Pages

Wednesday, November 14, 2012

వ్యాఖ్యల్లో వాస్తవాలు, రాజకీయ రాద్ధాంతాలు



ఇటీవలి కాలంలో కొంతమంది ప్రముఖుల వ్యాఖ్యానాలపైన, కొన్ని సినిమాల పైన తీవ్ర దుమారం చెలరేగింది.కొన్ని అంశాలు వాదోపవాదాలకే పరిమితమైతే మరికొన్ని తీవ్ర ఘర్షణలకూ వరకూ వెళ్లాయి. ఇందులో ఏది ఎంత వరకూ సరైంది అనే సమస్య ఒకటైతే అసలు ఈ వివాదాలకు నిజంగా అంత ప్రాధాన్యత వుందా లేక నిరర్థక తతంగాలానే అనే పరిశీలన మరొకటి.
వివేకానందుడు దావూద్‌ ఇబ్రహీంలు ఒకే విధమైన మనస్తత్వం కలిగివున్నారంటూ బిజెపి అద్యక్షుడు నితిన్‌ గడ్కరీ చేసిన వ్యాఖ్య, రాముడు మంచి భర్త కాదంటూ అదే పార్టీకి చెందిన రాం జెత్మలానీ వ్యాఖ్య,రవీంద్ర నాథ టాగూరు పెద్ద గొప్పవాడేమీ కాదన్న గిరీష్‌ కర్నాడ్‌ వ్యాఖ్య, గ్రామీణ స్త్రీలు ఆకర్షనీయమైన వారు కాదన్న ములాయం సింగ్‌ యాదవ్‌ వ్యాఖ్య, ఆరెస్సెస్‌ కార్యకర్తలు చాలా అంకిత భావం కలిగిన వారన్న కాంగ్రెస్‌ ఎంపి వ్యాఖ్య ఇవన్నీ వివాదాస్పదంగా మారాయి.
అవినీతి ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నితిన్‌ గడ్కరీ ఏం చెప్పినప్పటికీ వివేకానందుడిని దావూద్‌ ఇబ్రహీంతో పోల్టడం దారుణం. వాస్తవానికి సంఘ పరివార్‌ తన మతతత్వ ప్రచారానికి వాడుకోవడమే ఒక వైపరీత్యం. హిందూ మతానికి సేవా ధర్మం కావాలని, సనాతన ఛాయల్లోనే కాలం
గడపకుండా ఆధునిక విజ్ఞానం సంతరించుకోవాలని వివేకానందుడు నొక్కి చెప్పాడు. క్రైస్తవమిషనరీల కోవలోనే రామకృష్ష మిషన్‌ స్థాపించాడు.మతాల మధ్య శాఖల మధ్య యుద్దాలు రక్త పాతాలతో చరిత్ర ఎలా విషాదంగా మారింది వివరించాడు.పేద వాడికి ముద్ద పెట్టడమే కీలకమన్న వివేకానందుడు తన తరహాలో సోషలిజం వస్తుందని కూడా అన్నాడు. చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం మొదట బ్రాహ్మణులు, తర్వాత క్షత్రియులు,ఆ పిమ్మట వైశ్యులు(అంటే పెట్టుబడిదారులు) పాలించారనీ,ఇక మిగిలింది శూద్రులు అంటే శ్రామికులేనని ఆయన భాష్యం చెప్పాడు.తన జీవితపు మలి దశలో వివేకానందుడు హిందూ మతం ఔన్నత్యం ఎక్కువగా చెబుతూ వచ్చిన మాట నిజమే గాని అది సంఘ పరివార్‌ హిందూత్వ మాత్రం కాదు.అలాటి వ్యక్తి ఆలోచనను దావూద్‌ ఇబ్రహీంతో పోల్చి చూపడం గడ్కరీ స్థాయిని తెల్పుతుంది. ఆ ఇద్దరూ ఒకే ఐక్యూ(మేధాశక్తి)కలిగిన వారైనప్పటికీ ఒకరు విధ్వంసానికి మరొకరు నిర్మాణానికి ఉపయోగపడ్డారని మాత్రమే తాను చెప్పానని గడ్కరీ ఇచ్చే వివరణ అతికేది కాదు.
