Pages

Saturday, December 4, 2010

మసక బారిన క్యారెక్టర్‌ పాత్రలు!

సినిమా అంటే హీరో హీరోయిన్లే కదా.. ఫలానా హీరో సినిమా అంటారు.. అందుకోసం ఎదురు చూస్తారు.. బాగుంటే కేరింతలు కొట్టడం,బాగాలేకుంటే చప్పుడుచేయకుండా సర్దుకోవడం ఇవన్నీ మామూలే. మొత్తం ప్రచారమంతా ఆ హీరోల చుట్టూనే! కొంతవరకు హీరోయిన్లు ఆ పైన కమెడియన్తు, కొత్తగా వచ్చిన వారైతే విలన్లు.. అంతే! అయితే ఏ చిత్రం కూడా వీళ్లతోనే పూర్తయిపోదు. వీళ్లకు తోడుగా అనేక ఇతర పాత్రలుంటాయి. అవే క్యారెక్టర్‌ పాత్రలు.
తమాషా ఏమంటే అసలు క్యారెక్టర్‌ అంటేనే పాత్ర. మరి క్యారెక్టర్‌ పాత్రలేమిటి అంటే ఇది సినిమా భాష. నాయికానాయకులు చుట్టూ తిరిగే సినిమా రంగంలో ఇతరత్రా ప్రాధాన్యత గల పాత్రలను ఆ పేరుతో పిలవడం కద్దు. మామూలు భాషలో చెప్పాలంటే తల్లులు, తండ్రులు, అన్నలు, వదినెలు, అత్తలు మామలు, పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, జానపదాల్లో రాజులు మంత్రులు వంటి పాత్రలు. ఇవన్నీ చెబుతుండగానే పాఠకుల కళ్లలో కొందరు మహామహులైన నటీనటులు కదలాడటం మొదలెడతారు. సందేహం లేదు-నాలుగు పదులకు అటూ ఇటుగా వున్నవారికి ఆ పై వారికి ముందుగా గుర్తుకు వచ్చే గంభీర విగ్రహుడు ఎస్వీఆర్‌. తర్వాత గుమ్మడి. నాగయ్య, ఆ పైన మిక్కిలినేని, ముక్కామల, సీఎస్సార్‌,
ధూళిపాల తదితరులందరూ.. వాళ్లతో పాటు కన్నాంబ, హేమలత, లక్ష్మీరాజ్యం, సూర్యకాంతం, ఛాయాదేవి (వీళ్లది మరో ప్రత్కేక తరహా) జూనియర్‌ శ్రీరంజని, రుష్యేంద్రమణి, జి.వరలక్ష్మి, ఎస్‌.వరలక్ష్మి తదితరులు కూడా. వీరిలో అనేకులు కొనసాగుతుండగానే తర్వాతి తరంలో నిర్మల, సావిత్రి, భానుమతి, అంజలి, జమున, జయంతి, తర్వాత్తర్వాత శారద, సుహాసిని వంటి వారు మరో వైపున జగ్గయ్య, ప్రభాకరరెడ్డి, సత్యనారాయణ, రావుగోపాలరావు, కాంతారావు వంటివారు ఈ జాబితాలో ప్రవేశించారు. దీన్ని పరిశీలిస్తే ఒక విషయం అర్థమవుతుంది.కొంత కాలం హీరోలుగానో విలన్లుగానో వెలుగు వెలిగిన వారు నెమ్మదిగా క్యారెక్టర్‌ నటులై స్థిరపడిపోతారని. వయసులో ప్రమోషన్‌ వృత్తిలో కొంత రివర్షన్‌గా అవుతుందని.
