Pages

Thursday, November 15, 2012

మజ్లిస్‌ మతలబులు- పరివార్‌ పాచికలుఅస్థిరత్వంతో అస్తుబిస్తుగా నెట్టుకొస్తున్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి సర్కారుకు మద్దతు ఉపసంహరించుకోవాలని మజ్లిస్‌ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిని తీవ్రం చేస్తింది. బొమ్మ బొరుసులాటి బిజెపి మజ్లిస్‌ ల పోటాపోటీ రాజకీయ వ్యూహాల ఫలితంగా రాజధాని నగరం ఎప్పటికప్పుడు ఉద్రిక్తతల మధ్య అందోళనగా గడపాల్సిన స్థితి. దీపావళి సంబరాలకు బదులు అప్రకటిత కర్ఫ్యూ నీడలు దట్టంగా పర్చుకున్న దురవస్థ. చారిత్రాత్మక చార్మినార్‌ను కూడా వదలని మత రాజకీయాల నేపథ్యంలో వెలువడిన ఈ నిర్ణయం మతలబులేమిటో మజ్లిస్‌ నేతలకే తెలియాలి. అయితే పరిస్థితిని ఈ దశకు తెచ్చింది మాత్రం సంఘ పరివార్‌ రాజకీయాలు, అందుకు వత్తాసుగా ఉపయోగపడిన రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకాలే అనిచెప్పాలి. ఈ తాజా ఘటనలోనూ శాశ్వత కట్టడాలు నిర్మించరాదన్న కోర్టు ఉత్తర్వులు ఒక వైపు, యధాతథ స్థితి కాపాడాలన్న ఉత్తర్వులు మరో వైపు వుండగా మతతత్వ శక్తులు వాటికి రకరకాల భాష్యాలు చెబుతూ ఉద్రిక్తతలు రగిలిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వుదాశీనత వహించింది. పరిస్థితి పరాకాష్టకు వచ్చే వరకూ అనుమతించింది. దేవాలయ పరిరక్షణ సమితి పేరిట ప్రచురించిన కరపత్రంలోనూ అక్కడ చేసిన ప్రసంగాలలోనూ సంఘ పరివార్‌ బిజెపిల ప్రతినిధులు ఇష్టానుసారం మాట్లాడి మతభావాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఒక్కదెబ్బకు రెండు పిట్టల్లా ఈ సంక్షోభాన్ని మద్దతు ఉపసంహరణతో ముడివేయడంలో మజ్లిస్‌ నేతల ప్రచ్చన్న అజెండాలు ఏమిటన్న చర్చలు ప్రతిచోటా సాగుతున్నాయి. ఆ తర్వాత క్రమేణా ముస్లిం మైనారిటీలను సమీకరించి రాజకీయ ఒత్తిడిపెంచేందుకు మజ్లిస్‌ నాయకత్వం పెద్దఎత్తునే పాచికలు వేస్తున్నది. కాంగ్రెస్‌ నేతలు కొందరు బుజ్జగింపుగానూ మరికొందరు దాడి చేస్తూనూ అయోమయాన్ని ప్రతిబింబిస్తున్నారు.
చారిత్రికంగా చూస్తే 1978 తర్వాత మజ్లిస్‌ రకరకాల ఎత్తుగడలు మార్చి కాంగ్రెస్‌ అండదండలతో ప్రయోజనాలు సాధించుకోవడం రివాజుగా చేసుకుంది. 1980లలోనూ, 1990లోనూ కూడా
కాంగ్రెస్‌ అంతర్గత కలహాలకు మత పరమైన ఉద్రిక్తతల పెరుగుదలకు అవినాభావ సంబంధం వుండటం యాదృచ్చికం కాదు.1984లో వెన్నుపోటు ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు నెలరోజుల పాలనలోనూ ఇలాటి పరిస్థితే ఏర్పడింది. ముస్లిం మైనారిటీలకు ఏకైక ప్రతినిధిగా చెప్పుకునే మజ్లిస్‌ నిజానికి వారి సమస్యల పరిష్కారం, పాతబస్తీ అభివృద్ధి అంశాల కన్నా రాజకీయ ఆధిపత్యమే ప్రధానంగా ప్రయోజనాలు నెరవేర్చుకుంటూ వస్తున్నది. అనేక సందర్భాల్లో వారి చర్యలు మైనారిటీలకు నష్టం కలిగించడమే గాక పోలీసుల వేధింపులకు గురి చేసిన ఉదాహరణలు ఎన్నెన్నో. సిపిఎం నాయకుడు పి.మధు రాజ్యసభ సభ్యుడుగా వున్నప్పుడు ఆ తర్వాత కూడా ముస్లిం పేదల జీవిత సమస్యలపై పోరాటాలు నడిపితే అందరూ హర్షించారు. మజ్లిస్‌ నేతలు మాత్రం అది సహించలేక బిజెపిని నికరంగా వ్యతిరేకించే సిపిఎం నేతలపైనే దాడులకు దిగడం దాని నిజస్వరూపాన్ని బహిర్గం చేసింది. మరో మతోన్మాద పార్టీ అయిన బిజెపి దాని మాతృసంస్థ సంఘ పరివార్‌ విభాగాలు పోటీపడి ఏదో ఒక పేరుతో చిచ్చు పెట్టడం అది చినికి చినికి గాలి వానగా మారి అభద్రత తాండవించడం సర్వసాధారణమైంది. భోలక్‌పూర్‌, అంబర్‌పేట వంటి చోట్ల కూడా కొన్నిసార్లు మతపరమైన ఉద్రికత్తలు ఏర్పడ్డాయి. మక్కా మసీదు పేలుడు ఘటనలోనూ అనేక దిగ్భ్రాంతి కర వాస్తవాలు వెలుగు చూశాయి. వినాయక నిమజ్జనం ఘటనలతో మొదలైన వివాదాలు ఇప్పుడు ప్రతి పండుగకూ కనిపిస్తున్నాయంటే ఇరువర్గాల బాధ్యతా వుంది. మిలాడి నబి, హనుమజ్జయంతి, ఇప్పుడు దీపావళి సందర్భాల్లో ఏదోఒక సాకుతో రభస చేసి మత సామరస్యానికి విఘాతం కలిగిస్తూనే వున్నారు. అలాటి రాజకీయాల ఫలితంగానే పండగ పూట పాతబస్తీలో మరోసారి భయం పురివిప్పింది.
ఇప్పుడు మజ్లిస్‌ మద్దతు వెనక్కు తీసుకోవడం వల్ల తక్షణమే ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి లేదని అందరికీ తెలుసు.రాజకీయ వత్తిడికి మతపరమైన కారణం కావాలి గనక ఈ సందర్భాన్ని ఎంచుకున్నారు. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ చెలిమి చేయడానికి ఇవన్నీ ముందస్తు సూచనలు. జగన్మోహన రెడ్డితో ఒవైసీ భేటీ అయిన నేపథ్యం, ఆయన తన ప్రస్తుత స్నేహితుడని వ్యాఖ్యానించడం అలాటి రాజకీయ సంకేతాలే. అయితే అటు కేంద్రంలోనూ ఇటు హైదరాబాదు నగరంలోనూ కూడా కాంగ్రెస్‌తో మజ్లిస్‌ సంబంధాలు కొనసాగుతూనే వున్నాయి. కనక ప్రస్తుత నిర్ణయానికి శ్రుతి మించిన నాటకీయత ఆపాదించడం అనవసరం. సాంకేతికంగా 153 మంది సభ్యుల బలం చూపిస్తున్న కాంగ్రెస్‌ అధికారం కాపాడుకోడం కోసం ఎన్ని తంటాలైనా పడుతుంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, తర్వాతి స్థానంలో వున్న వైఎస్‌ఆర్‌పార్టీ టిఆర్‌ఎస్‌లు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం తప్ప చేతులు కలిపి ప్రభుత్వ మనుగడను సవాలు చేసే కళ కనిపించడం లేదు. కనకే రాష్ట్ర రాజకీయ రంగస్థలంపై మరిన్ని మాయా నాటకాలు నడవడం తథ్యం. ఈ క్రమంలోనే మజ్లిస్‌ మతలబులు కూడా బోధపడతాయి.