రాం జెత్మలానీ రకరకాలుగా వివాదాలు తెచ్చిపెడుతుంటాడు. అయితే రాముడిపై ఆయన చేసిన వ్యాఖ్య కొత్తదేమీ కాదు. రాముడు మర్యాద రాముడనీ, గుణాభిరాముడని కీర్తించేవారైనా సీతాదేవి పట్ల నిష్కారణంగా ఆయన చూపిన నిర్దయను సమర్థించలేరు. లంక నుంచి వచ్చేప్పుడు అగ్ని ప్రవేశం చేయించడం లోకం కోసం అన్నారు. తర్వాత అదే లోకం( అంటే ఒక రజకుడు) ఏదో అన్నాడని రాజధర్మం పేరిట నిండు గర్భిణిని అడవులకు పంపించాడు. తనను తాను రామదాసుగా అభివర్ణించుకునే బాపు కూడా దీన్ని సమర్థించడానికి శ్రీరామరాజ్యం సినిమాలో అనేక ప్రయాసలు పడ్డారు. ఆ క్రమంలో సీత పాత్రను కాస్త దెబ్బ తీశారని కూడా అనిపిస్తుంది. వాల్మీకి రామాయణంలో అయితే కావ్యకర్త అయిన వాల్మీకి మహర్షి స్వయంగా సీతను తీసుకుని వెళ్లి నిర్దోషి అని చెప్పి మళ్లీ స్వీకరించాలని కోరతాడు. అప్పుడు రాముడు ఆమె బహిరంగంగా ఆ విషయం నిరూపించుకుంటే ఒప్పుకుంటానంటాడు.సీత పరీక్షకు ఒప్పుకుంటూనే నేను నిర్దోషినైతే నా తల్లి భూదేవి వచ్చి తీసుకుపోవాలని శపథం చేస్తుంది. తర్వాత అందరూ వారిస్తున్నా వినకుండా పిల్లలను కూడా రాముడికి అప్పగించి భూ ప్రవేశం చేస్తుంది. సీత పట్ల రాముడు వ్యవహరించిన తీరు ఎలా వుందనేదానికి వాల్మీకి ఇచ్చిన ఈ ముగింపే తీర్పు చెబుతుంది. అయితే జెత్మలానీ ఈ విధమైన స్పష్టతతో చెప్పారా లేదా అనేది వేరే విషయం.విచిత్రమేమంటే రాం జెత్మలానీ మాటల విషయంలో సంఘ పరివార్‌ రెండుగా చీలిపోయింది. వినరు ఖతియార్‌ వంటి వారు అది నిజమేనని బలపరిస్తే మరికొందరు కేసులు దాఖలు చేశారు!
ఇక ములాయం సింగ్‌ గ్రామీణమహిళలపై చేసిన వ్యాఖ్యల వంటివి తరచూ వినిపిస్తుంటాయి. ఆధునిక వస్త్రధారణలో కనిపించే నవీన మహిళలే పురుష పుంగవులను రెచ్చగొడుతున్నారని పోలీసు అధికారులతో సహా చాలా మంది నోరు పారేసుకుంటుంటారు. నిజానికి స్త్రీలు తమకు నచ్చిన వస్త్రాలు ధరించితే ఇతరులు రెచ్చిపోతారనడం జాంతవ ప్రవృత్తినే సూచిస్తుంది తప్ప నాగరికతను కాదు.ఇప్పుడు ములాయం గ్రామీణ మహిళల సహజ సౌందర్యాన్ని కించపర్చేలా చేసిన వ్యాఖ్యమరో కోవకు చెందింది. ఈ మధ్యనే మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ అబ్బాయిలు అమ్మాయిలు కలసి మెలసి తిరగడం వల్లనే అత్యాచారాలు పెరుగుతున్నాయన్నారు. అదే నిజమైతే కేవలం అమ్మాయిలే ఎందుకు బలవుతున్నట్టు? చెప్పాలంటేమహిళలపై ఇలాటి అనుచిత వ్యాఖ్యలు నిరంతరం సాగుతూనే వుంటాయి. పురుషాధిక్య వ్యవస్థను కామాంధుల వికృతాల తీవ్రతను గమనించకుండా మహిళలనే తప్పు పట్టడం మరో వైపరీత్యం.
