్పుడు కూడా అవతలి వారిని బలపర్చడం చాలా అరుదు. అందులోనూ రెండు ప్రాంతాలలో రెండు రకాల వైఖరి తీసుకోవడం కూడా జరిగి వుండదు. అదే ఈ సారి నూతనాంశం. ఈ విధమైన వైఖరి తమ రాజకీయ విధానానికి ప్రయోజనాలకు అనుగుణంగా వుంటుందని సిపిఐ భావించింది. సిపిఎం అలా అనుకోవడం లేదు వచ్చిన మేరకు ఓట్లు తెచ్చుకుని పోటీ ఇచ్చి ప్రత్యామ్నాయ రాజకీయ విధాóనాలు ప్రజల్లోకి తీసుకుపోవాలని నిర్ణయించుకుంది. తన స్వతంత్ర రాజకీయ విధాóనాన్ని సిపిఎం నిర్నయించుకుంటే అది తెలుగు దేశంతో తెగ తెంపులు అనో మరొకరి పట్ల అనుకూలత అనో కొన్ని రాజకీయ శక్తులు కొన్ని మీడియా కథనాలు చిత్రిస్తున్నాయి. ఇది సిపిఎం రాజకీయ పంథా పట్ల తాజాగా జరిగిన ఆ పార్టీ మహాసభల నిర్ణయాల పట్ల అవగాహన లోపించిన ఫలితమే.

పొత్తులపై సిపిఎం వైఖరి
రాజుగారి బిడ్డను ఎత్తుకున్నా తప్పే దించినా తప్పే అని కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకున్నా అది విపరీత వ్యాఖ్యానాలకు దారి తీస్తుంటుంది. వారు చెప్పే ప్రత్యామ్నాయ రాజకీయ వైఖరి పట్ల బడా పార్టీల ,వాటి అనుకూలుర వైముఖ్యమే ఇందుకు కారణం. మనం వుంటున్నది బూర్జువా వ్యవస్థ గనక ఇక్కడ ప్రధాన పార్టీలుగా చెప్పబడే పాలక వర్గ పార్టీలన్ని బూర్జువా పార్టీలే గనక అవి లేకుండానే రాజకీయాలు నడవవు.అయితే వాటితో కమ్యూనిస్టు పార్టీల సంబంధాలు ఎలా వుండాలి,ఎన్నికల సర్దుబాట్లు ఎలా వుండాలి అన్నది ప్రజల, ప్రజా ఉద్యమాల కోణం నుంచి నిర్నయం కావాలి. సిపిఎం దాదాపు గత యాభై ఏళ్లచరిత్రలోనూ అదే విధంగా వ్యవహరిస్తున్నది. సర్దుబాట్లను పదవులకు సోపానంగా భావించలేదు గనకనే ప్రభుత్వాలలో చేరలేదు, ప్రధాని పదవినీ తీసుకోలేదు. మన రాష్ట్రంలోనూ తెలుగు దేశంతో రాజకీయ ప్రాతిపదికన సర్దుబాట్లు చేసుకున్నా స్వతంత్ర వైఖరిని ఎన్నడూ విడనాడలేదు.అయితే సాధారణ రాజకీయ పరిభాషలో గాని మిత్రపక్షాలు అనే మాట సృష్టించి అదేదో శాశ్వతమైన వ్యవహారంగా చిత్రించడం తప్ప తెలుగు దేశం విధానాలలో తప్పులను ఎన్టీఆర్‌ హయాంలో గాని చంద్రబాబు నాయుడు పాలనలలో గాని ఉపేక్షించింది లేదు. కాకపోతే దీర్ఘకాలం సర్దుబాట్ల వల్ల కొన్ని దుష్ప్రభావాలు పడ్డాయని చాలా ఏళ్ల కిందటనే సిపిఎం గుర్తించింది.2002లో హైదరాబాదులో జరిగిన సిపిఎం మహాసభ బూర్జువా పార్టీలతో పొత్తుల ప్రభావాన్ని దీర్ఘకాల సమీక్ష చేసి ఒక పత్రం విడుదల చేసింది.