నాటకరంగంలో తక్కువ స్థాయి నటులే వుంటారు తప్ప పాత్రలుండవంటాడు ప్రజానాట్యమండలి నిర్మాత డా||రాజారావు. నిజంగానే మంచి నటీనటులు అయిదు నిముషాలలోనే అద్భుతమైన అనుభూతిని అందించగలుగుతారు. అయితే అదంతా కళా రంగ సూత్రాలను కచ్చితంగా పాటించినప్పుడు. అలా జరిగినంత కాలం పరిశ్రమలో సహాయ నటులకు కూడా చాలా ప్రాధాన్యత వుండేది. ఎన్టీఆర్‌ ఏఎన్నార్‌లను గురించి చెప్పుకున్నట్టే జనం గుమ్మడి ఎస్వీఆర్‌లను కూడా అనుకునేవారు. ఇంకా చెప్పాలంటే ఎస్వీఆర్‌ హీరోలకు సమానమైన ప్రాభవం అనుభవించాడు. ఆయన హావభావాలు సంభాషణలు జనం అదేపనిగా చెప్పుకుంటుండేవారు. మహిళల్లో కన్నాంబ కూడా అంతే వైభవం గడించారు. ప్రతి చిత్రంలో కొన్ని కీలకమైన సన్నివేశాలు క్యారెక్టర్‌ నటుల ప్రతిభను ప్రతిబింబించేరీతిలో వుండేవి. ఆ మాటకొస్తే హీరోలు కూడా కొండ అద్దమందు కొంచెమై వుండదా అన్నట్టు కాస్త అప్రధానంగా కనిపించేందుకు వెనుకాడేవారు కాదు. అర్థాంగి చిత్రంలో అక్కినేని అమాయకుడు కాగా భార్య పాత్రలో సావిత్రిదే ప్రాధాన్యత. ఆత్మ బంధువులో ఎన్టీఆర్‌ బండాడిలా కనిపిస్తే అతన్ని కొడుకులా చూసుకునే ఇంటిపెద్ద ఎస్వీఆర్‌దే సగం వరకూ కీలక పాత్ర. ( ఈ చిత్రంలో ఆయనను హీరోగా చూపించడం గాక పాత్రను హైలెట్‌ చేస్తేనే కోపంవచ్చిందని ఇటీవల కాట్రగడ్డ నరసయ్య గారు ఈ సంచికలో రాశారు. ఏమంటే ఎన్టీఆర్‌ కూరగాయలు మోసుకుంటూ వస్తున్న స్టిల్‌ను ప్రచారంలో వాడటం ఆయనకు అంతగా నచ్చలేదట) అక్కినేని హీరోగా వున్నప్పుడే మరో ప్రపంచం 'సుడిగుండాలు' వంటి స్వంత చిత్రాల్లో క్యారెక్టర్‌ పాత్రల్లో నటించారు. ఎన్టీఆర్‌ స్వంత చిత్రాలైన 'తోడుదొంగలు, పిచ్చి పుల్లయ్య' వంటి వాటిలో గ్లామర్‌ లేని పాత్రలనే ధరించారు. ఇలాటి ఉదాహరణలు చాలా వున్నాయి. మొత్తంపైన పాత్రలు కనిపించడమే ఇక్కడ ప్రధానం తప్ప హీరోయిజం కాదు. ఇదే సూత్రం నాయికలకూ వర్తిస్తుంది. కన్నాంబ వంటి వారు నాయికలుగా వెలుగు వెలిగిన తర్వాత క్యారెక్టర్‌ పాత్రలవైపు వచ్చారు గనక వారికి సహజంగానే ప్రాధాన్యత వుండేది. శాంత కుమారి కూడా అంతే. పైగా ఆమె భర్త పి.పుల్లయ్య పెద్ద దర్శక నిర్మాత. 70 వ దశకంలో 'మనుషులు మారాలి' సినిమాతో నిర్మల మాస్‌ తరహా క్యారెక్టర్‌ పాత్రలకు ప్రతీకగా మారిపోయింది. అప్పటి నుంచి మూడు దశాబ్దాల పాటు అంటే రాజేంద్ర ప్రసాద్‌ చిత్రాల్లో బామ్మగా వేసినంత వరకూ కూడా నిర్మలమ్మ చిత్రాలకు ఆకర్షణగానే వున్నారు. అయితే అంతకంతకూ ఈ పాత్రలకు ప్రాధాన్యత గౌరవం తగ్గిపోతున్నాయని ఆమె ఆవేదన చెందుతుండేవారు. భానుమతి పెద్ద నిర్మాత గనక ఆమె కోరుకున్నట్టు సినిమాలు తీసుకోగలిగేవారు. తర్వాత కాలంలోనూ ఆమె బామ్మ వేషం కట్టినా కథ ఆమె చుట్టూనే తిరిగేది. అందరికన్నా ఎక్కువ కాలం నాయికగా కనిపించిన జమున పండంటి కాపురం వంటి చిత్రాల్లో ధరించిన క్యారెక్టర్‌ పాత్రలు గొప్ప సంచలనం కలిగించాయి. కథకులు దర్శకులు వాటికి ఆ విలువ నిచ్చేవారు. సావిత్రి నాయికగా గొప్పగా రాణించినా క్యారెక్టర్‌ పాత్రల దశలో బలహీనంగానే వుండిపోయారు. దాసరి నారాయణరావు మాత్రమే ఆమెను ఆక్క అనిపిలుస్తూ వేషాలు కల్పించేవారు.
