Pages

Wednesday, February 2, 2011

నేను సైతం,, హస్తరేఖగ.

.

శ్రీశ్రీ మహా ప్రస్థానంలో తొలి కవిత నేనుసైతం .చిరంజీవి రుద్రవీణలోనూ తర్వాత ఠాగూరులోనూ సుద్దాల అశోక్‌ తేజ ఈ పాట ఆధారంగా గీతాలు రాశారు. జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఉత్తరోత్తరా అది ప్రజారాజ్యం ప్రారంభ గీతమైంది. తిరుపతిలో ఆ పాట మోగుతుంటే మెగాస్టార్‌ మాటల కోసం అన్నిచోట్లా కోట్ల మంది ఎదురు చూశారు. ఇప్పుడు నేను సైతం హస్త రేఖగ కొత్త పాత్రకు మారిపోతాను అన్న పల్లవి ఇప్పుడు అక్కడ వినిపిస్తుంటే ఆ సన్నివేశాలూ ,చర్చోపచర్చలూ మెగాస్టార్‌ రాజకీయ గమనంలో విన్యాసాలు వైరుధ్యాలూ కళ్లముందు కదలాడుతున్నాయి. ఎందుకంటే అంతకు ముందూ తర్వాత కూడా దీనిపై మీడియా చర్చలలో ఎక్కువగా పాల్గొన్న వారిలో నేనొకణ్ని.
ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస దారులు, చలనచిత్రాభిమానులు, సామాజిక అనుయాయులు, ఔత్సాహిక నేతలతో చిరు రాజకీయ యాత్ర మొదలెట్టారు. మాజీ వామపక్షీయులు కొందరు
ఆయన తరపున తరగతులు నిర్వహించి దాని గురించిన సానుకూల భావన కలిగించేందుకు దోహదకారులైనారు. అయినా పార్టీ స్థాపనపై ఎడతెెగని వూగిసలాట సాగింది. తొమ్మిది నెలల్లో ఎన్టీఆర్‌ తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఇక్కడ ప్రకటనకే నవమాసాలు అవసరమైంది. ఎన్టీఆర్‌ సంచలనం సృష్టించినట్టే చిరు కూడా చేయగలరా అనే ప్రశ్న పదే పదే అడుగుతుండేవారు. అప్పటికీ ఇప్పటికి పరిస్తితులలో తేడా వుందని చెబుతుండేవాణ్ని. సినిమాల్లోనైతే కథ స్క్రీన్‌ప్లే అన్ని హీరో చుట్టూ తిరుగుతాయి గాని ప్రజా జీవితంలో ఎవరికి వారు తమ స్థానం సాధించుకోవలసి వుంటుందని కూడా నొక్కి చెప్పాను. చిరంజీవి ఎకాఎకిన ముఖ్యమంత్రి అవుతారని, సీట్లు తక్కువొచ్చినా ఏదో ఒక విధంగా సర్దుబాట్లలో పదవి నలంకరిస్తారని ఆయన తరపు ప్రతినిధులు చెబుతుండేవారు. ఇలాటి వారే ఇవేవీ జరక్కపోవడంతో నిరాశోపహతులైనారు. వచ్చిన 18 స్థానాలు, 18శాతం ఓటింగు చిన్న విషయాలు కాదని తెలిసినా ఓపిక పట్టగల స్థితి లేకపోయింది. వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఆపరేషన్‌ ఆకర్ష అప్పటికే మొదలై పోయింది. చిరు గమనం అటేనన్న కథనాలూ పొంగిపొర్లాయి. ఒక దశలో వీటిపై ఆయన ఆగ్రహావేశాలతో వూగిపోయారు గాని వాస్తవ పరిస్తితిలో పెద్ద మార్పు రాలేదు. సామాజిక న్యాయం వంటి నినాదాలు విశ్వసనీయత పెంచలేదు.
గెలుపు కన్నా ఓటమిలోనే వ్యక్తుల దృఢత్వం రుజుత్వం ఎక్కువగా సవాలునెదుర్కొంటాయి. తనకున్న బలాన్ని కాపాడుకుంటూ ప్రజల కోసం పని చేయడంలో నిమగగమైతే ప్రజారాజ్యం మనుగడ గురించిన సందేహాలు వచ్చేవే కావు. అయితే మొదటి నుంచి కార్పొరేట్‌ తరహా కలలు సినిమా తరహా వూహలు అంకెకు రాని లెక్కలు, కుటుంబ సభ్యుల ధోరణులూ గజిబిజి పర్చాయి. టికెట్ల పంపిణీతో మొదలైన కిష్కిందకాండ అపజయంతో అరణ్యకాండగా మారిపోయింది. బయిటవారిపైన మీడియాపైన ఎంత కోపగించుకున్నా అంతర్గత పరిస్థితిలో మార్పు రాలేదు. విధాన స్పష్టత, యంత్రాంగ పటిష్టత మెరుగు పర్చుకోలేదు. నిజంగా దాన్ని దీర్ఘకాలం పాటు నిలబెట్టాలన్న యోచన