Pages

Wednesday, December 22, 2010

దీక్షలు..ఉపేక్షలు..పరీక్షలు

 

నూతన సహస్రాబ్దిలో తొలి దశాబ్ది ముగిసిపోతున్న తరుణం. ఈ కాలాన్ని మీరెలా చూస్తారని ఛానెల్‌ మిత్రుడు అడిగితే ఒక పోలిక చెప్పాను. 2000 సంవత్సరం లో హైటెక్‌ ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు నాయుడు దశాబ్ది ముగింపు నాటికి రైతాంగ దురవస్థపై నిరవధిక నిరాహారదీక్షలో పట్టువదలకుండా వున్నారు. ఆనాడు ఆయన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బషీర్‌బాగ్‌ కాల్పులు ఇతర ఉద్యమాల పునాదిపై అధికారం చేపట్టిన వైఎస్‌రాజశేఖరరెడ్డి అనూహ్యంగా మరణించగా ఆయన వారసుడుగా పెనుగులాడుతున్న జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా రైతుల సమస్యపైనే 48 గంటల దీక్ష

ముగించనున్నారు.. నాయకులుగా వున్నవారు, కావాలనుకుంటున్నవారు ి సమస్యలపై ప్రత్యక్షంగా ఉద్యమించక తప్పని స్థితిని ఇది సూచిస్తుంది. సౌమ్యమైన భాషలో మాట్లాడినా మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇద్దరి దీక్షల ముందు వెనకలు ప్రస్తావించి తన చతురత ప్రదర్శించుకున్నారు. కాగా ఆయన స్థానం చేపట్టిన ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మాత్రం మూకుమ్మడి సవాళ్లను ఎలా ఎదుర్కోవాలని తలమునకలవుతున్నారు. చంద్రబాబుకు విజ్ఞప్తులు చేసినా ఆలస్యంగా రాయబారాలు పంపినా నిర్దిష్టమైన హామీలకు మాత్రం సిద్దపడటం లేదు. చంద్రబాబును ఎంతగా అపహాస్యం చేసినా ఆయన పాలనలో పొరబాట్లను ఎంతగా ఏకరువు పెట్టినా ఈ సమయంలో ఆయన ముందుకు తెచ్చిన కోర్కెలు న్యాయసమ్మతమైనవి, జగన్‌ సవాలును పైకి తేలిగ్గా తీసుకున్నట్టు మాట్లాడినా దాని వల్ల ఏర్పడే అస్తిరత్వం కాదనలేనిది. రాజకీయ మల్లగుల్లాలు అలావుంచి అసలు రైతాంగం దైన్య స్థితిని బాపడానికి మరింత క్రియాశీలంగా బాధ్యతా యుతంగా ప్రభుత్వం ఎందుకు ప్రతిస్పందించలేదన్నది అంతకన్నా కీలకమైన విషయం.
రైతాంగం వరుసగా అయిదు సార్లు వచ్చిన అధికవర్షాలు,తుపానులు, వరదల తాకిడికి ఎంతగా చితికి పోయారంటే ఆత్మహత్యలు గుండెపోటు మరణాలు రోజూ కనిపిస్తున్నాయి.అంతకు ముందే మన రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు జరక్క గిట్టుబాటు ధర సమస్యే లేక అఖిలపక్ష ఉద్యమాలు నడుస్తున్నాయి. ఎఫ్‌సిఐపై ఒత్తిడి తెచ్చి కొనుగోలు చేయిస్తామన్న మాటలు అక్షరాలా నీటి మూటలు కాగా రైతు నిండా మునిగాడు. ఇవి చాలనట్టు నెలమొదట్లొ కురిసిన వర్షాలు దిగుబడి చేతికి రాకుండా చేసి, కుళ్లిన పంటను తీసి పారేయడం కూడా తలకు మించిన భారంగా మార్చేశాయి. ప్రభుత్వ ప్రతిపక్ష నేతలు స్వయంగా పర్యటించి పరిస్తితి తీవ్రతను గమనించారు. వ్యవసాయ సంక్షోభం ఒకటైతే అందులో అత్యధికంగా వున్న కౌలు రైతులది మరింత జీవన్మరణ సమస్య. ఇవన్నీ కొత్తవిషయాలు కావు, కిరణ్‌ కుమార్‌ రెడ్డి అధికారం చేపట్టాక కూడా రైతు సంఘాలు రాజకీయ పార్టీలు ఆయనకు విన్నవించినవే. చొరవ తీసుకుని వీటిపై తక్షణ ఉపశమన సహాయక చర్యలు ప్రకటించి వుంటే అందరూ హర్షించేవారు. ప్రజల మద్దతూ లభించేది. సద్భావనతో సర్కారు ప్రారంభమై వుండేది.ఎందుకో అలా జరగలేదు.
