Pages

Saturday, March 31, 2012

జగన్‌ కేసులో ఛార్జిషీట్‌ విశేషాలు


వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగన్‌తో అధిష్టానం సయోధ్య దిశగా నడుస్తోందన్న సూచనల నేపథ్యంలో ఆయనపై ఆరోపణలకు సంబంధించి సిబిఐ ఛార్జిషీటు దాఖలు చేసింది.  జగన్‌ను అరెస్టు చేస్తారన్న అలజడి కొంత కాలం నడిచినా తర్వాత ఆ అవకాశం లేదని స్పష్టమై పోయింది. ఈ బ్లాగులో గతంలో ఆ సంగతి చెప్పుకున్నాం. ఢిల్లీ వెళ్లిన సిబిఐ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణకు ప్రస్తుతానికి పగ్గాలు పడ్డాయన్న వార్తలు ఒకవైపు వినిపించాయి. (ఆయన ఇక్కడ ఆరేళ్ల కాలంగా వున్నారు గనక బదిలీ కావచ్చని కూడా ఒక ఛానెల్‌ కథనం ప్రసారం చేసింది.) ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆ మేరకు బహిరంగంగానే ఆరోపణ చేశారు గాని అది కూడా రాజకీయ దృష్టితో చేసిందే తప్ప తీవ్రంగా తీసుకోనవసరం లేదని ఆ పార్టీ వర్గాల వివరణ ఇచ్చాయి. ఏమైనా అక్రమాస్తుల కేసులో మొదటి నిందితుడైన జగన్‌ను ప్రశ్నించేనిమిత్తం నిర్బంధంలోకి తీసుకోకుండానే లాంఛనంగా ఛార్జిషీటు దాఖలు చేయొచ్చని న్యాయ నిపుణులు భావించారు. జరిగింది కూడా అదే. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరికి అక్రమ లబ్ది చేకూర్చి వారి నుంచి తన సంస్థల్లో పెట్టుబడులు పెట్టించారన్న క్విడ్‌ ప్రో కో ఆరోపణలను సిబిఐ ఛార్జి షీటు నిర్ధారిస్తోంది. జగన్‌ను మొదటి నిందితుడుగా పేర్కొంది. అయితే ఆయనను నిర్బంధంలోకి తీసుకుని ప్రశ్నించడం తప్పని సరి కాదని ఆధారాలు వున్నాయి గనక నేరుగానే కోర్టుకు నివేదించారని అంటున్నారు. ఇప్పుడు ఏం జరగాలనేది కోర్టు ఆదేశాల ప్రకారమే జరుగుతుంది. ఒక వేళ కోర్టు గనక అరెస్టు చేయమని ఆదేశాలిచ్చినా వెంటనే అమలు కాకపోవచ్చు. ఉదాహరణకు కనిమొళి వంటి వారి విషయంలో రకరకాల సాకులతో చాలా సమయమే తీసుకున్నారు.ఇప్పుడు ఏం జరుగుతుందనేది చూడాల్సిన విషయం. ఈ లోగా సుప్రీం కోర్టు రాష్ట్ర మంత్రులకు కూడా నోటీసులు జారీ చేసింది గనక దాని వైఖరి ఎలా వుంటుందో కూడా గమనించాలి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఇది తప్పు చాేర్జిషీట్‌ అని విమర్శ చేసినప్పటికీ దానిలో రాజకీయంగా పెద్ద దూకుడు కనపించలేదు. పైగా జగన్‌ తరపు న్యాయవాది ఒకరు చార్జిషీట్‌లో ఆయనపై వున్న ఆరోపణలు తీవ్రమైనవేమీ కావన్నట్టు మాట్లాడారు. ఊహాగానాలు ఎలా వున్నా వేసిన ఛార్జిషీట్‌ పకడ్బందీగానే వుందనీ, కోర్టు ఏ వైఖరి తీసుకుంటుందనేది తప్ప ఇక సిబిఐ తనుగా జగన్‌ విషయంలో అరెస్టు వంటివి చేసే అవకాశం వుండదనీ న్యాయ పోలీసు నిపుణులు చెబుతున్నారు. మాయావతి, లాలూ యాదవ్‌, ములాయం సింగ్‌ యాదవ్‌ వంటి నేతలపై సిబిఐ కేసులు ఎంత కాలం నడుస్తున్నాయో ఎన్ని మలుపులు తిరుగుతున్నాయో గమనిస్తే జగన్‌ కేసుకు కూడా అలాటి అవకాశాలు వుంటాయనీ అయితే అవన్నీ రాజకీయ అవగాహనలపై ఆధారపడి వుంటాయని అర్థం చేసుకోవచ్చు.

No comments:

Post a Comment