Pages

Wednesday, October 17, 2012

ప్రధాని సందర్శన- పోలీసు పద ఘట్టనప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాక సందర్భంగా హైదరాబాదులో జరిగిన ఘటనలు ప్రజాస్వామ్యాన్ని పరిహసించేవిగా వున్నాయి.నిజానికి ఆయన హైదరాబాదుకు రాలేదు, సీవోపీ కి మాత్రమే వచ్చారు. తన ప్రభుత్వ ఏర్పాటుకు ప్రధాన బలం సమకూర్చిన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం పట్ల తనకు ఎలాటి బాధ్యత వుందని ఆయన భావించలేదు. అస్తవ్యస్త నిర్ణయాలతో అరకొర ప్రకటనలతో రాష్ట్రాన్ని రాజకీయ అనిశ్చితిలో ముంచిన ప్రభుత్వాధినేత ఆ ప్రభావానికి భయపడి నేలమీద కాలు మోపకుండా గాలిలోనే ఎగిరిపోవడం నిజంగా సిగ్గుచేటే. సమయం చాలదనే సాకు ఎంతమాత్రం నిలిచేది కాదు. ఈ దేశానికే అత్యున్నత కార్యనిర్వహణాధినేత తల్చుకుంటే సమయం కుదుర్చుకోవడం సమస్య కానేకాదు. అనిశ్చితికి స్వస్తి చెప్పే ప్రకటన విధాన నిర్ణయం వెలువడాల్సింది ఆయన నుంచే.( రాజ్యాంగ పరంగా) అది గాకపోయినా కనీసం గాయాలు మాన్చి సాంత్వన చర్యలు తీసుకోవలసింది కూడా ఆయనే. సోనియా గాంధీ సరే రెండేళ్ళుగా రాష్ట్రంవైపు చూడనే లేదు.ఈయన రాక సందర్భంలో ప్రజలెవ్వరినీ చూడకుండా
చూడనివ్వకుండా వాయు వేగ మనోవేగాలతో తరలిపోవడం ప్రజాస్వామ్యమవుతుందా? జీవ వైవిధ్య సదస్సు ఒక వాణిజ్య ప్రహసనమైతే జీవుల పట్ల ఆయనకు ఎంత మాత్రం బాధ్యత లేదన్న మాట
జర్నలిస్టులపై వివక్ష, దౌర్జన్యం
ఈ వికృతం చాలదన్నట్టు తెలంగాణా వాదులనే పేరుతో కొన్ని ఛానళ్ల జర్నలిస్టులను అనుమతించకపోవడం అగ్నికి ఆజ్యం పోసిన అప్రజాస్వామిక చర్య. ఆ పైన అరెస్టులు, మరుసటి రోజు పోలీసు బల ప్రయోగం చూస్తే ప్రభుత్వం ఒక వ్యూహం ప్రకారమే ఇలా చేస్తున్నట్టనిపిస్తుంది. ఒక వేళ జర్నలిస్టులలో ఎవరైనా జై తెలంగాణా అని అన్నంత మాత్రాన కొంపలంటుకు పోవు గాని వారిని అరెస్టు చేయడం వల్ల మాత్రం ప్రజాస్వామ్య విలువలు ప్రశ్నార్థకమైనాయి. తెలంగాణా మార్చ్‌ నుంచి తాజా ఘటనల వరకూ పోలీసులను ప్రయోగిస్తున్న తీరు సమస్యను జటిలం చేసేదిగా తప్ప పరిష్కరించేదిగా లేదు.
ముఖ్యమంత్రికీ తప్పలేదు!
ఇక ఇది చాలదన్నట్టు సాక్షాత్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని కూడా భద్రతా కారణాల రీత్యా ప్రధాని వాహనంలో ఎక్కించుకోకుండా నడిపించడం రాజ్యాంగ సూత్రాలను రాష్ట్రాల హక్కులను హాస్యాస్పదం చేసే హానికర వైఖరి. దీనిపై ముఖ్యమంత్రి మౌనం దాల్చవచ్చునేమో గాని ఆయన ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాన్ని తక్కువ చేసిన తప్పిదం మాసిపోదు. ఒకప్పుడు రాజీవ్‌గాంధీ అంజయ్యను అవమానిస్తే శాసనసభలో సుందరయ్య,గౌతు లచ్చన్న తదితర ప్రతిపక్ష నేతలంతా నిలబడి నిరసన తెలిపారు. తర్వాత ఎన్టీఆర్‌ ఆ ఘటన నుంచే ఆత్మగౌరవ నినాదం తీసుకున్నారు. ఇలాటి ఘటనలు ఎన్ని జరిగిన ఢిల్లీ పెద్దలు పాఠాలు నేర్చుకోరు. వారి చుట్టూ తిరిగే రాష్ట్ర నేతలు అగౌరవమనుకోరు.

No comments:

Post a Comment