Pages

Saturday, December 18, 2010

రైతాంగ విషాదం: రాజకీయ వివాదం

రాష్ట్ర రాజకీయ చరిత్రలో అత్యంత కల్లోలితమైన ఒక ఏడాది ముగింపు దశకు చేరుతున్నా ఆ కల్లోలాలకు కారణమైన పోకడలు మాత్రం మారలేదని ఈ వారం జరిగిన అనేక పరిణామాలు స్పష్టం చేశాయి. ఒకే ఖరీఫ్‌లో అయిదు సార్లు అతలాకుతలం చేసిన తుపానులతో హతాశులైన రైతాంగాన్ని ఆదుకోవడానికి సమగ్రమైన సానుకూల చర్యలను ప్రకటించేబదలు సంఘర్షణాత్మక వైఖరికే ప్రభుత్వం మొగ్గుచూపింది. మరీ ముఖ్యంగా కొత్త ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి నాయకత్వం చేపట్టాక జరిగిన మొదటి శాసనసభా సమావేశాలు ఆద్యంతం అవాంచనీయమైన నిరర్థకమైన వాగ్వివాదాలకు పంతాలు పట్టింపులకూ వేదికలుగా
మారాయి. వివిధ ప్రాంతాలలో విద్యార్తులపై పెట్టిన కేసుల ఉపసంహరణ, రైతాంగాన్ని ఆదుకోవడం అన్న రెండు అంశాలపైన స్థూలమైన ఏకాభిప్రాయం వున్నా దాన్ని ఉపయోగించుకుని సద్భావన పెంపొందించేబదులు వ్యూహాత్మకంగా ఘర్షణ వాతావరణమే మేలన్నట్టు ప్రభుత్వం ప్రవర్తించింది.
మొదట విద్యార్థుల కేసుల విషయమే తీసుకుంటే వీటిపై సభలో వేడి పెరుగుతుందనేది ముందుగా అనుకున్నదే.అయితే ప్రభుత్వం ఉపసంహరిస్తానన్న కేసుల శాతం చాలా పరిమితంగా వుండటంతో సహజంగానే 1అధికారపార్టీతో సహా అందరిలోనూ అసంతృప్తి వ్యక్తమైంది. డిసెంబరు 31 తర్వాత ఏమి జరుగుతుందో చూసి కేసులపై నిర్ణయం తీసుకుంటామన్న ఆలోచన వాస్తవితకూ తర్కానికి విరుద్ధమైంది. తర్వాత ఏమి జరుగుతుందనేది అప్పటి పరిస్థితిని బట్టి చేయవలసిందే తప్ప ఈ కేసులను కొనసాగించడం అందుకు పరిష్కారం కాదు. పైగా దీనివల్ల ముందునుంచే ఒక విధమైన ఉద్రిక్తతకు ఆస్కారమిచ్చినట్టయింది. దానిపై టిఆర్‌ఎస్‌ సభ్యుల నిరసనను సాకుగా చూపి మూడు రోజులు వృధాగా పోవడానికి కారణమైంది. తర్వాత రైతు సమస్యలపై చర్చలోనూ రాజకీయ దాడులే అధికమైనాయి. ఈ సందర్భంగా గతంలో తెలుగు దేశం పాలనతో పోల్చుకోవడానికి చూపిన శ్రద్ధ బయిట పరిస్థితికి తాము చేపట్టిన చర్యలకు మధ్య గల అంతరాన్ని పరిశీలించుకోవడానికి చూపించలేదు. తెలుగు దేశం హయాంలో ప్రకృతి ప్రతికూలతకు తోదు ప్రభుత్వ వైఖరి వల్ల కూడా వ్యవసాయం సంక్షోభాన్ని ఎదుర్కొన్న మాట ఆ ఎవరూ కాదనలేదు.అందుకే వారి స్తానంలో అధికారం చేపట్టిన వైఎస్‌ ప్రభుత్వం జయతి ఘోష్‌ కమిషన్‌ను నియమించింది. కాని వారి ప్రధాన సిఫార్సులను మాత్రం పెడచెవిని పెట్టింది. వ్యవసాయాన్ని పండుగ చేశామని పదే పదే చెప్పుకోవడమే తప్ప అది దిగజారిపోతూనే వుందన్న వాస్తవాన్ని అంగీకరించలేదు. గిట్టుబాటు ధరలు, ధాన్యం అమ్మకాలు, మార్కెట్‌ యార్డులు, ఎరువులు పురుగుమందులు ప్రతిదీ ప్రళయంగానే మారిన రైతన్నను ఇంత ఆపత్కాలంలో ఆదుకోవడానికి సూటిగా ముందుకు వచ్చే బదులు వ్యర్థ వాదనలలో మునిగి తేలడం దారుణమైన విషయం.