రవీంద్ర నాథ టాగూరు పై అంచనాలలో అనేక తేడాలు గతం నుంచీ వున్నాయి.ఆయనను అవసరమైనదానికన్నా అతిగా ఆకాశానికెత్తారని అనే వారూ, అనుకున్నదానికన్నా గొప్పతనం వుందని చెప్పేవారు కూడా వున్నారు. ఉదాహరణకు శ్రీశ్రీ ఆయనపై పదే పదే ధ్వజమెత్తడం ఆశ్చర్యం కలిగిస్తుంది. బెంగాల్‌లోనూ ఈ విధమైన తేడాలు వున్నాయి. ఆయనే సర్వస్వం అనేవారున్నారు, అసలు తీసిపారేసేవారూ వున్నారు.వాస్తవంలో టాగోరు భారత దేశ పునర్వికస పురుషుల్లో ఒకరన్నది నిస్సందేహం.అనేక అంశాల్లో ఆయన ఉదారవాద ప్రజాస్వామ్య భావాలను వినిపించడమే గాక సామ్యవాదాన్ని హర్షించడం, ఫాసిజాన్ని ఖండించడం వంటివి కూడా చేశారు. లోతైన అవగాహన అనితరసాధ్యమైన బహుముఖ ప్రజ్ఞప్రదర్శించాడు.ఒకవేళ ఎవరైనా ఆయనను అతిగా పొగిడివుంటే అది ఆయన పొరబాటు కాదు. నూటయాభైఏళ్ల తర్వాతటాగోర్‌పై అంచనాను వివాదం చేసుకోవడం అవసరం లేని పని. నేటి ప్రపంచీకరణ వాతావరణంలో టాగోర్‌ వంటి వారి వారసత్వం ప్రగతిశీలత వైపునే ఎక్కువగా ఉపయోగపడుతుంది.
సినిమాలకు సంబంధించిన వివాదం వీటిలో తీవ్రమైనదీ, ఏకాభిప్రాయంలేనిదీ కూడా.మొదట సారీ టీచర్‌, కెమెరా మెన్‌ గంగతో రాంబాబు,, తర్వాత వుమెన్‌ ఇన్‌ బ్రాహ్మణిజం, తర్వాత దేనికైనా రెడీ.. రకరకాలుగా వివాదాలకు గురయ్యాయి. ఇందులో సారీ టీచర్‌పై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహించి అభ్యంతరం పెట్టాయి. ఉపాధ్యాయులు వైద్యులు పోలీసులు పాత్రికేయులు ఇలా వివిధ వృత్తుల వారిని మరీ అవహేళనగా చూపించినప్పుడు వృత్తిగత కోణం నుంచి స్పందించడం ఒక తరహా. కెమెరా మెన్‌ సినిమాపై ప్రాంతీయ కోణం నుంచి వివాదం రేగింది. ఆ చిత్రంలో తెలంగాణా విభజన వాదాన్ని విమర్శించడం కోసం తెలుగువారిలో లేని జాతి విభజన కోణాన్ని( అంటే తెలుగేతరులను వెళ్లిపొమ్మనడం) జొప్పించడం అవాస్తవమే. అయితే ఆ పేరుతో దర్శకుడి ఇంటిపై దాడి చేయడం వంటివి ఎంతమాత్రం సమర్థనీయం కాదు. చివరకు కొన్ని సన్నివేశాలు తొలగించి సర్దుకున్నారు.ఇంతకూ ఆ చిత్రం ఏమంత విజయంసాధించింది లేదు. ఉమెన్‌ ఇన్‌బ్రాహ్మణిజం.. చలం నవల పేరు ఉపయోగించుకుని( దాని వివరాలు గత వారం వచ్చాయి) అశ్లీల శృంగారాన్ని చూపించేందుకు జరిగిన ఒక ప్రయత్నం.మొదటే విమర్శలు నిరసనలు రావడంతో యు ట్యూబ్‌లో దాని ట్రయలర్లు తొలగించడమే గాక పేరు మార్పునకు కూడా సిద్ధపడ్డారు.
దేనికైనా రెడీ చిత్రానికి వస్తే తమ కులాన్ని, వృత్తిని, స్త్రీలను కించపర్చే సన్నివేశాలు వున్నాయన్నది బ్రాహ్మణ సంఘాల ఆరోపణ. మొదట నిరసన తర్వాత వారు నిర్మాత నటుడు మోహన్‌ బాబు ఇంటి ముందు లేదా సమీపంలో ఆందోళన చేయడం, ఆయన మనుషులుగా చెప్పబడుతున్న వ్యక్తులు వారిపై దాడికి పాల్పడ్డం సమస్యలను జటిలం చేసింది. మోహన్‌ బాబు గత చిత్రాలలో కూడా ఇలాగే చేశారంటూ వారు ఉదాహరణలు ఇస్తున్నారు. సెన్సార్‌ పూర్తి చేసుకుని విడుదలైన తర్వాత అది ప్రభుత్వ బాధ్యత.ఒక వేళ ఏవైనా అభ్యంతరాలుంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి గాని వారు ధర్నా వీరు దాడి వరకూ వెళ్లడం శ్రుతి మించిన వ్యవహారం.
