Pages

Thursday, November 8, 2012

మదగజాల గిజగిజ!

దేశాన్ని పాలించే హక్కు తమదేనని హుంకరించే రెండు ప్రధాన పార్టీల దురవస్థ దాచేస్తే దాగని సత్యంలా గోచరిస్తోంది. స్వాతంత్ర సాధనతో సహా అన్నీ తమ ఖాతాలో వేసుకుని ఆ పైన దానికి ఎసరు పెట్టే ఆర్థిక విధానాలనూ వాటిలో భాగమైన అవినీతి అక్రమాలనూ ప్రవేశపెట్టిన కాంగ్రెస్‌ గిజగిజ ఒకటైతే విలక్షణ కమలదళం కటకట మరొకటి. రెండూ స్వయం కృతాపరాధాలే. దేశం ధ్యాస లేని అధికార దాహాలే. ఆ పైన ఒకరికి మతతత్వం అదనపు భుజకీర్తి. దేశ రాజకీయాలనూ ఈ రెంటి మధ్యనే చూపించే దేశ విదేశీ కార్పొరేట్‌ ప్రభువులు వారి మీడియా ఇదంతా చూసి ఆనంద నృత్యం చేస్తున్నారు. ఈ సంక్షుభిత పక్షాల నుంచి గరిష్ట ప్రయోజనం పొందేదెలా అని పొంచికూచున్నాయి. దింపుడు కళ్లం అశచావని వృద్ధ జంబూకాల నుంచి నీరసపు వారసత్వాల యువ రాజుల వరకూ ఈ రంగస్థలంపై దర్శనమిస్తున్నారు.
ఏది ఎలా పోయినా అధికార పక్షం గనక ముందు కాంగ్రెస్‌ వ్యవహారం. వెన్నాడే అస్థిరత్వం వదలని ఓటమి భయం మధ్య రాహుల్‌ రాజకీయ నాయకత్వాన్ని స్థిరపర్చాలన్నదొక్కటే సోనియా గాంధీ ఏకైక ఆశ, ఆశయం. ప్రధాని పీఠాన్ని విశ్వసనీయ విశ్వీకరణ ఆర్థిక వేత్తకు అప్పగించి అందుకు సమయం కోసం నిరీక్షిస్తుంటే కథ అడ ్డం తిరుగుతున్న దృశ్యం. వరుస కుంభకోణాలు అతలాకుతలం చేస్తుంటే- అధిక భారాలను ఆఖరుకు భాగస్వామ్య పక్షాలూ సహించలేక వీడ్కోలు పలికి నిష్క్రమిస్తుంటే పేకమేడలా మారిన యుపిఎ 2. అస్తుబిస్తుగా
నడుస్తున్న సర్కారు మెడపై కత్తిపెట్టి కఠిన షరతులు రుద్దుతున్న డాలర్‌ దొరలు. అన్ని రంగాల్లోకి ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం వారి అండదండల కోసం పెడుతున్న పెట్టుబడి మాత్రమేనని అందరికీ తెలుసు. ఇలా ఎంత లొంగిపోయినా వారి గొంతెమ్మ కోర్కెల జాబితా పెరిగేదే గాని ముగిసేదా? ఇలా గ్లోబలి పీఠం ఎక్కించిన ప్రజల ఆగ్రహాగ్ని తమ పెత్తనాన్నే భస్మం చేస్తారనే భయం. అందుకే దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా చాలా ఏళ్ల తర్వాత సర్కారీ సర్వశక్తులూ ఉపయోగించి ఒక రామ్‌లీలలో రాహుల్‌ లీల ఏర్పాటు. హంగు దర్పాలు వున్నందున జనాన్ని తేవచ్చు. (తుపానులో ప్రజలను వదిలేసి ఆంధ్ర ప్రదేశ్‌ మంత్రి పుంగవులంతా తరలిపోవచ్చు) కాని రాజకీయంగా చెప్పే కొత్త విషయాలేమిటన్నది అసలు ప్రశ్న. అక్కడే కాంగ్రెస్‌ మూర్తి త్రయం డొల్లతనం, కల్ల జపం తేటతెల్లమైంది.
