Pages

Monday, November 19, 2012

ఏక్‌ థా హిట్లర్‌




'' నేను హిట్లర్‌కు గొప్ప ఆరాధకుణ్ణి. అలా చెప్పడానికి నేనేమీ సిగ్గుపడటం లేదు.ఆయన పద్ధతులన్నిటితో నేను ఏకీభవించలేకపోవచ్చు గాని ఆయన అద్భుతమైన నిర్మాణ దక్షుడూ, మహౌపన్యాసకుడు. మాకిద్దరికీ చాలా ఉమ్మడి లక్షణాలున్నాయని నేననుకుంటాను.'' ఆసియా వీక్‌ ఇంటర్వ్యూలో బాల్‌ థాకరే.

బాల్‌ థాకరే మరణవార్తతో పాటు చాలా పత్రికలు ఛానెళ్లు ఇచ్చిన శీర్షిక 'ఏక్‌ థా టైగర్‌'. ఒక హిందీ సినిమా టైటిల్‌. టైగర్‌ అంటే పులి గనక బాల్‌ థాకరే రాజకీయం కూడా మతతత్వం మాఫియాల పులిజూదం లాటిదే. ఈ రాజకీయజూదంలో ఫణం పెట్టిందీ,బలిగొన్నదీ వేలాది మంది అమాయకులు ప్రాణాలు. మత మాఫియా తత్వాలు అన్ని రకాల దురభిమానాలు ఈ రాజకీయ ద్యూతంలో పాచికలు వాటన్నిటికీ ఆద్యుడైన హిట్లర్‌కు అసలు సిసలు ప్రతిరూపం ధాక్‌రే. తనకు తానుగా ఆ భక్తి ప్రపత్తులను బయిటపెట్టుకున్న వ్యక్తి. రాజకీయాల్లో ఆయన ప్రాబల్యం పట్టు గురించి మాత్రమే చెప్పి అందుకు సాధనంగా చేసుకున్న విధానాలను విస్మరించడం అవాస్తవికత అవుతుంది. పునర్వికాసం అనే పత్రిక నడిపిన రచయిత భాషా రాష్ట్ర ఉద్యమకారుడు కెఎస్‌థాకరే కుమారుడైన బాల్‌ థాకరే తండ్రి నుంచి స్పూర్తి పొందినా కొద్ది కాలంలోనే నాజీ హిట్లర్‌ బాట పట్టాడు. మొదట్లో ఆయనకు ఆరెస్సెస్‌తో సంబంధం వుండేది. ముంబైలోని ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌లో కొంత కాలం కార్టూనిస్టుగా పనిచేసిన థాకరే యాజమాన్యంతో విభేదించి మార్మిక్‌ అనే పేర స్వంత పత్రిక ప్రారంభించాడు. అయితే చాలా ఏళ్ల తర్వాత స్థాపించిన సామ్నా పత్రికకే ఎక్కువ ప్రచారం లభించి ఆయన వాణిగా మారింది.
మరాఠీ దురభిమానం...
ముంబాయిలో కాంగ్రెస్‌, సోషలిస్టు సంప్రదాయాలు, కమ్యూనిస్టు కార్మిక సంఘాలు వున్నప్పటికీ ధాకరే మాత్రం మరాఠీ దురభిమానం రెచ్చగొట్టడమే మొదటి నుంచి తన విధానంగా చేసుకున్నాడు. 1960లలో నిరుద్యోగం తాండవిస్తుంటే ఆయన ప్రభుత్వ విధానాలను ఖండించే బదులు భూమి పుత్రుల సిద్ధాంతం ముందుకు తెచ్చి మరాఠీయేతరులే కారణమంటూ వారిపై దాడులకు
పిలుపునిస్తూ రెచ్చగొట్టే రాతలు రాశాడు. ఇది తమకూ ప్రయోజనకరం అనుకున్న పాలకులు కూడా ప్రోత్సాహమిస్తూ వచ్చారు.కనకనే ఆయన కార్యక్రమాలకు వైబిచవాన్‌, వసంతదాదా వంటి వారంతా అతిథులుగా హాజరయ్యేవారు. 1966లో మొదటి సారి ఆరెస్సెస్‌ తరహాలోనే దసరా రోజున(అక్టోబరు30) శివాజీ పార్కులో సభ నిర్వహించింది.ఆ సభలో రెచ్చగొట్టే ప్రసంగాల ప్రభావం ఎంతగా వుందంటే తిరిగివెళ్తున్న మూకలు దక్షిణ భారతీయుల హొటళ్లపై పడి విధ్వంసం దహన కాండ సాగించారు. పోలీసులను జోక్యం చేసుకోవద్దని ముఖ్యమంత్రి వసంత రావు నాయక్‌ ఆదేశాలిచ్చారు.అప్పట్లో శివసేనను వసంత సేనగా కూడా పిలిచేవారు. 1968లో దక్షిణ భారతీయులు తీసిన హిందీసినిమాలు ప్రదర్శించే హాళ్లపై దాడులు చేశారు.
1972లో స్థానీయ లోకాధికార్‌ సమితి(ఎస్‌ఎల్‌ఎస్‌) అన్నది స్థాపించి ఇచ్చే ఉద్యోగాల్లో 80 శాతం, కట్టే ఇళ్లలో 80 శాతం మహారాష్ట్రులకే చెందాలంటూ ఇతరులు భయభ్రాంతులయ్యే రీతిలో ప్రచారం చేపట్టింది. మహారాష్ట్ర కర్ణాటకల మధ్య వివాదాస్పదంగా మిగిలిపోయిన సరిహద్దు సమస్యపై1969లో తీవ్ర విధ్వంసం సృష్టించింది. వారం రోజుల పాటు ముంబాయి అల్లకల్లోలమైంది. చివరకు జైలులోని థాకరేచే విజ్ఞప్తి విడుదల చేయించారు. ఈ ఘటనల్లో59 మంది మరణించగా వందలాది మంది పౌరులు పోలీసులు గాయపడ్డారు.ప్రాంతీయ దురహంకారానికి సంబంధించి బాల్‌ థాకరేను ఆ ఒక్కసారి మాత్రమే అరెస్టు చేశారు. తొండ ముదిరి వూసరవెల్లి అన్నట్టుగా తర్వాతి కాలంలో ముస్లిములు దళితులకు వ్యతిరేకంగా అది దాడులు కేంద్రీకరించింది.