2 comments:

  1. టపాకు సంబంధం లేని వ్యాఖ్య రాస్తున్నందుకు ఎమీ అనుకోవద్దు. టి.వి. షో లలో మిమ్మల్ని చూస్తూంటే చాలా పెద్ద వారయ్యారని తెలుస్తున్నాది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీరు, రంగనాయకమ్మ గారు సుమారు 30సం|| రాస్తూనే ఉన్నారు. మీ వంటి వారికి రిటైర్మెంట్ లేదా? మీరు ఎప్పుడు రిటైర్ అవుతారు?

    ReplyDelete


  2. శ్రీనివాస్‌ గారూ, ఇందులో అనుకోవడానికి ఏమీ లేదు. రంగనాయకమ్మ గారు నాకంటే వయసులో చాలా పెద్దవారు. నేను 1956 అక్టోబరులో పుట్టాను. కనక మీరు కోరుకున్న పరిణామం ఇప్పట్లో జరిగేది కాదు. రిటైరు కావాలంటే మీరు తప్పక నా రచనలు చదవడం నుంచి రిటైర్‌ కావచ్చు. పెద్దవాణ్ని గనక చూడలేననుకుంటే నా టీవీ షోలు కూడా చూడ్డం మానేయొచ్చు. దయచేసి అవతలి వారు ఎవరైనా సరే మీ వరకు మీరు సగౌరవంగా మాట్లాడ్డం అలవాటు చేసుకోండి. ఇది మీ హితం కోరి చెబుతున్న మాట.


    ReplyDelete