Pages

Saturday, December 11, 2010

రాజకీయ ఖాయిలా - సమస్యల వాయిదా

- తెలకపల్లి రవి

తుపాను ప్రాంతాల్లో ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులూ పర్యటించారు గాని పరిస్థితి తీవ్రతకు సరిపడిన చర్యలేవీ ప్రకటించిన దాఖలాలు లేవు.గత వరదలు, తుపానుల సహాయమే ఇంకా అందవలసి వుండగా తాజా నష్టం నుంచి పరిహారం లభిస్తుందన్న భరోసా ఎక్కడా కనిపించడం లేదు. ఇదే గాక కాంట్రాక్టు లెక్చరర్లు, 104 వుద్యోగులు, బీడీ కార్మికులు, ఉపాధ్యాయ వుద్యోగ వర్గాలు, నియామకాలు కోరుతున్న నిరుద్యోగులు ఇలా అన్ని తరగతుల ప్రజల సమర ఘోషతో ధర్నా చౌక్‌ దద్దరిల్లుతున్నది గాని పాలకుల నుంచి పరిష్కార సూచనలే రావడం లేదు.


మొండికెత్తిన వారితో సహా తన మంత్రివర్గ సభ్యులు సుమూహార్తాలు చూసుకుని బాధ్యతలు స్వీకరించడం ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి ఒకింత ఉపశమనం కావచ్చు గాని ప్రజలకు మాత్రం ఇంకా ఎలాటి ఉపశమనం లభించలేదు.వివిధ తరగతుల ప్రజల బాధామయ ఘోషలకు స్పందించే స్థితిలోకి సర్కారు రాలేదు. ఈ లోగానే మూడవసారి ముంచెత్తిన వర్షబీభత్సం రైతాంగాన్ని మరింత దైన్యంలోకి నెట్టింది. గతంలోనే ధాన్యం ధర గిట్టుబాటు కాక అసలే కొనేవారు లేక అఖిలపక్ష ఉద్యమాలతో ఆగ్రహావేదనలు వెలిబుచ్చుతున్న రైతన్నలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా రాష్ట్రం తీవ్ర పరిణామాలను చూడవలసి వస్తుంది.
తుపాను ప్రాంతాల్లో ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులూ పర్యటించారు గాని పరిస్థితి తీవ్రతకు సరిపడిన చర్యలేవీ ప్రకటించిన దాఖలాలు లేవు.గత వరదలు, తుపానుల సహాయమే ఇంకా అందవలసి వుండగా తాజా నష్టం నుంచి పరిహారం లభిస్తుందన్న భరోసా ఎక్కడా కనిపించడం లేదు. ఇదే గాక కాంట్రాక్టు లెక్చరర్లు, 104 వుద్యోగులు, బీడీ కార్మికులు, ఉపాధ్యాయ వుద్యోగ వర్గాలు, నియామకాలు కోరుతున్న నిరుద్యోగులు ఇలా అన్ని తరగతుల ప్రజల సమర ఘోషతో ధర్నా చౌక్‌ దద్దరిల్లుతున్నది గాని పాలకుల నుంచి పరిష్కార సూచనలే రావడం లేదు.ఈ మధ్యలోనే రిజర్వేషన్ల వర్గీకరణకై మాదిగ దండోరా, విద్యార్థులపై కేసుల ఎత్తివేత సమస్యలు కూడా రంగం మీదకు వచ్చాయి. దాదాపు ఏడాది కాలంగా పాలన ప్రతిష్టంభనలో పడిపోయిన నేపథ్యంలో ఇది వూహించదగిన విషయమే. అయితే కొత్త నేత పగ్గాలు చేపట్టి పక్షం గడుస్తున్నా పటిష్టమైన విధాన చర్యలు ప్రారంభం కాకపోవడమే విపరీతంగా కనిపిస్తుంది. పాలక పక్షంలో అంతర్గత కలహాలు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడం వల్ల అధిష్టానం సంపూర్ణ స్వేచ్చ నివ్వకపోవడం, సవాళ్ల తోరణంలో ఏం చేస్తే ఏమవుతుందో కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం తేల్చుకోలేకపోవడం ఇందుకు కారణమవుతున్నాయి. ప్రభుత్వ మనుగడకు అంతర్గత సమీకరణాలకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రజా సమస్యలకు ఇవ్వలేకపోవడం మరో కారణం. కారణమేదైనప్పటికీ ఈ పరిస్థితి మాత్రం వాంఛనీయం కాదు. రాజకీయ అస్థిరత్వం ఇప్పట్లో తొలగే అవకాశం లేదని ప్రభుత్వాధినేతలకు కూడా తెలుసు. అలాటప్పుడు కేవలం దానిలోనే తలమునకలవుతూ విశాల జన సమస్యలు విస్మరించడం, మొక్కుబడి ప్రకటనలు లాంఛన ప్రాయమైన చర్యలతో కాలక్షేపం చేయడం అనుమతించరాని విషయం. నిజమైన సమస్యలపై ఉద్యమాలకు పోరాటాలకు స్పందించకపోతే అప్పుడు అసంతృప్తి పెడతోవలు పట్టే అవకాశం కూడా చాలా వుంటుంది. దాన్ని తిరిగి ఇదే రాజకీయ శక్తులు దుర్వినియోగపరిచి ఉద్రిక్తతలు పెంచుతాయి. ఐదు రోజుల శాసనసభా సమావేశాలు పెంచడానికి కూడా వొప్పుకోని అధికార పక్షం ఆ సమయం కూడా వివాదాలతో ముగిసిపోతుంటే వాయిదాలతో సరిపెట్టడం బాధాకరమైనవాస్తవం. మరో వైపున ప్రతిపక్షాలు రైతు సమస్యలపై ఉమ్మడిగా నిరసన తెల్పడం సముచితంగా వుంది. 1980లో అఖిల పక్ష వుద్యమాలు గతంలో రైతాంగానికి రాయితీలు సాధించడంలోనూ రాజకీయ దృశ్యాన్ని మార్చడంలోనూ నిర్వహించిన పాత్ర ఇప్పుడు గుర్తుకు రాకుండా వుండదు. సందర్భవశాత్తూ నాటి కాంగ్రెస్‌ ముఖచిత్రం కూడా ఇప్పటిలానే అస్థిరత్వ భరితంగా వుండేది. కాని అప్పటికి తెలుగు దేశం ఇంకా రంగంలో లేదు. తర్వాత రాజకీయాలలో చాలా మార్పులు చేర్పులు వచ్చాయి గనక ప్రస్తుత పరిస్థితిని అచ్చంగా అప్పటితో పోల్చలేము గాని అస్థిరత్వం మాత్రం నిజంగానే కొనసాగుతున్నది.
డిసెంబరు 31 కౌంట్‌ డౌన్‌?
శాసనసభలో మొదటి రోజున ప్రశ్నోత్తరాల సమయం కూడా లేకుండా నేరుగా రైతుల సమస్యలు చేపట్టాలని అందరూ అంగీకరించినా టిఆర్‌ఎస్‌ విద్యార్థులపై కేసుల ఎత్తివేత సమస్యను ముందుకు తెచ్చింది. ఈ విషయంలో నిజానికి భిన్నాభిప్రాయాలేమీ లేవు. వివిధ ప్రాంతాలలో ఉద్రిక్తతలు ప్రజ్వరిల్లిన సందర్భంలో పెట్టిన కేసులను ఉపసంహరిస్తామని గత డిసెంబర్‌ 9న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. వివిధ రాజకీయ పక్షాలు కూడా అందుకు మద్దతు పలికాయి. అలాటప్పుడు ఏకంగా ఏడాది గడిచినా ఆ పని ఎందుకు జరగలేదన్నది దురూహ్యం. సుహ్రద్భావ సూచకమైన ఇలాటి చర్యలు తెలుగు ప్రజలలో సంయమనం పెంచడానికి దోహదపడి వుండేవి. ప్రాంతీయ వ్యూహాలతో పాచికలు