Pages

Sunday, November 25, 2012

మన సినిమాల్లో కులమతాలు






దేనికైనా రెడీ చిత్రానికి సంబంధించి ఇటీవల తీవ్రమైన వివాదమే నడిచింది. మానవ హక్కుల సంఘం ఆదేశాల మేరకు చిత్రాన్ని పరిశీలించిన ఉన్నత స్థాయి కమిటీ అందులో ఒక కులాన్ని కించపర్చే దృశ్యాలు ఇప్పుడు లేవని గౌరవించే అంశాలూ వున్నాయని పేర్కొంది. అయినా ఆ చిత్ర నిర్మాత మోహన్‌బాబుపై మరో కేసుకోసం ప్రయత్నం సాగుతున్నట్టు వార్తలు చెబుతున్నాయి. ఈ సందర్భంలో ఇంటిముందు ధర్నా చేసేందుకు వచ్చిన వారిపై దాడి జరగడం కూడా విమర్శలకు గురైంది. ఈ ఉదంతం తర్వాత చిత్రాలలో పాత్రల పరిధి, కళా స్వేచ్చ సామాజిక సమతుల్యత వంటి విషయాలు మరోసారి చర్చనీయమైనాయి. కుల మతాలు అధికంగా వుండటమే గాక వాటి చుట్టూ రకరకాల రాజకీయాలు అవాంఛనీయ భావాలు కూడా అధికంగా వుండే ఈ దేశంలో ఇలా జరగగడం అర్థం చేసుకోదగిందే.
ప్రస్తుత వివాదాన్ని పక్కనపెట్టి అసలు సినిమాల్లో కుల మతాల చిత్రణ విషయానికి వస్తే అనేక ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి.
సినిమా రంగంలో కుల తత్వం అధికమనీ ఒక కులం వారికే అవకాశాలు ఎక్కువనీ ప్రచారం ఎప్పుడూ సాగుతుంటుంది. సమాజంలో వున్న పరిస్థితులు ప్రాబల్యాలే సినిమా రంగంలోనూ గోచరిస్తాయి తప్ప ప్రత్యేకంగా ఏవో సూత్రాలు వుంటాయనుకోవడం అవాస్తవికం. కళాత్మక విలువల కోణంలో చూడాల్సిన విషయాలను కులాత్మకంగా చూడటమే ఒక దౌర్చల్యం. తెలుగు సినిమాలనే తీసుకుంటే మొదటి గొప్ప దర్శకుడు హెచ్‌ఎంరెడ్డి. మొదటి పెద్ద హీరో చిత్తూరు నాగయ్య! తర్వాత కాలంలోనూ ఈ సామాజిక పొందికలు కొనసాగాయి. వివిధ సామాజిక పరిణామాలు సంస్కరణోద్యమాల తర్వాత ఇతర తరగతులు కూడా అభివృద్ధి చెందిన కొద్ది సినిమా రంగంలో స్థానం సంపాదించగలిగాయి. అంతే తప్ప సినిమా రంగంలో కేవలం కులం బట్టి ఆదరించడం నిరాదరించడం అరుదు.ఎవరి ప్రతిభనైనా ఉపయోగించుకుని సొమ్ము చేసుకోవడమే అక్కడ ప్రధాన నీతి! రంగాల వారీగా నటన, రచన, సంగీతం వంటి వాటిని తీసుకుంటే కూడా ఈ సామాజిక విభజన కనిపిస్తుంది.
తెర వెనక విషయాలు ఏమైనా తెలుగు తెరపై కుల ప్రస్తావనలు చాలా తక్కువగానే వుంటాయి. సనాతనులు, దళితులు, వృత్తి చేసుకునే వారు, పెత్తందార్లు ఇలాటి సందర్భాల్లోనే చెప్పనవసరం లేకుండా వాతావరణాన్ని పేర్లను బట్టి కులాలు తెలిసిపోతుంటాయి. సూటిగా చెప్పాలంటే నిచ్చెన మెట్ల వ్యవస్థలోని అత్యగ్ర, అతి దిగువ
కులాలు సూచించబడతాయి. మిగిలిన సందర్భాల్లో ప్రేమ కథల వంటివాటిలో ఆర్థిక అంతరాల ప్రస్తావనలే ప్రధానంగా వుంటాయి.కులాల గొడవే లేకుండా చాలా చిత్రాల్లో హీరో అనాధ అంటుంటారు.
అయితే అసలు కులాల ప్రస్తావన వుండదని కాదు. తొలి సంచలన చిత్రం మాలపిల్లలోనే తిరుగుబాటు ధోరణులు కనిపించాయి. అవన్నీ సంఘ సంస్కరణ ప్రధానమైనవి. దేవదాసులో హీరో పార్వతిని చేసుకోకపోవడానికి కారణం వారు పిల్లలను అమ్ముకునే కులానికి చెందిన వారు కావడమేనని చెబుతారు.
బాగా విజయవంతమైన చిత్రం గుండమ్మ కథలో చాలా అసాధారణంగా కులాల ప్రస్తావన వుంటుంది. హీరో అంజి(ఎన్టీఆర్‌) ను సూర్యకాంతం(గుండమ్మ) మీది ఏ కులం అంటే మీది ఏ కులం అని ఎదురు అడుగుతాడు. మేము పెద కాపులం అంటే మేమూ పెదకాపులమేలే అంటూ తిష్ట వేస్తాడు. ఇలాటి ఉదాహరణలు చాలా తక్కువ.
ప్రజా కళల ప్రచారం ప్రధానంగా తీసిన జయభేరిలో హీరో కాశీనాథశాస్త్రి (అక్కినేని) బచ్చన భాగవతుల అమ్మాయి(అంజలి)ని ప్రేమించడంపై అగ్రహారం ఆగ్రహౌదగ్రమవుతుంది. ఆ చిత్రంలోనే చివరకు దళితులను ఆలయంలోకి రాకుండా అడ్డుకుంటే మద్యపానం నుంచి బయిటపడిన కథానాయకుడు నందుని చరితను వినుమా అనే పాట ఆవేశంగా పాడి తిరగబడతాడు.ఇలాటి చిత్రమే ఆ తర్వాత చాలా ఏళ్లకు వి.మధుసూదనరావు తీసిన రీమేక్‌ 'కళ్యాణ మంటపం' వేశ్యా కులంలో పుట్టిన నాయిక ప్రేమించినా పెళ్లి చేసుకోలేకపోవడం ఈ చిత్రకథ.దాసరి అక్కినేనితో తీసిన ప్రేమ మందిరంలోనూ అదే కథ కాని ముగింపు భిన్నంగా వుంటుంది. కొద్ది కాలం కిందట వచ్చిన పౌర్ణమి కూడా దేవదాసి వ్యవస్థకు సంబంధించిందే. ఇవో రకం సంస్కరణ కథలు.
దళితుల పట్ల సానుభూతి సామాజిక న్యాయం వంటి అంశాలను సృశించిన కథలు కూడా తెలుగులో వచ్చాయి. తెలుగు నాడును ఉర్రూతలూపిన రోజులు మారాయిలో హీరో అక్కినేని కులాంతర వివాహమే చేసుకుంటాడు.సంఘంలో హీరో ఎన్టీఆర్‌ అంజలిని ప్రేమించినా కులసమస్య కారణంగా పెళ్లి చేసుకోవడానికి వెనకాడతాడు. ఈ కథలు మరో కోవకు చెందినవి.
కులాలను చెప్పకపోయినా ఇంటిపేర్ల ద్వారా సూచించాలన్న ఆరాటం కొన్ని చిత్రాల్లో కనిపిస్తుంది. వీరమాచనేని, ఘట్టమనేని,సూర్యదేవర మాగంటి వంటి ఇంటిపేర్లు(నిర్మాతలు లేదా హీరోలు) ఒకటికి రెండు సార్లు అనిపిస్తుంటారు. సంబంధితులకు తప్పక అర్థమై పోతాయి.
పదేళ్ల కిందట వచ్చిన జయం మనదేరా చిత్రం లో శంకర్‌ నేరుగా సామాజిక న్యాయం కోసం పోరాటాన్ని చూపించడం ఒక కొత్త ప్రయోగం. అలాగే పరిటాల రవి హత్యపై రామ్‌గోపాల్‌ వర్మ తీసిన రక్త చరిత్రలోనూ రెండు కులాల మధ్య పోరాటం జరుగుతున్నట్టు స్పష్టంగానే చిత్రించారు.
సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, ఇంద్ర(సేనారెడ్డి), వంటి చిత్రాలు మరో కోవకు చెందినవి.ఇందులో నాయకులు ప్రతినాయకులు కూడా అదే కులనామంతో వుండి బీభత్సంగా చంపుకోవడంతో కలకలం రేగింది. దానికి విరుగుడుగా రాయలసీమ రామన్న చౌదరి, నరసింహనాయుడు వంటి పేర్లు పెట్టారు.చిత్రాల్లో నాయుడు చౌదరి, రెడ్డి, రాజు వంటి కుల నామాలు ఉపయోగించడం సర్వసాధారణం.
బహుశా ఆహార్యం కారణంగానూ ఆచారాల ప్రదర్శన కారణంగానూ బ్రాహ్మణ పాత్రలు ప్రత్యేకంగా చిత్రించబడుతుంటాయి. హాస్యానికి బ్రహ్మానందం వంటి వారు వాటినే ఉపయోగిస్తుంటారు. అయితే పాత కాలంలోనూ రేలంగి,రమణారెడ్డి,పద్మనాభం,వంగర వంటి వారు ఇలాటి పాత్రలలో హాస్యం పండించిన ఉదాహరణలున్నాయి. అయితే కె.విశ్వనాథ్‌ రంగ ప్రవేశం తర్వాత ఈ పాత్రల ప్రాధాన్యత పెరిగింది. సంఘ సంస్కరణకోసం అంతకు ముందు చాందసంపై దాడి జరిగితే విశ్వనాథ్‌ చిత్రాల్లో ఆ సనాతన పాత్రలనే గొప్పగా చిత్రించే ప్రయత్నం జరిగింది.