గత నెల రోజులలోనూ రాష్ట్ర రాజకీయాలలో కొన్ని ఆధార రహితమైన కథనాలను కావాలనే రాజకీయ శక్తులు ప్రచారంలో పెడుతున్నాయి.కీలకమైన నాయకులతో నేరుగా మాట్లాడినప్పుడు కాదని ఖండించే కొన్ని అంశాలపైనే తాడూ బొంగరం లేని ్ట ప్రచారాలు జరుగుతుండటం ఎంతైనా బాధ్యతా రహితం.
వాయిలార్ రవి ఎందుకు వచ్చాడంటే ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి, ఉప ఎన్నికల పోరాటంలో కొంతైనా వూపు నిలబెట్టడానికి అని అందరికీ తెలుసు.ఈ సందర్భంగా ఆయన పర్యటన వల్ల తెలంగాణా సమస్యకు సంబంధించి ఏదో నిర్ణయం జరుగుతుందని కాంగ్రెస్ ఎంపిలు అదే పనిగా చెబుతూ వచ్చారు. ఉప ఎన్నికల నేపథ్యంలో మరో ఆరు నెలల వరకూ ఇంకా చెప్పాలంటే ఈ ఏడాదిలో ఎలాటి ప్రకటన వుండబోదని విడిగా మాట్లాడినప్పుడు కొందరు ఎంపిలే చెబుతుంటే మరో వైపు వారి మిత్రులు ఇలా మాట్లాడుతుంటారు. ఇక మంత్రి టిజి వెంకటేశ్ వంటి వారైతే ఉప ఎన్నికలలో జగన్ గెలిస్తే రాష్ట్రం విభజన అయిపోతుందని వూదరగొడుతున్నారు. ఇది కూడా ఆధారం లేని కథనమే. ఈ ఫలితం జగన్ వర్గానికి అనుకూలంగా వుంటుందనే భావన బలంగా వుంది. కాంగ్రెస్‌కు అది ఆందోళన కలిగిస్తున్నది కూడా. అటువంటప్పుడు దాని వల్ల ఏదో నిర్ణయం జరిగిపోతుందని ప్రాంతాల వారిగా భావాలు రెచ్చగొట్టడం తగని పని.
ఈ వూహాగానాల్లో కెల్లా విడ్డూరమైనది కె.చంద్రశేఖర రావు ఉప రాష్ట్రపతి అవుతారనేది. దీన్ని ఎవరు సృష్టించారో తెలియదు గాని బాగానే చలామణిలో
వుంది. గత అరవై అయిదేళ్లలోనూ రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి ఎన్నిక తీరును గమనిస్తున్న వారెవరైనా ఇలాటి కథనాలు విశ్వసిస్తారా?దీనికి కొనసాగింపుగానే మరో పదవికి సంబంధించిన వూహాగానం కూడా వుంది దాన్ని ప్రస్తావించి విలువ కల్పించాలనుకోవాలనుకోవడం లేదు.
నిజానికి జగన్ పార్టీ, టిఆర్‌ఎస్ రెండు విషయాలలోనూ కాంగ్రెస్ వైఖరి దాదాపు ఒకటిగానే వుంది. వాటిపై విమర్శలు చేస్తూనే విలీనానికి లేదా అవగాహనకు ప్రచ్చన్న ప్రయత్నం సాగుతున్నది. జగన్ కేసు దర్యాప్తు వేగం తగ్గిందనేది కాదనలేని విషయం. ఈ కేసులో పెట్టుబడి పెట్టిన వారిని అరెస్టు చేసే ఉద్దేశం లేదని సిబిఐ హైకోర్టుకు చెప్పేసింది కూడా.పెట్టుబడులు స్వీకరించిన జగన్‌ను కూడా అరెస్టు చేసే ఉద్దేశం లేదని గతంలోనే చెప్పుకున్నాము. వైఎస్ రాజశేఖర రెడ్డిని విమర్శించరాదని వాయిలార్ రవి గట్టిగానే చెప్పడం అధిష్టానం ఆలోచనా ధోరణని వెల్లడిస్తున్నది. సాక్షి కథనాలను వైఎస్‌ఆర్ పార్టీ ప్రతినిధుల వాదనలను వింటుంటే కూడా అధిష్టానం ఇప్పుడిప్పుడే కళ్లు తెరిచిందన్న ధ్వని వినిపిస్తున్నది. అంటే వున్న నాయకత్వాన్ని మార్చి తమ విలువ గుర్తిస్తుందనే భావం వాటిలో వుంది.
కనక రాబోయే రోజులలో అనేక ఆసక్తికరమైన మలుపులు చూడొచ్చు.
No comments:
Post a Comment