Pages

Sunday, July 24, 2011

చెల్లిపోయిన రాజీనామాలు- ప్రాంతీయుల కొత్త వ్యూహాలు?



ఈ వారం రోజుల్లోనూ రాష్ట్ర రాజకీయాలు, వాటికి కేంద్ర బిందువైన ఢిల్లీలో వ్యవహారాలు పరశీలిస్తే ప్రాంతీయ రాజకీయ క్రీడల వెనక స్వార్థాలను కళ్లకు కట్టి చూపిస్తున్నాయి. ఎవరి మాటల్లో వాస్తవమెంతో ఎప్పటికప్పుడు వారి చర్యల ద్వారానే తేటతెల్లమవుతున్న పరిస్థితి. ఈ క్రీడలతో ప్రజలను నమ్మించి కాలం గడపాలన్న ప్రధాన పార్టీలు తమకు తామే ఆత్మరక్షణ స్తితిలో పడిపోయాయి.. రాజినామాలతో రాజకీయ సంక్షోభం ముంచుకొచ్చి రాష్ట్ర విభజన జరిగిపోతుందని చెప్పిన జోస్యాలకూ తర్వాత పరిణామాలకు పొంతన లేదు. ఇప్పుడు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఆ రాజీనామాలన్నిటినీ గుండుగుత్త గా తిరస్కరించడంతో ఒక ఘట్టం ముగిసింది. అదే మళ్లీ పునరావృతమవుతుందా లేక ప్రాంతాల వారి వ్యూహాల్లో
కొత్త విన్యాసాలు మొదలవుతాయా అన్నది చూడవలసిన విషయం.
.టి.ఆర్‌.ఎస్‌. అధినేత కె.చంద్రశేఖర రావు కాంగ్రెస్‌ వారి నిరాహారదీక్షల దగ్గర మాట్లాడుతూ రెండు వారాల్లో రాష్ట్ర విభజన జరగనున్నట్టు తనకు సంకేతాలు అందాయన్నారు. మరో వైపున కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు గులాం నబీ ఆజాద్‌ తమ పార్టీకి చెందిన వివిధ ప్రాంతాల ప్రతినిధులతో మాట్లాడ్డానికే రెండు మాసాలు పడుతుందని తేల్చిచెప్పారు. ఇప్పుడు రెండు వారాల సంకేతాలేమిటో ఈ రెండు మాసాల ప్రకటనలేమిటో సదరు పెద్దలే వివరించాల్సి వుంటుంది.తాము రాజీనామాల కన్నా రాష్ట్రాన్ని పట్టాలెక్కించడానికే ప్రథమ ప్రాధాన్యత నిస్తామని కూడా ఆజాద్‌ అన్నారు. పైగా రానున్న పార్లమెంటు సమావేశాలపై రాజీనామాల ప్రభావం వుండదని కూడా ఆయన ముందే చెప్పారు. అంటే అక్కడ కూడా ఇక్కడి లాగే తిరస్కరణ అనివార్యమని తేలిపోతున్నది.
ఇదంతా చూస్తుంటే టిఆర్‌ఎస్‌ ప్రముఖ నాయకులొకరు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. సభా నిబంధనల ప్రకారం స్పీకర్‌ రాజీనామాలను తిరస్కరించవచ్చునని ఆయన స్పష్టంగా చెప్పారు. అంతకన్నా విశేషం ఏమంటే - రాజీనామాలు ఆమోదించే అవకాశం లేదని తమ నాయకుడు గట్టిగా వివరించిన తర్వాతనే కాంగీయులు రాజీనామాలకు ముందుకు వచ్చారని ఆయన వెల్లడించారు. వారి కన్నా ముందే తెలుగు దేశం నేతలు రంగంలోకి దిగి రాజకీయ ఆధిక్యత కోసం ప్రయత్నించారు. ఇప్పుడు తిరస్కరణ తర్వాత కూడా ఎవరేమి చేస్తారు. ఏమి చేసినా ఒక్క రోజులో రాజకీయ వాస్తవాలు మారతాయా అన్నది ప్రశ్న. ఈ విషయంలో స్పీకర్‌ నిర్ణయమే శిరోధార్యం గనక దానిపై ముందస్తుగా కోర్టులకు వెళ్లే అవకాశం కూడా వుండదు. గతంలో వివిధ ప్రాంతాల నేతలు సామూహికంగా రాజీనామాలు చేసినప్పుడు కూడా తిరస్కరణే జరిగింది.ఇప్పుడు మళ్లీ ఇచ్చినా అదే జరగొచ్చు. ఎందుకంటే ప్రాంతాల వారీ ఉద్రేకాలు చెలరేగిన సమయంలో మొత్తం అందరి రాజీనామాలు ఆమోదించేసి శూన్యతను సృష్టించడం సాధారణంగా జరగదు. అందువల్లనే మళ్లీ రాజీనామాలు చేయడం,కొంతకాలం తర్వాత వాటిని తిరస్కరించడం అనేది మరోసారి మనం జరగొచ్చు.

