Pages

Monday, June 18, 2012

శ్రుతి మించిన అతి తర్కం (రంగనాయకమ్మ గారి పుస్తకంపై నాటి విమర్శపునర్ముద్రణ)



దళితుల సమస్య పరి'ా్కరానికి ''బుద్దుడు చాలడు, అంబేద్కరూ చాలడు మార్క్స్‌ కావాలి'' అంటూ రంగనాయకమ్మ ఇటీవల ఒక పుస్తకం రాశారు. సామాజిక న్యాయభావన, అట్టడుగు తరగతుల వారిలో స్వీయ అస్తిత్వం గురించిన చైతన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఇలాటి చర్చలు అందరి దృష్టినీ ఆకర్షించడం సహజమే. అందులోనూ అంబేద్కర్‌ దళితజాతి చైతన్యానికి వైతాళికుడిగా పరిగణించబడుతున్నారు. దేశంలో అత్యున్నత గౌరవాభిమానాలు పొందుతున్న దివంగత నాయకులలో ఆయనొకరు. ఇందుకు సహేతుకమైన కారణాలే వున్నాయి. వాటిని రంగనాయకమ్మ ఇలా వివరించారు:
''అంబేద్కర్‌ అస్పృశ్యుల సమస్యను దేశంలో అందరి దృష్టికి తెచ్చారు. ఆ దురాచారం మీద పోరాటాన్ని ఒక రాజకీయ ఉద్యమంగా మలచారు. మనకూ హక్కులున్నాయనే స్పృహ అస్పృశ్యులలో కలిగించారు.
రిజర్వేషన్ల ఉద్యమం అంబేద్కర్‌ కన్నా ముందే ప్రారంభించినా ఆయన ఆ ఉద్యమాన్ని కొనసాగించారు. రిజర్వేషన్ల వల్ల చిన్నకులాల్లో కొంత జనాభాకైనా పెద్ద చదువులు, ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి.
అంబేద్కర్‌ అస్పృశ్యుల విషయంలో కాంగ్రెస్‌ను, గాంధీని సాధ్యమైనంత ఎక్కువగానే బటyబయలు చేశారు....
అస్పృశ్యత మీదేగాక మొత్తం కులవిధానం అంతటి మీద అంబేద్కర్‌ తీవ్రమైన వ్యతిరేకత ప్రదర్శించారు.''
తన పుస్తకం చివరిభాగంలో రచయిత్రి ఇచ్చిన ఈ అంచనా ఆయన పాత్రను చాలావరకు సరిగానే చిత్రించింది. అయితే పుస్తకంలో అప్పటివరకు, ఆ తర్వాత విశ్లేషణ నడచిన తీరు మాత్రం అలాటి వాస్తవిక చారిత్రికదృష్టితో అవగాహన పెంచేదిగా గాక అవహేళన చేసే ధోరణితో నిండివుండటం విచారంకలిగిస్తుంది. సాధారణ రచనాసూత్రాల ప్రకారం చూసినా, ప్రత్యేకించి ఈ దేశంలో దళితుల సమస్య, ఆవిషయంలో అంబేద్కర్‌ అగ్రశ్రేణిపాత్ర, ఈనాడు దేశంలో సామాజిక రాజకీయ వాతావరణకోణం నుంచి చూపినా ఆమె పరిశీలనావిధానం, రచనా శైలి బొత్తిగా అనుచితమైనవని చెప్పక తప్పదు.
బౌద్ధం 2500 ఏళ్లనాటిదైతే కమ్యూనిసుy ప్రణాళిక 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. అంబేద్కర్‌ 70 ఏళ్ల క్రితం తన భావాలు ప్రకటించారు. ఆయన మృతి చెంది కూడా 50 ఏళ్లు అయిపోయింది. ఈ మొత్తం కాలంలో ఇలాటి అంశాలు అనేక రూపాల్లో చర్చించబడుతూనే వున్నాయి. ఇప్పుడు అంబేద్కర్‌ రచనా సంపుటాలు తెలుగులో వచ్చాయి. వాటిని వివరంగా చదివిన రచయిత్రి అంబేద్కర్‌ దేనిపై ఏమన్నారో సుదీర్ఘంగా పేర్కొంటూ వాటి మంచిచెడ్డలు సమీక్షించాలని నిర్ణయించుకున్నారు. అందుకు ఎవరికీ ఎలాటి అభ'్యంతరం ఉండనవసరంలేదు. అయితే వేలూ వందల సంవత్సరాల ఎడం దృష్టిలో పెటుyకోకుండా పై ముగ్గురి భావాలను పోల్చి చెప్పడం అసంబద్ధమైన అచారిత్రికమైన దృక్పథం. గతంలో