Pages

Tuesday, October 25, 2011

నరహంత ఖాతాలో గడాఫీ

గడాఫీ మరణంపై తక్షణ స్పందన, వచ్చిన వ్యాఖ్యలకు సమాధానం లోగడ రాశాను. దీనిపై ప్రజాశక్తిలో రాసిన వివరమైన వ్యాసం విమర్శకుల కోసం అందిస్తున్నాను- తెర



నియంతవో.. నీతి మంతుడివో.. ఉత్సాహివో..ఉన్మాదివో.. పోరాడిన యోధుడివి, నిలబెట్టిన నాయకుడివి..మంటల మధ్యనా మడమ తిప్పని స్థయిర్యం, పంజరంలోనూ లొంగని ధైర్యం..నీలోనే చూసిందొక కాలం,,నీవే ప్రతిఘటనకు ఆలవాలం.. కాల సంధ్యలో నీ బలిదానం,, బుష్సాసురులకు రణనాదం.. అయిదేళ్ల కిందట 2007వ సంవత్సరం ప్రవేశించనున్న తరుణంలో సద్దాం హుస్సేన్‌ను లోపాయికారిగా వురి తీసిన కథనాన్ని విడుదల చేసినప్పుడు రాసిన చరణాలివి. లిబియా అధినేత కల్నల్‌ గడాఫీ అమానుష హత్య తరుణంలో ఇవే వాక్యాలు గుర్తుకు వస్తున్నాయి. రోజెన్‌ బర్గులను కక్షకట్టి కరెంటుతో చంపినా, పర్షియా నేత మొసాదిక్‌ను సిఐఎ హత్య చేయించినా,వజ్రాల సీమ కాంగోలో పాట్రిస్‌ లుముంబా ప్రాణాలు బలిగొన్నా, లాటిన్‌ అమెరికాలో చే గువేరాను బలిగొన్నా, చిలీలో ప్రజలెన్నుకున్న అలెండీని సైన్యం హతమార్చినా, ఆఫ్ఘనిస్థాన్‌లో అభ్యుదయ పాలకుడు నజీబుల్లాను నడివీదిలోవురి తీయించినా, సోషలిస్టు రుమేనియా అధినేత సెషెస్క్మూను నిరంకుశంగా కాల్చిపారేసి టీవీలలో అదే పనిగా చూపించినా అన్నిటా ఒకే దుర్నీతి. ఒకే దుర్మార్గం. కొన్ని చోట్ల సైన్యం,కొన్ని చోట్ల కోర్టులు, కొన్నిచోట్ల కిరాయి హంతకులు.... ఇప్పుడు లిబియాలో చూస్తున్నది ప్రజాస్వామ్యం పేరిట తిరుగుబాటు శక్తుల ముసుగులో సాగిన ఘాతుకం.
నేషనల్‌ ట్రాన్షిషనల్‌ కౌన్సిల్‌(ఎన్‌టిసి) ఆధ్వర్యంలో గడాఫీ హతమైనట్టు చెబుతున్నా దాని వెనక వున్నది నాటో అమెరికాలే. అరబ్‌ వసంతం పేరిట పలు అరబ్‌ దేశాల్లో ప్రజాస్వామ్య ఉద్యమం ప్రజ్వరిల్లినప్పుడు అమెరికా ద్వంద్వ ప్రమాణాలు
పాటించింది. తన చెప్పుచేతల్లో వుండే ఈజిప్టు అద్యక్షుడు హౌస్నీ ముబారక్‌ పట్ల ఒక విధంగానూ లిబియా అద్యక్షుడు గడాఫీ, సిరియా అద్యక్షుడు పట్ల మరో వి ధంగానూ వ్యవహరించింది. గడాఫీ పాలనలో లోటుపాట్లు ఆయన వ్యక్తిగత పోకడలు, నిరంకుశ పద్దతులు ఎవరూ సమర్థించనవసరం లేదు. కాని అలాటి అభద్రతా వాతావరణాన్ని సృష్టించడంలో అమెరికా కూటమి పాత్ర చాలా వుంది. తమకు అనుకూలమైన నియంతలంతా వారికి మనోహరంగానే గోచరిస్తారు. అదే స్వతంత్రంగా వుండేవారైతే మాత్రం ఎక్కడ లేని ప్రజాస్వామ్య పాఠాలు గుర్తుకు వస్తాయి. సద్దాం హుస్సేన్‌ విషయంలో ఎన్ని కథలు వదిలారో ఎవరూ మర్చిపోలేరు. ఉగాండా అద్యక్షుడు ఈదీ అమీన్‌ సంగతీ అంతే. లేకపోతే మావో సేటుంగ్‌ గురించి కూడా లెక్కలేనని పుక్కిటికథలు గుప్పించారుగాని పోరాడి సాధించాడు గనక సరిపోయింది. కమ్యూనిస్టు నేతలపైన సోషలిస్టు శిబిరంపైన ప్రచ్చన్న యుద్ధం పేరిట ప్రత్యక్షయుద్ధమే సాగించిన సామ్రాజ్యవాదులకు తర్వాతి కాలంలో అరబ్‌ దేశాల నేతలు కంటిలో నలుసులయ్యారు. ప్రతిదశలోనూ ఎవరో ఒకరిని శత్రువుగా చూపిస్తూ వచ్చారు.ఆ క్రమంలో నాజర్‌, అరాఫత్‌, గడాఫీ,సద్దాం హుస్సేన్‌,బిన్‌లాడెన్‌ ఇలా.
