Pages

Monday, September 24, 2012

ఊహించినట్టే ఉద్రేకాల వ్యాప్తి వ్యూహం



ఊహించినట్టే ఉభయ ప్రాంతాల్లోనూ కాంగ్రెస్‌ నేతలే ఉద్రేకాల వ్యాప్తికి సిద్ధమయ్యారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారాన్ని కాపాడుకోవడానికి ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి అనేకసార్లు చేతులు కలిపిన వారే ఇప్పుడు హఠాత్తుగా రెండు శిబిరాలమన్నట్టు వ్యవహరిస్తున్నారు. పోటాపోటీగా అధిష్టానాన్ని కలుస్తూ సమావేశాలు జరుపుతూ తామే రెండు పాత్రలూ జయప్రదంగా పోషిస్తున్నారు. ఇందులో ఏ ఒక్క పక్షం వారు బెట్టుచేసినా అధిష్టానం ఇంతకాలయాపన చేసే అవకాశమే వుండేది కాదు. మమతా బెనర్జీ ఉపసంహరణ తర్వాత అస్తుబిస్తుగా మారిన కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసే అవకాశం వీరికి చాలా వున్నా ఎందుకు చేయలేదు? కుండలో అన్నం కుండలోనేవుండాలి కుర్రాడు భీముడు కావాలన్నట్టు ప్రభుత్వాలు పదిలంగా వుండాలి ప్రాంతాలు మాత్రం పంతాలతో రగిలిపోవాలన్నది కాంగ్రెస్‌ నేతల పాచికగా కనిపిస్తుంది. నిన్న మొన్న సంకేతాల భాషలో మాట్లాడిన వారు ఇప్పుడు సమరశంఖాలు పూరించుతున్నారంటే దాని వెనక మతలబులేమిటో ప్రతివారూ ఆలోచించాలి. ఇందులో ఒక పక్షం నిజాయితీ ఎక్కువ మరో పక్షం తక్కువ అనే మీమాంసకు అస్కారమే లేదు. ఇది ఈరోజునే వచ్చిన సమస్యా కాదు. తమలో తాము కలహించుకున్నట్టు కనిపించి ప్రజల మధ్య చిచ్చుపెట్టడం గందరగోళ పర్చడం తర్వాత చేతులు కలపడం గతంలో చాలా సార్లు జరిగింది. ఇప్పుడూ జరుగుతుంది. ఈ మాయాజాలం కన్నా కేంద్రంపై నిజంగా వత్తిడి చేసి ఏదో ఒక నిశ్చితమైన ప్రకటన చేయిస్తే గాని వీరి విన్యాసాలను విశ్వసించడానికి లేదు. తన గజిబిజిలో తానున్న తెలుగు దేశం గాని, జగన్‌ జైలు వ్యవహారంలో మునిగివున్న వైఎస్‌ఆర్‌ పార్టీ గాని,సంకేతాల సంధిగ్ధంలో చిక్కిన టిఆర్‌ఎస్‌ గాని ఇప్పుడు చేయగలిగింది పరిమితం. ఈ సమయంలో ప్రజలే ప్రభుత్వాలను నిలదీయాలి. తమ మధ్య తంపులు పెట్టాలని చూసే వారి పట్ల అప్రమత్తంగా వుండాలి. ప్రాంతాలు విడిపోవాలన్న కోర్కె వుండొచ్చు గాని ప్రజలు విడిపోతారని విడగొట్టగలమని అనుకునే వారికి పాఠం నేర్పేలా ప్రశాంతతను కాపాడుకోవాలి. గతంలో అనేకసార్లు అనేక మంది దుందుడుకుగా మాట్లాడినా ఏ ప్రాంత ప్రజలూ స్పందించకుండా అన్ని ప్రాంతాల ప్రజలూ సహనం చూపించారు. ఇప్పుడు కూడా అదే సంయమనం పాటించితే స్వార్థపర శక్తుల కుటిలత్వాలు కుప్పకూలక తప్పదు. కోదండరాం కూడా ఒకటికి రెండు సార్లు శాంతియుతంగా గాంధేయ మార్గంలో అని చెబుతున్న జెఎసి అద్యక్షుడు ప్రొపెసర్‌ కోదండరాం అందుకు భిన్నంగా వెలువడే వివాదాస్పద విధ్వసంకర వ్యాఖ్యలతో ఘటనలతో విడగొట్టుకోవాలి. ప్రభుత్వం కూడా మరింత చొరవగా వ్యవహరించి పరిస్థితి చేయిదాటిపోకుండా చూడాలి. అన్నిటికన్నా ముఖ్యం రాష్ట్ర భవిష్యత్తుపై స్పష్టమైన ప్రకటన కోసం కేంద్రం వెంటపడి వెంటనే తెప్పించాలి. పాలక పక్ష ఎంపిలు ఆ దిశలో కేంద్రంపై దృష్టి కేంద్రీకరించే బదులు పరస్పరం దూషించుకుంటూ పక్క దోవ పట్టించడం తగని పని.

No comments:

Post a Comment