అంతా అయిన తర్వాత ముఖ్యమంత్రి చేసిన ప్రకటన కూడా కంటి తుడుపు తప్ప కన్నీళ్ల నివారణ కాదు. అందుకే ఆయన ప్రకటన వెలువడిన తర్వాత రోజు ఆరుగురు ప్రాణాలు తీసుకోవడమే వారిలో భరోసా ఏర్పడలేదనడానికి నిదర్శనం. దీనిపై చంద్రబాబు నాయుడు నిరాహారదీక్ష ప్రారంభించడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని అదే పనిగా విమర్శించడం పసలేనిది. సమస్యను వదలిపెట్టి దాన్ని పరిష్కరించిన ప్రభుత్వాన్ని కాక ప్రతిపక్ష నేత దీక్షను తప్పుపట్టడం తలకిందులు తర్కం.ప్రభుత్వాధినేతల విమర్శలకు ప్రజారాజ్యం అధినేత గొంతు కలపడం మరింత విచిత్రం. కాంగ్రెస్‌తో ప్రజారాజ్యం సామీప్యతను ఈ విధంగా తనే ధృవీకరిస్తున్నట్టు ఆరోపణలను కొనితెచ్చుకోవడానికే ఇది ఉపయోగిస్తుంది. ప్రతిపక్షంలో వున్న పార్టీలు కలిసికట్టుగా పోరాడకపోయినా ఒకరి పోరాటాలను మరొకరు తప్పు పట్టుకోవదం మామూలుగా జరగదు. ఇదే సమయంలో కొత్తపార్టీ స్థాపిస్తానన్న వైఎస్‌ జగన్‌ కూడా నిరాహారదీక్షకు సిద్ధమవుతున్నారు.తనతో పాటు సామూహికంగా తన అనుయాయులను కూడా సమీకరిస్తున్నట్టు కనిపిస్తుంది. తెలుగు దేశం ఇటీవల రాజకీయంగా ఎదుర్కొన్న కొన్ని వొడుదుడుకులనుంచి బయిటపడటానికి ఈ అవకాశం ఉపయోగపడిందనుకుంటే కొత్తగా తను స్థాపించబోయే పార్టీకి పునాది అవుతుందని జగన్‌ భావిస్తుండవచ్చు. ఏమైనాసమస్య వున్నప్పుడు ఇలాటివన్నీ సహజమే. వాస్తవానికి రైతుసంఘాలు చాలా కాలంగా ఈ సమస్యలను లేవనెత్తుతూనే వచ్చిన సంగతి గుర్తుంచుకోవాలి.వ్యవసాయ విధానం సమూలంగా మారాలి తప్ప తాత్కాలిక ఉపశమనాల వల్ల లాభం లేదని కొందరు అంటున్నారు గాని ఈ రెంటికీ పోటీ ఏమీ లేదు.( ప్రజాశక్తి విజ్ఞాన వీచికలో దీనిపై సమగ్ర సమాచారం అరిబండి ప్రసాదరావు ఇచ్చారు) కేంద్రం విపత్కర పరిస్తితిలో రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ముందుకు రాకపోవడమే శోచనీయమైన విషయం.
శాసనసభలో దీనితో పాటు మైక్రోఫైనాన్స్‌ బిల్లును, స్వయం సహాయ బృందాల బిల్లును ఏకపక్షంగా ఆమోదింపచేసుకోవడం కూడా అభ్యంతరకరమే. వీటికి సంబంధించి చాలా విమర్శలు లోపాలు వున్నాయి. దీంతో పాటే సభ వెలుపల ఆందోళన చేస్తున్న వివిధ తరగతుల ప్రజల సమస్యలపై సావధానంగా స్పందన కూడా వెలువడలేదు. పైగా వారిపై అమానుషమైన లాఠీచార్జిలు నిర్బంధాలు ప్రయోగించబడ్డాయి. ఇవేవీ కొత్త ప్రభుత్వానికి ప్రతిష్ట తెచ్చేవి కావు.
