Pages

Friday, December 31, 2010

ఈ ఏడాది మీదే కావాలంటే..

.

మనకున్న సమయం ఎంత;? దాన్ని ఎలా వినియోగించుకుంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది? గత ఏడాదికి సంబంధించిన వీక్షణను పూర్తి చేసిన తర్వాత దాన్నుంచి నేర్చుకోవలసిన అంశాలు తీసుకోవలసిన పాఠాలూ ఇందుకు మొదటి ప్రాతిపదిక అయితే రానున్న కాలంలో ఎదురయ్యే పరిస్థితుల గురించిన అంచనాలు ప్రణాళికకు ప్రాథమిక వనరు. వాటి ఆధారంగా వాస్తవికమైన దృష్టితో ఏం చేయాలి ఎలా వ్యవహరించాలి అన్నది రేఖామాత్రంగానైనా
అనుకోవడం అవసరం.

కాలాన్ని లేదా సమయాన్ని ఎలా వినియోగించుకోవాలన్నది నిర్ణయించుకోవడానికి కొన్ని కొలబద్దలు వుంటాయి. అవన్నీ గమనంలో వుంచుకోవాలి. ప్రాధాన్యతల క్రమం నిర్ణయించుకోవాలి.


మొదటి ప్రాధాన్యత

ముందుగా తీసుకోవలసినవి గతంలో అసంపూర్ణంగా మిగిలిన అవసరమైన పనులు. అవి అనవసరమైతే పూర్తిగా వదిలేయవచ్చు గాని అర్ధంతరంగా అనిశ్చితంగా కొనసాగనివ్వకూడదు. కొద్ది కృషిచేస్తే పూర్తయి సత్ఫలితాలిచ్చే వాటిని మున్ముందుగా పూర్తి చేయాలి. ఉదాహరణకు ఏదైనా కట్టడం దాదాపు పూర్తయి కొద్దిగా మిగిలివుండొచ్చు.ఏదైనా పుస్తకం దాదాపు పూర్తయి కొన్ని పేజీలు మిగిలి వుండొచ్చు. ఏదైనా చెల్లింపు కొద్దిలో మిగిలి వుండొచ్చు. ఇలాటివి ముందుగా పూర్తి చేస్తే ప్రయోజనం కలగడమే గాక మెదడు కూడా ఆ మేరకు తేలికవుతుంది.

పూర్తి చేస్తే ప్రయోజనం కలగడం అటుంచి చేయకపోతే నష్టం కలిగించే పనులు కూడా వుంటాయి.ఉదాహరణకు ఏదైనా మరికొంత మొత్తం కడితే ఒక రుణం తీరిపోయి వడ్డీ మిగులుతుంది.లేకపోతే కొన్నిసార్లు ఆ కాస్త కట్టకపోవడం వల్ల కట్టింది కూడా వ్యర్థమవుతుంది అనుకుందాం.అలాటి వాటిని ప్రప్రథమంగా పూర్తి చేసేయాలి. ఇదే కోవలో పూర్తి కాకపోవడం వల్ల ఇతరులను ఇబ్బంది పెట్టేవి, బాధ కలిగించేవి కూడా ముందుగా పూర్తి చేసుకోవాలి.

ఎలా అయినా చేయకతప్పనివైతే వాటిని కూడా త్వరితంగా పూర్తి చేసుకోవడం మెరుగు.ఆలస్యం చేసుకోవడం వల్ల వొరిగేది వుండకపోగా అసౌకర్యమే మిగులుతుంది.

మన వృత్తి ఉద్యోగ వ్యాపారాలు లేదా రంగాలలో మన కృషికి గాని మొత్తం ఆ రంగానికి గాని మేలు చేసే పనులను కూడా ముందుగా చేపట్టాలి.