(ఇప్పుడున్న చాలా పార్టీలు అప్పుడు లేవు) అయితే మళ్లీ ఆ బూర్జువా పార్టీల అవకాశ వాద పోకడల వల్లనే సర్దుబాట్లు మద్దతులు తప్పని సరయ్యే వాతావరణం ఏర్పడింది.1998లో తెలుగు దేశం నాయకుడు బిజెపిని బలపర్చడం వల్ల మొదటి సారిగా కాంగ్రెస్‌తో కలసిన యుపిఎను బలపర్చాల్సిన అగత్యం ఏర్పడింది. యుపిఎ అమెరికాకు లొంగిపోయి అణు వొప్పందం కుదుర్చుకోవడం వల్ల విడగొట్టుకోవడమూ జరిగింది. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఆ విధంగానే 2004లో ఒకే ఒక్కసారి దేశంలోనే మొదటి సారి కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు జరిగింది. అప్పుడు కూడా అవినీతిని ముందుగా ఎత్తి చూపింది సిపిఎం కార్యదర్శి రాఘవులే. అయితే మూడేళ్లలోపునే భూ పోరాటం, ముదిగొండ కాల్పులు వంటి పరిణామాలు జరిగాయి.
ప్రస్తుత పరిస్తితి
2009 ఎన్నికలలో తెరపైకి వచ్చిన ప్రజారాజ్యంతో సర్దుబాట్ల సూచనలు వచ్చినా జాతీయ రాజకీయాల నేపథ్యంలో ఇక్కడ మహాకూటమి ఏర్పడింది. (మహాకూటమి అన్న పేరు కూడా కృత్రిమంగా తెచ్చిందే) అయితే కూటమి భాగస్వాముల వైఖరి కారణంగా సిపిఎం పలు చోట్ల పొందాల్సిన ఓట్లు పొందక ఒకే ఒక్క సీటుకు పరిమితం కావలసి వచ్చింది. తర్వాత వైఎస్‌ మరణం, తెలంగాణా ఉద్యమం, రాజకీయ అనిశ్చితి వగైరా పరిణామాలన్ని సంభవించాయి. ఏతా వాతా రాష్ట్ర రాజకీయాలంటే కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, తెలుగు దేశం, టిఆర్‌ఎస్‌లు మాత్రమే అనే వాతావరణం సృష్టించబడుతున్నది. నిజానికి కాంగ్రెస్‌ తెలుగు దేశం రెండు పార్టీల చుట్టూనే రాష్ట్ర రాజకీయాలు పరిభ్రమించే పరిస్థితి అవాంఛనీయమని సిపిఎం భావన.ఆ రీత్యా గత సారి ప్రజారాజ్యంతో అవగాహనకు వచ్చి వుంటే బావుండేదన్న భావన కూడా ఖమ్మం మహాసభ వ్యక్తం చేసింది.అయితే ఇప్పుడు ప్రజారాజ్యం ప్రజా రాజ్యం కూడా కాంగ్రెస్‌లో కలసి పోయింది గనక అది కేవలం గతం గురించిన నిర్ధారణ మాత్రమే. ఆర్థిక విధానాల విషయంలో ఎలాటి తేడా లేని ఈ బూర్జువా పార్టీలతో పొత్తులకే ప్రాధాన్యత వుండే ఇప్పటి విధానం మారాలని, ఉద్యమాలు ప్రత్యామ్నాయ విధానాల ప్రాతిపదికన స్వంత బలం పెంచుకోవాలని సిపిఎం జాతీయ రాష్ట్ర మహాసభలు నిర్ణయించాయి.ఈ క్రమంలో వామపక్ష ఐక్యతకు విశేషించి కమ్యూనిస్టుల ఐక్యతకు ప్రథమ ప్రాధాన్యతనివ్వాలని భావించాయి. సిపిఐ మహాసభలు, సిపిఎం మహాసభలకు హాజరైన వారి నాయకులు కూడా ఇంచుమించు అలాటి భావాలే వెలిబుచ్చారు.అందువల్లనే కాబోలు గత సారి ఉప ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం నాయకులు వచ్చి మద్దతు అడిగినప్పుడు సిపిఐ ఆ కోర్కెను మన్నించలేదు. కాని ఈ దఫా ి తెలుగుదేశంకు మద్దతు నివ్వడమే మంచిదని నిర్ణయించుకున్నది. అంతేగాక సిపిఎం వైఖరికి ఉద్దేశాలు కూడా ఆపాదిస్తూ నారాయణ వ్యాఖ్యలు చేశారు.
