తెలంగాణా సమస్యపై ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారనే భావన కలిగించేందుకు కేంద్ర ప్రతినిధులు, తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యమం వూపును నిలబెట్టడం కోసం టిఆర్‌ఎస్, జెఎసి నేతలు కూడా అంతా ఆఖరిదశకు వచ్చిందనే రీతిలో మాట్లాడుతున్నారు. తాము కూడా క్రియాశీలంగా చక్రం అడ్డం వేస్తున్నట్టు కనిపించడానికి ఇతర ప్రాంతాల కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులు కూడా హడావుడి చేస్తున్నారు. ఇవన్నీ చూసి మీడియా కూడా వీక్షకులకు ఆకట్టుకోవడానికి ఏదో ఒక కథనం ఉదయాన్నే చలామణిలో పెడుతున్నది. ఎవరు ఎవరిని కలిసినా దానిపై అంతులేని వూహాగానాలు సాగుతున్నాయి. వీటికి కేవలం మీడియానే నిందించి లాభం లేదు. రాజకీయ అవసరాల కోసం ఆ విధమైన కథనాలను అటు పాలక వర్గీయులూ ఇటు తెలంగాణా రాజకీయ నాయకులూ కూడా అందిస్తున్నారు. ఈ కథనాల మాటున కేంద్ర నాయకులు బహిరంగంగానే మాట్లాడిన మాటలూ సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం సరిగ్గా జరగడం లేదు. ఉదాహరణకు ఈ పదిహేనురోజులలోనూ కేంద్రం నుంచి మాట్లాడిన ప్రతివారూ సమస్య త్వరితంగా తేలేది కాదని, అందరికీ ఆమోదంగా వుండాలనీ పదే పదే చెబుతున్నారు. సంప్రదింపులు కొనసాగాలని అంటున్నారు. తెలంగాణా విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేట్టయితే దాన్ని సూచనగా వెల్లడించి లాభం పొందడానికి యత్నిస్తారే తప్ప ఇన్ని సన్నాయి నొక్కుల అవసరం వుండదు. దానిలో సమస్యలు వున్నాయన్న మాట నిజమే అయినా కేంద్రం ఇప్పుడే తెలుసుకున్నట్టు మాట్లాడ్డమే విచిత్రం. అలాగే సలక జనుల సమ్మె ఉధృతంగా జరుగుతున్నా దాన్ని బట్టి ప్రతిస్పందించేందుకు కేంద్రం సిద్దం కావడం లేదన్నది స్పష్టం. కనక సమ్మె సెగ తగిలినందువల్లనే కేంద్రంలో కదలిక వచ్చిందనీ చెప్పడం వాస్తవాలతో పొసగడం లేదు. సమ్మె విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం
చూసుకుంటుందని కేంద్రం చెప్పడమే అందుకు నిదర్శనం. ఆ సూచనలు కనిపిస్తున్నాయి కూడా. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు దిశలోనే ఆలోచన జరుగుతున్న పక్షంలో తెలంగాణా విభజన కోరే నాయకులు ఆమరణ దీక్షల వంటి ప్రకటనలు చేసే అవసరం వుండేది కాదు. ఆ విషయంలోనూ కాంగ్రెస్ ఎంపిలు ఒకడుగు వెనక్కు వేయడం గమనించదగ్గది. వీటిని సానుకూల సంకేతాలుగా పరిగణించడం ఏ విధంగానూ సాధ్యం కాదు. రాష్ట్రపతి పాలన కూడా అవసరం లేదని కాంగ్రెస్ భావించడానికి కారణం తమ వారిపై వున్న అపార విశ్వాసమే. కనక ఏదో జరగబోతుందని ప్రజలను వూరించడం బొత్తిగా అవసరం లేని పని. దాని వల్ల కలిగే ఆశాభంగం
