Pages

Saturday, October 27, 2012

విస్తరణ వివాదాలు- విస్తరించిన విభేదాలు


ఎంతకాలం నుంచో ప్రచారం జరుగుతున్న కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఎట్టకేలకు ఆదివారం పూర్తి కానుంది. ే పూర్వ ప్రజారాజ్య నేత మెగాస్టార్‌ చిరంజీవితో పాటు కోట్ల సూర్య ప్రకాశరెడ్డి, బలరాం నాయక్‌, కిల్లి కృపారాణి, సర్వే సత్యనారాయణ పదవులు పొందనున్నారు. ప్రభుత్వం కూలిపోయే స్థితిలో తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపి ప్రాణం నిలిపిన చిరంజీవికి కేంద్రంలో స్థానం కల్పిస్తారని ఎప్పటినుంచో చెబుతున్నా ఆ ప్రక్రియ బాగా ఆలస్యమైంది. దీనిపై అనేక వ్యాఖ్యలు కూడా వచ్చాయి. ఇక కోట్ల సూర్య మాజీ ముఖ్యమంత్రి కుమారుడైనప్పటికీ జిల్లాకే పరిమితమై తన వర్గం పనులను చూసుకుంటూ కాలం గడుపుతుంటారు. రాయలసీమలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ను ఎదుర్కొవడానికి సామాజిక సమీకరణను నిలబెట్టడంలో ఆయనను తీసుకోవడం ఉపయోగమని అంచనా వేసినట్టు కనిపిస్తుంది. ఉత్తరాంధ్రలో కిల్లి కృపారాణిని తీసుకోవడంలోనూ ఇదే వ్యూహం అనుకోవాలి. తెలంగాణా విషయానికి వస్తే ప్రాంతీయ ఉద్యమం నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్‌ అధిష్టానం తరపున నిలబడే వారు కావాలి గనక సర్వే, నాయక్‌లు ఎంపికయ్యారు. అనేక సందర్భాల్లో తీవ్ర స్వరంతో ప్రత్యేక నాదం వినిపిస్తున్న వారికి భిన్నంగా సర్వే అధిష్టానం విధేయతను చాటుకున్నారు. అందరూ బహిష్కరించినప్పుడు కూడా ఆయన లోక్‌సభలో వుండి తన వాదం వినిపించారు.ఇప్పుడు పదవి పూర్తిగా సోనియా గాంధీ దయా దాక్షిణ్యాల వల్లనే లభించిందంటూ ఆ విధేయతను రెట్టింపు చేశారు. పైగా వీరికి ఇవ్వడం వల్ల ఎస్‌సి ఎస్‌టి వర్గాల ప్రతినిధులుగానూ వారిని ముందుకు తెచ్చే అవకాశం వుంటుంది.
వాస్తవానికి ఎవరికి ఏ పదవి వచ్చిందన్న దానికన్నా ఎవరు ప్రజల కోసం ఏం చేశారన్నది
ముఖ్యం. ఇప్పటి వరకూ కేంద్రంలో రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలు అపరిషృతంగానే వుండిపోయాయి. అతి కీలకమైన తెలంగాణా సమస్యపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోవడం వల్ల అనిశ్చితిలో కూరుకుపోయిన స్థితి. నదీజల వివాదాలు, గ్యాస్‌ బొగ్గు కేటాయింపులు, నిధుల మంజూరు వంటి సమస్యలు సరే సరి. రాజకీయంగానూ అవినీతి ఆరోపణలకు గురైన మంత్రులపై ఏ చర్య తీసుకోవాలనేది నానబెట్టిన అధిష్టానం కావాలనే అనిశ్చితిని కొనసాగిస్తూ అధికారాన్ని కాపాడుకోవడానికే ఏకైక ప్రాధాన్యత నిస్తున్నది. ఈ పరిస్థితుల్లో కేంద్రంలో మంత్రుల సంఖ్య పెరిగినా రాష్ట్రానికి ఒరిగేది ఏమీ వుండదు. పైగా ఆదిలోనే హంసపాదులా పదవులు రాని వారి అలకలు, ఆగ్రహాలు ఇప్పటికే వ్యక్తమవుతున్నాయి. రాయపాటి సాంబశివరావు గతంలోనే బహిరంగంగా ఆగ్రహం వెలిబుచ్చగా కావూరి సాంబశివరావు కూడా అదే విధమైన స్పందనలో వున్నట్టు కనిపిస్తుంది. అధికార పార్టీలో ఇలాటివి కొత్త కాదు, ఇవన్నీ చివరి దాకా నిలిచేదీ లేదు. కాకపోతే అసలే అస్థిరత్వంలో అస్తుబిస్తుగా నడుస్తున్న ఆ పార్టీ పరిస్థితికి ఇవన్నీ అద్దం పడతాయి.