ద్వితీయ ప్రాధాన్యత

.రంగం ఏదైనా సరే ఉత్పాదకతకు పెద్ద పీట వేయవలసి వుంటుంది. సత్ఫలితాలివ్వడమే ఉత్పాదకత అంటే అర్థం. ప్రతిసారీ ఏదైనా ఉత్పత్తి జరిగి తీరాలని కాదు. ఆయా రంగాలను బట్టి దాని వల్ల కలిగే ప్రయోజనమే ఉత్పాదకత. అనాలోచితంగా అనుత్పాదక వ్యవహారాల్లో మునిగితేలే సందర్బాలు చాలా కనిపిస్తుంటాయి. గత సంచికలో అలాటివి చాలా చెప్పుకున్నాము. అలాటివి కాేకుండా నిజంగా ఉత్పాదకమైన వాటికి ప్రాధాన్యత నివ్వాలి. అంటే మీ అవగాహన పెంచేవి, మీ పెట్టుబడికి దోహదపడేవి.మీకు మానవ వనరులు మరింతగా పెరగడానికి దోహదపడేవి, మీ శ్రమను తగ్గించేవి, కొత్త సమాచారమో సమాధానాలో ఇచ్చేవి ఆర్థిక శక్తిని లేదా జ్ఞానాన్ని పెంచేవి బేరసారాల్లో మీ శక్తికి తోడయ్యేవి, ఆరోగ్యపరంగా మేలు చేసేవి, ఆందోళనను తగ్గించేవి, వేగం పెంచేవి, ఇలాటి అంశాలకు పెద్ద పీట వేయాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే దీనివల్ల ఫలానా ప్రయోజనం వుంది,ఫలానా అంశం అదనంగా వొనగూడింది అని మీరు భరోసాగా సూటిగా చెప్పగలగాలి. అలాటివాటికి కూడా ప్రాధాన్యతా క్రమంలో ముందుచోటు కల్పించాలి.