అమెరికా ఒత్తిడితో చేపట్టిన ఆత్మహత్యాసదృశ విధానాలను మార్చుకోలేని అధికార పక్షం వాటినే అద్భుత విజయాలుగా చూపించేందుకు చేసిన ప్రయత్నం హాస్యాస్పదమైంది. ఆమ్‌ఆద్మీ భజన చేసే తాము నిజానికి స్కామ్‌ ఆద్మీని కాపాడేందుకు అంకితమైనామని యువరాజు తొలి ప్రధాన ప్రసంగంలోనే ప్రకటించేశారు. ప్రియతమ బావగారితో సహా అస్మదీయులు ఎదుర్కొంటున్న ఆరోపణలపై విచారణకు సిద్ధపడే బదులు వితండ వాదనలతో విరుచుకుపడ్డారు. ఆ పైన మన్మోహనామిక్స్‌ మనోహరత్వాన్ని పొగిడి పరవశించిపోయారు. ఒకప్పుడు అణుఒప్పందంపై చర్చ తరుణంలో ఇలాగే చిలకపలుకులతో కళావతి కథ వినిపించిన రాహులుడు ఇన్నేళ్ల తర్వాత నిండు సభలోనూ అదే పునరావృతం చేశారు.మాట్లాడితే ప్రజల కోసమే మేము అని చెప్పే ఆ యువనేత కనీసం ఆ ఒక్క కళావతి కన్నీళ్లయినా తుడిచింది లేదు. ఇప్పుడు కూడా ఎఫ్‌డిఐల రాకతో వీధిన పడే చిల్లర వర్తకుల వేదనగాని, మధ్య తరగతి వుద్యొగుల మధనం గాని ఆయన చెవికెక్కలేదు.కార్పొ'రేటింగ్‌' కోసం మాట్లాడ్డమే తప్ప కష్టజీవుల ఘోష వినిపించుకునే ఆలోచనే తమకు లేదని తమ మాటలతో తేల్చిపారేశారు. ఇలాటి సూక్తిముక్తావళి వినిపించిన యువ రాజా వారే దేశానికి ముక్తి ప్రదాత అని నమ్మమంటున్నారు కాంగీయులు.
కాంగ్రెస్‌ వాదులు నెహ్రూ గాంధీ కుటుంబ ముద్రతో రాజకీయాలు నడిపించడం తప్ప విధానాలతో ప్రజలను ఆకట్టుకోవడం ఎప్పుడో పోయింది. అయితే కనీసం ఆ నెహ్రూ ఇందిరాగాంధీ విధానాలైన ప్రభుత్వ రంగం, స్వావలంబన వంటివాటినైనా వారి వారసులు పాటిస్తున్నారా అంటే అదీ లేదు. దేశ స్వాతంత్ర పోరాటం,తర్వాత నెహ్రూ ప్రభుత్వం అనుసరించిన ప్రణాళికా విధానం కూడ సోనియా హయాంలో హుళక్కి అయిపోయాక కుటుంబ పరంగా గాని రాజకీయంగా గాని వారసత్వం ఎక్కడున్నట్టు? వున్నదల్లా ఆధికారపు ఆరాటమే. మాట్లాడితే రాహుల్‌ గాంధీ ఏ పదవి తీసుకోకుండా త్యాగం చేశారన్నట్టు కాంగ్రెస్‌ వాదులు గొప్పలు చెబుతుంటారు. ఆయన కావాలనుకుంటే ప్రధాని పదవిలోకి వస్తే వంధిమాగధ స్తోత్రాలు ఆలపించడానికి వారంతా సిద్ధంగానే వున్నారు. కాకపోతే బుద్ధులు భూములేలాలంటే అదృష్టం మరోతరహాలో వున్నట్టు రాహుల్‌ కేంద్రక రాజకీయ వ్యూహాలకూ కాంగ్రెస్‌ ప్రస్తుత దురవస్థకు బొత్తిగా లంగరు అందడం లేదు. రాష్ట్రానికి చెందిన కొందరు కాంగ్రెస్‌ మిత్రులతో సహా యాభై మందిని ఒక సైన్యంగా చేసుకుని ఆయన బృహత్తర వ్యూహం వేస్తున్నాడని వూదరగొడుతున్నారు.అయితే గతంలో బీహార్‌ ,యుపిలలో పనిచేయని ఆ వ్యూహాలు రేపు దేశమంతటా ఫలిస్తాయన్నది పగటికలే.
