జగన్ ఆస్తులపైన గాలి జనార్ధన రెడ్డి మైనింగ్ అక్రమాలపైన దర్యాప్తు సాగిస్తున్న సిబిఐ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తులపైన కూడా దర్యాప్తు ప్రారంభిస్తున్నది. హైకోర్టు ఆదేశాలు ఆకస్మికంగానూ అనూహ్యంగానూ రాష్ట్ర రాజకీయాలలో కొత్త సంచలనం సృష్టించాయి. ఇందిరాగాందీ ఎన్నిక రద్దు నుంచి ఇప్పటి వరకూ కూడా న్యాయస్థానాల ఆదేశాలు తీర్పులు రాజకీయాలను విశేషంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రజా జీవితంలో ప్రభుత్వాల నిర్వహణలో కీలక పాత్రధారులైన నాయకులపైన ఆరోపణలు వచ్చినపుడు విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చడం అవసరమే. ఈ విషయంలో కోర్టుల ఆదేశాల వరకూ ఎవరూ వేచి వుండనవసరం లేదు న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి కలిగివున్నందున దాని నిర్ణయాలపై వ్యాఖ్యానించడం అరుదుగా తప్ప జరగదు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని నిర్ణయాలు ౖ తీవ్ర ఆరోపణలు విమర్శలున్న మాట నిజం. రెండు సార్లు ఆయన ఎన్నికల్లో దెబ్బ తినడం వెనక ఈ ప్రభావాలు కూడా వుంటాయి. అయితే న్యాయశాస్త్ర పరంగా వీటిపై గతంలో కాంగ్రెస్ నాయకులు అనేక సార్లు కేసులు వేసి విఫలమైనారని తెలుగు దేశం నేతల వాదన. అది నిజమే అయినా ఇప్పుడు న్యాయ స్థానమే ఇలాటి ఆదేశాలిచ్చింది గనక ఆహ్వానించడం తప్ప గత్యంతరం లేదు. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్తారా లేదా అన్నది వారి అంచనాలపైన ఆలోచనల పైన
ఆధారపడి వుంటుంది. ఈ లోగా రాజకీయంగా వాదోపవాదాలు వాగ్వివాదాలు ఎలాగూ జరుగుతూనే వుంటాయి.
వైఎస్ .జగన్ తల్లి గారైన విజయమ్మ వేసిన పిటిషన్ కారణంగా ఈ ఆదేశాలు వచ్చాయి గనక రాజకీయ దురుద్దేశాలున్నాయని తెలుగు దేశం నేతలు ఆరోపిస్తున్నారు. జగన్‌పైన కేసులో ఎర్రం నాయుడు తదితర తెలుగుదేశం నేతలు కూడా చేరారు గనక తాము అదే మార్గం అనుసరించామనేది జగన్ వర్గం వాదన సారాంశం. పైగా విజయమ్మ పిటిషన్‌లో తమ ఆడిటర్ విజయసాయి రెడ్డి( జగన్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి) సాయం తీసుకున్నట్టు కూడా స్పష్టంగానే పేర్కొన్నారు. కనక ఈ పిటిషన్లకు రాజకీయ స్వభావం వుందనడంలో సందేహం లేదు. 2009 ఎన్నికల పోరాటం, వైఎస్ మరణానంతరం అంతర్గత పోరాటం, ఆ తర్వాత ప్రాంతాల పోరాటం గడిచి ఇప్పుడు న్యాయస్థానాల దర్యాప్తుల ప్రధానంగా రాష్ట్ర రాజకీయ చర్చ నడిచే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతివారూ ఆవతలి వారిపై ఆరోపణలు నిజమంటూనే తమపై ఆరోపణలు కుట్ర అని విమర్శించడం పరిపాటిగా మారింది. ఆ వాదనల్లో ఏది ఎంత నిజం ఏది కాదు అన్న మీమాంస ఈ దశలో బొత్తిగా అప్రస్తుతం. అలాగే ఆయా నాయకుల వ్యక్తిగత తేడాలు ఎలా వున్నా ప్రైవేటీకరణ విధానాలు, భూముల కేటాయింపు వంటివి తెలుగు దేశం హయాంలో ప్రారంభమైన మాట కూడా నిజమే. వైఎస్ హయాంలో వాటికి సంబంధించిన వాస్తవాలను వెల్లడించిందేమీ లేదు. పైగా మైనింగ్ మాఫియాలు ఆశ్రిత పెట్టుబడిదారుల తాకిడి అనేక రెట్లు పెరిగింది. ఈ రెండు ప్రభుత్వాల హయాంలోనూ కొనసాగిన కార్పొరేట్ శక్తులు వ్యక్తులు కూడా వున్నారు. కనక నిజానిజాలు సమగ్ర దర్యాప్తులో వెల్లడి కావడం ఆహ్వానించదగింది. గతంలో ఈ అంశాలను కోర్టులు కొట్టి వేశాయన్న తెలుగుదేశం వాదన ఎలా వున్నా ఇప్పుడు స్వీకరించాయి గనక ఆ ప్రకారమే ఇప్పుడు పరిణామ క్రమాన్ని చూడవలసి వుంటుంది. దేశంలో ఇతర చోట్ల కూడా ఇలాటివి జరుగుతున్నాయి. అనేక కుంభకోణాలతో వుక్కిరి బిక్కిరవుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతలను పనిగట్టుకుని ఇరికిస్తున్నదనే ఆరోపణలు కూడా వున్నాయి.
తెర వెనక కార్పోరేట్ శక్తుల ప్రేరణతో రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు చేతులు కలిపితేనే అవినీతి వలయం పూర్తవుతుంది. గాలి జనార్థన రెడ్ది వ్యవహారంలో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి, మైనింగ్ శాఖ డైరెక్టర్ రాజగోపాల్‌ల విచారణ ఆసక్తికరమైన మలుపులకు దారి తీస్తున్నది. వారి పాత్ర ఆమోదం లేకుండా గనుల సంపద విశృంఖల దోపిడీ సాద్యమై వుండేది కాదు.2010లో ఈ ఉదంతాలు బయిటకు వస్తున్న తర్వాత కూడా వారు నోరు మెదిపింది లేదు.రాజగోపాల్ వంటివారు చాలా గట్టిగా సమర్థించుకుంటూ మాట్టాడారు కూడా. కనక ఇప్పుడు తాము ప్రభుత్వాధినేతల ఆదేశం ప్రకారం చేశాము తప్ప తమ బాధ్యత లేదని వాదిస్తే కుదిరేది కాదు. ఈ సందర్బంలోనే కొందరు ఐఎఎస్ లాబీయిస్టులు నియమావళిని సవరించడం, రక్షణ కల్పించడం గురించి రభస చేయడంలో అర్థం లేదు. ప్రజాధనానికి దేశ సంపదకు రక్షకులుగా వుండాల్సిన ఉన్నతాధికారులు పలువురు అవినీతి నేతలకు అనధికార సలహాదారులుగా సహాయకులుగా మారిపోవడం దుర్భర వాస్తవం.వీరిలో ఎవరు ఏం చెబుతారు, ఎలాటి పాత్ర నిర్వహిస్తారు అనేదాన్ని బట్టి వారిని అరెస్టు చేయడం లేదా అప్రూవర్లుగా స్వీకరించడం జరగొచ్చు.
ఎమ్మార్ వ్యవహారంలో కోనేరు ప్రసాద్ వంటివారు చెప్పిన విషయాలు కూడా ఈ కోవలోనే వున్నాయి. కొందరు అధికారులు కూడా అక్కడ సాక్ష్యమిచ్చారంటున్నారు. గతంలో లేనిది కెవిపిరామచంద్రరావు పేరు కూడా ఈ సందర్బంలో వినిపించింది. ఇక జగన్ విషయంలో ఎన్‌ఫోర్సుమెంటు డైరెక్టరేట్ పిలిపించడం కూడా కీలకమైన విషయంగా పరిగణించబడుతున్నది.గాలి గనుల కేటాయింపు విషయంలో రాజకీయ వత్తిడి జగన్ వ్యక్తిగత పాత్ర వుందా అనే దానిపైన కూడా కొన్ని నిర్దిష్టమైన ఫిర్యాదులు మీడియాలో ప్రచురితమైనాయి.ఈ విధమైన చక్రబంధం కారణంగానే కాంగ్రెస్ అధిష్టానంతో కాస్త మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారని కూడా కొన్ని మీడియా వర్గాల కథనంగా వుంది. కాగా జాతీయ ఛానెళ్లకు ఇచ్చే ఇంటర్వ్యూలలో జగన్ తాను ఎన్‌డిఎతో వెళ్లే ప్రసక్తిలేదనీ, యుపిఎను కేంద్రంలో బలపరుస్తానని చెబుతున్నారు. ఓదార్పు సభల్లో కూడా కేంద్రంపై విమర్శలు తగ్గిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలలో కూడా మునుపటి తీవ్రత తగ్గి తెలుగుదేశంపై ప్రధానంగా దాడి సాగుతుండడం అందరూ గమనించగలిగారు.
ఈ నేపథ్యంలో రాజీనామా చేసిన జగన్ వర్గ ఎంఎల్‌ఎలు కొందరు ప్రభుత్వాన్ని బలపరుస్తామని ప్రకటించారు. ప్రభుత్వాన్ని బలపరుస్తామని కూడా చెప్పారు. ఇలా వెనక్కు తగ్గడం రాజీ పడిన ఫలితమేనని తెలుగుదేశం నాయకులు ఇతరులు కొందరు అంటున్నారు. అదేమీ లేదని వైఎస్‌ఆర్ పార్టీ నేతలు ఖండిస్తున్నా తమ వర్గం ఎంఎల్‌ఎల వైఖరిలో మార్పుపై సరైన వివరణ ఇవ్వలేకపోతున్నారు. 150 మంది ఎంఎల్‌ఎలు సంతకం చేసిన నాటి పరిస్తితి మారిన తర్వాత కూడా తమ వెంట కనీసం యాభై అరవై మంది ఎంఎల్‌ఎల వరకూ వున్నారని వారు చెబుతూ వచ్చారు.తమ రాజీనామాల తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రభుత్వాన్ని పడిపోయేలా చేసేందుకు తెలుగుదేశం సహకరించడం లేదని విమర్శించారు.ఆ దశలో టిఆర్‌ఎస్ కూడా అదే విమర్శ తెచ్చింది. తీరా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవిశ్వాసానికి సిద్ధమని ప్రకటించే సమయానికి వారిలో కొందరి వైఖరి మారడం కనిపిస్తుంది. టిఆర్‌ఎస్ తీర్మానానికి మద్దతు నిస్తానంటున్నప్పటికీ ఇప్పుడున్న సంఖ్యాబలం ప్రకారం ప్రభుత్వ మనుగడకు అవసరమైన సంఖ్యాబలం వున్నట్టే కనిపిస్తుంది. చిరంజీవిని ప్రత్యేకంగా పిలిపించి తగు స్తానం కల్పిస్తామని హామీ ఇవ్వడం కూడా ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగమే. నిజానికి 1954లో కమ్యూనిస్టులు తెచ్చిన అవిశ్వాస తీర్మానం మినహా ఇంతవరకూ ప్రభుత్వం పడిపోయిన సందర్బాలు రాష్ట్రంలో లేవు. ఏవైనా అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప అవిశ్వాస తీర్మానం రాజకీయ ప్రదానంగానే మారొచ్చు.సమస్యలు పేరుకుపోయి సార్వత్రిక సంక్షోభం,అనిశ్చితి ఆవరించిన ప్రస్తుత తరుణంలో సమగ్రమైన చర్చ జరగడం కూడా మంచిదే.
కోర్టు ఆదేశాలు, అవిశ్వాస తీర్మానం చర్చతో పాటు తెలంగాణా సమస్యపైనా తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. ఇప్పట్లో తెలంగాణాను విభజించే అవకాశం లేదని ప్రధాని మన్మోహన్ సింగ్ కొంత సూటిగా చెప్పినప్పటికీ అనిశ్చితిని తొలగించే విధంగా అంతిమ నిర్ణయం మాత్రం కేంద్రం వాయిదా వేస్తూనే వుంది. సిపిఎం దీనిపై తీవ్ర విమర్శ చేసింది కూడా. కేంద్రం తరపున మాట్లాడిన నలుగురు నేతలూ తలో విధంగా చెప్పడమే గాక చిన్నరాష్ట్రాలు ఎస్‌ఆర్‌సి వంటి వాటితో తెలంగాణా సమస్యకు సంబంధం లేదని ప్రతిష్టంభన కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు.ఈ గజిబిజికి కారణమైన రషీద్ అల్వీతోనే అలాటి ప్రకటన చేయించడం కాంగ్రెస్ మార్కు రాజనీతి.యుపి ముఖ్యమంత్రి మాయావతి నాలుగు రాష్ట్రాల విభజన ప్రతిపాదనపై చిన్న రాష్ట్రాల సూత్రధారి బిజెపి పిల్లిమెగ్గలు వేయడం కూడా ద్వంద్వ నీతికి దర్పణం పడుతుంది.
ఇలాటి సమయంలోనే తెలంగాణా పేరిట చేసిన రాజీనామాలకు తిరస్కరించడం కూడా ఆశ్చర్యం కలిగించదు. భావోద్వేగ ప్రధానమైన సామూహిక రాజీనామాలను తేలిగ్గా ఆమోదిస్తారని అనుకోలేము. కాని అదే సమయంలో తమ అంతర్గత కారణాల రీత్యా లోక్‌సభ స్పీకర్ ఒకటి రెండు రాజీనామాలు అట్టిపెట్టుకోవడం గమనించదగ్గది. జాతీయ అంశాలను కూడా తమ స్వప్రయోజనాల కోణం నుంచి చూసే కాంగ్రెస్ నైజానికి ఇది అద్దం పడుతుంది. శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పార్టీల మార్పిళ్లతోనూ, ఫిర్యాదులతోనూ ముడిపడిన రాజీనామాలను మాత్రం ఆమోదించి తక్కినవి పక్కన పెట్టారు. సభాపతుల నిర్ణయాలకు కట్టుబడి వుంటామని వారూ చెప్పేశారు. పాలక వర్గ రాజకీయ వేత్తలు ఎప్పటికప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం వ్యూహాల కోసం ప్రాంతీయ మనోభావాలను కూడా ఉపయోగించుకునే తీరుకు ఇవి తాజా ఉదాహరణలు. కనీసం శీతాకాల సమావేశాలలోనైనా ఈ పాక్షిక వ్యూహాలను పక్కనపెట్టి ప్రజల విశాల ప్రయోజనాలు సమస్యల పరిష్కారాల కోసం కృషి జరుగుతుందని ఆశించాలి.
(ప్రజాశక్తి, నవంబరు 17, 2011)
You covered too many issues. Good one.
ReplyDelete