తాజా ఉప ఎన్నికలు: పార్టీలు
సిపిఎం అఖిలభారత మహాసభ తీర్మానం అవసరాన్ని బట్టి బూర్జువా పార్టీలతో ఎన్నికల సర్దుబాట్లు చేసుకోవడం, లేదా కలసి పనిచేయడం జరిగినా అది ఆ సందర్భానికి సమస్యకు పరిమితం కావాలని స్పష్టంగా పేర్కొంది. అలాటివి ఉద్యమ పురోగమనానికి దోహదపడేవిగా వుండాలి. ఇప్పుడున్న స్తితిలో తెలుగుదేశంతో సర్దుబాట్లు లేదా మద్దతు అలా దోహడపడతాయని సిపిఎం భావించడం లేదు. ప్రాంతీయ సమస్యపై సంధిగ్ధతతో సహా తెలుగు దేశం పార్టీ కూడా విశ్వసనీయతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మాట నిజం. జగన్‌ పార్టీ బలపడుతుందనుకున్న దశలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కొనసాగనివ్వడానికి కూడా తెలుగుదేశం అనుమతించింది గనకే అవిశ్వాస తీర్మానం తీసుకురాలేదు. తర్వాతి దశలో తెచ్చినా పరిస్థితి మారింది. ఆ సందర్బంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి సభ్యత్వం కోల్పోయిన వారి స్తానాలకే ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవి రెఫరెండం కాదని కాంగ్రెస్‌ తెలుగుదేశం నాయకులు ముందే ప్రకటించారు. తమ దృష్టి మొత్తం 2014 ఎన్నికలపై వుంటుందని కూడా అంటున్నారు. అందువల్లనే ఈ ఉప ఎన్నికలనూ మొత్తం రాజకీయ భవిష్యత్తును నిర్నయించే సాధారణ ఎన్నికలుగా చూడనవసరం లేదు. ఇలాటి సందర్భంలోనైనా వామపక్షాలు విడిగా నిలబడి తమ ఓటింగును పెంచుకోవడం, శ్రేణులను సమాయత్తం చేసుకోవడం జరక్కపోతే ఎప్పుడూ ఆ పార్టీల చుట్టూనే రాజకీయాలు పరిభ్రమిస్తుంటాయి.

