Pages

Saturday, December 25, 2010

వికీలీక్స్‌లో భారతం: విదేశాంగ వికృతం

 
విశ్వ రాజకీయ రంగ స్థలాన్ని విస్పోటనంలా ప్రకంపింప చేస్తున్న వికీలీక్స్‌లో భారత దేశానికి సంబంధించిన అంశాలు విభ్రాంతి కలిగిస్తున్నాయి. విదేశాంగ విధానంలో వికృత విన్యాసాలకు లజ్జాకరమైన లొంగు బాట్లకు తిరుగులేని సాక్ష్యాలను సమకూరుస్తున్నాయి. ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు చేపట్టి అంతర్జాతీయ బహుళజాతి సంస్థలకు మరీ ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగిపోవడం మొదలెట్టాక ఆ ప్రభావం విదేశాంగ విధానంపైనా ప్రసరించడం అనివార్యమన్న వామపక్షాల హెచ్చరిక ఎంత వాస్తవమో వికీలీక్స్‌ బయిటపెట్టిన కేబుల్స్‌ను బట్టి తెలిసి పోతున్నది.న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి తమ అధినేతలకు పంపిన 3000 కేబుల్స్‌ 2007-2010 మధ్య కాలానికి సంబంధించినవి. అణు ఒప్పందంపై సంతకాలు, వామపక్షాల మద్దతు వుపసంహరణ, మళ్లీ ఎన్నికలు, అనంతరం అణుపరిహారబిల్లును తీసుకురావడం ఇవన్నీ
ఈ దశలోనే జరిగాయి గనక వాటికి అదనపు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడుతున్నది.
వికీలీక్స్‌ ప్రకంపనలు మొదలు కాగానే అమెరికా భారత దేశానికి సంబంధించిన పత్రాలు కూడా విడుదల కావచ్చని వాటిపై పెద్దగా స్పందించనవసరం లేదని హెచ్చరించడంలో కూడా ఇరుదేశాల బ్రహ్మముడి విదితమవుతుంది. దేశ సార్వభౌమత్వం గురించి మనం ఎంతగా చెప్పుకుని మురిసిపోతున్నా పాలనా వ్యవస్థ మూలమూలల్లోకి అమెరికా అధికారిక అనధికారిక చొరబాటు పెరిగిపోతున్నదని వికీలీక్స్‌ పత్రాలు కుండ బద్దలు గొట్టాయి. అత్యున్నతాధికారులు, పాలక పక్ష, ప్రధాన ప్రతిపక్ష ప్రముఖులు అమెరికా కనుసన్నల్లో మెలిగిన వైనాలు వెలుగులోకి తెచ్చాయి.వీటిని స్థూలంగా పది రకాలుగా విభజించి వెల్లడైన వాస్తవాలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం.

