Pages

Thursday, November 10, 2011

మరో చరిత్రారంభం...

. కార్పొరేట్‌ స్వాప్నికుల కలలు కల్లలై కల్లోలాలు చుట్టుముడుతున్నాయి. చరిత్రాంతం భాష్య కారుల నోళ్లు మూత పడుతున్నాయి. మహా కథనాల మహా ప్రస్థానం మళ్లీ మొదలవుతున్నది. జోస్యాలన్ని అపహాస్యాల పాలవుతున్నాయి. విత్త విపణి విన్యాసాలన్ని వీగిపోతున్నాయి. ప్రతిఘటననూ ప్రజా చైతన్యాన్ని అపహాస్యం చేసిన అపర మేధావుల తలలు వాలిపోతున్నాయి. ఇవన్నీ నిజమేనా అనే సందేహ మందేహులుంటూ వాల్‌ స్ట్రీట్‌ దృశ్యాలు సమాధానం చెబుతున్నాయి.అక్కడిదాకా ఎందుకంటే కటకటాల్లో విఐపి హౌదా పొందిన గాలి జనార్ధనరెడ్డి ఇనుప సత్యాలను చెప్పడానికి సిద్దంగా వున్నాడు.అక్కడికీ అనుమానం తీరకపోతే తమిళ పొన్ను కనిమొళి కరుణార్ద్ర ఘట్టం కళ్లకు కడుతున్నది. సత్యం రామలింగరాజు స్వానుభవ కవిగా అందుబాటులో వున్నాడు. విదియ నాడు కనిపించని చంద్రుడు తదియ నాడు తానే కనిపించినట్టు ప్రపంచీకరణ పేరిట మొదలై నిరాఘాటంగా కొనసాగిన నిలువు దోపిడీ నిర్వాకాలకు నిదర్శనాలుగా ఇలాటివి ఎన్నయినా చూపించవచ్చు.ఈ నిలువు దోపిడినే శాశ్వతమని విశ్లేషించిన విపరీత సిద్ధాంత కారులకు సమాధానం వాల్‌స్ట్రీట్‌ నుంచి మంగళవారం భారత కార్మిక వర్గం అఖిల భారత సమ్మె పోరాటం వరకూ ప్రతి చోటా లభిస్తున్నది. చరిత్రాంతం కాదు, సరికొత్త సమర శీల చరిత్రకు అంకురార్పణ జరుగుతున్నది.
అమెరికా ప్రస్తుతానికి ప్రపంచ ఏకైక అగ్రరాజ్యం వుగ్ర రాజ్యం కూడా గనక- పోలీసు తలారి న్యాయమూర్తి కూడా గనక - అక్కడ పరిణామాలకు ప్రత్యేక ప్రాధాన్యత. అక్కడ చీమ చిటుక్కుమన్నా ప్రపంచమంతటా ప్రచార ప్రకంపనలే. అయితే అమెరికా ప్రపంచ దేశాలను వరుసగా అక్రమిస్తుంటే లేదా అక్కడే వాల్‌ స్ట్రీట్‌ ను అక్రమించడమేమి చిత్రం? ఎవరో ఇస్లామిక్‌ టెర్రరిస్టులు వచ్చి దాడి చేయకుండా ప్రతిచోటా తలదూర్చే ఆ మహాదేశాధినేతలు వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ దారుల ధాటికి
తల్లడిల్లిపోవడమదేమిటి? ఇంతటి అఘాయిత్యానికి తలపడిన ఆ తుంటరుల దుశ్చర్యను మహా విశ్వపు చానెళ్లు విస్త్రతంగా చెప్పకపోవడానికి ఏమి కారణం? 180 దేశాలలో మార్మోగుతున్న నిరసనలు కంటికి ఆనడం లేదా? ఇదే విధమైన ప్రదర్శనలు ఏదైనా దేశంలో చెప్పాలంటే చైనాలో జరిగివుంటే బిబిసి, సిఎన్‌ఎన్‌లు ఇలాగే వుండేవా? వూదరగొట్టేవి కావా? వాల్‌స్ట్రీట్‌లో ఫుట్‌పాత్‌లపై నడవడం కూడా ఆంక్షలకు గురైతే ఆమ్నెస్టీలు హక్కుల యోధులు ఏం చేస్తున్నట్టు?అబ్రహాం లింకన్‌ ఆత్మ సమాధిలోంచి ఘోషించడం లేదా? మేడిపండు వంటి మీడియా స్వేచ్చ మేత మేయడానికి పోయిందా?