ప్రాధాన్యత- మూడు

ఉత్పాదకత పెరగాలంటే అవగాహన పెరగాలి.అందుకు ఉపయోగపడే అంశాలను ప్రాధాన్యతగా పెట్టుకోవాలి. అవగాహనను నాలుగు రకాలుగా చెప్పుకోవచ్చు- వైజ్ఞానికం,సాంకేతికం,సామాజికం,రాజకీయం, లౌకికం, సాంసృతికం. సాంఘికం
.విజానం మానవజాతికి మార్గదర్శి మాత్రమే గాక మన జీవితంలో అణవణువూ దానితో ముడిపడి వుంటాయి. ఆహారం, ఆరోగ్యంతో సహా. ఆ పనులు యాంత్రికంగా పూర్తి చేయడం గాక అవగాహనతో చేయాలంటే విజ్ఞాన శాస్త్ర సంబంధమైన సమచారాన్ని తప్పక తెలుసుకోవాలి. చదవడం, వినడం చూడడం వంటివన్నీ ఈ కోవకు వస్తాయి. వైజ్ఞానిక అవగాహన ఆత్మ విశ్వాసాన్ని పెంచి అపోహలను దూరం చేస్తుంది. వాస్తు, చేతబదులు, శాంతులు వంటి మూఢత్వం పెరగడానికి కారణం విజ్ఞానం పెంచుకోకపోవడమే. కనక వున్నచోటనే వుండకూడదనుకునే వారు తప్పక తమ విజ్ఞాన పరిధిని పెంచుకోవడానికి ప్రాధాన్యత నివ్వాలి
.సాంకేతికం అన్నది ఈ రోజున ప్రపంచాన్ని శాసిస్తున్నది. జీవితం సుఖప్రదమూ సులభమూ కావాలంటే సాంకేతిక పరిజ్టానంపరికరాలు తప్పనిసరి. ఇంట్లో స్విచ్చి వేయడం దగ్గర నుంచి కార్యాలయంలో ఎస్‌ఎంఎస్‌ మెసేజ్‌ పంపడం వరకూ ఇతరులపై ఆధారపడేట్టయితే అది ఆత్మ విశ్వాసాన్ని అనివార్యంగా దెబ్బ తీస్తుంది. వ్యవసాయం నుంచి వంట చేయడం వరకూ ప్రతిపనిలో ఏదో ఒకనాటి సాంకేతికత దాగి వుంటుంది. పనులు రావని, ఫలానాదానితో సంబంధం లేదని దాటేస్తూ పాత పద్ధతినే పట్టుకు వేళ్లాడ్డం అంటే సమయం సామర్థ్యం కూడా తగ్గించుకోవడమే. ఉదాహరణకు మహానగరంలో బాగా తిరిగే వ్యక్తి స్కూటరు వాడటం అలవాటు లేదని చెప్పడం, రాత ఎక్కువగా చేసే వ్యక్తి కంప్యూటరు వాడటం తెలుసుకోకపోవడం, అన్ని పరికరాలు అందుబాటులో వున్నా వాడకం రాకపోవడం ఇవన్నీ ఆ కోవలోకే వస్తాయి. ఇలాటి కారణాలు అనివార్యంగా పరాధీనతకు దారి తీస్తాయి. పరిమితులు కల్పిస్తాయి. కొంత స్తోమత వున్నవారు వస్తువులు కొంటుంటారు గాని వినియోగించడం నేర్చుకోరు.కనక వున్నదానికంటే మరింత మెరుగైన అవసరమైన సాంకేతిక అవగాహన పెంచుకోవడం ప్రాధాన్యతల క్రమంలో వుండాలి. వున్నది బాగుంది గనక కొత్తది అవసరం లేదనే వారు ముందు దాన్ని గురించి తెలుసుకుని ఆ పైన నిర్ణయించుకోవచ్చు.
.సామాజిక సంబంధాలు మనిషిని నడిపిస్తాయి. కుటుంబాలు సంస్థలు పరిసరాలు ఏవైనా సరే. వాటిని పెంచుకోవడం కూడా ప్రాధాన్యత కిందకే వస్తుంది., వంటిగొట్టు రామలింగం లాగా గిరిగీసుకుని కూచుంటే మానవ స్వభావంలో ప్రాథమికాంశమే దెబ్బతినిపోతుంది. అయితే సామాజిక సంబంధాలలో ఏది ఎంత ప్రాధాన్యం అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. ఈనాటి సమాజంలో కులాన్ని సామాజిక వర్గాన్ని పర్యాయ పదాలుగా వాడుతున్నారు గాని అది సరైంది కాదు. కులం గీతలు దాటి అందరినీ ఒకే కుటుంబంగా పరిగణిస్తూ సామాజిక పునాదిని విస్తరించుకోవడానికి ప్రయత్నించాలి. అందుకు తగిన విధంగా కాలాన్ని కేటాయించుకోవాలి. కొన్ని సార్లయినా శుభాశుభ సందర్బాలలో కలవడం ఈ రీత్యా చాలా కీలకం. సామాజిక సందర్బాలను తప్పక వాడుకోవాలి.ఇతరులు సమస్యలలో వుంటే సహాయపడాలి. మనకు అవసరమైతే తీసుకోవాలి. పదిమందిలో కలసి వుండే అవకాశాన్ని ఆహ్వానించాలి. అంతర్ముఖులం గనక అలా వుండనవసరం లేదంటుంటారు గాని అది పూర్తిగా సరికాదు. కావాలంటే అక్కడ కలుపుగోలుగా మాట్లాడ్డంలో అంతర్ముఖులకు బహిర్ముఖులకు తేడా వుండొచ్చు గాని పదిమందితో కలసి వుండాలనే సూత్రానికి మినహాయింపు వుండదు.
రాజకీయ అవగాహన: జీవితంలో ప్రతిదీ ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయ నిర్ణయాలతో ముడిపడి వుంటాయి. కనక ప్రతివారూ రాజకీయ అవగాహన పెంచుకోవాలి. వ్యక్తిగతంగానూ రాజకీయ అంచనాలకు రాగలగాలి.చాలా మంది చదువుకున్న వాళ్లు కూడా మాకు రాజకీయాలంటే ఆసక్తి లేదని గొప్పగా చెబుతుంటారు గాని అది హాస్యాస్పదమైంది.ఎవరి రాజకీయ అభిప్రాయాలు వారికి ఉంటాయనుకున్నా ఆ మేరకైనా స్వీయ పరిజ్ఞానం వుండాలి. లేకపోతే మరెవరో చెప్పిన దాన్ని విచక్షణా రహితంగా అనుసరించే పరిస్థితి వస్తుంది.