టిఆర్‌ఎస్‌ మహాగర్జన
వరంగల్‌లో టిఆర్‌ఎస్‌ మహాగర్జన అందరూ వూహించినట్టే ఘనంగా జరిగింది. ఆ పార్టీకి ఉత్సాహం ఇచ్చింది కూడా. అయితే ప్రాంతీయ సమస్యలపై కేంద్రం వైఖరి స్పష్టం గాని నేపథ్యం టిఆర్‌ఎస్‌ను ప్రభావితం చేస్తున్నట్టు ఈ సభ స్పష్టం చేసింది. తెలంగాణా కాంగ్రెస్‌ నాయకులను తీవ్రంగా విమర్శిస్తూనే అసలు నిర్ణయం తీసుకోవలసిన కేంద్ర కాంగ్రెస్‌ను ప్రస్తావించకపోవడం టిఆర్‌ఎస్‌ వైఖరిలో వైరుధ్యాన్ని ప్రతిబింబించింది. తెలుగుదేశం బదులు కాంగ్రెస్‌ను విమర్శించారని పలువురు వ్యాఖ్యానించిన పూర్వరంగంలో చంద్రబాబు నిరాహారదీక్షను కె.తారకరామారావు నిశితంగా విమర్శించడం ఆ లోటును పూర్తి చేసింది. డిసెంబరు 31 తర్వాత ఉద్యమం జెఎసి నడిపిస్తుందన్నట్టు మాట్లాడ్డంలోనూ రాజకీయ వ్యూహం ద్యోతకమైంది. పాలక పక్షాల నేతలందరూ మరోసారి జెండాలు లేని ఒకే అజెండా ప్రహసనాన్ని పునరావృతం చేస్తారా అన్న సందేహానికి తెరతీసింది. అయితే తమ తమ అవసరాల నిమిత్తం ఎప్పటికప్పుడు కలసి విడిపోయి రకరకాలుగా మాట్లాడుతుంటే విశ్వసనీయత ఏ మేరకని ప్రజలు ఆలోచించకపోరు. గతంలో అనేక సార్లు తెలంగాణా పేరిట రాజకీయాలు నడిపిన కాంగ్రెస్‌ నాయకులు ఈ సందర్భంలోనూ కె.సిఆర్‌ విమర్శలపై విరుచుకుపడటంలో విశేషమేమీ లేదు. ఇదే గాక రకరకాల పేర్లతో అనేకానేక జెఎసిలు ఏర్పడివున్న పరిస్థితి రీత్యా గత పరిణామాలు యధాతథంగా పునరావృతమవుతాయా లేక మరో విధంగా జరుగుతుందా అన్నది వేచి చూడవలసిన విషయం.
శ్రీకృష్ణ వీడ్కోలు భాషణం..
మహాగర్జన రోజునే జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ అధికారికంగా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలకు పార్టీలకు వీడ్కోలు చెప్పడం యాదృచ్చికం కాదు. తమ పని పూర్తి కావడానికి సహకరించినందుకు కృతజ్ఞతల పేరిట ఈ సమావేశం ఏర్పాటు చేసినా మీడియాకు వారు చెప్పిన మాటలు అర్థగర్భితంగా వున్నాయి.అన్ని ప్రాంతాలకూ మేలుచేసే నివేదిక నిస్తామని చెప్పడం, అది కొందరికి నచ్చకపోవచ్చంటూనే అందరికీ సంతోషం కలిగిస్తుందనడం రకరకాల వ్యాఖ్యానాలకు దారి తీశాయి.శ్రీకృష్ణ కమిటీకి ప్రస్తావనాంశాలలో సూటిగా విభజన లేదా యధాతథస్తితి కొనసాగింపుపై సిఫార్సు సూటిగా చేయాలన్నది లేదు.తాము అలా చేయబోవడం లేదని వారు అనేకసార్లు చెప్పివున్నారు కూడా.బహుశా అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను న్యాయమైన సమస్యలను అందులో పొందుపరిచాము గనక అందరికీ సంతోషం కలుగుతుందని వారి ఉద్దేశం కావచ్చు. దీనిపై కాంగ్రెస్‌ నేత కె.