.శాసనసభ తీర్మానం లేకుండా తెలంగాణా అంశం అంగుళం కూడా కదలదని తాను బీజింగ్‌లో చెప్పినట్టు వచ్చిన పిటిఐ వార్త వక్రీకరణ అంటూనే ఆజాద్‌ అంతకన్నా ఘంటాపథంగా ఇది బాగా సమయం పట్టే విషయమని కుండ బద్దలు కొట్టి చెప్పారు. పైగా శతాబ్దాల పాటు కలిసి వున్న వారు మరో శతాబ్డం పాటు కలిసి వుండటానికి కూడా సిద్ధంగా వుండాలని సుహృద్భావ సూచనలు చేశారు. ఇవన్నీ గమనంలో వుంటే ఇన్ని తొందరపాటు ప్రకటనలు చేయకుండా వుండాల్సిందని వేరే చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆ మరుసటి రోజునే ప్రణబ్‌ ముఖర్జీ డిసెంబరు 9 ప్రకటన కాస్త తొందరపాటుతో కూడిందని మొదటి సారిగా వ్యాఖ్యానించినట్టు వచ్చింది. ఈ విధంగా తొందరపాటుగా వ్యవహరించినందుకు రాష్ట్ర ప్రజలు చెల్లించవలసి వచ్చిన మూల్యం గురించి మాత్రం మాట్లాడలేదు.
.కేంద్రం వైఖరి కారణంగా ప్రాంతాల వారీగా సంభవించిన ప్రజ్వలనాలకి తమదే బాధ్యత అని అంగీకరించేట్టయితే ఇప్పటికైనా ఈ చెలగాటాన్ని ఆపాల్సి వుంటుంది.కాని జరుగుతున్నది అందుకు పూర్తి భిన్నం. ఉదాహరణకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన 14(ఎఫ్‌) తొలగింపును కేంద్రం ఎందుకు వాయిదా వేస్తున్నదీ అధికార పూర్వకమైన వివరణ లేదు. రాష్ట్రం దానిపై వత్తిడి తెస్తున్నదీ లేదు. ఇప్పుడు మారిన పరిస్తితులలో అదే తీర్మానం మరోసారి చేసి పంపించాలని కోరినట్టు అనధికార సమాచారం వచ్చింది తప్ప అధికారికంగా వివరణ లేదు. సుహృద్భావ సూచనగా ఉపయోగపడే ఆ చర్యను వాయిదా వేయడంలో వున్నది ప్రాంతాల వివాదాన్ని కొనసాగించాలనే దుర్బుద్ధి కాక మరేమిటి?
.రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలకు కారణమైన పాలక పార్టీలే దాన్ని రాజకీయ మనగడ కోసం వాడుకోవడంలో కూడా ముందున్నాయి. ప్రజలు విడిపోయారంటూ ఆ పార్టీల నాయకులే చెరో వైపున నిలబడి విద్వేషం పెంచేందుకు కారణమవుతున్నాయి. ప్రజల మనోభావాలు, ఆకాంక్షలు ఏమైనప్పటికీ పరస్పర ద్వేషాలు దూషణలు కోరుకోవడం లేదు. శ్రమ జీవులు గాని సామాన్యులు గాని అలా మరో ప్రాంతంపై కవ్వింపు వ్యాఖ్యలు చేయడం లేదు. టిఆర్‌ఎస్‌ నాయకులు పలు సార్లు ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తే అందరూ తప్పని ఖండించారు.ఈ దశకు వచ్చాక కాంగ్రెస్‌, తెలుగు దేశం నాయకులు కూడా దాన్ని మించిపోయిన మాటలతో ఉద్రేకాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు వైపున లగడపాటి రాజగోపాల్‌, టిజివెంకటేష్‌, ఆనం వివేకానందరెడ్డి వంటివారు ఇటు వైపున పొన్నం ప్రభాకర్‌, మధు యాష్కి వంటివారు అభ్యంతర కరమైన భాషలో ఆవేశాలు పెంచేందుకు యత్నిస్తున్నారు. అలాగే తెలుగు దేశంలో కూడా అటు ఎర్రం నాయుడు, పయ్యావుల కేశవ్‌ తదితరులు ఇటు రేవంత్‌ రెడ్డి, దయాకర రావు వంటివారు ఒకరిని మించి ఒకరు నోరు పారేసుకుంటున్నారు. ఆ మాటలన్ని ఏకరువు పెట్టడం అనవసరం. ఆఖరుకు చంద్రబాబు నాయుడు స్వయానా వాటిని ఖండించక తప్పని స్తితి ఏర్పడింది. ఈ రెండు పెద్ద పార్టీల నాయకులూ తమ కార్యాలయాల్లో కలసి కూచుని ఒకే అభిప్రాయానికి రావాలి గాని ప్రజల పేరు జపిస్తూ ఏ ప్రజలూ హర్షించని భీషణ దూషణలకు దిగడమెందుకు?