గడాఫీ లోపాలోపాలపై చాలనే చర్చ జరిగింది. అయితే ఆయన హయాంలో లిబియా మానవాభివృద్ధి సూచికల్లో అరబ్‌ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిన సంగతీ గుర్తుంచుకోవాలి.ఇస్లామిక్‌ సోషలిజం వంటి అశాస్త్రీయ సూక్తులు చెప్పినా పుట్టినప్పటి నుంచి విద్య వైద్యం, గృహ వసతి వీటన్నిటినీ ప్రభుత్వం సహాయపడే సమగ్ర సంక్షేమ వ్యవస్థ అక్కడ కొనసాగింది. చమురు సంపద విలువను ప్రజలకు తెలియజెప్పి దీన్ని మరెవరో హరించకుండా కాపాడుకోవాలన్న చైతన్యం వారిలో నింపినవాడు గడాపీ. అలీనోద్యమంలోనూ ముఖ్య పాత్రధారిగా వుండి ఆఫ్రికా దేశాల ఐక్యత కోసం పరితపించాడు.సోషలిస్టు దేశాలతో సన్నిహితంగా నిలిచి సామ్రాజ్యవాదాన్ని సవాలు చేశాడు.ఒకప్పుడు కాస్ట్రో అరాపత్‌, వంటి పేర్లు తల్చుకోగానే గడాఫీ కూడా గుర్తుకు వచ్చేవాడు. పాలస్తీనా ప్రజలకు భూభాగం లేకుండా వేటాడుతున్న ఇజ్రాయిల్‌ జాత్యహంకారాన్ని నిర్దంద్వంగా ఖండించి ఆ ప్రజలకు తోడు నిలిచాడు. ఆ దాడులకు గురవుతున్న లెబనాన్‌ను బలపర్చాడు. 80 వ దశకంలో రీగన్‌ థాచర్‌ అభివృద్ధి నిరోధక దాడి పెరిగినప్పుడే లిబియాతో ఘర్సణ కూడా పెరిగింది.ఆ సందర్భంలో యూరప్‌లో ఒక హౌటల్‌పై దాడి చేశాడనీ, అమెరికా విమానం కూల్చివేశాడని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ ఉగ్రవాదులకు ప్రోత్సాహంగా అమెరికా దాడి చేస్తూనే వచ్చింది. సద్ధాం హుస్సేన్‌పై కత్తి కట్టడానికి ముందే 1986లోనే అమెరికా లిబియాపై ఆయన నివాసంపై వైమానిక దాడులు చేసి ఆయన పెంపుడు కూతుర్ని చంపేసిందని మర్చిపోకూడదు. కాస్ట్రోపైన జరిగినట్టే గడాఫీపైనా ఎన్నో హత్యాప్రయత్నాలు జరిగాయి.వాటన్నిటి మధ్యనా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ నిలబడిన గడాఫీ సోవియట్‌ విచ్చిన్నానంతర ప్రపంచంలో కొంత వ్యూహం మార్చుకున్నాడు. విమానం పేల్చివేతకు కారకుడుగా వారు ఆరోపిస్తున్న వ్యక్తిని అప్పగించాడు కూడా. మెత్తపడినట్టు కనిపిస్తూనే ఆత్మరక్షణ సామర్థ్యం పెంచుకున్నాడు.