కేశవరావు విరుచుకుపడటమే ఆశ్చర్యం కలిగిస్తుంది. తామే నియమించిన కమిటీ సాదారణ సంయమన వాక్యాలు పలికితే అంతగా తప్పు పట్టడం ద్వారా కెకె ఏవో రాజకీయ సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నించారన్నది స్పష్టమే. ఇదే బహుశా భవిష్యత్తులో కాంగ్రెస్‌ నేతల వైఖరి కూడా కావచ్చు. అదే సమయంలో ఇతర ప్రాంతాలలోని కాంగ్రెస్‌ నేతలు మరో విధంగానూ మాట్లాడవచ్చు.ఆ మాటకొస్తే తెలుగుదేశంతో పాటు జగన్‌ ఏర్పాటు చేయబోయే ప్రాంతీయ పార్టీ కూడా రెండు ప్రాంతాలలో రెండు రకాల వైఖరులు చేపట్టే అవకాశమే ఎక్కువగా వుందని వూహిస్తున్నారు. ఇవన్నీ ఎలా వున్నా వివిధ ప్రాంతాల ప్రజల మధ్య ఉద్రిక్తతలు రగుల్కొల్పే చర్యలు మాత్రం అనుమతించరానివి. ఈ ఏడాది కాలంలోనూ ప్రజలు ప్రశాంతతను కోరుతున్నారన్న మాట నిర్ద్వంద్వంగా రుజువైంది. దీన్ని గౌరవించడం అన్ని పార్టీల బాధ్యత. అదనపు బలగాల గురించి అదే పనిగా ప్రకటనలు వెలువరించడం ద్వారా ప్రభుత్వం ఏమి ఆశిస్తున్నదో గాని రాజకీయ పరిష్కారం లేకుండా కేవలం సాయుధ బలగాలే ఇలాటి సందర్భాలను సర్దుబాటు చేయలేవు.
కాంగ్రెస్‌ పరిణామాలు
ఈ వారం జగన్‌ శిబిరంలోకి పాలక పక్ష ఎంఎల్‌ఎలు ఒకరిద్దరు విధేయత ప్రకటించడం బాగా ప్రచారం పొందింది. అయితే రాజ్యాంగ పరిమితుల దృష్ట్యా వారు తాము కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని కూడా చెప్పారు. తమ వైపు చాలామంది వస్తున్నారని జగన్‌ వర్గీయులు చెబుతుండగా వచ్చిన వారిలో ఎక్కువ మంది గతంలోనూ ఆయనతో వున్నవారేనన్నది కూడా యదార్థం. సామినేని ఉదయభాను వంటివారు ఇటు వస్తున్నట్టు ప్రచారం జరిగాక కొందరు సర్దుకోవడం కూడా జరిగింది. కిరణ్‌ కుమార్‌ నూతన శాసనసభ్యులతో సమావేశాలు నిర్వహించదం కూడా ఇందుకోసమే జరుగుతున్నది. వైఎస్‌ వివేకానంద రెడ్డి కడపలో సమావేశాలు జరుపుతున్నారు కూడా. మొత్తంపైన అధికార పార్టీలో అనిశ్చిత వాతావరణం కొనసాగడానికి ఇవన్నీ కారణమవుతున్నాయి. ఇందులో భాగంగానే జగన్‌ సంస్తలపై ఆదాయ పన్నుదాడులు జరుగుతాయని కథనాలూ వచ్చాయి. మరోవంక రైతులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్‌ వారి సమస్యలు పరిష్కరించని ప్రభుత్వాలు కూలిపోతాయంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ పరామర్శలకు వచ్చిన జనాన్ని కూడా రాజకీయ బలంగా చూపించే ప్రయత్నం జరుగుతుండగానే ఆయన సామూహిక నిరాహారదీక్షను ప్రకటించారు. ఇది ఆయన ప్రత్యక్ష రాజకీయ కార్యాచరణకు ప్రారంభంగా భావించవచ్చు.
సిపిఎం సమావేశాలు...
