Pages

Wednesday, November 23, 2011

దర్యాప్తులు, ద్వంద్వనీతులు

ఏడాది పాలన పూర్తి చేసుకున్నందుకు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సంతోషించే తరుణం. ఇప్పుడే ఆయనకు ప్రధాన ప్రత్యర్థులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఉభయులూ న్యాయ పోరాటాలు, దర్యాప్తుల వ్యవహారంలో చిక్కుకోవడం ఒక విచిత్రమైన పరిణామం. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం చర్చ కూడా వెనక్కు పోయింది. ఈ ముగ్గురిలో తక్కిన ఇద్దరూ కుమ్మక్కయినట్టు మూడోవారు ఆరోపిస్తుంటారు గాని వాటిని ప్రజలు అంతగా పట్టించుకోరు. అలాటి అవసరార్థపు అదృశ్య అవగాహనలున్నా పెద్ద ప్రాధాన్యతా వుండదు.
తెలుగు దేశం అధినేత ఆస్తులపై దర్యాప్తు జరపాలన్న హైకోర్టు ఆదేశాలు రాష్ట్ర రాజకీయాలలో కొత్త సంచలనం తీసుకొచ్చాయి. ఇందిరా గాందీ ఎన్నిక రద్దుతో సహా - కోర్టుల తీరు ఎప్పుడూ ఆలాగే వుంటుంది. న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి కలిగివున్నందున దాని నిర్ణయాలపై ఎవరూ వ్యాఖ్యానించరు. తమ వాదన వినకుండానే విచారణకు ఆదేశాలిచ్చారన్నది ఇక్కడ తెలుగుదేశం ప్రధాన ఫిర్యాదు. సాంకేతికంగా చూస్తే జగన్‌ కేసులోనూ సిబిఐ సీల్డు కవరు ఉపయోగించకుండానే నిర్ణయం ప్రకటించినట్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఇప్పుడు కూడా బహుళ సంస్థల ద్వారా ప్రాథమిక దర్యాప్తు జరిపించి అలాగే చెప్పొచ్చు. తెలుగు దేశం నేతలు తమపై విశేష ప్రభావం చూపే ఈ కేసులో జోక్యానికి ముందే ఎందుకు ప్రయత్నించలేదో తెలియదు. స్టేలు తెచ్చుకుంటారన్న విమర్శకు వెరిచి వెనకడుగు వేశారా లేక తేలిగ్గా అంచనా వేశారా? మొత్తంపైన ఈ పరిణామంతో వారిలో కొంత తడబాటు కనిపిస్తుంది. ప్రాంతీయ సమస్యనుంచి ఎలాగో బయిటపడ్డామన్నంతలో ఇది చుట్టుకుందన్న దిగులూ వెంటాడుతుంది.సుప్రీం కోర్టు ఆదేశాలు అనుకూలమా కాదా అన్నదానిపైన కూడా భిన్నమైన అంచనాలున్నాయి.