యోజన వున్నాయా అన్న ప్రశ్నలు కొనసాగుతుండగానే రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చేశాయి. వైఎస్‌ మరణం తర్వాత కాంగ్రెస్‌లో కల్లోలం, ప్రాంతాల వారీ ప్రకంపనలు ప్రజారాజ్యంను పట్టి కుదిపేశాయనడం నిస్సందేహం. మొదట సామాజిక తెలంగాణా అన్నప్పటికీ ఆ విధానం మార్చుకుని సమైక్యతకు కట్టుబడివుండాలని ప్రజారాజ్యం నిర్ణయించుకోవడం వారి అంతర్గత విధాన నిర్ణయం కావచ్చు గాని ఇతరత్రా గజిబిజి మాత్రం వెంటాడుతూనే వచ్చింది. గ్రేటర్‌ హైదరాబాదు కార్పొరేషన్‌ ఎన్నికల సందర్భంలో పొత్తు గురించి పిసిసి పీఠాధిపతి స్వయానా ప్రకటించి తర్వాత మరోలా చేసినా ప్రజారాజ్యం ప్రతిస్పందన లాంఛన ప్రాయంగానే వుండిపోయింది. రాజ్యసభ ఎన్నికల్లో మద్దతు ఇవ్వడం ఒకటైతే ఆ సందర్బంలో అత్యుత్సాహం అపభాస్యభాజనమైంది. రోశయ్య ప్రభుత్వానికి మద్దతు నిస్తామని తాము చెప్పినప్పుడు ఆయన ఆ అవసరం లేదు అంటే దానిపైనా స్పందన నాస్తి. . జగన్‌ సవాలు తీవ్రమయ్యేట్టయితే ప్రజారాజ్యం ఆదుకుంటుందని కథనాలు పుంఖానుపుంఖంగా వస్తున్నా మౌనామోదమే. విధానమైంది.కిరణ్‌ కుమార్‌ రాక, జగన్‌ నిష్క్రమణ ఈ క్రమాన్ని వేగవంతం చేశాయి.
ఒక ప్రభుత్వం అనిశ్చితిలో వున్నప్పుడు దానికి సరైన ప్రత్యామ్నాం తామేనని వచ్చిన పార్టీ బలపర్చడం పొత్తు నిర్వచనం కిందకు రాదు. ప్రభుత్వంలో చేరిక పార్టీలో విలీనం గురించి చర్చలు సాగించడం సర్దుబాట్ల కోవలోకి రాదు. చిరంజీవితో సహా నాయకులందరూ ఇంకా నిర్ణయం తీసుకోలేదని అంటున్నారే గాని ఆ ప్రసక్తి లేదని చెప్పకపోవడం హస్తముఖ గమనాన్ని చెబుతూనే వుంది. అధికారం లేకుండా పార్టీని కాపాడుకోవడం సాధ్యం కాదన్న అంచనా, ఒత్తిడి ఇందుకు కారణమై వుండాలి. ఏది ఏమైనా పార్టీని స్వతంత్రంగా నిలబెట్టుకోవాలనే సంకల్ప లోపం అసలు కారణం. అది సాధ్యం కాదన్న విశ్వాస రాహిత్యమైనా అయివుండొచ్చు.
ఇంతా అయిన తర్వాత ప్రజారాజ్యం నేతలకు కాంగ్రెస్‌లో పెద్ద పీట వేస్తారని వూహాగానాలు చేయడం వాస్తవాలకు చాలా దూరం. ముఖ్యమంత్రిగానో పీసీసీ అద్యక్షడుగానో అవకాశం కల్పిస్తారని అంచనాలు వేయడం నిరాధారమైన కాల్పనికతే. కలహాల నుంచి బయిటపడటానికి ప్రజారాజ్యంను రాబట్టుకుంటున్న కాంగ్రెస్‌ వచ్చిన వారిని వెంటనే నెత్తిన పెట్టుకుని కొత్త కలహాలు తెచ్చుకుంటుందా? అంత మౌలికమైన మార్పులు చేయగల సత్తా ప్రస్తుత దశలో కాంగ్రెస్‌ నాయకత్వానికి వుందా? ప్రజారాజ్యంతో అవగాహనపై ఇప్పటికే కాకా వెంకటస్వామినుంచి అనేక మంది నేతలు మాట్టాడుతున్న తీరే ప్రతికూలతను ప్రతిబింబిస్తుంది. ప్రజారాజ్య రాకనూ తెలంగాణాపై నిర్ణయాన్ని ముడిపెట్టి మాట్లాడ్డంలో ఔచిత్యం లేదు. ఎందుకంటే కాంగ్రెస్‌ ఇంతవరకూ దీనిపై నిర్ణయం ప్రకటించిందే లేదు.ప్రాంతాల వారి దాగుడు మూతలే దాని విధానంగా నడుస్తున్నాయి. అలాటి పార్టీకి అనుబంధంగా అనుకూలంగా ప్రజారాజ్యం వ్యవహరించాలనుకున్నాక ఆ పార్టీ ప్రత్యేక విధానం ప్రశ్నకు విలువేముంటుంది? తెలంగాణా ప్రాంత నేతలు దీనిపై చేస్తున్న వ్యాఖ్యలు కేవలం రాజకీయ జాగ్రత్తలో భాగాలు మాత్రమే. వారైనా ప్రభుత్వం ఎలాగోలా కొనసాగాలనే కోరుకుంటున్నారు.