కార్మికోద్యమాలపై దాడి
కాంగ్రెస్‌ నేతలు, కార్మికోద్యమాలు గిట్టని పెట్టుబడిదారుల ఆర్థిక సహాయంతో శివసేన కమ్యూనిస్టులు జాతి వ్యతిరేకులంటూ వారిపై దాడికి దిగింది. వామపక్ష కార్మిక సంఘాలకు పోటీ సంఘాలు స్తాపించి చీలికలు తెచ్చింది.దాని బీభత్స కాండకు యజమానులు పోలీసుల మద్దతు లభించేది సిపిఐ ఎంఎల్‌ఎ కార్మిక నాయకుడు క్రిష్ణదేశారుని 1970 జూన్‌ 6 న శివసేన గూండాలు దారుణంగా హత్య చేశారు.ఇదంతా ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమంపై పాలకులు సాగిస్తున్న కుట్రలో భాగమని విమర్శలు మార్మోగాయి.1970లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెను,1974లో రైల్వే కార్మికుల సమ్మెను, 1976లో జౌళి కార్మికుల సమ్మెను కూడా భయోత్పాతంతో విచ్చిన్నం చేసింది. 1980 వ దశాబ్దంలో శివసేన కుల మతకలహాలు రగిలించడం కూడా రివాజుగా మార్చుకుంది.1970లో భివాండిలో తొలిసారి జరగిన మత ఘర్సణలు మరింత విస్తరించి దాదాపు వందమంది ప్రాణాలు కోల్పోయారు. 1972లో దళిత విముక్తి పేరిట ఏర్పడిన దళిత్‌ ఫాంథర్స్‌తోనూ శివసేన ఘర్షణలు పెట్టుకునివారి నాయకుల హత్యకు కారణమైంది.