బిజెపి స్థితి ఇంకా దారుణం. వెంకయ్యనాయుడు కాంగ్రెస్‌పై వదిలే ప్రాసలు ఎప్పుడైనా తమ పార్టీకి అన్వయించగలిగితే మరింత అద్భుతమైన అపహాస్యం పండుతుంది. అధికారంలోకి వచ్చేది తామేననే ఆ పార్టీ అధినేతలు ముందు తమ పార్టీనే తాము సరిగ్గా పాలించుకోలేక తల్లడిల్లిపోతున్నారు. ప్రతిపక్షంలో వున్నా కుంభకోణాల కళంకాలు మూటగట్టుకోవడంలో కాంగ్రెస్‌ను మించిపోతున్నారు. లేకలేక లోకాయి అన్నట్టు దక్షిణ భారత దేశంలో ఏర్పడ్డ తొలి కర్ణాటక ప్రభుత్వం యెడ్యూరప్ప కళంకిత వ్యవహారాలతో కంపించిపోతున్నది. వయోవృద్ధ వాజ్‌పేయి, అఘాయిత్యపు అద్వానీలను మినహాయిస్తే మరో అద్యక్షుడెవరూ సజావుగా పదవి పూర్తి చేసుకున్న దాఖలాలు లేవు. ఆ మాటకొస్తే అద్వానీ కూడా ఒకసారి హవాలా దెబ్బకు మరోసారి జిన్నా జెల్లకు తల్లడిల్లి పోయిన స్థితి.నాగపూర్‌ ఆరెస్సెస్‌ పీఠాధిపతుల ఆశీస్సులు లభించేవరకూ ఆయన వేచివుండవలసి వచ్చింది. తెహల్కాతో బంగారు లక్ష్మణ్‌, ఓటమితో వెంకయ్య ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. వారిద్దరి తర్వాత మళ్లీ కాస్త స్థిరంగా కొనసాగే అవకాశం నితిన్‌ గడ్కరీకి వుంటుందనుకున్న అంచనా కూడా మిథ్యగా మారిందంటే అది బిజెపి పరిస్తితికి దర్పణం పడుతుంది. న.మో. అని తనకు తానే నమస్కరించుకున్నట్టు నరేంద్రమోడీ మతతత్వ ప్రభుత్వ పునర్విజయావకాశాలు తప్ప రాజకీయంగానూ సంస్థాగతంగానూ కూడా బిజెపి నేతలు ఆనందించే అంశం ఒక్కటైనా వుందా? ఆ మోడీ కూడా ప్రధాని అభ్యర్థి అంటే అద్వానీనే ఆమోదించడానికి సిద్ధంగా లేరు. కోపంలో నిజాలు కక్కేస్తారన్నట్టు ఈసారి కాంగ్రెస్‌ బిజెపిలకు చెందని ప్రధాని వస్తారని రాసి పారేశారు! బాల్‌ ధాకరే, నితిష్‌ కుమార్‌ వంటి మిత్రులు కూడా డిటో. తానే ఒక అభ్యర్థిననుకున్న గడ్కరీ కూడా స్వయానా ఆరోపణల్లో కూరుకుపోయి ఆత్మసమర్థనతో అవస్థలు పడుతున్నారు. ఆ గుంజాటనలో వివేకానందుడు దావూద్‌ ఇబ్రహీం ఒక్కటేనంటూ కొత్తభాష్యం చెప్పి చిక్కులు కొని తెచ్చుకున్నారు. బిజెపి ఆయనను అందుకోసమే ఉపయోగించుకుంటుందనేది ఆయన ఉద్దేశం కావచ్చు.ఇన్నిటి మధ్యనా నాగ్‌పూర్‌ ఆశీస్సులు ఆయనకు వున్నాయా లేదా అన్న మీమాంస నడిచి ఎట్టకేలకు సర్దుకున్నారు. ఈ లోగానే అద్వానీ మరోసారి పగ్గాలు చేపట్టడానికి సిద్ధమై తర్వాత వె నక్కు తగ్గారు. ఇలాటి బిజెపి ఎన్‌డిఎలు కాంగ్రెస్‌ యుపిఎలకు ప్రత్యామ్నాయం అవుతాయనుకోవడం కన్నా అవాస్తవికత వుండదు. అంతర్గత విన్యాసాలకు మారుపేరైన బిజెపి నేతల వ్యవహారం చివరకు ఎలా ముగిసేది వేచిచూడాల్సిందే.ఏది ఏమైనా ఈ రెండు పక్షాలూ ఒకదానికి ఒకటి ప్రత్నామ్నాయం కావన్న నిజం ఈ తాజా పరిణామాలతో మరింత స్పష్టంగా రుజువై పోయింది. ఈ నిజాల నుంచే రేపటి రాజకీయ ప్రత్యామ్నాయ పొందిక రూపొందవలసి వుంటుంది. ఈ పార్టీల దురవస్థ నుంచి ఎవరు ఏ పాఠం నేర్చుకుంటాయన్నది వాటివాటి వాస్తవికతపై ఆధారపడి వుంటుంది.

No comments:

Post a Comment