స్పార్టకస్‌, అంకుల్‌ టామ్స్‌ క్యాబిన్‌ వంటి పుస్తకాలు క్లుప్తంగా ప్రచురించిన ఆమె అదే తరహాలో అంబేద్కర్‌ సంపుటాలను కూడా సుదీర్ఘంగా ఉటంకించారు. విమర్శనాత్మకంగా రాయడం ప్రధానోద్దేశం అయినప్పటికీ ఆమె మూలంనుంచి ఇచ్చిన భాగాలు చాలా ఎక్కువ. పేజీలు, పంక్తులు లెక్కబెడితే ఈ విషయం తేలిపోతుంది. కొన్ని చోట్ల ఆయన వాక్యాలు ఏవో, ఆమె మాటలు ఏవో కూడా తేల్చుకోలేని గందరగోళ స్థితికి లోనవుతారు పాఠకులు. శైలిపరంగా దీంట్లో మొదటి ఇబ్బంది ఇది.
అటyడుగువర్గాల్లో జన్మించి ఆ దురవస్థలు స్వయంగా అనుభ'వించి, వాటిని తొలగించడం జీవిత లక్ష్యంగా పెట్టుకున్న అంబేద్కర్‌ అందుకు ఆచరణాత్మకంగానూ, అధ్యయనరీత్యానూ విశేష శ్రమచేశారు. మన సమాజ పరిణామాన్ని ముఖ్యంగా కులసమస్య పుట్టుకను అర్థం చేసుకోడానికి ఎంతో కృషి చేశారు. వేలపేజీలు రాశారు. సంస్కరణోద్యమాలు నడపడమే గాక ఆనాటి రాజకీయ పరిస్థితుల్లో జోక్యం చేసుకుని తన సహోదరుల ప్రయోజనాలు కాపాడేందుకు పాటుపడ్డారు. కొన్నిసాధించారు. కొన్ని అంశాల్లో యథాతథవాదుల ప్రతికూలతను ఎదుర్కొన్నారు. ఆఖరుకు గాంధీ అంతటి వ్యక్తితో తలపడ్డారు. మార్క్సిజంతో సహా వివిధ సిద్దాంతాలపై తన అభిప్రాయాలు ప్రకటించారు. ఆ తాపత్రయంలో, ఆగ్రహావేశాలలో అనేక అశాస్త్రీయ ప్రతిపాదనలూ చేశారు. చాలా మంది సంస్కర్తలలాగే ఆయనా రాజకీయాలలో అతివాది కాదు గనుక సామాజిక వ్యవస్థ పరిధికి మించి ఆలోచించ లేకపోయారు. స్టేట్‌ సోషలిజం వంటి భావాలు ప్రకటించినా విప్లవకర సాంఘిక సిద్దాంతాన్ని అనుసరించలేకపోయారు. ఇది అందరికీ బాగా తెలిసిన విషయమే. చివరి దశలో ఆయన బౌద్ధం పరి'ా్కరమార్గమని ప్రతిపాదించినా దాన్ని అనుసరించేవారు పెద్దగా లేకపోయారు.
మార్క్సిస్టులుగా తమను తాము పరిగణించుకునే వారెవరైనా ఈ నేపథ్యం దృష్టిలో వుంచుకుని పరిశీలించితే ఆచరణకు ఉపయోగపడుతుంది గాని ఆయన ఏనాడో రాసిన సంపుటాలను పేజీల కొద్దీ ఉటంకించి చీల్చి చెండాడం వల్ల కాదు. ఏ సామాజిక రాజకీయ సమస్యనైనా గతితర్కదృష్టితో పరిశీలించడం మార్క్సిస్టు విధానం. అంటే చలనంలో, కదలికలో చూడాలి. వ్యక్తులు, వ్యవస్థలు, సిద్ధాంతాలు ఏవైనా కావచ్చు. ఘనీభ'వించిన దృష్టితో గాక గమనశీలస్ఫూర్తితో ఆకళింపు చేసుకోవాలి. సమాజం ఒక నూతన చైతన్యం సంతరించుకోడానికి కారణమైన ప్రతి భావాన్నీ ఆహ్వానిస్తూ దాని పరిమితులు గుర్తించాలి. సాపేక్షంగా సానుకూలమైన, ప్రతికూలమైన భావాల పట్ల విచక్షణ చూపగలగాలి. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్టు యాంత్రికంగా వ్యవహరించకూడదు. ఒక వ్యక్తి లేదా భావం స్థూలంగా సమాజవికాసానికి దోహదపడినప్పుడు ఆ విషయాన్ని గుర్తిస్తూ దానిలో పరిమితులను జాగ్రత్తగా వివరించాలి. ఆ ప్రభావంలో వున్నవాళ్లను మరింత సంపూర్ణమూ, సమగ్రమూ అయిన మార్గానికి తీసుకురావాలి. చర్చనీయాంశం సున్నితమూ, సంక్లిష్టమూ అయితే మరింత జాగ్రత్తగా విశ్లేషించాలి. కానీ రంగనాయకమ్మ అందుకు పూర్తి విరుద్ధమైన మార్గాన్ని అనుసరించారు.