ఢిల్లీలో ఉద్రిక్తత, అనుచితదాడి
.టి.ఆర్‌.ఎస్‌ విషయానికి వస్తే కేంద్రం, కాంగ్రెస్‌ సాగిస్తున్న చెలగాటాన్ని చెప్పడం కన్నా ప్రతిపక్షంపై విమర్శలు లేదా సీమాంధ్ర నేతల పేరిట సాధారణ వ్యాఖ్యలకే పరిమితమవుతున్నది. మొదటే చెప్పినట్టు కాంగ్రెస్‌ ప్రతినిధులను మించి పోయి కేంద్రం ఏదో చేసేస్తుందన్న నిరాధారమైన గడువులు ప్రకటిస్తున్నది. అవి జరగనప్పుడు ఆశాభంగాలూ అసహనాలు పెరగడం కూడా కనిపిస్తున్నా ఆ వైఖరి మార్చుకోవడం లేదు.రాజీనామాల తర్వాత కాంగ్రెస్‌ శిబిరంలో పరిణామాలపై ఎలా ప్రతిస్పందించాలో తేల్చుకోలేని టిఆర్‌ఎస్‌ సంధిగ్ధత స్పష్టంగా కనిపిస్తూనే వుంది.ఇలాటి నేపథ్యంలో ఆదిరెడ్డి మృత దేహం అప్పగింత సందర్బంగా ఢిల్లీ ఎపిభవన్‌లో జరిగిన పరిణామాలు అవాంఛనీయమైన ఉద్రిక్తతకు దారి తీశాయి. ఆత్మహత్య చేసుకున్నవారి పట్ల ప్రగాఢ సంతాపం తెల్పుతూనే ఇది సమస్యకు పరిష్కారం కాదన్న స్పష్టత ఇవ్వాల్సిన సమయంలో ఆ విషాదం వివాదంగా మారడం ఎవరూ బలపర్చలేని పరిణామం. స్వాతంత్రానికి ముందు తర్వాత కూడా ఏ ఉద్యమంలోనూ లేని ఈ విపరీత విషాద ఘటనలు కొనసాగడంపై సామాజిక రాజకీయ ఆత్మశోధన జరగాల్సి వుంటుంది. ఒక రాజకీయ రాజ్యాంగ సమస్యను ఉద్వేగ ప్రధానమైందిగా మార్చడం,కేంద్ర వైఖరిపై ఆధారం లేని భ్రమలు పెంచడం ఇందుకు గల కారణాలలో కొన్ని. అదలా వుంచితే ఈ సందర్బంలో ఎపిభవన్‌ ఉద్యోగిని టిఆర్‌ఎస్‌ నేత హరీష్‌ రావు కొట్టడం పూర్తిగా ఖండనీయమైంది. మృతదేహాన్ని ఎపిభవన్‌లోకి తెచ్చే విషయమై వివాదం, ఈ సందర్భంలో అధికారి రాసిన లేఖ వీటిపై ఎవరి అభిప్రాయాలు ఆగ్రహాలు వారికి వుండొచ్చు. (మాజీ ప్రధాని ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు మృత దేహాన్ని కూడా అక్కడకు తేలేదని కొందరు అంటున్నారు కాని ఆ చర్చ అప్రస్తుతం) ఈ కోపతాపాలు భావావేశాలు ఒక దళిత ఉద్యోగిపై బలప్రయోగానికి సమర్థనలు కావు. ఒక వేళ ఆయన దళితుడు కాకున్నా దాడి తప్పే అవుతుంది. ఇదేదో ఆవేశంలో జరిగిందని చెప్పడం పాక్షికసత్యం మాత్రమే. గతంలోనూ శాసనసభలో జయప్రకాశ్‌ నారాయణ్‌పై చేయి చేసుకోవడం రాష్ట్రమంతా చూసింది. అంతకు ముందు కూడా హరీష్‌ రావు కొన్ని దుందుడుకు చర్యలకు పాల్పడి విచారం వెలిబుచ్చిన ఉదాహరణలున్నాయి. ఈ ధోరణి మారలేదని ఎపిభవన్‌ ఉదంతం చెబుతున్నది. దీనిపై హరీష్‌ రావు ఇప్పుడు క్షమాపణలు చెప్పినా మరోవైపున సమర్థనలే బలంగా వినిపిస్తున్నాయి. సామాన్యులలో అభద్రతా భావన వుద్రేకాలు పెరగడానికి ఇలాటి ఘటనలు దారి తీస్తాయి.