వామపక్ష ఐక్యతకే ప్రాధాన్యత
వామపక్ష ఐక్యతకు ప్రథమ ప్రాధాన్యత నిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆచరణాత్మక అన్వయంగా11 వామపక్ష పార్టీలు విద్యుచ్చక్తి ఛార్జీలు ఇతర ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటానికి సమైక్యమయ్యాయి. ఈ ఉప ఎన్నికలలో సిపిఎం వైఖరి దానికి కొనసాగింపువంటిదే. అలా గాక దీన్ని జగన్‌ పార్టీ కోణం నుంచి చిత్రించే ప్రయత్నం కొంత జరుగుతున్నది. ఆ పార్టీతో పొత్తుకు అవకాశం కోసమే ఇలా చేస్తున్నట్టు కొందరు చెబుతుంటే వారిలోనూ కొందరు అలానే మాట్లాడుతున్నారు.ఇవన్నీ వూహాగానాలు మాత్రమే. కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, తెలుగు దేశం ఇవన్నీ మౌలికంగా బూర్జువాపార్టీలే. టిఆర్‌ఎస్‌ బిజెపి వంటివి కూడా ఇందుకు మినహాయింపు కాదు. అవినీతిని ఆర్థిక భారాలను పెంచుతున్న విధానాల విషయంలో వీటన్నిటి మౌలిక అవగాహనలో తేడాలేమీ వుండవు. వీరంతా పరస్పరం ఎంతగా తిట్టిపోసుకున్నా ఏదో ఒక పక్షం కొమ్ము కాయవలసిన అవసరం కమ్యూనిస్టులకు లేదు. ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే మీమాంస కూడా అవసరం లేనిదే. అవసరార్థం వీరంతా ఒకరికొకరు సహకరించుకోవడమూ కద్దు. చంద్రబాబు పేరెత్తితే తట్టుకోలేని వారు కొందరైతే జగన్‌ ఒక్కడే పాపాల భైరవుడని భావించే వారు మరికొందరు. ఇలా వ్యక్తులను బట్టి వ్యవహరించాల్సిన అవసరం కమ్యూనిస్టులకుండదు.దీన్నే కొంతమంది విపరీతంగా వ్యాఖ్యానిస్తుంటారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్ని బూర్జువా పార్టీలూ అవినీతి మయమేనని సిపిఎం అనడంలో రహస్య అజెండా వుందని ఆరోపించారు. ఇది పరోక్షంగా జగన్‌ అనుకూలత అంటకట్టడానికే అనుకోవచ్చు. అయితే ఉప ఎన్నికలలో అందరితోనూ సిపిఎం పోటీ చేస్తున్నదని గుర్తుంచుకోవాలి. అందుకే అవకాశమున్నప్పుడల్లా వీటి విధానాలను వ్యతిరేకంగా నిలబడటం, నిరంతరం వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యత పెంపొందించడం అవసరమని సిపిఎం భావిస్తోంది. అంతేగాని ఈ నిర్నయాన్ని తెలుగు దేశం లేదా వైఎస్‌ఆర్‌ పార్టీ కోణం నుంచి చిత్రించడం సరైంది కాదు. అలాగే సిపిఐ ఉప ఎన్నికలలో సిపిఎంను గాక తెలుగుదేశంను బలపర్చాలని నిర్ణయించుకుంటే అది వారి అవగాహన కనకనే ఏకీభావం కుదరలేదు.ఇలాటి సమస్యలున్నా పైన చెప్పుకున్న ఐక్య ఉద్యమాలను ముందుకు తీసుకుపోవడంలో ఎలాటి మినహాయింపులుండకూడదు.ఏ విధానం ఏ మేరకు సరైందన్నది ఎన్నికల తీర్పు, భవిష్యత్‌ పరిణామాలు చెబుతాయి. గతంలోనూ భిన్నమైన వైఖరులు వున్నప్పుడు కూడా ఈ రెండు పార్టీలు కలసి పని చేసిన ఉదాహరణలున్నాయి.ఇప్పుడు తెలంగాణా సమస్యపై రెండింటి వైఖరి పూర్తి భిన్నంగా వున్నా ఐక్య కార్యాచరణకు అడ్డంకి కావడం లేదు. కనక ఉప ఎన్నికలలో తీసుకునే రాజకీయ వైఖరులు కూడా ఉద్యమాలలో కలసి పనిచేయడానికి అవరోధం కానక్కరలేదు.
(ప్రజాశక్తి, ఏప్రిల్‌22,2012)

1 comment:

  1. నారాయణ గారు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలీదు!

    ReplyDelete