ఈ సమయంలోనే రాష్ట్రంలోనూ పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ పార్టీ ముఖ్యుల సమావేశం అంటూ జరిపి విభేదాలు తొలగించేందుకు ప్రయత్నించాల్సి వచ్చింది. మిగిలిన విషయాలెలా వున్నా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మధ్య వివాదాన్ని తొలగించగలిగినందుకే ఆనందపడిపోతున్నారు.అదైనా పైపై వ్యవహారమే తప్ప ఈ వ్యక్తిగత రాజకీయ వ్యూహాల ఘర్షణకు ముగింపు అంటూ వుండదు.ఇప్పుడు వాటికే ప్రాంతీయ కోణం జోడించే అవకాశం కూడా ఉపయోగించుకుని ప్రజలను గందరగోళ పరుస్తున్నారు. ఈ సమయంలోనే ఎంతోకాలంగా వాయిదా పడుతున్న నామినేటెడ్‌ పదవుల పందేరం ప్రారంభించేందుకు కూడా ముఖ్యమంత్రికి అనుమతి లభించింది. అధికార భాషా సంఘం అద్యక్ష పదవితో అది మొదలైంది. ఇవన్నీ చూస్తుంటే ప్రజల సమస్యల పరిష్కారం కన్నా పార్టీ వారిని సంతృప్తి పర్చే పనిలో అధినేతలు నిమగమవడం తథ్యమని అర్థమవుతుంది. స్థానిక ఎన్నికలలో ఇలాటి పరీక్ష చేసుకోవచ్చు. కేంద్రంలోనూ మనుగడ కష్టంగానే వుంది గనక ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చన్న అంచనా నెలకొంది. గుజరాత్‌, హిమచల్‌ ప్రదేశ్‌లలో పెద్ద అనుకూల వాతావరణం వుంటుందని భావించడం లేదు. త్రిపురలో అసలే అవకాశం వుండదు. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌ను ఏదో ఒక విధంగా కాపాడుకోవాలని అధిష్టానం ఆశపడుతున్నది. అయితే అనిశ్చితిని తొలగించకుండా అవినీతిపై ఖచ్చితమైన వైఖరి తీసుకోకుండా పట్టు నిలబెట్టుకోవడం కుదిరేపని కాదు. లేపాక్షి భూముల స్వాధీనం వంటి చర్యలను ముఖ్యమంత్రి వర్గం గొప్పగా చెప్పుకోవచ్చు గాని తన మంత్రివర్గ సహచరులపై చర్య తీసుకోలేకపోయిన నిజం కనిపిస్తూనే వుంది. ఇటీవలనే ధర్మానను తిరిగి ఆహ్వానించారంటే అధిష్టానం ఆలోచన ఎలా వుందో తెలుస్తుంది.ఇన్ని ఆరోపణలు తమవారిపైనే వుండగా వైఎస్‌ఆర్‌ పార్టీపైనో మరొకరి పైనో ధ్వజమెత్తినంత మాత్రాన ప్రజలు హర్షిస్తారని అనుకోలేము. మీ సంగతేమిటని తప్పక ప్రశ్నిస్తారు. దానికి తోడు అధికార పార్టీలో పదవి రాని అసమ్మతి వాదులు తెలంగాణాలోనైనా ఇతర చోట్లనైనా తప్పక నిప్పు రాజేస్తూనే వుంటారు. వారికి ఇప్పుడున్న అనిశ్చితి అసంతృప్తి వరప్రసాదాలవుతాయి. కాకపోతే వారి మాటలకు ఎంత విలువ ఇవ్వాలన్నది ప్రజలు కూడా గమనించే వ్యవహరించాల్సి వుంటుంది.

No comments:

Post a Comment