గతంలో వలె ఏకపక్ష అత్యుత్సాహం ఆరోపణలకు ఆస్కారం లేకుండా చూసుకోవడానికే ఆంటోనీ ఆగమన ప్రహసనం అవసరమైంది.ఆంటోనీ గుణగణాలు రాజకీయ ప్రాధాన్యతను బట్టి ఆయన వచ్చి ఆహ్వానించడం చాలా గొప్ప విషయమైనట్టు చెప్పుకోవడం ప్రచారానికి తప్ప ప్రయోజనం కలిగించేది కాదు. వాస్తవంలో వైఎస్‌ వున్నప్పటినుంచి ఇలాటి మంతనాలు జరుగుతున్నాయని అటూ ఇటూ కూడా చాలా మంది చెబుతున్నారు. ఈ విధంగా ఒక ప్రతిపక్షం అధికారంలో వున్న పార్టీ వైపు నడవడం సరికొత్త అనుభవం. గతంలో కాంగ్రెస్‌తో కలసిన చాలా పార్టీలు వారి నాయకులు నదీనాం సాగరోగతి చందంగా కలసి పోయాయి.ఇప్పుడైనా పరిస్థితి అందుకు భిన్నంగా వుండదు. కాంగ్రెస్‌ కూడా ఈ కాలంలో చాలా బలహీనపడినప్పటికీ ప్రధాన పాలకపార్టీగా దాని పునాది దానికి వుంటుంది. అందులో కొంత భాగం ప్రజారాజ్యం వైపు వచ్చి పోతుంది. తెలుగు దేశం తనే ప్రధాన పక్షమని చెప్పుకోవడానికి అవకాశమూ కలుగుతుంది. ఎన్నికల దెబ్బలతో నిమిత్తం లేకుండా ఉద్యమాలు పోరాటాలతో నిర్మాణ బలంతో దశాబ్దాలుగా కొనసాగుతున్న పార్టీల సిద్దాంత బలిమి తెలుస్తుంది. ప్రజారాజ్యం పరిమితులు గమనించకుండా ప్రత్యామ్నాయ శక్తిగా వూహించుకుని గొప్ప గొప్ప సూత్రీకరణలు చేసిన వారికి గుణపాఠమూ మిగులుతుంది.
రాజకీయాలంటే ప్రజల పట్ల నిర్వహించవలసిన నిబద్ద బాధ్యత తప్ప పదవుల వేటగాని పైరవీల బాట గాని కానేకాదు. అయితే ధన ప్రధానంగా మారిపోయిన నేటి రాజకీయ రంగ స్థలంలో వాతావరణం అందుకు పూర్తి విరుద్దం. ప్రజారాజ్యంతో అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్న వారు అంతగానూ ఆశాభంగం చెందారంటే కారణం ఆ ఆశల తీరే. చిరంజీవి కూడా ఈ వాస్తవాన్ని గమనించిన తర్వాతే భావి గమనం దుర్గమమని అర్థం చేసుకుని వుంటారు.. వైఎస్‌ హయాంలోనే మొదలైన ఈ తతంగాన్ని నేడు ఆయన వారసులు హర్షించలేకపోతున్నారంటే వారి రాజకీయ ప్రయోజనాలకు అది కాస్త ప్రతిబంధంకంగా వుండటమే కారణం.కొద్దిమంది ప్రజారాజ్య సభ్యులు ఇప్పటికే వారితో వుండగా మిగిలిన వారి తీరు అంది వచ్చే అవకాశాలపై ఆధారపడి వుంటుంది.గొప్ప జనాకర్షన వున్నా ఇప్పటి వరకూ విధానాలతో విజేత కాలేకపోయిన మెగాస్టార్‌ అభిలాష ఆయనకు కాంగ్రెస్‌లో ఖైదీ, బిగ్‌ బాస్‌,చంటబ్బాయి వగైరాలలో ఏ పాత్ర తెచ్చేది భవిష్యత్తు చెబుతుంది.

1 comment:

  1. ravi gaaru

    asalu congress high command prp ki minister posts istundi antara(media lo chepthunattu) naa udesam prakaram antha scene undaka povachu. kadapa lo unna bi-elections lo congress party paruvu nilupukovataniki akkada jagan baga balam ga undatam valana bielections lo saraina voting % vastundo raado ani bayam tho kani PRP ki akkada unna voting veellaki upyoga padidi ani congress vallu adutunna natakalu ivi prp avasaram teeragane side lo petti malli avasaram vachinappudu upyoginchu kuntaru ani naa udesam. oka vela ippude merge aithe cabinet posts ivvochu emo kani support iche tattu aithe prp ki antha scene undaka povachu

    ReplyDelete