గతంలో జరిగిన అనేకానేక నిరసనలకూ వాల్‌స్ట్రీట్‌ వ్యవహారానికి హస్తిమశకాంతరం తేడా వుంది. సోవియట్‌ విచ్చిన్నానంతరంఏకధృవ ప్రపంచంలో పెట్టుబడిదారీ విధానమే అంతిమ వాక్యమని తేలిపోయిందని చెప్పిన ఏకాక్షులకు కిది దిమ్మ తిరిగే సమాధానం. మన దేశంతో సహా చాలా చోట్ల సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగిన మాట నిజం.జరుగుతున్న మాట నిజం.వామపక్షాలు ప్రజాసంఘాలు కొన్ని సందర్భాల్లో ఇతరులు కూడా ఈ పోరాటాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ విధానాలతో పేచీ లేని పాలక వర్గ పార్టీలు కూడా ప్రతిపక్షంలో వుంటే పోటీ పడి ఖండిస్తున్నారు. భూ పందేరాలు, సెజ్‌లు, ప్రైవేటీకరణలు, ఉద్యోగాల కోతలు, వ్యవసాయ సంక్షోభాలు. అధిక ధరలు భారాలు వగైరాలపై ఆందోళలను జరుగుతున్నాయి.అవినీతి విజృంభణపై ఆగ్రహం మిన్నుముడుతున్నది. అయితే ఇవన్నీ మూలాలను ముట్టుకుంటున్నట్టు చెప్పలేము. సమస్యల తీవ్రతకు వ్యతిరేకంగా వాటినుంచి కాస్తయినా ఉపశమనం సాధించుకోవడం కోసం జరుగుతున్న పోరాటాలే ఇవి. అమిత ప్రచారం పొందిన అన్నా హజారే కూడా అవినీతి పోకడలను ఖండించడం తప్ప వాటికి మూలాలను ప్రస్తావించింది లేదు. టుజి స్పెక్ట్రం వ్యవహారమే తీసుకుంటే అంత పెద్ద కుంభకోణం తర్వాత 2011 నవంబరులో ప్రకటించిన నూతన విధానం కూడా అక్షరాల అదే కోవలో వుంది! జలయజ్ఞం అవకవతవకలపై ఇంత అలజడి జరిగిన తర్వాత పోలవరం టెండర్ల ఆమోద ప్రహసనం మక్కీకి మక్కిగా పాత ఫక్కీనే తలపించింది. పైపెచ్చు ఇందులో ప్రాంతాల పార్టీల తేడా లేకుండా మోతుబరులందరూ వాటాదారులేనని తేలిపోయింది. గాలి అరెస్టు బాగానే వుంది గాని మైనింగ్‌ మాఫియాను పెంచి పోషించే గనుల ప్రైవేటీకరణ విధానం యథాతథంగా కొనసాగుతున్నది. వీటన్నిటిలోనూ విదేశీ కంపెనీలతో సహా కార్పొరేట్‌ కబంధ హస్తాలున్నాయన్నది కప్పిపుచ్చలేని సత్యం.
ఇప్పుడు వాల్‌ స్ట్రీట్‌ ఆక్రమణలో ఆ కార్పొరేట్‌ పెట్టుబడుల దోపిడీనే ప్రశ్నిస్తున్నారు. ప్రతిఘటిస్తున్నారు. మేము మాడిపోతుంటే మీరు వైభోగాలు వెలగబెడతారా అని నిలదీస్తున్నారు. రెండు మూడేళ్ల కిందట సబ్‌ ప్రైమ్‌ సంక్షోభం ముంచుకువచ్చినప్పుడు దిగిపోతున్న బుష్‌ కొత్తగా వస్తున్న ఒబామా కూడబలుక్కుని భారీ బెయిలవుట్‌ ఇచ్చి ఆదుకున్నారు. అయినా ఆ సంక్షోభం తగ్గక పోగా ఇప్పుడు యూరప్‌ను చుట్టుముట్టింది. మన్మోహన్‌ సింగ్‌తో సహా దేశాధినేతలంతా కలసి తలలు పగల గొట్టుకున్నా తరుణోపాయం తట్టలేదు. చివరకు మరీ పీకల్లోతున మునిగిన గ్రీసును ఆదుకోవడానికి ఒక పథకం సిద్ధం చేసి అక్కడ ప్రధానిని మార్చి అన్ని పార్టీల ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు.అయితే ఇంతలోనే ఇటలీ ఆర్తనాదాలు చేయడం మొదలెట్టింది. చెప్పాలంటే ఆ దేశాలన్నిటిలోనూ ఇదే ఆర్థిక దురవస్థ ఆవరించింది. ఇండియాలో మనం చూస్తున్న కార్పొరేట్‌ కుంభకోణాలు ప్రజా పోరాటాలు అంత తీవ్రంగా కనిపించడం లేదంటే కారణం అవి మనకన్నా సంపన్నమైన సంప్రదాయక పెట్టుబడిదారీ దేశాలు కావడమే. ఒక శాతం వ్యక్తుల చేతుల్లో అత్యధిక సంపద కేంద్రీకృతమైన అమెరికాలో మిగిలిన వారంతా వాయిదాల పద్దతిపై బతుకుతున్నవారే. కాని మన దేశం వంటి చోట్ల కొద్దొ గొప్పొ మద్య తరగతి వుండటం, వారిపైన ప్రపంచీకరణ భ్రమలు ఇంకా తొలగకపోవడం కారణం కావచ్చు. కాని ఆ విధానాలు పరాకాష్టకు చేరిన అమెరికా వంటి చోట్ల పరిస్తితి వేరు.కనకనే వారు నేరుగా పెట్టుబడిదారీ విధానాన్నే ప్రశ్నిస్తున్నారు. సోవియట్‌ తదితర చోట్ల సోషలిజం దెబ్బతిన్నప్పటికీ ఈ విధానం శాశ్వతమనుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
నిజానికి వాల్‌ స్ట్రీట్‌ ఉద్యమ కారులు నిర్దిష్టమైన కోర్కెలేవీ లేవనెత్తలేదు. కాని ఆ వ్యవస్థనే అభిశంసించడం ద్వారా మార్క్సిస్టు మూల సూత్రాలను పరోక్షంగా పునరుద్ఘాటిస్తున్నారు. దివాళా తీసిన ప్రజలను వదిలిపెట్టి కార్పొరేట్లకు బెయిలవుట్లు ఇచ్చే దుర్నీతిని సవాలు చేస్తున్నారు. అవినీతి ఆర్థిక దోపిడీ కేవలం నైతిక సమస్యలు కాదని, ఆస్తిపాస్తులు వనరులపై ఆధిపత్యానికి సంబంధించిన కీలకాంశాలని వారు చాటి చెబుతున్నారు.అదే ఈ ఉద్యమ ప్రత్యేకత.ఇతరత్రా కూడా ప్రపంచంలో ప్రగతిశీల శక్తులు నిలదొక్కుకుంటున్నాయి. నికరాగ్వాలో ఒకప్పుడు అమెరికా వెంటాడి వేధించిన డేనియల్‌ ఒర్టేగా పునరాగమనం వాటిలో ఒకటి. లాటిన్‌ అమెరికా దేశాలలో వామపక్ష ప్రత్యామ్నాయప్రభుత్వాల విజయాలు కొనసాగుతూనే వున్నాయి. మరోసారి అంతర్జాతీయ కమ్యూనిస్టు,వర్కర్స్‌ పార్టీల మహాసభకు సన్నాహాలు సాగుతున్నాయి. రష్యాలో పుతిన్‌ ప్రభుత్వం కమ్యూనిస్టు పత్రికలను స్వాధీనం చేసుకుంటే తప్ప ఎన్నికలను ఎదుర్కొవడానికి భయపడే స్తితి వచ్చింది. రెండు దశాబ్దాలలోనే ప్రపంచ ముఖ చిత్రం ఇన్ని పరిణామాలు చూస్తుందని చరిత్రాంతం సూత్రకారులు ఆదునికాంతర సిద్దాంత వేత్తలు వూహించి వుండరేమో కాని అవి నిజంగా నిజాలు.
ఇండియాలో ఈ కఠోర వాస్తవాలు మరింత నగంగా వెల్లడవుతున్నాయి. మన్మోహనామిక్స్‌ అనబడే సరళీకరణ స్రష్ట దేశాధినేతగా వుండి పెట్రోలు ధరల మోత తప్పదని సెలవిస్తున్నాడు.ఆయనే గోదాముల్లో మక్కిపోతున్న ధాన్యాన్ని పేదలకు పంచి పెట్టమని న్యాయస్థానాలు చెబితే ససేమిరా వీల్లేదన్న ఫ్లాష్‌ బ్యాక్‌ ప్రజల కళ్లముందు కదలాడుతున్నది. మిశ్రమ అధర్మం ప్రకారం అవినీతి పరులను మంత్రివర్గంలో చేర్చుకోక తప్పదని సెలవిచ్చిన ఆయన వాస్తవికతకూ లోకం విస్తుపోయింది. అయితే అంతర్జాతీయ పెట్టుబడి ఆమోదం కొరకు ఆయన బొమ్మ అవసరం అనుకున్న అధిష్టానం ఇప్పుడు ఆ అవసరం తీరిపోయిందనుకుని యువరాజు రాహుల్‌ను తెరపైకి తెస్తున్నదేమోనని అనుమానాలు ప్రబలుతున్నాయి. ఆయన సంగతి అలా వుంటే అన్నా హజారే బృందం ఆరోపణల వరదలో వుక్కిరిబిక్కిరవడం కూడా వ్యక్తి ప్రధాన ఉద్యమాల పరిమితులను వెల్లడిస్తున్నది.