కుల సమస్య విషయంలో అంబేద్కర్‌ అభిప్రాయాలన్నీ సరైనవి కాకపోవచ్చు. కానీ ఆ సమస్య క్లిష్టత కూడా అంతే నిజం. అయన రాసిన నాటికి ఇది మరింతగా వర్తించుతుంది. ఆ తర్వాత కాలంలో కోశాంబి, ఇర్ఫాన్‌ హబీబ్‌, ఆర్‌ ఎస్‌ శర్మ, రొమిల్లా థాపర్‌, దేవీ ప్రసాద్‌ తదితరులు సమాజపరిణామాన్ని మార్క్సిసుy్టదృష్టితో అధ్యయనం చేసి అనేక విలువైన విశ్లేషణలు చేశారు. అవే అంతిమ వాక్యాలని వారూ చెప్పలేదు. రంగనాయకమ్మ మాత్రం ఆ సరైన కారణాల జోలికి పోకుండా అంబేద్కర్‌ రచనలో అవకతవకలనే వాటిని లేదా ఆమె పదేపదే చెప్పినట్టు పొంతనలేనితనాన్ని నిరూపించడానికి ప్రయాస పడ్డారు. (ఆమె భా'షాప్రయోగంలోకి తర్వాత వద్దాం) బౌద్ధం పరి'ాష్కారమని ఆయన అన్నాడు గనుక బుద్ధుడి మాటలు - చేతలలోని అనౌచిత్యాలను ఏకరువుపెడుతూ ఆయన ఏమి అని వుండాల్సిందో, ఏమి చేసి వుండాల్సిందో చాలా వివరంగా పేర్కొన్నారు. బుద్ధుడి విషయంలో కూడా ఆమె తర్కాన్నే ఆశ్రయించారు తప్ప ఆనాడు వైదిక మతాన్ని సవాలు చేయడం, బౌద్దం పాత్ర గురించి ప్రగతిశీల పరిశోధకుల అభిప్రాయాలను పేర్కొనలేదు. ఇక చివరగా మార్క్సిజం గురించి అంబేద్కర్‌ వ్యాఖ్యానాలను విమర్శిస్తూ మరోసారి అదనపు విలువ సిద్ధాంతం వగైరాలను వివరించారు. ఆయన మంత్రిగా చేరడం, రాజ్యాంగ రచన తదితర అంశాలతో పుస్తకం ముగించారు. మార్క్సిజం గురించి ఆమె ప్రస్తావనలు కూడా చాలా యాంత్రికంగా, ఆమె భాషలో చెప్పాలంటే ''మిడిమిడి'' సూత్రీకరణలుగా ప్రతీకలుగా వున్నాయే గానీ కులసమస్య సంక్లిష్టత, భారతీయ సమాజ ప్రత్యేకతలు పరిగణనలోకి తీసుకునేవిగా లేవు. ఈ విషయంలో మార్క్‌స్వయంగా చెప్పిన అంశాలకైనా ఆమెచోటు కల్పించలేదు.
రచనారంగంలో అపారానుభ'వం గల వ్యక్తి పదేపదే అవాంచనీయ వ్యాఖ్యానాలకు పాల్పడటం ఆశ్చర్యం గొలిపే స్థాయిలో సాగింది. అందులో పరస్పర విరుద్ధతా గోచరిస్తుంది. ఉదాహరణకు మొదటి పేజీలో ఆమె ఇలా అంటారు:
''అంబేద్కర్‌ శైలి చాలా తేలికగా సుఖంగా అర్థమయయ్యేవిధంగా వుంటుంది. విషయాలన్నీ తెలుసుకోదగ్గవీ, చర్చించదగ్గవీ గనుక ఆసక్తికరంగానే సాగుతాయి. ఎంతో ఓపిగ్గా రాసినట్టు కనబడుతోంది'' - ఇలా ప్రశంసించిన ఆమె మతగ్రంథాలపై ఆయన అనవసరంగా ఎక్కువ సమయం వెచ్చించడాన్ని ప్రస్తావించి ''గొడ్డుచాకిరీ'' అన్న మాట కూడా ఆ కష్టాన్ని చెప్పదు అంటారు. ఇంత సమయం పెట్టడం ''దండగమారి పని'' అని పదేపదే అనిపిస్తుందని కూడా రాస్తారు. చర్చించదగ్గవీ, అసక్తికరమైనవీ అయిన విషయాలపై శ్రమపడటాన్ని, ఓపిగ్గా రాయడాన్ని 'గొడ్డుచాకిరీ', 'దండగమారి పని' అని పిలవడం ఎలాటి ఔచిత్యం? ఆమె తన రచనలో ''పొంతనలేకపోవడం'' అనే మాట పదేపదే ఉపయోగించారు గనుక మొదటి రెండు పేజీలలోనే ఎంత పొంతన పాటించారో అర్థం కావడానికి ఈ ప్రస్తావన. అంబేద్కర్‌ అస్పృశ్యులలో తెచ్చిన స్పృహ ఏమిటో మొదట్లో ఆమె మాటల్లో చూశాము. కానీ ఆతర్వాత రెండు పేజీలు కూడా తిరక్కుండానే ఆయన వల్ల పట్టుబడింది ''రిజర్వేరేషన్‌ దాస్యమూ, మతమౌఢ్యమూ'' మాత్రమే నంటారు!