ఇప్పటికే కొనసాగుతున్న ఒఎంసి, ఎమ్మార్‌, జగన్‌ కేసుల దర్యాప్తుల్లో చాలా అంశాలు వస్తున్నాయి. దర్యాప్తు సాగేకొద్ది
మరిన్ని పెద్ద తలకాయల పేర్లు కూడా వచ్చే అవకాశాలు స్పష్టం. ఈ సందర్బంలోనే అధికారుల పాత్ర ప్రత్యేకించి చర్చనీయమై పోయింది. ఎప్పుడైనా కార్పోరేట్‌ శక్తుల ప్రేరణతో రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు చేతులు కలిపితేనే అవినీతి సాధ్యం. ఐఎఎస్‌ అధికారి శ్రీలక్ష్మి, మైనింగ్‌ శాఖ డైరెక్టర్‌ రాజగోపాల్‌ వంటివారి విచారణ ఆ కోవలోదే. బాధ్యతాయుతమైన అధికారులు తాము ప్రభుత్వాధినేతల ఆదేశం ప్రకారం అసహాయ స్తితిలో సంతకాలు చేశామంటే కుదిరేది కాదు. అమాత్యులు మారిపోవచ్చు గాని అధికారులు అలాగే వుంటారు. ఎవరైనా సరే ప్రజాధనం ఫలహారమై పోతుంటే దోహదపడమని ఏ నిబంధనావళి చెబుతుంది?చాలా సందర్బాల్లో మంత్రులు ఎంఎల్‌ఎలు సహితం తమ మాట అధికారులు వినడం లేదని వాపోతుంటారు. మంత్రుల మాట కాదంటే బదిలీ చేయడం తప్ప ఏం కొంప మునుగుతుంది?సేవ చేసేవారికి శక్తిగల వారికి ప్రధాన అప్రధాన శాఖల బాద్యతల మీమాంస ి ఏముంటుంది? అసలు అవినీతి రాజకీయ వేత్తలలో తప్ప అధికారులలో లేదా?వారిలో పలువురు మంచి వారున్నా వక్రమార్కులు కూడా తక్కువ కాదని ప్రతివారికీ తెలుసు. కనక ఇప్పుడేదో నియమావళిని సవరించడం, రక్షణ కల్పించడం గురించి రభస హాస్యాస్పదం. ఉన్న చట్టాలను సక్రమంగా ప్రజాహిత కోణంలో అమలు చేస్తే చాలు. సమస్య అవినీతికి నీతికి మధ్య సంఘర్షణ తప్ప అధినేతలకూ అధికారులకూ తేడా చూడడం కాదు.
జగన్‌ యుపిఎను కేంద్రంలో బలపరుస్తానని చెప్పడం, ఓదార్పు సభల్లో కేంద్రంపై విమర్శలు లేకపోవడం వెనక ఈ కారణాలన్ని వున్నాయా? రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలలో కూడా మునుపటి తీవ్రత తగ్గి తెలుగుదేశంపై ప్రధానంగా దాడి పెరగడం నిజం కాదా? రాజీనామా చేసిన జగన్‌ వర్గ ఎంఎల్‌ఎలు చాలామంది ప్రభుత్వాన్ని బలపరుస్తూ గృహౌన్ముఖులవడం వెనకా ఇలాటి కారణాలున్నాయా? తమ వెంట కనీసం యాభై అరవై మంది ఎంఎల్‌ఎల వరకూ వున్నారని, ప్రధాన ప్రతిపక్షం కలిసి వస్తే ప్రభుత్వం కూలిపోతుందని సవాలు చేస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు అవిశ్వాసానికి సిద్ధమని ప్రకటించే సమయానికి అదంతా మారిపోయింది! కనకనే టిఆర్‌ఎస్‌ తీర్మానానికి మద్దతు నిస్తానంటున్నప్పటికీ ప్రభుత్వ మనుగడకు అవసరమైన సంఖ్యాబలం వున్నట్టే కనిపిస్తుంది. అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప అవిశ్వాస తీర్మానం రాజకీయ ప్రదానంగానే మారొచ్చు.సమస్యలు పేరుకుపోయి అనిశ్చితి ఆవరించిన ప్రస్తుత తరుణంలో ఎందుకైనా సరే విధానాలపై చర్చ జరగడం మంచిదే.
