బిజెపి వృద్ధ నేత అద్వానీ రథయాత్రపై గతంలోనే వ్యాఖ్యానించాను. అయితే ఆంధ్ర ప్రదేశ్‌లో ఆయన పర్యటన తీరు అనుకున్న దానికన్నా విపరీతంగా నడిచింది. అంత పెద్ద నాయకుడు వచ్చినపుడు జనం రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. పైగా బిజెపి రాష్ట్ర నేతలు శాయ శక్తులా సమీకరణ చేయడం సహజం. ఇంతకూ అవినీతికి వ్యతిరేకంగా ఆయన మొదలెట్టిన యాత్ర యెడ్డీ అరెస్టుతో ఆదిలోనే హంసపాదులా మారింది. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఆయన పార్టీ వాడైన గాలి జనార్థనరెడ్డి జైలులో వున్నాడు. ఇన్ని వున్నా అవినీతికి వ్యతిరేకంగా సూక్తులు చెప్పడం అద్వానీ వంటి గడుసు నేతకే చెల్లుతుంది.. ప్రధాని పరుగులో తాను ఆలసి పోలేదని చెప్పడానికే ఆయన రథ యాత్ర అని ప్రతివారికీ తెలుసు. అంతకంటే కూడా ఆయన తెలంగాణా విభజన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు గురించి చెప్పడంలో టిఆర్‌ఎస్‌ను కూడా మించి పోయి మాట్లాడ్డం జాతీయ నేత హౌదాకు తగినట్టు లేదు. శాసనసభ తీర్మానం లేకుండానే వచ్చే జనవరిలోనే ప్రత్యేక రాష్ట్ర బిల్లు పార్లమెంటులోపెట్టేయొచ్చని చెప్పడం రాజ్యాంగ విషయాలనూ తారుమారు చేసింది. 3 వ అధికరణం ప్రకారం
రాష్ట్రపతి ఆదేశంతో శాసనసభ చర్చించి అభిప్రాయం చెప్పిన మీదట, లేక చెప్పదని తేలిపోయిన మీదట మాత్రమే పార్లమెంటు ఇలాటి బిల్లును తీసుకోగలుగుతుంది. పైగా చరిత్రలో ఒక శాసనసభ వ్యతిరేకించినా ఏర్పడిన రాష్ట్రం కూడా లేదు. ఎందుకంటే అది శ్రేయస్కరంగా వుండదని అందరికీ తెలుసు. కాని అద్వానీ మాత్రం ఇక్కడి ప్రజలను ఆకట్టుకోవడమే పరమార్థంగా శాసనసభ వూసే లేకుండా రాష్ట్ర విభజన చేయొచ్చని చెబుతున్నారంటే ఏమనాలి?ఇందులో రాములమ్మ ప్రవేశ ప్రహసనం ఒకటైతే ఇంతగా తమ కోర్కెను బలపరుస్తున్న అద్వానీని టిఆర్‌ఎస్ అధికారికంగా కలవకపోవడం ఇంకోటి. అంటే తెలంగాణా స్మరణ చేసే పార్టీల మధ్యనా రాజకీయ ప్రయోజనాల ఘర్షణ ఎంత తీవ్రంగా వుందో తెలుస్తుంది. ఇదే మల్లగుల్లాలు కాంగ్రెస్ శిబిరంలో మరింత తీవ్రంగా కనిపిస్తున్నాయి.
అదవానీ ఇంత అద్వాన్నమైన నాయకుడని నేనూహించలేదు. చాలా బాగా విశ్లేషించారు. మార్క్సిస్టు నాయకుల్లో వున్న నిబద్ధత, నిజాయతి, సేవాతత్పరత హిందుత్వ మతతత్వ పార్టీలకు ఎక్కడుంటుందడి? బాగా చెప్పారు.
ReplyDelete