మరింత నష్టం కలిగిస్తుందని నేతలు తెలుసుకోవడం అవసరం.కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఈ దేశంలో దీర్ఘకాలిక సమస్యలు వేటినీ పరిష్కరించకుండానే నెట్టుకొస్తున్న కాంగ్రెస్ నైజం, అవకాశ వాద నైపుణ్యం ఒక్క క్షణమైనా మర్చిపోకూడదు. ఇక టిఆర్‌ఎస్‌ను కలుపుకోవడం గురించిన కథనాలకు వస్తే ఈ దశలో ముందస్తుగా కలిసిపోవడం ఆత్మహత్యా సదృశమేనని కెసిఆర్ తదితరులకు బాగా తెలుసు. కనక ఇప్పట్లో నాటకీయమైన మౌలికమైన నిర్ణయాలేమీ ఆశించలేము.ఇది ఎవరి ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేని వాస్తవిక అంచనా మాత్రమే. ఆకాంక్షలను బట్టి అంచనాలు వేసుకోవడం ఎవరికీ దీర్ఘకాలంలో ఉపయోగపడదు. ఈ రోజున ఉత్సాహపర్చాలని ఏదైనా చెప్పినా మళ్లీ తెల్లవారడానికి ఎన్నో గంటలు పట్టదని గుర్తుంచుకోవాలి. పాలకుల పాపాలకు ప్రజలు మూల్యం చెల్లించే పరిస్తితిని కూడా ఎక్కువ కాలం కొనసాగించడం సరైందేనా అని ఆలోచించుకోవాలి. ప్రాంతాల మధ్య వివాదాలు విభేదాలలో ఎక్కడి వారు అక్కడి మాటలు మాట్టాడ్డంలో పెద్ద త్యాగం ఏమీ లేదని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. తెలంగాణా కోసం , తెలంగాణా రుణం వంటి మాటలు మాట్టాడే వారు ఆ తెలంగాణాలోనూ పీడితులు పీడకులు వున్నారని అణచేసేవారు అణచబడిన వారు వున్నారనీ, అసమానతలు అక్కడా వున్నాయనీ గుర్తుంచుకోవాలి.
తెలంగాణా పోరాటం కార్మిక వర్గ పోరాటమని తెలంగాణావాదులు ఎన్నడూ చెప్పుకోలేదు. అది ప్రాంతీయ అస్తిత్వవాద పోరాటమని మాత్రమే చెప్పుకున్నారు. తెలంగాణా సాధించడం అనివార్యమైన ఈ సమయంలో ముందు ప్రాంతీయ అస్తిత్వం సంగతి చూడాలి. తెలంగాణా ఏర్పడిన తరువాత వర్గ పోరాటం సంగతి చూసుకోవచ్చు. అందుకే CPI(ML) న్యూ డెమోక్రసీ లాంటి కార్మిక వర్గ పార్టీలు కూడా తెలంగాణా ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాయి. అంతే కానీ తెలంగాణా ఉద్యమాన్ని కార్మిక వర్గ పోరాటంగా ఎన్నడూ అభివర్ణించలేదు.
ReplyDeleteసరిగ్గా చెప్పారు. ఏదో ఒకటి అనుకూలంగా రాయకపోతే రాళ్ళేస్తారన్న భయంతో తెలుగు మీడియా కనీస భాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాయన్నది తెలుస్తోంది. అభూత కల్పనలు, అసత్య కథనాలు సృష్టించి రాసే తెలుగు మీడియాపై ఓ 3నెలలు నిషేధం/సెన్సార్‌షిప్ విధిస్తేగాని అసలు విషయం ప్రజలకు అర్థంకాదు. కేంద్రం నుంచి ఏలాంటి సూచనలేకున్నా కెసిఆర్ రాయలతెలంగాణ అని పుకార్లు లేవదీయడం ఏ ప్రయోజనమాసించో, అది వారికి ఎలా ఉపయోగ పడుతుందో కూడా అర్థం కాని పరిస్థితి, రెండ్రోజుల తరువాత ఆ వూసే లేదు. ప్రజలను వెర్రిగొర్రెలనుకుని కాలయాపన చేస్తున్నారనిపిస్తోంది. ప్రధాని ఏమీ మాట్లాడక విని పంపించేసినా వీళ్ళు తోచింది రాసేసుకుంటున్నారు. It is clear that KCR spreading rumours to save his skin from fanatic seperatists. పులిమీద సవారిలా వుందేమో మరి. :)
ReplyDelete