అచేతన ప్రభుత్వం
.ఇన్నిటి మధ్యనా కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం నిస్సందేహంగా నిశ్చేతనావస్థలో చిక్కుకుపోయింది. ముఖ్యమంత్రి ప్రభుత్వం పనిచేస్తున్నదన్న భావన కలిగించడానికి ప్రయాస పడుతున్నా మంత్రివర్గం రాజ్యాంగ బద్దమైన సమిష్టి స్వభావం కోల్పోయింది.ప్రాంతాల వారీగా విడిపోయింది. తెలంగాణా మంత్రులు శాసనసభ్వత్వాలకు రాజీనామా ఇచ్చాక ప్రతిష్టంభన పెరిగింది. వారు గవర్నర్‌కు లేదా ముఖ్యమంత్రికి రాజినామాలు ఇవ్వలేదు గనక రాజ్యాంగ బద్దంగా వున్నట్టే లెక్క. అడపా దడపా విధుల దరిదాపుల్లో అగుపిస్తున్నారు. తెగతెంపులు చేసుకున్నట్టు వారు ప్రకటించలేదు, ముఖ్యమంత్రి కూడా వత్తిడి చేయడం లేదు. అధిష్టానం రాజీనామాల కన్నా రాజకీయ సర్దుబాటు ముఖ్యమంటున్నది.ఈ పరిస్థితులలో మరికొందరు మంత్రులు విజయవాడలో సమైక్య సదస్సుకు హాజరైనారు.వారిలో ఒకరు సైన్యం ఏర్పాటు గురించి కూడా ప్రకటించి వచ్చారు. ఇలాటి స్థితిలో ప్రభుత్వ అస్తిత్వంపైనే దట్టమైన సందేహాలు అలుముకున్నాయనేది కాదనలేని వాస్తవం. .

(ప్రజాశక్తి- జులై24, స్వల్పంగా తాజా పర్చింది)

1 comment: