Pages

Tuesday, June 12, 2012

ఏం స్వతంత్రం?


కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం అస్తుబిస్తుగా నడుస్తుండడం యధార్థం. నేరుగా ప్రధాని మన్మోహన్‌ సింగ్‌పైనే ఆరోపణలు రావడం కూడా నిజం. ఆయనను కొనసాగింపుపైనా రకరకాల కథనాలు వస్తున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిని తేల్చుకోవడంలోనూ కాంగ్రెస్‌ మల్లగుల్లాలు పడుతున్నది. ఇవన్నీ నిజమే గాని దేశ అంతర్గత వ్యవహారాలు. కాని ఒక అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ వీటి ఆధారంగా వ్యాఖ్యానాలు చేయడం ప్రపంచీకరణ ప్రభావానికి అద్దం పడుతున్నది. అధికారం సోనియా గాంధీ చేతిలో వుండి మన్మోహన్‌ సింగ్‌ నామకార్థపు నాయకుడు కావడమే దీనంతటికీ కారణమని స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ అనే అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ నివేదిక నిచ్చింది. బ్రెజిల్‌, రష్యా, ఇండియా,చైనా, సౌత్‌ ఆఫ్రికాలతో కూడిన బ్రిక్స్‌ కూటమిలో ముందుగా దెబ్బ గినే దేశం ఇండియానే కావచ్చునని కూడా అది పేర్కొంది. ఆర్థికాభివృద్ది 6.5 శాతానికి పడిపోయి, పారిశ్రామిక పెట్టుబడుల సూచి దాదాపు శూన్యంగా మారిన ఆర్థిక స్థితిలో ఇదేమంత ఆశ్చర్యం కలిగించదు. ఇదే అంతర్జాతీయ నివేదికల ఆధారంగా మన అభివృద్ధి గురించి ఆదరగొట్టిన అధినేతలు ఇప్పుడు మాత్రం మరోలా మాట్లాడుతున్నారు.ఆ నివేదికను పట్టించుకోనవసరం లేదన్నట్టు ప్రణబ్‌ ముఖర్జీ ఉవాచ. అదొక భాగమైతే ఈ విధంగా ఇండియాపై వత్తిడి తేవడంలోని రాజకీయం కూడా పట్టించుకోదగిందే. దేశాన్ని ఈ స్తితికి తెచ్చిన ప్రపంచీకరణ సరళీకరణ విధానాలను మరింత గట్టిగా అమలు చేయాలన్నదే రేటింగ్‌ సంస్థ సందేశం తప్ప ప్రజానుకూల మార్పులు ఎంత మాత్రం కాదు. ప్రధాని సలహాదారు కౌశిక్‌బాసు కూడా ఇటీవలనే విదేశాలలో ఈ విధమైన వ్యాఖ్యానాలు చేయడం తెలిసిన విషయమే. ఆర్టిక సంక్షోభానికి కారణమైన విధానాలను మరింత ఉధృతంగా అమలు చేస్తే ఏమవుతుందో వేరే చెప్పాలా? అదొకటైతే దేశ ఆంతరంగిక పాలనా వ్యవస్థను కూడా అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు ప్రభావితం చేయడం మరింత తీవ్రమైన విషయం.

1 comment:

  1. > అధికారం సోనియా గాంధీ చేతిలో వుండి మన్మోహన్‌ సింగ్‌ నామకార్థపు నాయకుడు కావడమే దీనంతటికీ కారణమని స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ అనే అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ నివేదిక నిచ్చింది...
    మన్మోహన్‌ గారిది నామకార్థపు నాయకత్వం అనేది మనకు తెలియదా? దీని ప్రభావం ఆర్థిక సుస్థిరతపై ఉంటుందని మనకు అర్థం కాదా? ఇప్పుడు అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ నివేదిక ఇస్తే ఆశ్చర్యపోవటం దేనికి? అలా ఇవ్వకపోతే ఆశ్చర్యపోవాలి గాని!
    > దేశ ఆంతరంగిక పాలనా వ్యవస్థను కూడా అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు ప్రభావితం చేయడం మరింత తీవ్రమైన విషయం.
    అంతర్జాతీయ వాణిజ్యం పైన దేశ ఆంతరంగిక పాలనా వ్యవస్థ ప్రభావం ఉంటుంది కదా? అటువంటప్పుడు ఈ పరిణామం సహజం అని మర్చిపోతే యెలా? ఈ తీవ్రపరిణామానికి కారణం మన స్వయంకృతాపరాధమే కదా?

    ReplyDelete