శాసనసభను అటుంచి ఢిల్లీకి వెళితే రాష్ట్రాన్ని విభజించే అవకాశం లేదని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కొంత సూటిగా చెప్పినప్పటికీ అంతిమ వాక్యం వెలువడలేదు. తెలంగాణా ఎంపిలు పార్లమెంటులో రభస చేసినప్పటికీ ఇప్పట్లో ఎలాటి నిర్ణయమూ వచ్చే అవకాశం దాదాపు కనిపించడం లేదు. యుపి ముఖ్యమంత్రి మాయావతి హడావుడిగా నాలుగు రాష్ట్రాల విభజన తీర్మానం చేసినా దాని ప్రభావం ఇక్కడేమీ అక్కరకు వచ్చేది కాదు. ౖ చిన్న రాష్ట్రాల సూత్రధారి బిజెపి యుపిలో భిన్నరాగమాలపించడం, కాంగ్రెస్‌ స్పందించకపోవడం వాటి ద్వంద్వ నీతికి దర్పణం.. రాష్ట్రాలు ప్రాంతాలు ఏవైనా పాలక వర్గాలు స్వప్రయోజనాలకే పాకులాడతాయని ఈ ఉదంతం స్పష్టంగా నిరూపిస్తోంది. ఏ చర్చ లేకుండా అయిదు నిముషాలలోనే మూజువాణి ఓటుతో యుపి శాసనసభ తీర్మానం ఆమోదించిన తీరుపైనే అక్కడి పార్టీలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశాయి. దాన్ని కేంద్రానికి ఎప్పుడు పంపుతారు, వారు ఎలా స్పందిస్తారు రాష్ట్రపతి ఏం చేస్తారు ఇవన్నీ చూడాల్సిన విషయాలు. 2007 లో లేఖ రాసి వూరుకున్న మాయావతి ఇప్పుడు క్షణాల మీద నాలుగు రాష్ట్రాల తీర్మానాన్ని ఆమోదించడం నిజంగా ప్రజల కోసమేనా? అంబేద్కర్‌ చిన్న రాష్ట్రాలని చెప్పడం నాలుగేళ్లు గుర్తుకు రాలేదా? అంబేద్కర్‌ వాదనలోని పొరబాటును ఆ నాడే సుందరయ్యవంటి వారు పార్లమెంటులోనే చెప్పడం నిజం కాదా? ఈ దేశంలో ఇద్దరు పార్లమెంటు సభ్యులు వున్న రాష్ట్రాల నుంచి 80 మందిని ఎన్నుకునే వాటి వరకూ వున్నాయి. వీటి అభివృద్ధి వెనకబాటు రకరకాలుగా వున్నాయి తప్ప చిన్న వన్నీ గొప్పగా లేవు. ఇది లెక్కలు చెబుతున్న సత్యం. విధానాలు మార్చకుండా విభజనలతోనే విముక్తి వస్తుందని వాదించడం ఆయా పార్టీల వ్యక్తుల రాజకీయ ప్రయోజనాలకే పనికి వస్తుంది. పార్లమెంటులో తమ నిరసన తర్వాత సోనియా గాంధీకి నమస్కారం చేస్తే ఆమె బాడీ లాంగ్వేజ్‌ సంతోషంగా కనిపించిందని కాంగ్రెస్‌ ఎంపి మందా జగన్నాథం ఒక చర్చలో అన్నప్పుడు యాక్చువల్‌ లాంగ్వేజి ప్రధాని వినిపించారు గదా అని నేనన్నాను. అది వారి ఇష్టమని సరిపెట్టుకున్నా కేంద్రం నుంచి రాని సంకేతాలు వస్తున్నాయని చెప్పడం, రేపు డిసెంబరు 10 న ఏదో వొరిగి పడుతుందని వూరించడం ఆత్మ సంతృప్తికే పనికివస్తుంది. ఎపి వేరు, యుపి వేరు.రెండు చోట్ల రెండు పెద్ద పార్టీల రాజకీయ బలాబలాలు కూడా వేరు. అవకాశవాద విన్యాసాలు మాత్రం అన్నిచోట్లా ఒక్కటే. ఆ రాజకీయ మాయాజాలంలో పడి పరిభ్రమించే బదులు మండిపోతున్న ధరలు, కూలిపోతున్న రూపాయి విలువ, చితికిపోతున్న బతుకులు, ముంచుకొస్తున్న అణు ఒప్పందం అపాయకరమైన మలుపులు వగైరాలను గురించి ఆలోచించడం అడ్డుకోవడం అవసరం.మొదట్లో ప్రస్తావించుకున్నట్టు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కూడా ఏడాది పూర్తయిన సందర్భంలో వృథా పథకాల జాతరలో వూదరగొట్టే బదులు పేరుకుపోయిన సమస్యల పరిష్కారం దిశలో చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటారు. అంతర్గత సవాళ్లు సద్దుమణిగాయి గనక ఇప్పటికైనా పాలనపై దృష్టి పెట్టి ప్రజల ప్రజా సంఘాల, ప్రతిపక్షాల, స్వపక్ష ప్రతినిధుల అభిప్రాయాలు వింటూ అన్ని ప్రాంతాల తరగతుల ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు చేపడతారని ఆశిస్తారు.తెలంగాణా, జగన్‌ రెండు సమస్యల ఆయన చేతిలో లేవు గాని ప్రజల సమస్యల పరిష్కారం మాత్రం ఆయన చేతుల్లోనే వుంది.ఆ దిశలో ఏదైనా చేస్తే ప్రజల మద్దతు కూడా లభిస్తుంది.
(ఆంధ్రజ్యోతి గమనం 24,11,11)No comments:

Post a Comment