అంబేద్కర్‌ వాదనలలో లోపాలను నిర్దిష్టంగా ఎత్తిచూపాలి గానీ గొడ్డుచాకిరీ అనీ, దండగమారి పని అనీ ''ఆకతాయిపిల్లవానివాదం కన్నా విలువైనది కాదు'' అనీ, ''మేధావితనం మితిమీరితే లోకజ్ఞానం అడుగంటుతుందనీ'' - ఇంకా ఇలాటి భాషలో వ్యాఖ్యలు గుప్పించడం ఏ అవగాహనకు దోహదపడుతుంది? ''ఎదుటివాళ్లు ఎప్పుడు ఏది చెబితే అది బాగుందో లేదో చూడకుండా ఏది చెప్పినా తిరస్కరించాలనే దృషిy వల్లనే అంబేద్కర్‌ దారితప్పిపోయారని'' విశ్లేషించడం ఎంత విపరీతం? అంటే కేవలం తన ప్రవృత్తి వల్లనే ఆయన దారితప్పారన్నమాట.
ఆయన తన వాదనల గురించి గొప్పగా చెప్పుకున్న ప్రతిమాటనూ ఆమె ఎగతాళి చేస్తారు. ఆయనే చివరలో ఇదే అంతిమ సత్యం కాకపోవచ్చని వినయంగా చెప్పుకోడం మాత్రం సాంప్రదాయికత అనీ, లాంఛనం అనీ కొట్టిపారేస్తారు. మతసాహిత్యం మీద ఇంత సమయం పెట్టడం దండగమారి పని అయితే ఆమె రామాయణ విషవృక్షానికి ఆస్కారమే వుండేదికాదు. పురాణ గ్రంథాలలో కూడా సామాజిక విశ్లేషణకు పనికివచ్చే విషయాలు ఎలా పటుyకోవచ్చో ఆమె ఆ పుస్తకం పీఠికలో రాశారు. ఆఖరుకు సుప్రసిద్ధ పరిశోధకుడు ఆర్‌.ఎస్‌. శర్మ కూడా పురాతన కాలంలో కులాల గురించి తెలుసుకోడానికి ఏకైక ఆధారం మతసాహిత్యమేనని పేర్కొన్నారు. ''ఈ రెండు అభిప్రాయాలు ఆర్యసామాజికుల పిడివాదాలమీద ఆటంబాంబుల్లా విరుచుకుపడతాయి'' అని అంబేద్కర్‌ అంటే ''వేదాల్ని పొగిడే వాళ్లకు జవాబుచెప్పడానికి ఆటంబాంబులు కావాలా? చీపురు పుల్లలు చాలవూ'' అని రంగనాయకమ్మ కామెంట్‌. చీపురు పుల్లలతో మతోన్మాదాన్ని ఎదుర్కోవడం సాధ్యమని ఆమె నిజంగా నమ్ముతున్నారా? (అదే భాషలో చెప్పాలంటే ఒక చీపురు పుల్ల విసిరి వాజ్‌పారుని గద్దెదించవచ్చుగా) మతకర్మకాండను అంబేద్కర్‌ ఎక్కువగా వర్ణించారని ఇంకో ఎద్దేవా! సమాజ పరిశీలనలో కర్మకాండకు చాలా ప్రాముఖ్యత వుంటుంది. రోమన్‌ బానిసల కన్నా అస్పృశ్యుల పరిస్థితి హీనం అని అంబేద్కర్‌ రాశారు. తిలక్‌ వాదనకు సమాధానంగా అది చెప్పారు. ఇక వెంటనే ఆ మాట నిజం కాదని నిరూపించేందుకు ఆమె హడావుడి పడతారు. చారిత్రికంగా నిలవకపోయినా అస్పృశ్యుల వేదనను ప్రతిధ్వనించే పరిస్థితిని సానుభ'ూతితో చూడాల్సిందిపోయి దానిపైనా ధ్వజమెత్తడం ఎలాటి న్యాయం? ఆడదై పుట్టడం కన్నా అడవిలో మానై పుట్టడం మేలు అనే సామెత వుందనుకోండి, వాదనకు నిలుస్తుందా? స్పార్టాలో బానిసల కన్నా అస్పృశ్యుల స్థితి మెరుగని ఆర్‌.ఎస.్‌శర్మ కూడా రాశారు. కుల సమస్యపై అంబేద్కర్‌ భావాలు కొన్ని ప్రస్తావించి అవి సరికాదని ఆయన చెప్పారు. అయితే ఆభాషవేరు. దృక్పథం వేరు.
