కన్నీళ్లు మనుషులను బతికించగలిగితే అమృతం లాగే అవీ ఎప్పుడో అరుదై పోయివుండేవంటాడు ఆత్రేయ ఒక సినిమాలో. నా కోసం ఏడవకుండి మీ కోసం మీ బిడ్డల కోసం ఏడవండి అంటాడు కరుణామయుడు! కన్నీళ్లు పెట్టుకోవడం ఎప్పుడైనా కదిలించాల్సిన విషయమే. అందులోనూ ప్రజా ప్రతనిధులుగా ప్రముఖ నేతలుగా చక్రం తిప్పిన వారు కన్నీరు మున్నీరవడం అసాధారణం.తెలుగు దేశం అగ్గిబరాటాల్లో ఒకరైన పయ్యావుల కేశవ్ తను వలస వెళ్తానంటూ వస్తున్న వార్తలపై మనస్తాపం చెంది మీడియా ముందు విలపించిన తీరు ఆ రీత్యా ఎవరికైనా సానుభూతినే కలిగించాలి.అయితే కేశవ్ ఏ పార్టీలోకి వెళ్తాడన్న వార్త ఈ సన్నివేశానికి కారణమైందో ఆ పార్టీ ముఖ్యుడైన శ్రీకాంత్ రెడ్డి ఈ అశ్రువులను అవహేళన చేస్తూ మాట్లాడారు.అది ఆయన సంస్కారానికి నిదర్శనమని కేశవ్ స్పందించారు. రాష్ట్రంలో రాజకీయాలు ఎలా వున్నాయంటే ఆ విలాపం కూడా వివాద గ్రస్తమవుతున్నది.ఏమైనా ఇది ఈ ఇద్దరికే పరిమితమైన వివాదం కాదు.
ఆయారాం గయారాంల సంసృతి ఈ దేశానికీ, రాష్ట్రానికీ కూడా కొత్తకాదు. అయితే వైఎస్‌రాజశేఖర రెడ్డి దుర్మరణం, జగన్ వారసత్వ సమరం, తర్వాత స్వంత కుంపటి పెట్టుకోవడం నేపథ్యంలో వలసల వరుస కాస్త విచిత్రంగా వున్నమాట నిజం. అధినేత ఆరోపణలు దర్యాప్తులతో జైలులో వున్నా పార్టీ మాత్రం ఎన్నికల విజయాలు సాధిస్తూ ఇతర పార్టీల ప్రతినిధులను ఆకర్షించడం గతంలో చూడని పరిణామం. ఇందుకు దోహదం చేస్తున్న కారణాలేమిటన్నది లోతుగా అధ్యయనం చేయవలసిన అంశం. అవినీతిని ప్రజలు పట్టించుకోవడం లేదని కొందరు తేలిగ్గా అంటుంటారు . సామాజిక పొందికలను బట్టి మరికొందరు విశ్లేషిస్తుంటారు. ఇవన్నీ పాక్షికమైన భావనలే. జగన్, ఆయన పార్టీ బలంగా ఆవిర్భవించడం వెనక అనేక శక్తుల ప్రోత్సాహంతో పాటు తెలుగు దేశం ప్రదర్శించిన ఉపేక్షాభావం కూడా వుంది. జగన్ తిరుగుబాటు కాంగ్రెస్‌ను బలహీనపరుస్తుందనే అంచనాతో ఆ పార్టీ చూచీ చూడనట్టు వ్వవహరించింది. కాని జగన్ బలం పుంజుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి సంపాదించుకున్నప్పుడు ఆ పనిచేస్తే అతను బలపడతాడన్న కారణంగా తటపటాయించింది.ఈ జంజాటంలో జగన్ వర్గం వ్యూహాలకు పదును పెట్టుకుని శక్తి పెంచుకుందనేది వాస్తవం. ఆయనకూ
కాంగ్రెస్‌కు పూర్తిగా తెగతెంపులై బయిటకు వెళ్లి కేసుల్లో చిక్కిన తర్వాతనే తెలుగు దేశం కూడా దాడి తీవ్రం చేసింది. అయితే అప్పటికే ఆ పార్టీకి జరగాల్సిన సష్టం జరిగేపోయింది. తెలంగాణాలోనూ తెలుగు దేశం మాజీ నాయకుడు స్థాపించిన ఉప ప్రాంతీయ పార్టీ టిఆర్‌ఎస్ వ్యూహాత్మక దాడి కూడా అదే స్థితి కల్పించింది. ఈ విషయంలో అవతలి వారినే విమర్శించి తన వ్యూహాత్మక తప్పిదాలను వూగిసలాటలనూ విస్మరించడం సమంజసం కాదు.పాలకపక్షం ఇంత తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినా ఫ్రధాన ప్రతిపక్షం ముందుకు రాకపోగా తను అంతకంటే ఆత్మరక్షణలో ఎందుకు పడిందన్న ఆత్మ విమర్శ అవసరం లేదా?