ఆఫ్ఘనిస్తాన్‌,ఇరాక్‌ల దురాక్రమణ తర్వాత అమెరికా లక్ష్యం లిబియా,ఇరాన్‌ వంటి దేశాలేనని ఎప్పుడో స్పష్టమైంది. అయినా దౌత్య నీతితో గడాఫీ ప్రభుత్వం వారితో సంబంధాలు సంప్రదింపులు నెరుపుతూ నెట్టుకొచ్చింది. ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌ జోక్యాన్ని అడ్డుకునే పేరిట అమెరికా సృష్టించిన తాలిబాన్లు,అల్‌ ఖయిదా, బిన్‌లాడెన్‌ వంటి వారికి గడాఫీ ఎప్పుడూ లోను కాలేదు. అయితే 9/11 నిందితులలో ఒకడైన అబ్దెలఖిమ్‌ బెల్వద్జీని 2003లో మలేషియాలో పట్టుకున్న సిఐఎ మరుసటి ఏడాది లిబియాకు అప్పగించింది. ఇది స్నేహపూర్వక కానుక అని అప్పట్లో చెప్పింది. గదాఫీ అతన్ని కొంత కాలం ఖైదులో వుంచి వుదార దృష్టితో విడుదల చేశాడు. బెల్వద్జీ లిబియా ఇస్లామిక్‌ ఫైటింగ్‌ గ్రూప్‌ (ఎల్‌ఐఎఫ్‌జి) పేరిట ఒక చాందస సంస్థను ఏర్పాటు చేసి గడాఫీపైనే దాడికి దిగాడు. ఇస్లామిక్‌ తీవ్రవాదంపై పోరాటమే తన ప్రాణమని చెప్పే అమెరికా వత్తాసుతో నడిచే నాటో కూటమి వీరికి సహాయం చేసింది.ఇస్లామిస్టులు అధికారంలో వాటా పంచుకోవడాన్ని అనుమతించాలని గార్డియన్‌ పత్రిక రాసింది.
తక్కిన అరబ్‌ దేశాలతో పాటు లిబియాలోనూ తిరుగుబాటుకు ప్రయత్నం జరిగి కొంత పురోగమించినా గదాఫీ ఆయన కుమారుడు పూర్తిగా లొంగిపోకుండా ఆపగలిగారు. తమ చేజారిన రాజధాని ట్రిపోలీనీ, ఇతర ప్రాంతాలను అదుపులోకి తెచ్చుకోవాలనుకుంటే అందుకు అవకాశం ఇవ్వకుండా ఐరాస ముసుగులో అమెరికా అడ్డుపడింది.ఆగష్టు 21న నేరుగా నాటో దళాలు రంగ ప్రవేశం చేశాయి. క్వతార్‌ వారికి ఆయుధాలు సమకూర్చింది.ఏప్రిల్‌ 20న గడాఫీ నివాసాన్ని ధ్వంసం చేశారు. దాంతో గడాఫీ దళాలు ఆయన స్వస్థలమైన సెట్రీలో తలదాచుకోవలసి వచ్చింది.గడాఫీ భార్య పిల్లలు అల్జీరియాలో ఆశ్రయం పొందితే వారిపైనా బెదిరింపులు నడిచాయి. నో ఫ్లై జోన్‌ అంటూ తము కోల్పోయిన రాజధానిని స్వాధీనం చేసుకోవడానికి విమానాలు వెళ్లడాన్ని నిషేదించి తాము మాత్రం ఆయన వున్న చోట దాడులు కొనసాగించారు. లిబియా హస్తగతమయ్యే రోజు దూరంలో లేదని నాటో ప్రధాన కార్యదర్శి బాహాటంగా ప్రకటించాడు. ఆగష్టు 30న ఐరాస లిబియాలో రాజకీయ భవితవ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి పది పేజీల ప్రణాళిక సిద్ధం చేసింది. గడాఫీ అదుపు కోల్పోయాడని ఒబామా ప్రకటించాడు.ర్వాండాలో మారణహౌమం తర్వాత తాముగా సృష్టించిన రక్షణ నివ్వాల్సిన బాధ్యత అనే నిబంధనను అడ్డుపెట్టుకుని బ్రిటన్‌ ఫ్రాన్స్‌లు 26 వేల విమాన దాడులు చేశాయి. అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ స్వయంగా పర్యటించి గడాఫీ అనంతర లిబియాకు తమ సహాయం వుంటుందని తాయిలాలు ప్రకటించి సన్నాహాలు చేసి వచ్చారు.ఇంత జరిగినా ఎన్‌టిసి ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కేవలం నలభై దేశాలు మాత్రమే గుర్తించాయి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాలు చాలా వరకూ గుర్తించలేదు.ఆ దేశాలను తన గుప్పిట్లోకి తెచ్చుకోవడం అమెరికా వ్యూహంలో కీలకాంశం. ఇందుకోసమే జర్మనీలో ఆఫ్రికాం పేరిట ఒక సంస్థను కూడా ఏర్పాటుచేసింది. అంతర్జాతీయ న్యాయస్థానం అనబడే ఐసిసి గడాఫీని యుద్ధ నేరస్తుడుగా ప్రకటించింది. అంతకు ముందు సూడాన్‌ అద్యక్షుడు ఒమర్‌ అల్‌ బషీర్‌నూ నేరస్తుడుగా చేసింది. ఈ రెండు దేశాలు చమురు సంపన్నమైనవి కావడం ఇక్కడ బహిరంగ రహస్యం. ఇదే తరుణంలో ఇజ్రాయిల్‌ విమానాలు గాజా భూ ఖండంలో దాడులు చేసి 1400 మంది పాలస్తీనియన్ల ప్రాణాలు తీస్తే మాత్రం వీరికి నేరంగా కనిపించలేదు.