ఇంతేగాక ఆమె తన పుస్తకంలో కింది కులాల వారి మనోభావాలను దృష్టిలో పెటుyకోకుండా అనేక వ్యాఖ్యలు చేశారు. అస్పృశ్యులు ఇలా ఎందుకనరు? అంటూ వాదనలు లేవనెత్తారు. తర్కం కోసమే అయినా సున్నితమైన అంశాలు జాగ్రత్తగా ప్రస్తావించొద్దా? రాజ్యాంగ రచన పూర్వపరాలపై కూడా ఆమె చాలానే రాశారు. అది క్లర్కులు చేయగలిగిందేగానీ పెద్ద నైపుణ్యం అక్కరలేదని తేల్చారు. రాజ్యాంగం పట్ల అంబేద్కర్‌ భావాలనూ చాలానే పొందుపరచారు. వాటిలో సమగ్రత లోపించింది. చివరకు ఎంతవరకు వెళ్లారంటే రాజ్యాంగం మార్పులకు వీలైందని అంబేద్కర్‌ చెబుతుండగా ఇప్పటి దళిత నాయకులు మార్పును వ్యతిరేకిస్తున్నారేమిటని ఆశ్చర్యం వెలిబుచ్చారు. మేధావితనం ముదిరితే ఏమవుతుందో పైన తానే చెప్పినదాన్ని గుర్తు చేశారు! ఒక మతోన్మాద ప్రభ'ుత్వం తలపెటిyన అనర్థక సవరణలు గనుక దళితులే గాక ప్రజాస్వామికవాదులందరూ వ్యతిరేకిస్తున్నారని తెలిసీ ఇలాటి ప్రశ్నలు విసరడం ఎంత బాధ్యతా రాహిత్యం?
ఈ పుస్తకంలో అసందర్భ వ్యాఖ్యలను, అవహేళనలను వివరంగా పేర్కొనడానికి ఎంత స్థలమైనా చాలదు. ఎందుకంటే ఆమె ఎంచుకున్న శైలి అది. ఆడబిడ్డ పుట్టిందని శ్రావస్తి రాజు విచారిస్తుంటే బుద్ధుడు మగబిడ్డకన్నా ఆడబిడ్డే గొప్పకావచ్చు అని సర్దిచెబుతాడు. ఏ బిడ్డ అయినా ఒకటే అనకుండా ఇదేమిటని ఈమె బుద్దునిపై కోపగిస్తారు!
మార్క్సు గురించి మాట్లాడాలంటే మార్క్స్‌ ఎంగెల్స్‌ల రచనల మీద ఆధారపడి మాత్రమే మాట్లాడాలని ఇంకో ముఖ్యమైన పాయింటు రాశారు. 150 ఏళ్ల కిందటి స్థితిలోనే మార్క్సిజం ఆగిపోలేదు. ఎన్నో ఎదురుదెబ్బలు తింటూనే పురోగమనమూ సాధించింది. కనీసం లెనిన్‌ను కూడా రంగనాయకమ్మ పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపించరు.
మార్క్సిజం ఏ అంశాన్నీ శూన్యంలో విమర్శించదు. స్థలకాలాలలో మాత్రమే పరామర్శిస్తుంది. మానవ చైతన్య వికాసంలో ప్రతి చిన్న అడుగునూ పరిగణనలోకి తీసుకుంటుంది. పెట్టుబడిదారీ విధానం నిర్వహించిన విప్లవాత్మక పాత్రను మార్క్స్‌ ప్రశంసాపూర్వకంగా ప్రస్తావించడానికి కారణం అదే. కానీ అంబేద్కర్‌ గురించి రంగనాయకమ్మ గారి పరిశోధన ఆ పద్ధతిలో ఎంతమాత్రం నడవలేదు. ఇది సమస్యను సవ్యంగా అర్థం చేసుకునేందుకంటే ఆవేశాలు అపార్థాలు పెరగడానికే ఎక్కువగా కారణమవుతుంది. అంబేద్కర్‌ స్ఫూర్తి ఈ నాటి మన సమాజంలో ఒక పాత్ర పోషిస్తోంది. వేలఏళ్లనాటి మనుధర్మ శాస్త్రాన్ని పున:ప్రతిష్టించాని చెప్పే అభివృద్ధి నిరోధకశక్తులు కేంద్రంలో తిష్టవేసి ప్రజాస్వామ్య లౌకిక వాతావరణాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్న సంగతి గమనంలో వుంచుకున్న వారెవరూ దానిపై పోరాటానికి ఉపయోగపడే అంబేద్కర్‌ భావాల గురించి, కులసమస్య గురించి ఈ విధంగా రాయరు. కళ్లెదుట కనిపించే వాస్తవాన్ని గుర్తించి ప్రగతి నిరోధకులపై సమైక్యంగా పోరాడవలసిన అవసరాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.
(2001?)