ఇరాన్‌కు సంబంధించి వత్తిడి
అమెరికాకు మన పాలకుల లొంగుబాటుకు ప్రత్యక్ష నిదర్శనం అణ్వాయుధ తయారీ ప్రయత్నాల పేరిట ఇరాన్‌ను వేధించడంలో భారత దేశం సహకరించడం. దీని గురించిన విమర్శలు మొదటి నుంచివున్నా వికీలీక్స్‌లో ధృవీకరణ దొరికినట్టయింది. 2008లో ఇరాన్‌ అద్యక్షుడు భారత దేశ సందర్శనకు రావడాన్ని అమెరికా అద్డుకోవడంతో ఆయన పర్యటనను మార్గమధ్య సందర్శన( ట్రాన్సిట్‌ విజిట్‌ర) గా మార్చేశారు.అమెరికా అందుకు కూడా అలుక వహించి మన గ్రాఫైట్‌ ఎగుమతులను నిలుపు చేయించింది. దానిపై మన అధికారుల నుంచి పదే పదే సంజాయిషీలు చెప్పించుకుంది. ఒక స్వతంత్ర దేశానికి మరో స్వతంత్ర దేశాద్యక్షుడు రావడం అనేది కేవలం ఆ రెండు దేశాలకు సంబంధించిన విషయమే తప్ప అమెరికా ఆదేశాలకు తల వంచవలసిన అవసరమేమిటి? వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలోనూ 2003లో ఇరాక్‌కు దళాలను పంపే విషయమై బుష్‌ ప్రభుత్వం వత్తిడి చేసినట్టు ఈ పత్రాలలో నమోదైన సత్యం. ఐఎఇఎ సమావేశంలో ఇరాన్‌కు వ్యతిరేకంగా ఓటు చేసేలా కూడా మనను వత్తిడి పెట్టారు. మరో విపరీతం ఏమంటే ఇరాన్‌లో వాస్తవ పరిస్తితిని పరిశీలించడానికి ప్రముఖ వ్యక్తుల పర్యటన ఏర్పాట్లు జరుగుతుంటే వాటి గురించి అమెరికాకు నివేదించడానికి విదేశాంగ శాఖ అధికారి ఒకరు( రాజన్‌) వెంటపడ్డాడు.తనను అమెరికాకు పంపిస్తే వివరాలన్ని చెప్పడమే గాక అందుకు విరుగుడుగా చేయదగిన చర్యలు కూడా సూచిస్తానని ఆయన చెప్పుకున్నాడు. ఈ క్రమంలో ఆయన తనను తాను జాతీయ భద్రతా వ్యవహారాల సంఘం చైర్మన్‌గా అభివర్ణించబడ్డాడు. వాస్తవంలో ఆయన కేవలం సభ్యుడు మాత్రమే. ఇంతకూ ఇరాన్‌కు ఈ దేశం నుంచి ప్రతినిధి వర్గం వెళ్లడం నేరమైనట్టు అందుకు వ్యతిరేకంగా అమెరికా అనుకూల బృందాన్ని తయారు చేద్దామని చెప్పడం అవమానకరమైన విషయం. ఆ సందర్భంలో వెళ్లివచ్చిన వారి పేర్లు హిందూ ప్రచురించింది కూడా.వారంతా గౌరవనీయులైన వారే. ఈ సందర్బంలో అణ్వాయుధంతో ఇరాన్‌ వుండటం అందరికీ హాని అని భారత ప్రతినిధి తమతో వ్యాఖ్యానించినట్టు కూడా అమెరికా రాయబార కార్యాలయం వర్తమానం పంపింది. వీటన్నిటిలోనూ స్పష్టంగా కనిపించేది ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా సాగిస్తున్న దాష్టీకాన్ని ఏకపక్ష వేధింపులను ఏదో విధంగా సమర్థించడమే. ఇంతా చేసి ఇరాన్‌ మనకు చిరకాల మిత్రదేశం కాగా అమెరికా అనేక విధాల ప్రతికూలతలకు పాల్పడిన సామ్రాజ్యవాద శక్తి. ఇరాన్‌ విషయంలో దానికి వంతపాడిన తర్వాత కూడా మనపై ఆంక్షలు సడలించింది లేదు.

పాకిస్తాన్‌, భారత్‌. టెర్రరిజం, ఆఫ్ఘనిస్తాన్‌

వికీలీక్స్‌ వెల్లడించిన కేబుల్స్‌లో అధికభాగం భారత పాకిస్తాన్‌ సంబంధాల చుట్టూ తిరిగాయి. పాకిస్తాన్‌పట్ల అమెరికా మొగ్గు బాహాటంగా కనిపిస్తుంది. టెర్రరిజంపై ఉమ్మడి పోరాటం అంటూనే దాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌ పట్ల భారత దేశ ఫిర్యాదులను అమెరికా తేలిగ్గా తీసుకుంటున్నట్టు అనేక వర్తమానాలు చెబుతున్నాయి. పాక్‌ పట్ల భారత్‌కు సంప్రదాయికంగా సందేహాలున్నాయని అమెరికా అధికారులు ఇందులో పేర్కొన్నారే తప్ప వాటిలో న్యాయం వుందన్నట్టు ఒక్క చోట కూడా చెప్పలేదు.పాకిస్తాన్‌ తీవ్రవాద శక్తులతో వజీరిస్తాన్‌ ఒప్పందం చేసుకోవడం పట్ల భారత దేశం అభ్యంతరం చెప్పినా పట్టించుకోలేదు. అంతకంటే కూడా విపరీతం ఏమంటే భారత దేశ అధికారులు కూడా పాకిస్తాన్‌పై విమర్శల తీవ్రత తగ్గించామని సంజాయిషీ ఇచ్చుకోవడం.ముంబాయి టెర్రరిస్టు దాడి తర్వాత దేశంలో పాకిస్తాన్‌ పాత్రపై తీవ్ర విమర్శలు చేసిన ప్రభుత్వ ప్రతినిధులు అమెరికాకు మాత్రం మరో విధంగా నివేదించారు. ఇది పాక్‌ నిఘా సంస్థల వైఫల్యమే తప్ప ఉద్దేశపూర్వకంగా చేసింది కాదన్న రీతిలో తాము మాట్లాడామని నాటి భద్రతా సలహాదారు నారాయణన్‌ చెప్పుకున్నారు. ముంబాయి దాడుల వెనక వున్న అమెరికన్‌ పాక్‌ పౌరుడు డేవిడ్‌ హెడ్లీ అప్పగింత విషయంలో హౌం మంత్రి చిదంబరం మాట్లాడిన తీరుకూ వాస్తవ పరిస్థితికి ఏ మాత్రం పొంతన లేదు. హెడ్లీ దగ్గర మాకు చాలా సమాచారం దొరికింది అని అమెరికా అధికారి అంటే అతన్నిమేము కూడా నేరుగా కలుసుకునే అవకాశం వుంటుందా అని చిదంబరం ప్రాధేయపూర్వకంగా అడగడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. తాలిబాన్లు కొంచెం దుందుడుకుగా వుండేవారే తప్ప మరీ ప్రమాదకరమైన వారు కాదన్నట్టు ఈ పత్రాల్లో అమెరికా ప్రతినిధులు చెబుతుంటారు. భారత దేశానికి ఈ విషయంలో చాలా ప్రముఖ పాత్ర అని నమ్మబలుకుతూనే దానికి తెలియకుండా టర్కీలో ఒక సమావేశం జరిపినట్టు ఈ పత్రాలు చెబుతున్నాయి.ఆఫ్ఘన్‌ పునర్మిర్మాణంలో భారత దేశం పాత్ర వుండాలంటూనే అందుకు చూపించిన కారణాలు దారుణంగా వున్నాయి.భారత ఇంజనీర్లు చౌకగా లభిస్తారట! ఐరోపాలో వెచ్చించే డబ్బులో కొంత భాగం పెట్టినా అందుకు అనేక రెట్లమంది నిపుణులు ఇక్కడ దొరుకుతారట! ఇది ఎంత అగౌరవంగా వుందో వేరే చెప్పాలా? పాక్‌ను ఎదుర్కోవడం కోసం భారత సైన్యం ఆపరేషన్‌ కోల్డ్‌స్టార్ట్‌ పేరిట సన్నాహం జరిపితే దానిపై అమెరికా నిఘా వేసి నివేదికలిచ్చింది! అలాటి దేశాన్ని మనం మిత్ర దేశంగా చెప్పడం రక్షణ ఒడంబడికలు చేసుకోవడం ఎంత విడ్డూరం?
అణు ఒత్తిళ్లు, అపహాస్యాలు