వైఎస్‌ఆర్ పార్టీలోకి, టిఆర్‌ఎస్‌లోకి వలసలు పెరగడం తెలుగుదేశంకు ఆందోళన కలిగించవచ్చు. ఆ కథనాల్లో అతిశయోక్తులు కూడా వుండొచ్చు.అసలే అసత్యాలని మాత్రం చెప్పడానికి లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో నెగ్గిన తెలుగు దేశం ఎంఎల్‌ఎలు చాలా మంది ఇప్పటికే బయిటక నడవడం, ఇతర పార్టీల తరపున నెగ్గడం జరిగిపోయింది.మరింత మంది వేచి చూస్తున్నారు. ఈ జాబితాలో ఎవరెవరున్నారనే దానిపై భిన్నాభిప్రాయాలుండొచ్చు గాని అలాటివారు చాలా మంది వున్నమా ట నిజం. బహుశా వీరినే విశ్వాసం లేని గొర్రెలని చంద్రబాబు పాదయాత్రలో తిట్టిపోశారు. విశ్వాసం శునకాలది గాని గొర్రెల లక్షణం కాదనే మాట లటుంచితే గొర్రెల కాపరి పాత్ర ఏమిటన్న ప్రశ్న కూడా వెంటనే వస్తుంది. ఇతర పార్టీలలోంచి ఎన్టీఆర్ ట్రస్టు కార్యాలయంలోకి ఎవరూ రాలేదా? ఇకముందు రారా? ఆ మాటకొస్తే 1998లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా ఢిల్లీ వెళ్లి ఎన్‌డిఎ ప్రధాన మాద్దతు దారుగా మారిన ఉదంతం దేశ చరిత్రలోనే ఎరుగని రాజకీయ మార్పిడి కాదా? (2009లో కెసిఆర్ మహాకూటమి లో భాగస్వామిగా వుండి ఫలితాలు రాకముందే ఎన్‌డిఎ బృందగానంలో చేరడం ఒక్కటే దీనితో పోల్చదగింది) కనక విధానాల కన్నా అధికార ప్రయోజనాలే ముఖ్యమనుకున్నప్పుడు విశ్వాసం అన్నమాటకు పెద్దగా విలువుండదు. ఇప్పుడు నాలుగు పార్టీల మధ్య కప్పెల తక్కెడగా నడుస్తున్న రాజకీయ సారాంశం అదే. ఈ క్రమంలో నిజంగా ఏడావాల్సింది ప్రజలు.
అధినేత ఆగ్రహాలు కలిగించిన ఆవేదనలో పయ్యావుల వంటి వారు కన్నీళ్ల పర్యంతమయ్యారు గాని నిజానికి అంత అవసరమేమీ లేదు. పార్టీ ఫిరాయిస్తారన్న కథనాలకు జవాబు ఫిరాయించకుండా వుండటమే. ప్రత్యర్థి పార్టీ మైండ్ గేమ్ ఆడితే అధినేత కూడా శంకించే స్థితి వస్తున్నదంటే అప్పుడు మొత్తం పరిస్తితి అస్తవ్యస్తంగా వుందనుకోవాలి. అస్పష్టతకు ఆచరణకు సంబంధించిన ఈ సమస్య అశ్రుధారలతో మెరుగుపడదు. తెలంగాణా సమస్య నుంచి అవిశ్వాస తీర్మానం వరకూ అన్ని విషయాల్లో అస్పష్టతతో అల్లాడిపోవడం కనిపిస్తూనే వుంది. విధాన పరమైన స్పష్టతతో ప్రజలకోసం నిలబడటమే ఇందుకు నిజమైన సమాధానం. పెద్ద మాదిగననీ, బంజరా నాయక్‌ననీ, మైనార్టీ చార్టర్ అనీ, వంద స్థానాలు బీసీలకేననీ, అప్పులు రద్దు చేస్తాననీ ఇంకా అనేకానేక వాగ్దానాలు అధినేత గుప్పిస్తున్నా అనుకున్న ఫలితం కనిపిస్తుందా అన్నది అనివార్యంగా అడగాల్సిన ప్రశ్న. విశ్వసనీయత అంటే అవినీతికి పాల్పడటమా అని అడగడం బాగానే వుంది గాని స్వంత పార్టీ వారిలోనే ఆత్మ విశ్సావం ఎందుకు దెబ్బ తింటున్నదనేది అసలు సమస్య.