ఈ మొత్తం పరిణామాలలో ఒక విశేషం ఏమంటే - రాజకీయ పక్షాలన్ని అనివార్యంగా సమస్యలపై దృష్టి మళ్లించడం. ప్రాంతీయ వివాదాలు, ప్రభుత్వాల మనుగడ వంటి వాటి చుట్టూ పరిభ్రమించిన రాజకీయాలు మళ్లీ సమస్యల మార్గం ప ట్టడానికి సిపిఎం వామపక్షాలు ప్రజాసంఘాల పాత్ర ప్రధాన ప్రభావం చూపించింది. చుట్టుముడుతున్న పోరాటాలను ఎవరూ విస్మరించలేని స్థితి వచ్చింది. సమస్యలూ అలాగే ప్రజ్వరిల్లుతున్నాయి. ఈ పోరాటాల మధ్యలో రాజకీయ పరిస్థితిని సమీక్షించుకోవడానిక భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోవడానికి సిపిఎం రాష్ట్ర స్తాయి విస్త్రత సమావేశం 19వ తేదీన హైదరాబాదులో జరుగుతున్నది. ఈ సమావేశం రాష్ట్ర భవిష్యత్తు పరిణామాల పట్ల ప్రజాసమస్యలపై ఉద్యమాల నిర్మాణం పట్ల స్పష్టమైన అవగాహనకు దోహదం చేస్తుందని ఆశించవచ్చు.
వికీలీక్స్‌, పెట్రో ధరల మోత
జాతీయంగా పార్లమెంటు సమావేశాలు 2 జి స్ప్రెక్ట్రంపై జెపిసి ఏర్పాటుకు నిరాకరించే ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా పూర్తిగా వృధా అయ్యాయి. అవినీతిపై విస్త్రత ప్రదర్శనలు నిర్వహించాలని సిపిఎం సిపిఐ తెలుగు దేశం అగ్రనేతలు ప్రకటించారు. మరోవైపున పెట్రోలియం ధరలు పెంచి ప్రభుత్వం తన నైజం వెల్లడించుకున్నది.వికీలీక్స్‌ సెగ ఇండియాను కూడా తాకి పాలక పక్ష ప్రముఖుల వ్యాఖ్యలు బహిర్గతమైనాయి.2007 అణుఒప్పందంపై సంతకాల సమయంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ పట్ల అమెరికా ఎలా విషపూరిత వ్యాఖ్యలు చేసిందీ బయిటపడింది. అయితే సోనియా గాంధీపైన కూడా వారు తృణీకారంగానే మాట్లాడటం సామ్రాజ్యవాద స్వభావాన్ని చెబుతుంది. ఇక హిందూత్వ శక్తుల ముప్పును గురించి రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యల్లో మౌలికంగా పొరబాటు లేకున్నా వాటిపై శ్రుతిమించిన విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది మీడియా లక్షణానికి అనుగుణంగానే వుంది. నీరా రాడియా టేపుల విడుదనలు అడ్డుకోవాలని వాదించిన మీడియా గాని కార్పొరేట్‌ శక్తులు గాని వికీ లీక్స్‌ను ఉత్సాహంగా ప్రచారంలో పెట్టడం వారి వర్గ తత్వాన్ని ద్వంద్వత్వాన్ని వెల్లడిస్తాయి. నిజానికి వీటిపై వికీలీక్స్‌ ద్వారా బయిటకు వచ్చిన సంగతులు సంచలనమైనవేమీ కాదు. కాగా భారత చైనా స్నేహ సంబంధాలకు ప్రతికూలమైన రీతిలో బడా మీడియా వ్యవహరిస్తున్న తీరును చైనా ప్రధాని వెన్‌బావో సూటిగానే ఖండించారు. విశేషమేమంటే అదే రోజున ఒక తెలుగు దినపత్రిక అచ్చంగా అలాటి సంపాదకీయమే రాయడం!