అసలు ఏదైనా సినిమాలో ఒక కులానికి చెందిన పాత్రలను చూపించితే అవమానంగా భావించడం ఎంతవరకు సమంజసం? కథను బట్టి లేదా తీసే వారి సంస్కారాన్ని బట్టి పరిపరివిధాల పాత్రలు పెడుతుంటారు. అనౌచిత్యాలు కూడా వుండొచ్చు. మోహన్‌ బాబు గత చిత్రాలలోనూ తమను తక్కువగా చూపించారని బ్రాహ్మణ సంఘాల ఫిర్యాదు. అ ది కథకు అవసరమా కాదా అన్నది అసలు ప్రశ్న. ఏదైనా కులానికి చెందిన పాత్రను లేదా బృందాన్ని ఎగతాళిగా చిత్రిస్తే బాధ కలగొచ్చు గాని ఆ పేరిట అడ్డుకోవడం మొదలెడితే ఆగేదెక్కడీ చారిత్రికంగా చూస్తే శ్రీనాథుడు కాశీఖండములో చిత్రించిన గుణనిధి, తెనాలి రామకృష్ణుని పాండురంగ మహత్యములో నిగమశర్మ బ్రాహ్మణపాత్రలైనా చాలా హీన గుణాలతో వుంటాయి. మరి వారిని ఏమనాలి? ఎందుకనాలి? గురజాడ కన్యాశుల్కం లో అడుగగుడునా చాందసం,మూఢóత్వాలు, కపటత్వాలపై అవహేళన వుంటుంది. ఇక వీరేశలింగం రచించిన హాస్య సంజీవినిలో పాత్రలనూ సంభాషణలనూ యధాతథంగా చూస్తే తీస్తే వీరంతా భరించగలరా?జంధ్యాల చిత్రాలన్నిటా ఎన్ని సన్నివేశాల్లో అవహేళన లేదు?బ్రహ్మానందం వంటి వారి పాత్రలు వెకిలిగా వున్న సన్నివేశాలెన్ని?
ఇందులో మరొక కోణం కూడా చూడాలి. బ్రాహ్మణ క్షత్రియులు అగ్రవర్ణాలుగా చరిత్రలో అనేక అసమానతలకు అమానుషాలకు కూడా కారకులైనారు.ఇప్పుడు పలు చాందసాలు వారి ద్వారా కొనసాగుతూనే వున్నాయి. వాటిని ప్రస్తావించితే తప్పయిపోదు. తాగుబోతులుగా నేరస్తులుగా తరచూ చిత్రించే పాత్రలు ఏ వర్గాలకు చెందినవనుకోవాలి? ఏ నిర్మాతలైనా తీసిన దాంట్లో చవకబారు తనం అనుమతించకూడదు.దౌర్జన్యాల వరకూ వెళ్లివుండకూడదు.సమతుల్యత కోల్పోకూడదు. సమర సింహారెడ్డి, చెన్నకేశవ రెడ్డి ఇలా ఒకే విధమైన పేర్లే వస్తున్నాయంటే నరసింహనాయుడు అని పె ట్టారు.అయితే వొరిగిందేమిటి? తరిగిందేమిటి? వినోదానికి(కొన్నిసార్లు వికారానికి కూడా) ఉద్దేశించిన సినిమాలపై వివాదాలు పెంచుకుని దాడులు దౌర్జన్యాల వరకూ రావడం అర్థరహితం. ఆలస్యంగా రంగ ప్రవేశం చేసిన పరిశ్రమ ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు కూడా శాంతియుత పరిష్కారం కోసం చొరవ తీసుకోవడం మంచిదే.కాని సెన్సార్‌పూర్తయిన చిత్రంపై పున: పరిశీలన కమిటీ వేయడాన్ని న్యాయస్థానం నిలుపుదల చేయడం కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ కులాల కుంపట్లు చల్లార్చుకుని సామరస్యంగా పరిష్కరించుకోవడం ఇప్పుడు అవసరం. ఇలాటి నిరర్థక వివాదాలతో కాలం వ్యర్థం చేసుకోకుండా జాగ్రత్తపడటం మరింత ముఖ్యం.


No comments:

Post a Comment