Pages

Sunday, November 13, 2011

ప్రధాని ప్రకటన - ఒక ఘట్టానికి ముగింపు?


ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ దాదాపు సూటిగానే చేసిన వ్యాఖ్యలపై  ఎవరు ఎలా స్పందిస్తారు అన్నది వారి వారి వైఖరిపై ఆధారపడి వుంటుంది. రెండేళ్ల పాటు రాష్ట్రాన్ని వెంటాడిన రాజకీయ ప్రతిష్టంభన, అన్ని జీవిత రంగాల్లోకి చొరబడిన స్తబ్దత, అచేతనత్వం నిస్సందేహంగా కేంద్రం సృష్టించినవే.
ప్రధాని చెప్పిన మాటలు కొత్తవేమీ కాదు. ఎవరికీ తెలియనవీ కావు. 1.తెలంగాణాపై తీసుకునే నిర్ణయానికి జాతీయ ప్రభావం వుంటుంది.2.ప్రశాంత పరిస్తితులు నెలకొనకుండా పరిష్కారం చేయలేము 3. దీనిపై జాతీయ సంప్రదింపులు అవసరం 4.పరిష్కారం పెనంమీద నుంచి పొయ్యిలోకి పడినట్టుగా వుండకూడదు. - ఇవి ఆయన చెప్పిన దానిలో నాలుగు అంశాలు. అంటే రాష్ట్ర విభజన గాని,రాజ్యాంగ ఏర్పాటు గాని చేయబోవడం లేదని దీన్నిబట్టి స్పష్టం అవుతున్నది. గత వారంలో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధులు పరిపరివిధాల మాట్లాడిన దాన్నే ప్రధాని క్రోడీకరించారని చెప్పాలి. ఇవన్నీ తెలిసి కూడా రాష్ట్రంతో చెలగాటమాడడం ప్రజలను అనిశ్చితికి గురి చేయడం కేంద్రం దోషమైతే దానిపై కొండంత నమ్మకంతో వుండటం ఇతరుల దోషం. ప్రధాని ప్రకటన తర్వాత టిఆర్‌ఎస్‌ అద్యక్షుడు కె.సి.ఆర్‌. శాపనార్థాలు పెట్టారు గాని తమకేవో సంకేతాలు అందతున్నాయని ఎప్పటికప్పుడు ఎందుకు చెప్పారనేదానికి ఆయన కూడా సమాధానం చెప్పవలసే వుంటుంది. నవంబరులో విభజన జరిగిపోతుందని ప్రకటించిన కోదండరామ్‌ కూడా ఆ పొరబాటుకే జవాబుదారి కాకతప్పదు.
నా వరకు నేను 2009 డిసెంబరు 10న ఎన్‌టివి చర్చలోనే అంతకు ముందు రాత్రి చిదంబరం చేసిన ప్రకటన పరిమితులు చెప్పాను, అది అంతిమ వాక్యం కాదనీ అన్నాను. దేశంలో పాలకవర్గాలు ముఖ్యంగా కాంగ్రెస్‌ తీరుతెన్నులు అలానే
వుంటాయి. మాయావతి పాలనా కాలం ముగింపులో నాలుగు రాష్ట్రాల పల్లవి ఎత్తుకోవడం రాజకీయ గందరగోళానికి తప్ప మరెందుకు? మమతా ఎన్నికలు ముందు గూర్ఖాలాండ్‌ వాదులతో చేయి కలిపి తర్వాత స్వయం పాలనా మండలితో ఎందుకు సరిపెట్టింది?చిన్న రాష్ట్రాలు కావాలనే బిజెపి మాయావతి ప్రకటనను ఎందుకు హర్షించడం లేదు? చెప్పాలంటే స్వార్థ రాజకీయాలలో ఇలాటివి సర్వసాధారణం. ప్రాంతం పేరిట ఎన్ని గంభీరోక్తులు పలికినా వాటితోనే సమస్యలు తీరవు, విధానాలు మారకుండా విభజనలతోనే పరిస్తితులూ బాగు పడవు.
ఇప్పుడు ప్రధాని ప్రకటనపై కెసిఆర్‌ ప్రభృతుల స్పందన, ప్రతిఘటన ఎలా వున్నాయనేది చూస్తే అనేక ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి. ఏదో విధంగా ఈ నిర్ణయంపై నిరసన గట్టిగానే ప్రకటించడానికి తెలంగాణా ప్రాంత నాయకులు ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదు. అయితే కేంద్రం అనుకూలంగా కనీసం అనిశ్చితంగా వుందన్నప్పటి పరిస్తితికి లేదని తేలిపోయిన తర్వాత పరిస్థితికి తప్పక తేడా వుంటుంది. అధికధరలు, కరువు, వ్యవసాయ సంక్షోభం, వగైరా అనేకానేక సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు నిరంతరం ప్రాంతీయ చుట్టూనే ప్రదిక్షణం చేస్తూ వుండరు. దైనందిన జీవిత సమస్యలు వారికి వాస్తవాలు తెలియజేస్తాయి. ప్రాంతీయ రాజకీయాలలో వారి పాత్ర కూడా దానిపైనే ఆధారపడి వుంటుంది.

No comments:

Post a Comment