ఎమర్జన్సీకి కీర్తన
మొదట రాజకీయాలంటే కిట్టనట్టుగా చెప్పుకున్న శివసేనాధిపతి బాల్‌ థాకరే 1967లోనే వామపక్ష నాయకుల ఓటమికి పిలుపునిచ్చాడు. అదే ఏడాది మొదటిసారి థానే మున్సిపాలిటీని, తర్వాత 1973 నాటికి ముంబరు కార్పొరేషన్‌ కూడా కైవశం చేసుకోగలిగింది. సోషలిస్టులు కాంగ్రెస్‌ వాదులు కూడా దానితో పొత్తు పెట్టుకుని అవకాశవాదంప్రదర్శించారు. 1975లో ఎమర్జన్సీ ప్రకటించినప్పుడు బాల్‌ థాకరే దాన్ని కీర్తించడమే గాక సాధుజంతువులా ప్రవర్తించాడు. పులి అని చెప్పుకునే ఆయన మరోసారి జైలు జీవితం భరించలేకే అలా చేశాడని వ్కాఖ్యలు వచ్చాయి. 1977 ఎన్నికలలో కూడా ఒక్క సీటుకైనా పోటీ చేయలేదు.1978 ఎన్నికలలో గెలవలేదు. 1980లో కాంగ్రెస్‌ తిరిగివచ్కాక ముఖ్యమంత్రి అంతూలేకు థాకరే ఆప్తమిత్రుడుగా మెలిగాడు.1982లో జౌళి కార్మికుల సమ్మెను వ్యతిరేకించాడు. అయితే క్రమంగా తన బలం క్షీణిస్తున్నదని గ్రహించి ఆ సమస్యపైనే 1982 దసరా సభలో కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించాడు. ఆ సమయంలోనూ ఆయన పక్కన శరద్‌ పవార్‌, జార్జి ఫెర్నాండెజ్‌లు వున్నారంటే ధాకరే వెనక ఎలాటి శక్తులున్నదీ తెలుస్తుంది.
బిజెపి ప్రియనేస్తంగా..
శివసేన విస్తరణ, అధికార పక్షంగా అవతరణలో 1984-95 కాలం చాలా కీలకమైంది. ఈ కాలంలోనే నెమ్మదిగా దేశంలో హిందూత్వ రాజకీయాలు ప్రబలడం కాంగ్రెస్‌ అవకాశవాదం ప్రదర్శించడం జరిగాయి. 1984లో మొదటి సారి బిజెపితో పొత్తు పెట్టుకున్న శివసేన ఈ ముప్పై ఏళ్లలోనూ దాని తర్వాత ప్రధాన మత శక్తిగా ఎదిగింది.అనేక సందర్భాల్లో బిజెపిని మించిపోయి థాకరే రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. అయోధ్య విధ్వంసం తర్వాత ముంబాయిలో ఇస్లామిక్‌ తీవ్రవాదం దాడులు పేలుళ్లు కూడా జరిగాయి.వీటన్నిటి మధ్యనా శివసేన కూడా అనేక అమానుష వ్యూహాలతో పునరుజ్జీవం పొందుతూ చివరకు 1995లో అధికారం చేపట్టగలిగింది. బిజెపి కూడా కావాలనే జూనియర్‌ భాగస్వామి పాత్రతోసరిపెట్టుకుని థాకరేను ముందుంచి పార్లమెంటు సీట్లు ఆయన మద్దతు పొందుతూ పబ్బం గడుపుకొంది. థాకరే బిజెపిని కూడా అవహేళన చేసినప్పటికీ భరించి కాళ్లబేరానికి రావడం అలవాటు చేసుకుంది. ఈ రెండు పార్టీల కలయికలో ఎన్‌రాన్‌ నుంచి రిలయన్స్‌ వరకూ కార్పొరేట్‌ ప్రాబల్యం విదేశీ పెట్టుబడులు విపరీతంగా పెరగడమే గాక మతతత్వ శక్తులు మాఫియా పోకడలు కూడా అల్లుకుపోయాయి.బాలీవుడ్‌ కూడా ఆయనకు దాసోహం అన్నది. అయితే శ్రుతిమించిన అఘాయిత్యాల కారణంగా శివసేన ఎదురు దెబ్బలు తిని చీలికలకు కూడా లోనైంది. బాల్‌ థాకరే కొద్ది రోజుల కిందటే విడిపోయిన తన అన్న కొడుకు రాజ్‌ థాకరేను చేతులు కలపాల్సిందిగా బహిరంగంగా పిలుపునివ్వడమే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు ఆయన మరణానంతరం భవిష్యత్తు ఏమిటన్నది కూడా ప్రశ్న గానే వుంది.

1 comment: