Pages

Thursday, November 24, 2011

అమానుష రాజకీయ బంధాల అనివార్య పరిణామం

మల్లోజుల కోెటీశ్వరరరావు అలియాస్‌ కిషన్‌జీ జంగల్‌ మహల్‌ అడవుల్లో భద్రతా దళాల కాల్పుల్లో మృతి చెందడం సహజంగానే మీడియాలో పతాకశీర్షికలనాక్రమించింది. దీనిపై అనేక కథనాలు వెలువడుతున్నాయి. కరీం నగర్‌లో ఆయన పుట్టిన వూరు కన్నవారు తదితర వివరాలతో పాటే మావోయిస్టు అగ్రనాయకుడుగా ఆయన పాత్రను కూడా అభివర్ణించే విశేషాలు అనేకం వచ్చాయి. కొన్ని పత్రికలు దీనిపైకథనాలు,వ్యాసాలు గుప్పించాయి. మావోయిస్టులతో చేతులు కలిపి మార్క్సిస్టు పార్టీని, వామపక్ష ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు అనేక కుట్రలు సాగించిన ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం తుంచేసినట్టుగానే మాట్టాడారు. నిజానికి అధికారంలోకి రావడానికి గాను మావోయిస్టుల దాదులకు హత్యాకాండకు వత్తాసు నిచ్చిన ఆమె ముఖ్యమంత్రి కాగానే వారికి హెచ్చరికలు సవాళ్లు చేయడం మొదలు పెట్టారు.మావోయిస్టులు కూడా తమ పాత బంధాన్ని మర్చిపోయినట్టు మమత వర్గ స్వభావం గురించి వ్యాఖ్యానాలు ఆరంభించారు.అంటే వారి మధ్య రాజకీయ బంధం ఎందుకు ఏర్పడిందో ఆ అవసరం తీరిపోయిందన్న మాట. ఈ అమానుష బంధం అనివార్యంగా కిషన్‌జీ కాల్చివేతకు దారి తీసిందనేది ఇక్కడకాదనలేని వాస్తవం. బెంగాల్‌ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు సూర్యకాంత్‌ మిశ్రా తన స్పందనలో కిషన్‌జీని ప్రాణాలతో పట్టుకుని వుంటే బాగుండేదని, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాననని అన్నారు. ఈ ఒక్క ఘటన వల్ల మావోయిస్టుల ప్రమాదకర వ్యూహాలలో పెద్ద మార్పు వస్తుందని తాము అనుకోవడం లేదని కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే సిపిఎం ఏనాడూ మావోయిస్టు సమస్యకు బూటకపు ఎన్‌కౌంటర్లు లేదా కాల్చివేతలు మార్గమని భావించలేదు.
వ్యక్తిగతంగా కిషన్‌జీ నేపథ్యం ఏమైనప్పటికీ ఆయన మావోయిస్టు మారణ యంత్రంలో కీలక పాత్రధారిగా పనిచేశాడు. గనక ఆ కోణంలోనే అర్థం చేసుకోవలసి వుంటుంది. కిషన్‌జీ మృదు స్వభావం, కవితా హృదయం, సాహసికత వగైరాలపై ఆయన అభిమానులు అనేకం చెప్పారు. దేశ ప్రజలకు ఆయన గురించి బాగా పరిచయమైంది మాత్రం
ఇటీవల దాడులు హత్యాకాండల వార్తలతో. అడవులు కొండల్లో రహస్య జీవితం గడిపే ఒక మావోయిస్టుకు అంత తరచుగా విస్త్రతంగా మీడియా ప్రచారం లభించడమే పెద్ద ఆశ్చర్యం. హిందూ పత్రిక ఈ విషయం సూటిగానే రాసింది.మొహానికి ముసుగు కప్పుకున్నప్పటికీ అజ్ఞతంలో వుంటూ అంత తరచుగా మీడియాలో ప్రత్యక్షమైన నాయకులు దాదాపు లేరు. అడవుల్లో టీవీ కెమెరాలతో వెలుగుల మధ్య పూర్తి స్థాయి పత్రికాగోష్టి కూడా జరిపారు! కాగా ఆ ఇంటర్వ్యూలన్నిటిలోనూ ఆయన వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోయాల్సిన అవసరాన్ని చెబుతూ మమతా బెనర్జీకి పరోక్షంగానూ , ప్రత్యక్షంగానూ కూడా సానుకూల సంకేతాలిస్తూ వచ్చారు.ఇప్పుడు వరవరరావు వంటి వారు మమతా కుటిలత్వాన్ని గురించి ఎంతగా ఖండించినా అదే కూటమికి తాము కీలక సూత్రధారులమన్న సంగతి మర్చిపోవడానికి లేదు. కిషన్‌జీ తన ఇంటర్వ్యూలలో చేసిన కొన్ని వ్యాఖ్యలు వాస్తవానికి అద్దం పడతాయి:
'' ప్రజలు రహదార్లను దిగ్బంధిస్తారు. అక్కడకు వచ్చే సాయుధ దళాలకు పాఠం చెబుతారు. కంఏద్ర ప్రభుత్వానికి బుద్ధదేవ్‌ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు.మేము మమతను కూడా అడుగుతున్నాము.నందిగ్రామ్‌లో ఆమె మాతో వున్నారు. ప్రస్తుతం ఆమె ఏ వైఖరి అవలంభించబోతున్నారో తెలుసుకోగోరుతున్నాం. ఆమె ప్రస్తుతం కేంద్రమంత్రివర్గంలో తృణమూల్‌ తరపున ఏకైక మంత్రిగా వున్నారు.... ఆమె ఏ పక్షానికి మద్దతు ఇస్తారో తెలుసుకోగోరుతున్నాము'' (2009 జూన్‌ 18 ఎన్‌డిటివి ఇంటర్వ్యూ)
ఇందుకు తగినట్టే మమతా బెనర్జీ కూడా లాల్‌గడ్‌ ప్రాంతంలో మావోయిస్టులు లేరని వాదించడం మొదలెట్టారు.
'' లాల్‌ఘర్‌లో సిపిఎంకు మద్దతు ఇవ్వవద్దని నేను కేంద్ర ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను.ఆ పార్టీ నిల్వ చేసి వుంచిన ఆయుధాలను వెలికి తీసేందుకు కేంద్ర దళాలను పంపాలని కోరుతున్నాను. మావోయిస్టులను తరిమివేసే పేరుతో లాల్‌గర్‌లో ఏం జరుగుతున్నదో సమీక్షించేందుకు అత్యవసర సమావేశాన్ని తక్షణం ఏర్పాటు చేయాలనిఆ సమావేశానికి ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ,హౌంమంత్రి చిదంబరం హాజరు కావాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నాను''(హిందూస్తాన్‌ టైమ్స్‌, జూన్‌ 29)
లాల్‌ఘర్‌లో జరుగుతున్నదంతా ఒక డ్రామా. ఆ ప్రాంతంలో మావోయిస్టు కార్యకర్తలెవరూ లేరు.ఉగ్రవాద కార్యకర్తలెవరైనా వుంటే ఈ పాటికి ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయి వుంటారు.వారు పారిపోయే అవకాశాన్ని వామపక్ష ప్రభుత్వమే కల్పించింది.మావోయిస్టులపై ఉమ్మడి దాడుల పేరుతో తన రాజకీయ పునాదిని తిరిగి సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తోంది'' (ఎకనామిక్‌ టైమ్స్‌,జులై1)

మావోయిస్టుల విముక్త ప్రాంతాల జాబితాలో లాల్‌ఘర్‌ నాల్గోవదైనప్పటికీ అక్కడే కేంద్రీకరణ పెరగడానికి మమతా వంటివారి మద్దతే కారణం.2004 ఆగష్టు 12న పశ్చిమ మిడ్నపూర్‌ జిల్లాలోఆరుగురు భద్రతా సిబ్బందిని చంపివేసినప్పటి నుంచి దాడులు కుట్రలు తీవ్రమైనాయి. టిఎంసి సహకారంతోనే ఇవన్నీ జరిగాయి.2005లోనే మావోయిస్టు నేతలు నందిగ్రామ్‌ సందర్శించినట్టు పోలీసులకు పట్టుబడిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సేన్‌రారు వెల్లడించాడు. 2004లో 32 మంది ఎంపిలను గెలిపించుకున్న వామపక్ష సంఘటనను కూలదోయడానికి సాగిన ఈ పథకంలో తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌లే గాక అనేక ఎన్జీవోలు కూడా కీలకపాత్ర వహించాయి. వీరందరి ప్రయోజనాలు ఏకీభవించడమే ఇందుకు కారణమని కూడా ఆయన చెప్పాడు.విస్తారమైన ఆయుధాలు సంపాదించుకున్న తర్వాత కిషన్‌జీ అక్కడకు మారాడు.2008 జనవరి అక్టోబరు మధ్య కాలంలోనే బంకూరా, పశ్చిమ మిడ్నాపూర్‌,పురులియా జిల్లాల్లో మావోయిస్టులు 34 దాడులు జరపగా 22 మంది చనిపోయారు. ఏ విధమైన హింసకైనా తాము వెనుకాడబోమని,లష్కరే తోయిబా వంటి ఇస్లామిక్‌ సంస్థల విజృంభణను కూడా అడ్డుకోబోమని కిషన్‌జీ చెప్పారు.ఆ ఏడాది జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కూడా భూమి ఉచ్చేద ప్రతిరోధ కమిటీ(బియుపిసి) భాగస్వాములుగా వీరంతా కలసి పనిచేశారు.తర్వాత రంగం లాల్‌ఘర్‌కు మారింది.2008 నవంబరు 2న ముఖ్యమంత్రి బుద్దదేవ్‌ భట్టాచార్య ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చివేసుందుకై మందుపాతర అమర్చినా విఫలమైంది.2009 తర్వాత ఈ హత్యాకాండ తీవ్రమై 62 మంది బలయ్యారు. 2009 ఫిబ్రవరి 4న జరిగిన ర్యాలీలో మమతా బెనర్జీ పాల్గొని ఈ విధ్వంసానికి వంత పాడారు. ముఖ్యమంత్రిపై ఈ దాడిలో ప్రధాన అనుమానితుడైన శశాధర్‌ మహతో (వికాస్‌) 2009జూన్‌ 16న భుజాన ఎకె47 వేలాడ తీసుకుని తగలబడుతున్న సిపిఎం కార్యాలయం నేపథ్యంలో బుద్దదేవ్‌ను ఉరితీయాలన్నది ప్రజల డిమాండు అని రెచ్చగొట్టే రీతిలో మాట్లాడాడు.ఆ సమయంలో కేంద్ర దళాలు కూడా దిగ్బందం పేరిట మావోయిస్టులను కాపాడే పాత్ర నిర్వహించాయి. వికాస్‌ సోదరుడు ఛత్రధర్‌ మహతో తృణమూల్‌ పార్టీ తరపున పోటీ చేసిన వ్యక్తి. ఆయనే పోలీసు అత్యాచారాల నిరోధం పేరిట ఏర్పాటు చేసిన పిఎస్‌బిజెపి కన్వీనర్‌.ఈ కాలంలోనే మావోయిస్టులు రహస్య సర్క్యులర్లలోనూ వామపక్షాలను ఓడించి తృణమూల్‌ను ప్రతిష్టించాలన్న భావాన్నే పొందుపర్చారు. లోక్‌సభ ఎన్నికల్లో సిపిఎం స్థానాలు బాగా తగ్గిపోయిన తర్వాత ఈ అరాచకం ఇంకా పెరిగింది. ఎన్నికలకు ముందునుంచే భీతావహ వాతావరణం సృష్టించబడింది. నగ్జలైట్‌ ఉద్యమ ప్రారంభకుల్లో ఒకరైన కానూసన్యాల్‌ కూడా ఆదివాసుల పేరిట మావోయిస్టుల ఎజెండా అమలు చేయడాన్ని విమర్శించారు.
నగ్జలైట్‌ ఉద్యమం బెంగాల్‌లో మొదలైనప్పటికీ తర్వాత అక్కడ ఆ ప్రభావం దాదాపు లేకుండా పోవడానికి కారణం వామపక్ష ప్రభుత్వ ప్రజానుకూల చర్యలు,ముఖ్యంగా భూ సంస్కరణల వంటివి. ఏవైనా కొన్ని పొరబాట్టు వుంటే వాటిని ఆసరా చేసుకుని తృణమూల్‌ వంటి పార్టీలు అంతర్జాతీయ కమ్యూనిస్టు వ్యతిరేక శక్తుల సహాయంతో ప్రతీఘాత వ్యూహాలు పన్నాయి.ఇందుకు మావోయిస్టులను ఉపయోగించుకోవడం అందులో భాగం. కిషన్‌జీ లాల్‌ఘర్‌ వెళ్లడం కూడా ఆ క్రమంలోనే జరిగింది తప్ప వూత పదంగా మారే విప్లవోద్యమం అక్కడ వచ్చిందని కాదు.అయితే పాలక పక్షాల వర్గ స్వభావం తెలిసీ చేతులు కలిపిన ఫలితమే ఇప్పుడు ఆయన కాల్చివేత. ఒక వ్యక్తిని చంపడంతోనే మావోయిస్టుల ధోరణి మారిపోదనేది వాస్తవం. మావోయిస్టు పార్టీలో ఒకప్పటి పీపుల్స్‌ వార్‌ నాయకత్వంలో ప్రధాన భాగం ఆయనతో ముగిసిపోయిందని వాటితో పరిచయం వున్న వారు చెబుతున్నారు గాని ఆ భావజాలం మటుమాయమై పోదు. మమత గురించి తమకు ముందే తెలుసని మావోయిస్టులు సమర్థించుకోవడం, అప్పటి కిషన్‌జీ మాటలు విడుదల చేయడం వారిలో మార్పు రాలేదన్న వాస్తవాన్నే చెబుతుంది. ఇందుకు భిన్నంగా మమతను పొగిడిన మాటలు కూడా చూపించవచ్చు గాని సమస్య అదికాదు. ే మమతా బెనర్జీ మాటల మార్పు చాలా వికృతంగా వుందని ప్రభుచావ్లా వంటి ప్రముఖ సంపాదకులు ఈ ఘటనకు ముందే వ్యాఖ్యానించారు. అది ఇప్పుడు మరింతగా రుజువవుతున్నది. పాలక వర్గాలు మావోయిస్టులు కూడా చర్చల పేరిట ప్రజల్లో భ్రమలు కలిగించి తర్వాత మరింత దారుణమైన పరిణామాలకు కారణమవడం చాలాసార్లు జరిగింది.ఇందుకు ఉభయుల బాధ్యతా వుంటుంది. ఈ పరస్పర హరణోద్యోగంలో బలయ్యేది మాత్రం అమాయకులైన ప్రజలు కాగా దెబ్బతినేది ప్రజా ఉద్యమాలు ప్రగతిశీల రాజకీయాలు మాత్రమే. ఎందుకంటే ప్రజల పాత్ర లేని విప్లవోద్యమాలు ఎక్కడా ఎప్పుడూ లేవు. దేశంలో ప్రత్యామ్నాయ విధానాల కోసం ప్రజలను సమీకరించి పోరాడుతున్న సిపిఎంను సోషల్‌ఫాసిస్టు అని ఇప్పటికీ నిందిస్తున్న మావోయిస్టులు మమతా బెనర్జీలో ఏ విప్లవం చూసి బలపర్చారు ? కనక సిద్దాంత రహితమైన రాజకీయాల పర్యవసానమే ఇది.దీనికి సంబందించిన వివరాలు విశ్లేషణలకు ఇది సందర్భం కాదు గాని మావోయిస్టులు కనీసంగానైనా ఈ విషయంలో తమ విధానాలను సవరించుకుంటారా అన్నదే ప్రశ్న.

No comments:

Post a Comment