సాంసృతిక సౌందర్య దృష్టి : జీవితంలో తక్కిన అన్ని అంశాలతో పాటు సాంసృతిక దృష్టి, సౌందర్య కోణం కూడా వుంటుంది. కొన్ని కుటుంబాలలో ఎంత పేదరికంగా వున్నా కళాదృష్టి మనకు కనిపిస్తుంది. సాంసృతిక స్థాయి జీవితాన్ని అర్థవంతంగా చేస్తుంది. సాహిత్యం చదవడం, కళా రూపాలను ఆదరించడం వీలైతే పాల్గొనడం ఇవి ఆహ్వానించదగినవి. వీటివల్ల మానసిక ఉల్లాసం వికాసం కలగడమే గాక జీవితం పట్ల దృక్పథం కూడా విశాలమవుతుంది. ఉత్సాహం పెరుగుతుంది.అయితే దీని అర్థం టీవీకి అతుక్కుపోయి వచ్చినవన్నీ చూస్తూ కాలం వృథా చేయడం కాదు. ఇంటిని పొందికగా తీర్చిదిద్దుకోవడం ఈవితం ఒద్దికగా గడపడం పరస్పరం సంబంధం లేని విషయాలు కాదు. ఆదిమానవులు గుహల్లోనే చిత్రాలు వేసి వేటలో నాట్లలో పాటలు పాడారని గుర్తుచేసుకుంటే ఆధునికులమనుకునేవాళ్లం మరెంత చేయొచ్చు?ముగ్గు వేయడమైనా పేడతో అలకడమైనా ఒక బొమ్మ ను తెచ్చి పెట్టడమైనా సౌందర్య దృష్టిని చూపిస్తుంది. ఇది ఖర్చుతో ఖరీదుతో ముడిపడినదే కానక్కరలేదు. కళా దృష్టి మనిషిలో ఒకింత ప్రశాంతతకు విశాలత్వానికి కూడా దారి తీసే అవకాశముంటుంది.

ప్రాధాన్యత- నాలుగు

జీవితం అనే మాట ఏక వచనం కాదు. బహువచనమూ శాశ్వతమూ జీవితం. ఒక్కరే వుంటే ఎలా జీవించారన్నది సమస్య కాదు, అలాగే ఆ ఒక్కరితో ముగిసిపోదు కూడా. కనక తరాలు మారతాయి గాని సమాజం శాశ్వతంగా వుంటుంది.కనక ఏ రంగంలో వారైనా తము చేసే పని ఇతరులకు మరీ ముఖ్యంగా తర్వాతి తరాల వారికి నేర్పడం పనిగా పెట్టుకోవాలి.అదే జరక్కపోతే మానవ నాగరికత ఏనాడో అంతమై వుండేది. ఏదైనా సాధించిన వారు సాదించాలనుకునే వారు తమ తర్వాత ఆ పని చేసే యువతను తర్ఫీదును చేయడం బాధ్యతగా తీసుకోవాలి. ఇంట్లో పిల్లలైనా కార్యాలయాల్లో సహాయకులైనా యువకులైనా ఇది తప్పక జరగాల్సిన పని. వారు అనేక పొరబాట్టు చేయొచ్చు. అపరిపక్వంగా ప్రవర్తించవచ్చు.అయినా సరే భవిష్యత్తును చూసేది వారే అని ప్రతివారూ గుర్తుంచుకోవాలి. తమ కంటే ఏ కాస్త చిన్నవాళ్లనయినా కొత్త వాళ్లనయినా అదో మాదిరి ఆధిపత్య కోణంలో చూసే వారు తరచూ కనిపిస్తుంటారు. ఈ వైఖరి మార్చుకోవడమే గాక వారికి చైతన్య పూర్వకంగా నేర్పించడానికి సిద్దం కావాలి. యువతకు నేర్పడమే గాక వారి నుంచి నేర్చుకోవడానికి కూడా సిద్ధం కావాలి. ఎందుకంటే కాలంతో కాలంలో వచ్చే మార్పులను అవాహన చేసుకోగల శక్తి వారికి ఎక్కువగా వుంటుంది.