ఈ అష్ట దిగ్బంధం మధ్యన గడాఫీని వేటాడి చంపడం తథ్యమనే ప్రపంచం భావించింది. నో ఫ్లై జోన్‌ ఆంక్షలు ఆచరణలో గడాఫీని పట్టుకోండి(గెట్‌ గడాఫీ)గా మారాయని అంతర్జాతీయ పరిశీలకులు హెచ్చరించారు. క్యూబా ఐరాస వేదికపై ఈ దుర్మార్గాన్ని ఖండించింది. వెనిజులా అద్యక్షుడు హ్యూగో చావేజ్‌ గడాఫీని నిర్మూలించేందుకు జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఆయనతో సంఘీభావం ప్రకటించారు. అయినా నాటో దేశాలు గడాఫీని హతమార్చడమే ఏకైక లక్ష్యంగా వేట సాగించాయి. ఇదంతా చమురు దాహం ఫలితమే. ఆఫ్రికా దేశాలలో 4.6 కోట్ల బ్యారళ్ల చమురు నిల్వలున్నాయి.చమురు సంపన్న దేశాలైన సౌదీ అరేబియా, కువైట్‌,ఇరాక్‌, సూడాన్‌లు ఇప్పటికే అమెరికా చెప్పుచేతల్లో వుండగా ఇప్పుడు లిబియా కూడా వశమైంది. మిగిలింది ఇరాన్‌ ఒక్కటే. దానిపైనా అణ్వస్త్ర తయారీ పేరిట వత్తిళ్లు సాగుతూనే వున్నాయి. లిబియా కూడా అణ్వాయుధానికై ప్రయత్నాలు చేసిందన్న వార్తలువున్నాయి. అంతర్జాతీయ వాతావరణాన్ని బట్టి వాటిని విరమించుకుంది. అయితే వాటిని సంపాదించివుంటే ఇలా జరిగి వుండేది కాదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికాకు తొత్తు వంటి పాకిస్తాన్‌ పాలకులు కూడా మాది అణ్వస్త్ర దేశం గనక తేలిగ్గా మాపై దాడి చేయలేరు అంటున్నారంటే రేపు మిగిలిన దేశాలు కూడా ఆ దిశలో ఆలోచించవచ్చునని దౌత్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాడూ బొంగరం లేని తిరుగుబాటు దళాల చేతిలో ఇప్పటికే లిబియా కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది. లూటీలు రాజ్యమేలుతున్నాయి.ఆఫ్ఘనిస్తాన్‌ ఏ విధంగా ఆటవిక స్తితిలోకి దిగజారిపోయిందో గడాఫీ అనంతర లిబియా కూడా అంత అగమ్యంగా మారే అవకాశముంది. అప్పుడు అమెరికా కూటమి మరింత బాహాటంగా తలదూరుస్తుంది. ఇప్పటికే అక్కడ లాభాలు పోగుపోసుకోవడానికి బ్రిటన్‌,ఫ్రాన్స్‌లు ఆదరాబాదరాగా వున్నాయని రాయిటర్స్‌ కథనం. గతంలో రష్యా చైనా బ్రెజిల్‌ దేశాలతో గడాఫీ కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసి ఆ సంపదను తమ అదుపులోకి తెచ్చుకోవడమే వాటి లక్ష్యం. గడాపీ మంచి చెడ్డలు ఏమైనా అది లిబియా అంతర్గత వ్యవహారం. ఆ ప్రజలే నిర్ణయించుకోవాలి. అమెరికా నాటోల దుర్మార్గమైన జోక్యాన్ని గనక ఈ విధంగా సాగనిస్తే రేపు అన్ని దేశాల స్వాతంత్రం సార్వభౌమత్వాలకూ ముప్పు తప్పదు.గడాఫీ నియంత అనేవారు ప్రపంచ నియంత పైశాచికత్వాన్ని చూడకపోతే అది ప్రపంచమంతటికీ ప్రమాదం.
ా ప్రజాశక్తి, అక్టోబరు 23

No comments:

Post a Comment