విసిరే పాలక పార్టీలనూ ఆ ప్రచారాలతో ఉద్రిక్తతలలో చిక్కుకున్న విద్యార్థి యువజనులను ఓకే గాట కట్టడానికి లేదు. పైగా వారి సుదీర్గ భవిష్యత్తును కూడా గమనంలో వుంచుకోవాల్సి వుంటుంది. ఒకవేళ కేసులను ఉపసంహరించే సందర్భంలో ఏవైనా న్యాయపరమైన లేదా తీవ్రతకు సంబంధించిన సమస్యలు ఎదురైతే అప్పుడు నిర్దిష్టంగా పరిశీలించవచ్చు. అంతేగాని సాధారణ సూత్రం మాత్రం సామూహిక కేసుల ఉపసంహరణకు అనుకూలంగా వుండాలన్నది అందరి భావన. దాన్ని జాప్యం చేసి లేనిపోని వివాదాలకు అవకాశం ఇచ్చి వుండాల్సింది కాదు. అదే సమయంలో ఆ కేసుల ఉపసంహరణకై వొత్తిడి రైతుల సమస్యలను చర్చించడానికి ఆటంకం కావలసిన అవసరం కూడా లేదు. వీటన్నిటిని సమన్వయ పర్చి సభ నడవడానికి సమస్యలు చర్చించడానికి చొరవ చూపవలసింది ప్రభుత్వమే.
కేసుల ఉపసంహరణపై ఆందోళన ఉధృతం చేయడం వెనక టిఆర్‌ఎస్‌ రాజకీయ వ్యూహ ప్రాధాన్యతలు కూడా గమనించవలసి వుంటుంది. డిసెంబరు 31 శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పణ తర్వాత బిల్లు పెట్టాలన్నది వారి ప్రధాన కోర్కెగా వుంది. ఫిబ్రవరి వరకూ బిల్లు పెట్టడానికి వ్యవధినిస్తామని, అందుకోసం కాంగ్రెస్‌కు మద్దతిస్తామని చెప్పినప్పటికీ కేంద్రం నుంచి పాలక పక్షం నుంచి తమకు సానుకూల సంకేతాలేమీ రాకపోవడం వారికి సమస్యగా వుంది. తెలంగాణా విభజన గట్టిగా కోరుతున్న కాంగ్రెస్‌ వాదులు కూడా ఇదే చెబుతున్నారు. ఇంతకూ కేంద్ర పాలకులు తమ రాజకీయ లాభనష్టాలను లెక్క వేసుకోవడం తేలేదాకా నిర్ణయాలను వాయిదా వేస్తుంటారు తప్ప పారదర్శకంగా వ్యవహరించడం కల్ల.
బిజెపి రంగ ప్రవేశం
తెలంగాణా విభజనపై బిల్లు పెట్టాలంటూ బిజెపి ఢిల్లీలో ధర్నా చేయడం ఈ వారంలో మరో పరిణామం. ఈ సమస్యపై చొరవ తమ చేతిలోకి తీసుకుని రాజకీయంగా లాభం పొందడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలలో మరో దశ. పార్లమెంటులో స్థానాలు తమకే వున్నాయి గనక తమ మద్దతు లేకపోతే బిల్లు ఆమోదం పొందదు గనక దాని వల్ల రాజకీయ లబ్ది కూడా తామే పొందాలన్న ఆలోచన ఇందులో వుంది. రాష్ట్రరాజకీయాలలో పరిమిత శక్తిగా వున్నా మత సమస్యను అప్పటి రాజకీయ పరిస్థితిని ఉపయోగించుకుని లబ్ది పొందడానికి బిజెపి సదా యత్నిస్తూనే వుంటుంది. 1996లో లక్ష్మీ పార్వతి పార్టీతో చేతులు కలిపి ప్రయోజనం పొందింది.(తర్వాత కాలంలో ఆ పార్టీ నామమాత్రమై పోగా ఇప్పుడు ఆమె జగన్‌ను సమర్థిస్తున్నారు) ఆ విధంగా 1998లో ప్రాతినిధ్యం పెంచుకున్న బిజెపి 1999లో తెలుగు దేశంతో పొత్తును కూడా వుపయోగించుకుని పార్లమెంటులో బాగా స్థానాలు పొందింది. ఇప్పుడు కూడా ప్రాంతీయ వాదనలను రెండు చోట్లా బలపర్చి రాజకీయంగా లాభపడాలని చూస్తున్నది. జగన్‌ను కర్ణాటక మంత్రి గాలి జనార్థనరెడ్డి తమ వైపు తెస్తాడని కూడా వారు చెబుతుంటారు. కనక రానున్న రోజుల్లో బిజెపి విన్యాసాలను జాగ్రత్తగా చూడవలసే వుంటుంది.