శంకరాభరణంతో మొదలై సప్తపదితో వరకూ ఇదే జరిగింది. ఆయన ప్రధాన పాత్రల వేషభాషల్లో అనివార్యంగా సనాతనత్వం తాండవించడమే గాక అది సంస్కార పూరితమైందన్న సందేశం జొప్పించబడింది. జయభేరిలో కాశీనాథశాస్త్రి అగ్రహారంపై తిరగబడితే విశ్వనాథ్‌ సృషించే శంకరశాస్త్రులు(సోమయాజులు) తామే సూక్తులు చెప్పి సనాతనత్వాన్నీ కాపాడుకుంటారు. సప్తపదిలోనైతే అల్లు రామలింగయ్యతో రాజు పాత్ర వేయించి మీరు యాజలు మేము రాజులం అంటూ అనేక ఘట్టాలు సృష్టించారు. రాజులు చెప్పిన సంస్కారాన్ని యాజులు అమలు చేసినట్టు కూడా చూపించారు. శుభ సంకల్పంలో రాయుడు గారు జాలర్లను ఆదరించినట్టు చూపిస్తే స్వయం కృషిలో చర్మకారుడి పాత్రను గొప్పగా చేశారు. చాలా కాలం తర్వాత తనే ప్రధాన పాత్ర వేసిన లోనూ ఈ ధోరణి కనిపిస్తుంది.అంటే కింది వారు సహాయం చేయడం, పై వారు ఔదార్యం ప్రదర్శించడం వంటి సన్నివేశాలుంటాయి.కుల పరమైన అంతరాలను చూపిస్తూనే వాటిని సనాతనత్వ పరిధిలో పరిష్కరించుకోవచ్చన్న తపన విశ్వనాథ్‌ది. బాపు తీసిన బుద్దిమంతుడు లో పూజారి మాధవయ్యకు తరచూ కనిపించే కృష్ణుడు తాను యాదవుడినైనప్పటికీ ఎలా వంటింట్లోకి రానిస్తున్నావని ప్రశ్నిస్తాడు.
మోహన్‌బాబు గతంలో తీసిన చిత్రాల్లోనూ ఇటీవలి చిత్రంలోనూ కూడా బ్రాహ్మణులను టోకరా వేసి చోటు సంపాదించడం ఒక అంశం. కథలో అంతిమంగా అది ఎలాటి సందేశం ఇచ్చిందన్నది కూడా చూసి దీనిపై నిర్నయానికి రావలసి వుంటుంది. జూ.ఎన్టీఆర్‌ బ్రహ్మానందంల అదుర్స్‌లోనూ ఇలాటి పాత్రలుంటాయి.
వేజెళ్ల సత్యనారాయణ అనే దర్శకుడు వెనకటికి ప్రతిచిత్రంలోనూ ఏదో విధంగా రిజర్వేషన్లను వ్యతిరేకించే డైలాగులు సన్నివేశాలు పెట్టేవాడు.తర్వాత వాటని తొలగించాల్సి వచ్చేది. పోలీసు భార్య అనే చిత్రం విషయంలోనూ ఇలా జరిగింది. దాసరి మనుషులంతా ఒక్కటే అనే చిత్రంలోనూ ఇటీవల శ్రీరామరాజ్యంలోనూ కూడా రజకులను తక్కువ చేసే సన్నివేశాలున్నాయంటే వాటిని తొలగించినట్టు కనిపిస్తుంది. దాసరి తీసిన రంగనాయకమ్మ నవల బలిపీఠంలో కులాంతర పునర్వివాహాన్ని చూపించేప్పుడు కులాల ప్రస్తావనే గాక కించపర్చడం వంటి వివాదాలు కూడా రాకపోలేదు. రజకులు క్షురకుల వంటి వృత్తిదార్ల పాత్రలను గతంలో చాలా చిత్రాల్లో చూపించేవారు. అలాగే వర్తకులను కూడా ప్రత్యేక వేషధారణతో చూపించేవారు. ఇప్పుడు ఇలాటివన్నీ బాగా తగ్గిపోవడం ఆహ్వానించదగిన విషయం.
వందల సంఖ్యలో వచ్చే చిత్రాలలో అన్ని ఉదాహరణలు ఇక్కడ ప్రస్తావించుకోవడం సాధ్యమయ్యేది కాదు. గాని ప్రధానధోరణులు కొన్ని చూశాం. మతాల విషయంలో మన చిత్రాల తీరు ఎలా వుంటుందనేది ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అంశం.ఈ విషయాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలేమిటనేది కూడా ఆ క్రమంలో చూడొచ్చు.

4 comments:

  1. రవిగార్కినమస్కారం,
    వ్యాసం బాగుంది. కానీ, అనేక సినిమాల్లో ’చండాలంగా ఉంది‘ అనేదొక కులాన్ని తిట్టే తిట్టు కదా. దీని గురించి మన సినిమా వాళ్ళు జాగ్రత్తపడితే మంచిది.

    ReplyDelete
  2. బావుంది సార్...

    ReplyDelete