Pages

Monday, May 21, 2012

మళ్లీ పాత బాణీలో కెసిఆర్‌ మాటలు!


పరకాల ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్‌ గెలిస్తే వంద రోజుల్లో సోనియా గాంధీ తెలంగాణా ప్రకటిస్తారని ఆ పార్టీ అద్యక్షుడు కె.చంద్రశేఖరరావు చేసిన ప్రకటనను కాంగ్రెస్‌ ఎంపి పొన్నం ప్రభాకర్‌ స్వాగతించారు. గతంలో కెసిఆర్‌ ఇదే రీతిలో రాష్ట్ర విభజనకు గడువులు ప్రకటించడం తర్వాత అవి జరక్కపోవడం పలుసార్లు జరిగింది.ఇటీవలనే ఆయన కాంగ్రెస్‌ మోసం చేసిందని ఇక ఉద్యమం తీవ్రం చేయాల్సిందేనని కూడా ప్రకటించారు. అలాటిది హఠాత్తుగా ఎందుకని సోనియాపై విశ్వాస ప్రకటన చేస్తున్నారనేది ఆసక్తి కరమైన ప్రశ్న. తక్షణ కారణం ఉప ఎన్నికలే.కాగా కాంగ్రెస్‌ తెలంగాణా విషయం పునరాలోచిస్తోందని, ఉప ఎన్నికల పోలింగ్‌ ముగిసిన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తుందని ఒక ప్రచారం రాజకీయ వర్గాలలో నడుస్తున్నది.దీన్ని ప్రముఖులే ప్రచారంలో పెట్టడమే కాక అనేక రకాల తర్కాలు కూడా జతచేస్తున్నారు. బహుశా ఇలాటి వ్యాఖ్యలలో కూడా ఆ ప్రభావం వుండొచ్చు. అయితే కాంగ్రెస్‌ రాజకీయ విన్యాసాలు తెలిసిన వారు చూస్తున్న ప్రజలు మాత్రం ఇలాటి ప్రచారాలను ఒక పట్టాన నమ్మడం కష్టమే. పైగా కాంగ్రెస్‌ నాయకత్వం ఇస్తున్న బహిరంగ సంకేతాలకు ఈ అంచనాలు భిన్నంగా వుండటం కూడా కనిపిస్తుంది. ఆ సంకేతాలన్ని ఉప ఎన్నికల కోసమేనన్నది విభజన కోరే వారి వాదన. జగన్‌ వ్యవహారం ఏదో విధంగా ఒక కొలిక్క వస్తున్నట్టుంది కాబట్టి మళ్లీ తెలంగాణా పాచిక తీస్తున్నారా అన్నది కూడా సందేహించాల్సిన విషయం. 

3 comments:

  1. గడువు అనడం సమంజసమేనా?
    కావాలని ఆ పదాన్ని వాడుతున్నారు తప్ప
    నిజానికి కే సి ఆర్ అన్న మాటలు ఒక అంచనా... ఒక ఆశాభావం ... అంతే.
    గోల్కొండ కిల్లా కింద నీ గోరి కడ్తం కొడుకో ... వంటి ఒక ఆకాంక్ష.
    ఉద్యమాల్లో ఇలాంటి మాటలు సహజమే.
    కోడిగుడ్డుకు ఈకలు పీకినట్టు కే సి ఆర్ నోటి నుంచి నాలుగు నెలలకో ఆరు నెలలకో రాలే నాలుగు మాటలను
    పట్టుకుని ఇట్లా గింజుకుంటూ, వక్రీకరిస్తూ ... ఎందుకు మీకీ వృధా ప్రయాస,

    ReplyDelete
  2. "నిజమే .
    కే సి ఆర్ లో కించిత్తు మార్పు వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు.
    కే సి ఆర్ తెలంగాణా ఉద్యమాన్ని తన ఎత్తుగడలతో,
    అద్భుతమైన ఉపన్యాసాలతో ఎంత ఉన్నత శిఖరాలకు తీసుకేళ్ళారో
    ... తన ఒంటెత్తు పోకడలతో, అహం తో, నిర్లక్ష్యం తో
    ఉద్యమానికి అంతే అన్యాయం కూడా చేసారు... చేస్తున్నారు.
    మామూలు పార్టీల నేతలు (రెండుకాళ్ల బాబు, మేకవన్నె పులి జగన్ ) తమ ఏసీ భవంతులను వదిలి
    ఎండనక వాననక ప్రతి రోజూ ప్రజల్లో తిరుగుతూ
    హోరెత్తిస్తుంటే కే సి ఆర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూచోడం దుర్మార్గం.
    కనీసం ఎన్నికల సమయమో కూడా నాలుగు ఊళ్ళల్లో పాదయాత్ర చేసే ఓపికలేదు.
    మోత్కుపల్లి నర్సింలు తిట్టే తిట్లు నిజం చేసుకునేలా ప్రవిఅర్తించడం చాలా బాధాకరం.
    ఎవరు చెప్పాలి ఈ నరమానవుడికి"

    :) గౌతమ్ గారూ ఈ కామెంట్ ఎవరిదో ఏమన్నా గుర్తొచ్చిందా?

    ReplyDelete
  3. SHANKAR.S గారూ !

    :)

    ఇది మంట
    అది తంట!

    ReplyDelete