4 comments:

 1. రవి గారికి, మీ విమర్శలు ఎప్పుడూ సహేతుకంగా ఊంటాయి, చానల్ మార్చకుండా చూసే లైవ్స్ లో మీ లైవ్ ఒకటి, మీ బ్లాగ్ ద్వారా మీరు అందరికీ ఇంకా దగ్గర కావాలని కోరుకుంటూ...

  ReplyDelete
 2. రవి గారికి, మీ విమర్శలు ఎప్పుడూ సహేతుకంగా ఊంటాయి, చానల్ మార్చకుండా చూసే లైవ్స్ లో మీ లైవ్ ఒకటి, మీ బ్లాగ్ ద్వారా మీరు అందరికీ ఇంకా దగ్గర కావాలని కోరుకుంటూ...

  ReplyDelete
 3. *నీరా రాడియా టేపుల విడుదనలు అడ్డుకోవాలని వాదించిన మీడియా గాని కార్పొరేట్‌ శక్తులు గాని వికీ లీక్స్‌ను ఉత్సాహంగా ప్రచారంలో పెట్టడం వారి వర్గ తత్వాన్ని ద్వంద్వత్వాన్ని వెల్లడిస్తాయి.*

  రవి గారు,
  మీరు ప్రతి టి.వి. చానల్ లో రాజకీయ చర్చల్లో పాల్గొంటారు కదా! ఇంతకి మీరు మీడీయాలో భాగమా కాదా? మీరు పేపర్లో వ్యాసాలు రాస్తారు, టి.వి. లో చర్చల్లో పాల్గోంటారు కావున మీరు మీడీయాలో భాగమని నేను అనుకొంట్టున్నాను. మీరు రాసిన పై వ్యాఖ్య లో మీరు మీడీయాలో భాగం కాదు అనే అర్థం ధ్వనిస్తున్నాది. నా అభిప్రాయం సరి ఐనదా కాదా మీరే చెప్పండి.

  ReplyDelete
 4. srikar garu... time leka jawabu telugulo cheyadam ledu.. sory. intakoo nenu medialo bhagame kani paina vimarsinchina carporate commercial medialo bhagam kadu. ewarainaa tama rangam sadharana laxanalapai vimarsa cheyochhu kooda. mediapai mediavadi gane ee vyakhyalu chesanu.
  intakoo nenu prajasakti samsthaku chendina vanni. prastutam prajasakti publications editorga unnanu. Annattu Andhrajyothilo naa column gamanam vastundi. akkada ilative rastuntanu..

  mee prasna dwara ila cheppe velu kaliginchalu.. dhanyavadalu.

  ReplyDelete