విధానాలు మార్చకపోయినా విగ్రహాలు మార్చడం పాలకవర్గ నీతిలో భాగమే. అమెరికా సంస్థలు కూడా ఎంచక్కా రాహుల్‌ గాంధీని నరేంద్ర మోడీని ఎదురెదురుగా నిల్పి రాబోయే ఎన్నికల్లో వీరిద్దరే వుంటారన్న భావన వ్యాపింపచేస్తున్నది. అవాస్తవికం ఆకాశానికెత్తబడిన మోడీ వరుసగా కోర్టు దెబ్బలు తింటుంటే ఆయన ముందు తలవంచలేని రథారూఢుడు అద్వానీ కళ్లనీళ్ల పర్యంతమవుతున్నాడు. ఆర్థికాభివృద్ది రేటు గురించి అతిశయోక్తులు ఆకాశమంటిన ఈ దేశంలోనే రోజుకు 32 రూపాయల ఆదాయం సరిపోతుందని ప్రణాళికా సంఘం లెక్కలు చెప్పి మొట్టికాయలు వేయించుకుంది. ఇవి మన వాల్‌ స్ట్రీట్‌ దృశ్యాలు. ఆంధ్ర ప్రదేశ్‌లో రెండేళ్లలో ఆరువేలమందికి పైగా రైతుల ఆత్మహత్యలు.. ప్రాంతీయ సమస్యలో చెప్పే ఆరువందల యువకుల ఆత్మహత్యలు కూడా ఉద్యోగాలు రాలేదన్న ఆవేదన ఫలితాలే. సరిహద్దులు దాటి సంహారం సాగిస్తున్న ప్రపంచీకరణ విష ఫలితాలపై జరగాల్సిన పోరాటం ప్రజల మధ్య ప్రాంతాల మధ్య పోరాటంగా మారడం మనం చూస్తుంటే అమెరికాతో సహా 180 దేశాలలో ప్రజలు నేరుగా కార్పొరేట్‌ కుంభస్థలంపైనే లంఘిస్తున్నారు. అమెరికాలోనే సీతారాం ఏచూరి ఒక ప్రసంగంలో చెప్పినట్టు సంస్కరణలు సమానత్వాన్ని పెంచాలి గాని సంపద దోచుకోవడానికి సాధనాలు కాకూడదు. ప్రజల జీవన భద్రత పెంచాలి గాని ప్రైవేటీకరణ కాటుకు బలిచేయకూడదు.
సరిగ్గా ఇలాటి సమయంలోనే దేశ వ్యాపితంగా ఇరవై లక్షల మంది కార్మికులు వినాశకర ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా సమ్మె చేయడం గొప్ప పరిణామం. ఆయా చోట్ల ఆయా సందర్బాలలో సాగుతున్న రకరకాల పోరాటాల తారాస్థాయిగా దీన్ని పరిగణించవచ్చు. రాష్ట్రంలోనూ ఈ సమ్మె ప్రాంతాలకు అతీతంగా జయప్రదం కావడం స్వాగతించదగింది. ఇలాటి పోరాటాలే రేపటి భారతాన్ని ప్రపంచాన్ని కూదా కాపాడగలుగుతాయి. సమయం పట్టవచ్చు గాని సరైన మార్గం మాత్రం అదే.
(ఆంధ్రజ్యోతి గమనం - 10.11.11)

2 comments:

 1. /అమిత ప్రచారం పొందిన అన్నా హజారే కూడా అవినీతి పోకడలను ఖండించడం తప్ప వాటికి మూలాలను ప్రస్తావించింది లేదు. /

  మూలం: పెట్టుబడిదారీ బూర్జువా విధానం - అంతేనా?!!
  ఏకైక పరిష్కారం: సామ్యవాద వామపక్ష మార్క్స్ విధానం- అంతేనా?!!

  అయితే ఓ సందేహం: మరి సోవియట్ ఎందుకు విచ్చిన్నమైంది?! చైనా ఎందుకు పెట్టుబడిదారీ విధానం అవలంభించింది? ఇవేవి చెప్పకుండా... అమెరికా వాపు వామపక్షాల బలుపు అని ఎలా చెప్పగలరు?
  (వ్యాఖ్య డిలీట్ చేసి వూపిరి పీల్చుకుని, వామపక్ష వ్య్తిరేక వర్గశతృనిర్మూలన చేసిన అనుభూతిపొందుదామనుకుంటే, నా అభ్యంతరమేమీ లేదు, తీసేసుకోండి. :) )

  ReplyDelete
 2. This comment has been removed by the author.

  ReplyDelete