3 comments:

  1. రవి గారూ!
    రంగనాయకమ్మ గారి పుస్తకంపై మీరు రాసిన సమీక్ష చదివాను. ఆమె వాదనలో ఫలానా లోపాలున్నాయని చెప్పటం వేరు. కానీ మీరు ‘వేలూ వందల సంవత్సరాల ఎడం దృష్టిలో పెట్టుకోకుండా పై ముగ్గురి భావాలను పోల్చి చెప్పడం అసంబద్ధమైన అచారిత్రికమైన దృక్పథం’- అని రాశారు. ఈ ముగ్గురిలో బుద్ధుడొక్కడే వేల యేళ్ళ ఎడం ఉన్న వ్యక్తి. మార్క్స్, అంబేద్కర్ సమకాలీనులు కాకపోవచ్చు వారిద్దరికీ పెద్దగా ఎడం లేదు. కానీ మార్క్పిజం విస్తృతంగా చర్చించనీయాంశంగా ఉన్న కాలంలోనే అంబేద్కర్ తన సిద్ధాంతాలను ప్రకటించాడు.

    దళిత సమస్య పరిష్కారానికి బౌద్ధం పరిష్కారమని చెప్పటమే కాకుండా అంబేద్కర్ మార్క్సిజంపై వ్యతిరేకత ప్రదర్శించి దాన్ని దళితులకు అందకుండా చేశారు. అంబేద్కర్ పరిష్కారంగా సూచించిందీ, ఆచరించిందీ దళితుల ప్రయోజనాల దృష్ట్యా సమంజసమా కాదా అనేది పరిశీలించబోతే అది అచారిత్రకమైపోతుందా?