తెలుగులో తొలి స్టార్‌ హీరో అయిన నాగయ్య పెద్ద వయసులో ప్రదానంగా కరుణ భక్తి ప్రధానమైన క్యారెక్టర్‌ పాత్రలు ధరిస్తే ఆయనకు సరిజోడిగా వుండిన నెగిటివ్‌ పాత్ర ధారి సిహెచ్‌ నారాయణరావు బాగా ఆలస్యంగా ఆ తరహా వైపు వచ్చారు. ప్రతినాయకులుగా బాగా ప్రసిద్ధికెక్కిన నాగభూషణం, సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, రావుగోపాలరావు వంటివారు ఏక కాలంలో క్యారెక్టర్‌ నటులుగానూ మారిపోవడానికి కె.విశ్వనాథ్‌ చిత్రాలు బాగా ఉపయోగపడ్డాయి. వారు కూడా బాగా నటించి జనాన్ని మెప్పించారు కూడా. ఇక హీరోగా ప్రయత్నించి విఫలమైన రమణమూర్తి 'ఒకే కుటుంబం' చిత్రంతో చిన్న పాత్రలు వేయడం మొదలుపెట్టి అమాయకురాలుతో స్థిరపడ్డారు. తర్వాత కాలంలో విశ్వనాథ్‌ చిత్రాలు ఆయనను బాగా నిలబెట్టాయి. ఉత్తరోత్తరా ఆయన సోదరుడైన సోమయాజులు 'శంకరాభరణం' చిత్రంతో ఏకంగా ప్రధాన పాత్రధారి అయిపోయాడు.
నాయికగానూ అభినయ ప్రధానమైన పాత్రలు వేసిన శారద క్యారెక్టర్లలోనూ బాగా విజయవంతమైనారు. ఎనభైలలో అయిదారేళ్ల పాటు ఆమె పాత్రనే ప్రధానాకర్షణగా చిత్రాలు వచ్చాయి. ఇదే కాలంలో శరత్‌బాబు క్యారెక్టర్‌ పాత్రలలోనే ప్రత్యేకంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 'రాధా కళ్యాణం, అభినందన, సీతాకోక చిలుక, సితార, సాగరసంసగమం' వంటి చిత్రాల్లో ఆయన నటనకు ప్రేక్షక జనం నీరాజనాలర్పించారు. అయితే తర్వాత కాలంలో క్రమేణా ఆయన కనిపించడం తగ్గింది. ఇటీవల బాగా విజయవంతమైన 'మగధీర'లో కూడా రాజుగా నటించారు. విలన్‌ పాత్రధారులు క్యారెక్టర్‌ నటులుగా రాణించే వరవడి మొదట కోట శ్రీనివాసరావుతో అంతకు మించి ప్రకాశ్‌ రాజ్‌తో మరోసారి రుజువైంది. దాదాపు పదేళ్లపాటు ఆయన ఈ రెండు రకాలుగానూ తెలుగు తమిళ ప్రేక్షకులను కట్టిపడేశారు. అదే కాలంలో తనికెళ్ల భరణి, గిరిబాబు, చలపతి రావు, ఆహుతి ప్రసాద్‌, చంద్రమోహన్‌, నరేష్‌, డబ్బింగ్‌ జానకి, సుధ, సన, వంటి వారు ఈ కాలంలో క్యారెక్టర్‌ పాత్రలను పోషిస్తూ వచ్చారు. నాయకలుగా వెలుగు వెలిగిన జయసుధ, సుహాసిని వంటివారు క్యారెక్టర్‌ పాత్రల్లోనూ విజయవంతమైనారు. ఇదే కోవలో సీత, నగ్మా, భానుమతి వంటి వారు కూడా క్యారెక్టర్‌ పాత్రల వైపు వచ్చినా పరిమితంగానే వుండిపోయారు. వాణిశ్రీ వంటి వారు కొద్దిగా ప్రయత్నించి విరమించుకున్నారు. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం కొంత కాలం నటించారు. అలాగే కె.విశ్వనాథ్‌ బాగా జయప్రదమైనా పరిమితంగానే నటిస్తున్నారు.