ఇలా అన్నంత మాత్రాన జగన్ పార్టీ ధోరణి గొప్పదని కాదు. నిజంగా అధికార పార్టీనుంచిచిటికేస్తే అంతమంది వస్తారనుకుంటే ఎందుకు చిటికెయ్యడం లేదని నేనొక చర్చలో అడిగాను. తెలుగు దేశం అవిశ్వాస తీర్మానం పెట్టలేదని తిట్టిపోసేబదులు మీరెందుకు ముందుకు రావడం లేదు? నేరుగా గవర్నర్ దగ్గరకు వెళ్లడానికి అభ్యంతరాలేమిటి? ఎంతో మంది వస్తారని జాబితాలు ప్రకటించేవారు ఎందుకుని దశలవారీగా కొందరినే చేర్చుకుని ప్రచారం సాగదీస్తున్నారు? నిస్సందేహంగా ఇవన్నీ మైండ్‌గేమ్ అనుకున్నా ఏదైనా పోలిటికల్ గేమ్‌లో భాగమే కదా? తెలంగాణాలో టిఆర్‌ఎస్ కన్నా సామాజిక ప్రాతిపదికన తాము పెరుగుతున్నామన్న ప్రచారమూ ఇలాటి గేమ్ కావచ్చు కదా? సమస్య ఏమంటే అక్కడ జగన్ పార్టీ ఇక్కడ మేము అని అదే పనిగా చెప్పుకున్న టిఆర్‌ఎస్‌నూ ఇది ఇబ్బందిలో పడేస్తున్నది. మూడు పెద్ద పార్టీలూ ఇలాటి గేమ్‌లలో పడిపోతే పాలక పక్షీయులు హాయిగా నెట్టుకొస్తున్నారు. నిజమైన గేమ్ ఆడుతున్నది కాంగ్రెసే అనుకోవాలి.అదికూడా ఆఖరి ఘట్టంలో ఆట. పాలక పక్షీయులు వారిలో వారు పోట్లాడుకుంటుంటే ప్రధాన ప్రతిపక్షాలూ తమలో తాము పోట్లాడుకుంటున్నాయి. ఎన్నికల ముంగిట్లో రాజకీయాలు అస్తిత్వ పోరాటాలు ఎలాగూ తప్పవు. గతసారి 2007 నుంచి ఈ సారి ఇప్పటి నుంచి కూడా ఎన్నికల యావ యావత్తూ నడిపిస్తున్నది. మరోవైపున అన్ని భారాలూ అనకొండలా పెరిగిపోతున్నాయి. కనక నిజంగా ఏడవాల్సిన వారెవరంటే ఈ రాష్ట్ర ప్రజలే.
కాకపోతే ప్రజలు ఎంతోకాలం ఏడవరు. త్వరగా కళ్లు తుడుచుకుని జీవితపోరాటం ప్రారంభిస్తారు.ఎవరికి నేర్పాల్సిన పాఠం వారికి నేర్పుతారు. కనక నిబద్దత గల వారు నీతి మంతులు ఎప్పుడైనా నిబ్బరంగా వుండొచ్చు. ఎవరైనా సరే బేలతనంతో సాధించేది వుండదు. నికరంగా నిలిచే వారికి నీరసమూ రాదు.
No comments:
Post a Comment