సురేఖ లేఖ: అంత:కలహాల మరో ఘట్టం
జగన్‌ వీర విధేయురాలుగా చెప్పుకునే మాజీ మంత్రి కొండా సురేఖ ప్రభుత్వ మాజీ సలహాదారు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రాణమిత్రుడు కెవిపి రామచంద్రరావుపై అవినీతి ఆరోపణలతో లేఖ సంధించడం కాంగ్రెస్‌ అంతర్గత కలహాల వ్యాప్తిలో మరో అసక్తికరమైన ఘట్టం. గతంలో వైఎస్‌ వివేకానందరెడ్డి ఆ శిబిరానికి దూరమైతే ఇప్పుడు కెవిపి కూడా దూరమవడాన్ని ఈ లేఖ సూచిస్తుంది. పైగా వైఎస్‌ హయాంలో చక్రం తిప్పిన కెవిపిపై అవినీతి ఆరోపణలు చేసిన తర్వాత మూల విరాట్టును తప్పించడం కుదరని పని.జలయజ్ఞం అవినీతిని కూడా ఆమె ప్రస్తావించారు. అందుకే ఆయనకు తెలియకుండా ఇవన్నీ చేశారనే వింత వాదన సురేఖ వినిపించడం అందుకోసమే. అయితే ఆ వాదన ఏ విధంగానూ నిలిచేది కాదు. పైగా ఈ లేఖను జగన్‌ శిబిరం వ్యూహంలో భాగంగా కూడా పరిగణించడం సహజం. అప్పుడు వైఎస్‌ కాలపు కుంభకోణాలపై సంజాయిషీ ఇచ్చుకోవలసిన స్థితిలో ఆ శిబిరం పడిపోతుంది.ఈ ఇరకాటం నుంచి తప్పించడానికే సురేఖ వెనువెంటనే ఇది తన వ్యక్తిగత లేఖ అని వివరణ లాటి సవరణ పంపించారు! వైఎస్‌ను కాంగ్రెస్‌నుంచి విడదీయడం కుదరదు. వైఎస్‌ లేకుండా జగన్‌ ప్రచారం నడవదు. ఏతావాతా జగన్‌ రాజకీయానికి కాంగ్రెస్‌ పాలనకూ సంబంధం లేదంటే కుదరదు. ఈ గజిబిజి రాజకీయ మాయాజాలంలో ఇలాటి ప్రహసనాలెన్నో ముందు ముందు చూడవలసి వుంటుంది. వైఎస్‌ పాలనలోనూ తర్వాత వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించి సత్యాసత్యాలు జనం ముందు వుంచడమే వీటన్నిటికి సమాధానం. అప్పుడే జనం ఎవరేమిటో ఎవరిని ఏ మేరకు విశ్వసించాలో విమర్శించాలో జనం తేల్చుకుంటారు.

1 comment:

  1. అభివృధ్ధి,సంక్షేమం వై యస్ ఖాతాలోకి,అవినీతి,దోపిడీ కెవిపి ఖాతాలోకి వేయడమే సులేఖాస్త్రం ముఖ్యోద్దేశం.జగన్ దెబ్బకు మెడ తెగిన కోడిలా గిలగిలలాడుతున్న అధిష్ఠానం కెవిపి ని ఉంచాలో పంపాలో తేల్చుకోలేని దయనీయపరిస్థితి .కుర్చీ ని కాపాడుకోడానికే 24 గంటలు చాలనివాడు,రైతులనేమికాపాడుతాడు ?ఆ.ప్ర.లో రాబోయే సర్కారు మిశ్రమ ప్రభుత్వమన్నది సుస్పష్టం.1980 ల నాటి అస్థిరత మళ్ళీ వచ్చిందని మీరు వ్రాసినది ముమ్మాటికీ నిజం.

    ReplyDelete