ఇప్పుడు చెప్పాలంటే క్యారెక్టర్‌ తరహాలో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసే నటులు గాని పాత్రలు గాని చాలా తక్కువగానే వుంటున్నాయి. కారణం హీరోలకు శ్రతి మించిన ప్రాధాన్యత నివ్వడమే. ఇతర సహాయ పాత్రలలోనైనా వయసు మళ్లినవారైనా సరే తమ కంటే కీలకంగా కనిపించడాన్ని హీరోలు హర్షించడం లేకపోతున్నారనిపిస్తుంది. కృష్ణ చిత్రాల్లో తారాతోరణంలా ప్రముఖులందరూ కనిపించేవారు. ఆయన కుమారుల చిత్రాల్లోనూ ఆ పద్ధతి కొనసాగింది. కాని ఇప్పుడు అది కొంచెం మారినట్టు కనిపిస్తుంది. ఉదాహరణకు 'చిరుత' చిత్రంలో తల్లి పాత్ర చాలా కీలకమైనా దానికి ప్రముఖులెవరినీ తీసుకోకపోవడం! ఈ సంప్రదాయం చిరంజీవి పవన్‌ కళ్యాణ్‌, బాలకృష్ణ, నాగార్జున వంటి వారి చిత్రాల్లో మనం స్పష్టంగా చూడొచ్చు. వారి వారసులు వచ్చేసరికి మరింతగా ఇతర పాత్రల ప్రాధాన్యతకు కత్తెర వేయడం జరుగుతున్నది. ఇంకా చెప్పాలంటే చిత్రంలో ప్రతి సన్నివేశంలోనూ హీరో ప్రధానంగా వుండాల్సిందే. నాయికలను కూడా తరచూ మారుస్తూ ఎవరూ పెద్దగా నిలదొక్కుకోకుండా చేయడంలో ఆకర్షణే కాక ఈ కోణం కూడా వుంది.
గతంలో వలె క్యారెక్టర్‌ పాత్రలకు ప్రసిద్ధ నటీనటులు సిద్ధం కాకపోవడం వెనక ఇవన్నీ కారణాలున్నాయి. ఒకవేళ ప్రతిఫలం ఇచ్చినా పాత్ర ప్రాధాన్యత లేకపోతే వారు ఇష్టపడరు. దీనివల్ల కలుగుతున్న నష్టం ఏమిటంటే నవరసభరితంగా వుండవలసిన తెలుగు సినిమాలు మూస ధోరణిలోకి మారిపోతున్నాయి. వైవిధ్య భరితమైన పాత్రలకూ నటనకూ అవకాశాలు కుదించుకుపోయి కేవలం నృత్యాలు పోరాటాలు సాంకేతిక నైపుణ్యాలే మిగులుతున్నాయి. ఇది మాత్రం వాంఛనీయం కాదు. ఒక హీరో పారితోషికంతో ఎందరు మంచి నటులకైనా అవకాశం కల్పించవచ్చునని మన పరిశ్రమ తెలుసుకోవడం శ్రేయస్కరం. కుటుంబ సంబంధాలు మానవీయ విలువలు అడుగంటిపోతున్న నేటి వాతావరణంలో ఇది మరింత అవసరం

No comments:

Post a Comment