ప్రాధాన్యత- అయిదు

స్నేహం మానవ సంబంధాలలో చాలా విలువైంది. బహుశా ఏ కుటుంబ బంధమూ వ్యవస్థాత్మక అనుబంధమూ లేని మానవీయ సృహ స్నేహంలోనే మనకు కనిపిస్తుంది. పురాణ కాలం నుంచి స్నేహంపై చాలా కథలున్నాయి. చరిత్రలోనూ అనేక వాస్తవ గాధలున్నాయి. చలన చిత్రాల్లో వాటిని మరీ నాటకీయంగా చూపించడం ఒకింత నవ్వు తెప్పించినా మానవాళి సృష్టించుకున్న గొప్ప విలువల్లో స్నేహం ఒకటని ఒప్పుకుని తీరాలి. మంచి స్నేహమైతే స్వార్థం వుండదు. అందుకే నిస్వార్థమైన నిజమైన స్నేహితులను ప్రాణ ప్రదంగా కాపాడుకోవాలి. వారితో అపార్తాలను త్వరితంగా తొలగించుకోవాలి. స్నేహితులైన వారు పరస్పర అవగాహనతో సహకారంతో ఉమ్మడి లక్ష్యాలను నెరవేర్చుకోవాలి కూడా. అయితే స్నేహం అన్న భావనను అవాస్తవంగా ఆకాశానికెత్తి అపశ్రుతులకు అనర్థాలకు ఆస్కారమివ్వకూడదు. వాస్తవిక దృక్పథంతోనే దాన్ని కాపాడుకోవాలి.

వినోదం, విరామం ఎంత కష్టపడే వారైనా సరే క్రమ పద్దతిలో విరామానాకి వినోదానికి అవకాశం అట్టిపెట్టుకోవాలి. వినోదం మనిషికి కొత్త శక్తి నిస్తుంది. ఒక్కసారి నవ్వగలిగితే బోలెడు శ్రమ మటుమాయమై పోతుంది. అయితే అది ఆరోగ్యకరమైన ఆహ్లాద కరమైన హాస్యమై వుండాలి.విరామం మరింత అవసరం. అది శక్తిని పెంచుతుంది కూడా. అలాగని విరామం ఎక్కువైతే విసుగుదలకూ దారి తీస్తుంది.శక్తిసన్నగిల్లిపోతుంది.

ప్రణాళిక ఎలా వుండాలి?
పైన చెప్పుకున్న అంశాలను గమనంలో వుంచుకుని వార్షిక ప్రణాళిక వేసుకోవాలి. వారం ప్రణాళిక కూడా వేసుకోవాలి. గత ఏడాది సమీక్షను ఈ ఏడాది ప్రాధాన్యతలకు దృష్టిలో వుంచుకుని సమయాన్ని విభజించుకోవాలి. అసలు మనకు ఎంత సమయం వుంది? అందులో మన చేతిలో వున్నదెంత? మన ప్రమేయం లేకుండానే తప్పక కేటాయించవలసినదెంత?చూసుకోవాలి.ప్రధానమైన వాటికి చురుగ్గా వుండే సమయాన్ని పెద్ద కేంద్రీకరణ అవసరం లేని వాటికి విసుగు పుట్టే సమయాన్ని కేటాయించుకోవాలి. ఉదాహరణకు ఇంట్లో బట్టలు మడతలేయడం, వూడ్చడం, మీ ఆఫీసు టేబులు తుడవడం వంటి పనులకు పెద్ద కేంద్రీకరణ అవసరం లేదు.యథాలాపంగా చేసెయొచ్చు. వాహనం నడిపేముందు బాగా అలసి పోయారనుకోండి మంచిది కాదు. కలుసుకోవలసిన వారి సమయాలెలా వుంటాయి?మీ కోసం సందర్శకులు ఎప్పుడు వస్తారు? టీవీలో మీరు చూడాలనుకునే కార్యక్రమం ఎప్పుడు వస్తుంది? మీ ఇంటికి పత్రికలు ఏ సమయానికి వస్తాయి? బ్యాంకుల వేళలెలా వుంటాయి ఇవన్నీ మీ సమయ విభజనను ప్రభావితం చేయొచ్చు. నిద్ర లేవడం, పడుకోవడంతో సహా మీ వేళలు నిర్ణీతంగా వుంటే చాలా ప్రయోజనం కలుగుతుంది.
సమయం తర్వాతది డబ్బు . ఇది అందరికీ ఒకే మోతాదులో అందుబాటులో వుండదు.కనక వున్న దాన్నిబట్టి అవసరానుగుణంగా అంచనాలు వేసుకోవాలి. ఏది ఏమైనా ఎంత వున్నా లేకున్నా జమా ఖర్చులు తెలియాలి.