    ReplyDelete
    Replies
    1. వేణు గారూ,

      నేను రాసిన వ్యాఖ్యలో అన్నిటికీ సమాధానాలున్నాయి. జాగ్రత్తగా పరిశీలించండి.
      సూచనగా చెప్పి వదిలేయడానికి రంగనాయకమ్మగారిపై గౌరవమే కారణం. బుద్దుడు వేల ఏళ్లు, మార్క్స్‌ వంద ఏళ్లు తేడా . అంబేద్కర్‌ను నేనెక్కడా ఏకపక్షంగా సమర్థించలేదు కాని ఆయన గురించిన వ్యాఖ్యలలో గమనించాల్సిన కొన్ని సున్నితమైన జాగ్రత్తలు పేర్కొన్నాను. ఆంబేద్కర్‌పై ప్రజాశక్తి కుబేర్‌ రాసిన సమగ్ర గ్రంధమే ప్రచురించింది. నా వరకు నేను ఇప్పటికి ఇరవయ్యేళ్ల కిందటే కుల సమస్యపై ప్రత్యేకంగా రాసిన పుస్తకం మూడు ముద్రణలు పొందింది. అందులోనూ అంబేద్కర్‌ పరిమితులు రాశాను.ఓపిక అవకాశం వుంటే చూడండి. కనక సమస్య విమర్శ కాదు, విమర్శించే తీరులో విస్మరిస్తున్న సామాజిక స్పందనలు. రంగనాయమ్మ గారు తర్వాతి పరిణామ క్రమం సంక్లిష్టతలు పరిగణనలోకి తీసుకోవడం లేదన్నది అప్పుడూ ఇప్పుడూ నా భావన.

      Delete
  2. మార్క్సిజం అర్ధమయితే శాస్త్రం లేకుంటే తప్పిదం అని ఎక్కడో చదివింది గుర్తుకొస్తుంది.

    చలనం లో పరిశీలించడం అవగతం కాకుంటే మార్క్సిస్టు అతివాదం మహా ప్రమాదకరమయింది.

    హేళనగా - ఆవేశం గా - అతిగా చెప్పడం వల్ల అసలుకు మోసం + మనం వీరభాషణ చేసి మాకూ మార్క్సిజం తెలుసునని మేమూ మేధావులమని చెప్పుకోవడానికే పనికి వస్తుంది.

    ఆచరణలొ ప్రజలతో మమేకం కావడానికి - వారిని మార్క్సిజం వైపు విశ్వసనీయత కల్పించడానికి బదులు భయపడేటట్లు చేస్తుంది.

    యాంత్రికం గా విమర్శించేవారు తాము మాత్రమే కుండబద్దలు కొడుతున్నట్లు మిగతావాళ్లు అసలు మార్క్సిస్టులే కాదని భ్రమలలో ఉంటుంటారు.

    ఘర్షణ లో నుండి మేలైన భావం ఉత్పత్తి కావాలి తప్ప హేళనగా - కుతర్కపు వ్యంగ్యం వల్ల మినిమం సంస్కారం కోల్పోవడం జరుగుతుంది.

    కేపిటల్ పరిచయం ద్వారా మార్క్సిజానికి మేలు చేసిన రంగనాయకమ్మ గారు విమర్శించేటప్పుడు అనవసర తర్కం చేసే సందర్భాలే ఎక్కువగా ఉంటాయి.

    ReplyDelete