అమెరికాతో జరిపిన సంభాషణల్లో అణు ఒప్పందానికి ఒప్పించడం కోసం వత్తిళ్లు తేవడం ఒక ప్రధానాంశంగా క నిపిస్తుంది. సోనియా గాంధీ ఈ విషయంలో మెతకవైఖరి అనుసరిస్తున్నారని వెంటపడ్డారు. ఆమె అవకాశాలు వదులుకోవడానికి గల ఏ అవకాశాన్ని వదులుకోదని అపహాస్యం చేశారు. ప్రకాశ్‌ కరత్‌ ఆమె మెడపై కత్తిపెట్టి పనులు చేయించుకుంటున్నాడని తిట్టిపోశారు. ఇందుకు తగినట్టే సోనియా గాంధీ కూడా భారత వామపక్షాలు అమెరికాకు వ్యతిరేకమైనవి అని వారితో సరదాగా చెప్పడం విశేషం. అంటే వారి ఫిర్యాదును ఆమె కూడా ధృవీకరించారన్నమాట. అయితే ఆ వ్యతిరేకత విధానాలకే పరిమితం తప్ప అమెరికా ప్రజలకు కాదు అని కూడా తెలివిగా మరో ముక్క జోడించారు. వామపక్షాల సంగతి ఎలా వున్నా ప్రధాన ప్రతిపక్షమైన బిజెపిని దారికి తెచ్చుకోవడం అవసరమని సాధ్యమని అనుకున్నారు. ఎందుకంటే ఇది మీ ఒప్పందం కూడా అని వారికి చెప్పారు. సాక్షాత్తూ ఎల్‌కె అద్వానీనే దారికి తెచ్చిన తర్వాత ఆయన పనిగట్టుకుని ఢిల్లీ నుంచి ఇద్దరు విలేకరులను హైదరాబాదు తీసుకెళ్లి అక్కడ ఈ విషయం ప్రకటించారు. అణు ఒప్పందంపై కొంత వివరణ కోరుతున్నాం తప్ప వ్యతిరేకం కాదని నొక్కి చెప్పారు.అంటే దేశంలో ప్రధాన పాలక పార్టీలను అమెరికా ఆడించిన తీరుకు ఇదో నిదర్శనం. 2009 ఎన్నికల్లో వామపక్షాల ప్రాతినిధ్యం పెంపుతో తృతీయ కూటమి అధికారంలోకి వస్తే మనకు నష్టమని కూడా అమెరికా అధికారులు అందులో నివేదించారు. ఇందుకు తగ్గట్టే రాహుల్‌ గాంధీ భారత దేశంలో వామపక్షాలు సరీసృపాల్లా కాలం చెల్లిన స్తితిలో వుండిపోయాయని నోరు పారేసుకున్నాడు.అలాగే లష్కరే తోయిబా కంటే హిందూత్వ ఉగ్రవాదమే ఎక్కువ ప్రమాదమన్న ఆయన వ్యాఖ్యలపై మీడియాలో చాలా చర్చ జరిగింది.కాని వామపక్ష వ్యతిరేక వ్యాఖ్యలను మాత్రం తీవ్రంగా పట్టించుకోకపోవడం దాని స్వభావానికి అనుగుణమే.ఇంతకూ వామపక్షాలు కాలం సవాళ్లను అధిగమించి బలం పెంచుకుని తమ ప్రభుత్వ మనుగడను శాసించే స్తాయికి వచ్చాయని ఆయనకు బాగా తెలుసు. తర్వాత కాలంలో సిపిఎంపై జరిగిన ముప్పేట దాడికి మూలం ఇదేనన్నది స్పష్టం. ఆంధ్ర ప్రదేశ్‌లో మహాకూటమిలో కమ్యూనిస్టులకు చోటు వుండరాదని చెప్పడానికి అమెరికా ప్రతినిధి హైదరాబాదు వచ్చి చంద్రబాబు నాయుడును కలిసిన విషయం గుర్తుండే వుంటుంది. అమెరికా 70 వదశకంలోనే కేరళ బెంగాల్‌లలో కమ్యూనిస్టులను ఎదుర్కోవడానికి ఇందిరాగాంధీకి నిధులిచ్చినట్టు మాజీ రాయబారి మోయిన్‌ హాన్‌ రాసిన దానికి ఇది కొనసాగింపే.ఇందేగాక భారత దేశానికి మరింత సమర్థవంతమైన నాయకత్వం కావాలని కూడా ఆ కేబుళ్లలో వ్యాఖ్యానించడం చూస్తాం. భారత దేశం ఐరాస భద్రతా మందలి శాశ్వత సభ్యత్వం కోసం యత్నించడంపై హిల్లరీ క్లింటన్‌ మాట్టాడుతూ తనను తనే మొదటి శ్రేణి అభ్యర్తిగా చెప్పుకుంటున్న భారత దేశం అని గేళి చేశారు!ఇదంతా అయిన తర్వాత ఒబామా రాక సందర్భంలో లాంఛనంగా మన దేశ అభ్యర్థిత్వం పరిశీలించవచ్చునని చెప్పిన దానికి మనం ఉబ్బితబ్బిబయ్యాం! అణు పరిహార బిల్లు ఆలస్యానికి మన దేశంలో వున్న క్లిష్టమైన న్యాయ వ్యవస్థ కారణమని కూడా నారాయణన్‌ విన్నవించుకున్నారు!