సెల్‌ఫోన్‌ మాట్టాడేందుకు ఎంత సమయం వెచ్చిస్తున్నారు అన్నది స్పష్టంగా గుర్తించాలి. మనం అవసరమైన వారితో అవసరమైన మేరకు మాట్టాడాలి.
తనిఖీ మీ పనిపై మీకు తనిఖీ వ్యవస్థ వుండాలి. కుటుంబ సభ్యులకు మిత్రులకు సహచరులకు మీరే ఆ బాధ్యత అవ్పగించాలి. విమర్శలు ఆహ్వానిస్తారన్న భరోసా కలిగించాలి.

సంధిగ్ధాలు: కారణాలేవైనా వ్యక్తులెవరైనా తాము స్పష్టంగా తేల్చుకోలేని విషయాలు గుర్తించాలి. ఆ విషయంలో సంధిగ్ధంగా వున్నామని నిర్ణయించుకోవాలి.లేకపోతే పదే పదే అ విషయం ముందుకొచ్చి సమయం హరిస్తుంటుంది. తక్షణ సమస్యలు కాకపోతే అలాటి వాటిని కొంత కాలం వాయిదా వేయాలి.కాని సమస్య సంధిగ్ధతను వ్యక్తులకు ఆపాదించకూడదు.లేదా మిమ్మల్ను మీరే తిట్టుకుంటూ కూచోకూడదు.

ఇక ఇప్పుడేం చేస్తారు?

కలం కాగితం తీసుకోండి. పట్టిక రాసుకోండి.

.కొనాల్సినవి.. చదవాల్సినవి . చూడాల్సినవి. మాట్లాడాల్సినవి. చేయాల్సినవి. ముగించాల్సినవి . తేలనివి. తేల్చవలసినవి . నేర్చుకోవలసినవి.మార్చుకోవలసినవి .వాయిదా పడినవి, వాయిదా వేయదగినవి . వదిలించుకోవలసినవి . నిలబెట్టుకోవలసినవి. స్పష్టం కావల్సినవి . మీరు ప్రోత్సహించవలసిన వారు . మనం సలహాలు తీసుకోదగిన వారు, మీ సహాయం అవసరమైన వారు, నిరర్థక సమయాపహారులు . మూఢ నమ్మకాలు, సాంకేతిక మెరుగుదల, కళా సాంసృతికాంశాలు, వినోదం ఇచ్చే విషయాలు, సామాజిక కార్యక్రమాలు, వృత్తి నైపుణ్యాలు, మానవ సంబంధాలు, వెళ్లవలసిన ప్రదేశాలు..
ఈ జాబితాలో మీరు ఏం రాసుకున్నా అందుకు వ్యవధి ఏమిటో ఎప్పుడో వ్యయ ప్రయాస లేమిటో కూడా ప్రాథమికంగా ఆలోచించుకోండి. అంతిమ రూపం వచ్చే సరికి ఏమైనా మార్పులు వుండొచ్చు గాని బీజ ప్రాయమైన ఆలోచన తప్పక వుండాలి.
ఇందులో మీరు రాసుకునేదేదైనా మీ లవగాహన కోసమే తప్ప బహిరంగ ప్రచారం కోసం కాదు. ప్రతివారూ వెనువెంటనే మీతో ఏకీభవించనవసరం లేదు. వారు వద్దంటే మీరు బాఢపడాల్సిన పనీ లేదు. ప్రణాళిక అంటూ వుంటే దాన్ని సందర్భాన్ని బట్టి పట్టువిడుపులతో అమలు చేసుకోవచ్చు. కాకపోతే గత అనుభవాలను గమనంలో పెట్టుకుని వాస్తవికంగా నిర్ణయించుకోండి. కలుగుతున్న అనుభవాలను బట్టి మార్పులు చేర్పులు చేసుకుంటూ పురోగమించండి.
2011 మీదే కావచ్చు!

3 comments:

  1. నూతన సంవత్సర శుభాకాంక్షలతో...
    మంచి మాటలు ఎంత బాగాచెప్పారు.. ఈ మంచి సమయాన...క్రుతజ్ఞతలు
    ( http://andhravani.in )

    ReplyDelete
  2. ఆప్తుల యోగక్షేమాలే ఆనందదాయకం ఆత్మీయులను తలచుకొనడం పండుగనాడు విధాయకం అందుకే ఈ పర్వదిన శుభ సమయంలో ఆయురారోగ్యభాగ్యాలు పెరగాలీ ఇతొధికం.
    నూతన సంవత్సర శుభాకాంక్షలతొ ధరణీ రాయ్ చౌదరి

    ReplyDelete