గూఢచారులు, బేహారులు
ఇదేగాక మన దేశ అధికార యంత్రాంగంలో అమెరికా గూఢచారులు చొరబడిన తీరును వికీలీక్స్‌ విడుదల చేసిన పత్రాలు కళ్లకు కడుతున్నాయి. దేశంలో అత్యున్నత గూఢచారి సంస్థ రా( రిసెర్చి అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌) అధికారి ఒకరు సిఐఎతో సంబంధం పెట్టుకున్నారు.అసలు ఢిల్లీ పోలీసు విభాగం అమెరికా రాయబార కార్యాలయం ద్వారా సిఐఎతో రహస్య సంబంధాలు కలిగివున్న విషయం ప్రభుత్వానికి కూడా తెలియదంటున్నారు! ఇరాన్‌కు సంబంధించిన సమాచారం ముందే చెప్పడం పైన చూశాం. టెర్రరిజానికి వ్యతిరేకంగా ఉమ్మడి వేదిక సభ్యుడైన కెసిసింగ్‌ కూడా అలాగే వ్యవహరించారు. అయితే తమ రాయబార కార్యాలయాలు గూఢచర్యం కూడా చేయాలని విదేశాంగ మంత్రి హిల ్లరీ ప్రత్యేకంగా ఆదేశాలు పంపిన సంగతి ఇక్కడ చెప్పవలసి వుంది. కనక ఆప్తమిత్రులమంటూనే అమెరికా మన పట్ల ఎలా వ్యవహరించిందో ఇవన్నీ చెబుతున్నాయి
ఇదే రీతిలో అమెరికా అధికారులు అధినేతలు ఫక్తు వ్యాపార వేత్తలుగా ప్రయోజనాల సాధనకు పాకులాడారు. మొన్నటి ఒబామా పర్యటనపై ఈ విధమైన వ్యాఖ్యలు వచ్చాయి గాని ఈ లక్షణం అంతకు ముందునుంచే వుంది. భారతదేశం మననుంచి తీసుకోవడం తప్ప ఏమీ ఇవ్వడం లేదని ఒక అధికారి ఫిర్యాదు చేశారు. ఆ దేశ సెనెటర్‌ వచ్చిన సందర్భంలో లాక్‌హీడ్‌,బోయింగ్‌ విమానాల కొనుగోలు ఒప్పందాలను వేగవంతం చేయాలని వెంటపడ్డారు. తమ దేశపు ఉత్పత్తి రంగాన్ని మనం హరిస్తున్నామని మరో సందర్భంలో అమెరికా చికాకు పడింది.ఇవన్నీ ఎంతటి అసత్యాలో చెప్పనవసరం లేదు. మోన్‌శాంటో విత్తనాలు ముస్సోరిలోనే తయారవుతున్నా వ్యవసాయ రంగంలో పెద్ద ఆర్డర్లు రావడం లేదన్నట్టు చెప్పారు.రక్షణ రంగంలో కొనుగోళ్లకు సహకారానికి అపారమైన అవకాశలున్నా ఉపయోగించుకోవడం లేదని హితబోధ చేశారు.
ఇక్కడ ప్రస్తావించిన ప్రతి అంశమూ పేర్లు తేదీలతో సహా నమోదై వుంది. అమెరికా భారత దేశం పట్ల వ్యవహరించిన అహంభావ ధోరణికి అల్లుకుపోయిన తీరుకు మన వాళ్ల లొంగుబాటుకు వికీలీక్స్‌ అద్దం పడుతున్నాయి.అందుకే విదేశాంగ విధానంలో విన్యాసాల వెనక విపరీతమైన వత్తిళ్లు వున్న సంగతి విస్మరించకూడదు. ఈ విషయంలో అప్రమత్తంగా వుంటేనే మన సార్వభౌమతాన్ని కాపాడుకోవడం సాధ్యం. వికీలీక్స్‌ ఇప్పటి వరకు విడుదల చేసిన కేబుల్స్‌ చేస్తున్న హెచ్చరిక అదే.ఇదేగాక దేశ దేశాల నాయకులను గురించి ఎంత చులకనగా ప్రస్తావించారో చూస్తే మతిపోతుంది.సోనియా గాంధీ మిస్‌ ఆపర్చూనిటి అట! రష్యా ప్రధాని పుతిన్‌ ఆల్ఫాడాగ్‌ అని కూడా అవమానపర్చారు.జర్మనీ అద్యక్షురాలు మార్కెల్‌ సంగతీ అంతే.ఆఫ్టన్‌లో తాము కోరికోరి ప్రతిష్టించిన హమీద్‌ కర్జారుని నీచాతినీచంగా సంబోధించారు.కాని మన పాలకులకు ఇలాటి దూషణలు దులపరించుకోవడం పెద్దలెక్కలోది కాదు కదా!
నీరా రాడియా టేపుల వెను వెంటనే వెల్లడైన వికీ లీక్స్‌పైన సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలు వెల్లడించాల్సి వుంది. కాని విదేశాంగ మంత్రి ఎస్‌ఎంకృష్ణ ఆదరాబాదరగా హిల్లరీతో మాట్లాడి ఈ లీకులు మన సంబంధాలపై ప్రభావం చూపించనివ్వబోమని ప్రకటించారు. అంటే మళ్లీ అదే లొంగుబాటు.ఇందుకు భిన్నంగా వెనిజుల అద్యక్షడుచావేజ్‌ బ్రెజిల్‌ నేత లూలా వంటి వారు వికీలీక్స్‌ను వెలువరించిన ఆసాంజేను బలపరుస్తూ అమెరికా దుర్నీతిపై నిప్పులు కక్కారు.అలాటి ధైర్య సాహసాలు నిబద్దత నిర్భీతి ఈ పాలకుల నుంచి ఒకనాటికి ఆశించలేము.

1 comment:

  1. please watch
    http://bookofstaterecords.com/
    for the greatness of telugu people.

    ReplyDelete