తెలుగు దేశం హయాంలో ప్రకృతి ప్రతికూలతకు తోడు ప్రభుత్వ వైఖరి వల్ల కూడా వ్యవసాయం సంక్షోభాన్ని ఎదుర్కొన్న కాదనలేనిది. నిజానికి అందుకే వారి స్తానంలో వైఎస్‌ ప్రభుత్వం వచ్చింది.అయితే మేము వ్యవసాయాన్ని పండుగ చేశామని పదే పదే చెప్పుకోవడమే తప్ప అది దిగజారిపోతూనే వుందన్న వాస్తవాన్ని అంగీకరించలేదు.ఆత్మహత్యలు కొనసాగుతూనే వున్న నిజాన్ని చూడలేదు.కార్పొరేట్‌ వ్యవసాయం గురించిన కలలు భూ ఆక్రమణ కుంభకోణాలు తప్ప దాన్ని నమ్ముకున్న రైతు బిడ్డల సంక్షేమం పట్టలేదు. వాస్తవానికి ఎవరు అధికారంలో వున్నా ఇది ప్రపంచీకరణ విధానాలలో భాగం. గిట్టుబాటు ధరలు, ధాన్యం అమ్మకాలు, మార్కెట్‌ యార్డులు, ఎరువులు పురుగుమందులు ప్రతిదీ ప్రళయంగానే మారిన రైతన్నను ఇంత సంకట సమయంలో సహాయపడటానికి సూటిగా ముందుకు వచ్చే బదులు రాజకీయ వాదనలలో మునిగి తేలడం దురదృష్టకరమే. సభా రభసల తర్వాత ఆఖరున ముఖ్యమంత్రి చేసిన ప్రకటన కూడా కంటి తుడుపు తప్ప నిజంగా కన్నీళ్ల నివారణ కాదు. తర్వాత దశల వారిగా ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు చేసుకుంటున్న ప్రచారాలు అన్ని కూడా చేసిందే ఎక్కువన్నట్టు ధ్వనిస్తున్నాయి తప్ప పునరాలోచన వూసే కనిపించలేదు. ఆ పార్టీ కేంద్ర నేతలు కూడా జోక్యం చేసుకుని చెప్పిన విషయాలు కూడా పునరుద్ఘాటనలు స్వీయ సమర్థనలే తప్ప వాస్తవికంగా లేవు. గతంలో ప్రకటించి కూడా ఇవ్వని సహాయాన్ని పాక్షికంగా విడుదల చేసి దానికి కూడా బయానా అని నామకరణం చేయడం పుండుమీద కారం చల్లడమే. రేపు దీన్ని నిర్దాక్షిణ్యంగా కత్తెర వేయడం కేంద్ర విధానమని కూడా అందరికీ తెలుసు. రైతాంగం దైన్యం కళ్లముందు కనిపిస్తుండగా ప్రతిపక్ష నేత దీక్షను తీవ్రంగా తీసుకోకపోవడంలో విజ్ఞత వాస్తవికత కనిపించదు. దీనిపై వీలైన మేరకు పునరాలోచించి ఆ పైన అందరం కలిసి కేంద్రంమీద వత్తిడి తీసుకువద్దామని చెబితే ఎంతో హుందాగా వుండేది. ఆ అవకాశం ఇప్పటికీ వుంది.
ప్రజాస్వామ్యంలో సమస్యలపై నిరాహారదీక్షలు నిరసనలు ఎవరు చేపట్టినా ఆహ్వానించవలసిందే, ప్రభుత్వాలు వీలైన మేరకు స్పందించి పరిష్కార చర్యలు తీసుకోవలసిందే. స్వంత పార్టీ ఏర్పాట్లు చేసుకుంటున్న జగన్‌ 48 గంటల సామూహిక దీక్ష కూడా రాజకీయ అరంగ్రేట్రానికి సరైన సందర్భమే. ఇందులో ఎవరు ముందు ప్రకటించారు ఎవరు ముందు కూచున్నారు అని రాజకీయ కేశ విభజన చేయవలసిన అవసరమేమీ లేదు. కాకపోతే జగన్‌ ప్రత్యేక నేపథ్యాన్ని బట్టి, అధికార పక్షం నుంచి నిష్క్రమించిన కీలక వ్యక్తి కాబట్టి దాని రాజకీయ కోణం కూడా ప్రధానమవుతుంది.ఎందుకంటే తెలుగు దేశం కాంగ్రెస్‌ల వైరం మొదటి నుంచి వున్నదే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యక్షంగా రంగంలోకి వచ్చిన కొత్త నేత జగన్‌. పాలకపక్ష సభ్యులను రాబట్టి సంక్షోభం సృష్టించగల శక్తివున్న వ్యక్తి కూడా గనక కృష్ణాతీర సమీకరణం నిశిత విశ్లేషణానికి గురి కావడం సహజం. ఆ రీత్యా చూస్తే జగన్‌ సేనలో చేరిన శాసనసభ్యుల సంఖ్యాబలం గణనీయంగానే వుంది. ఇంచుమించు ఇరవైకి అటూ ఇటుగా వుంటుందని వారు చెబుతూ వచ్చిన మాటలు నిజమేనని రుజువైంది.వీరంతా 'ఇక్కడే' వుంటారా లేదా వీళ్లు ఇలాగే వుంటే తక్కిన వారంతా 'అక్కడ'ే వుంటారా లేదా అన్నది భవిష్యత్తు చెబుతుంది. పైగా తమ నేత దీక్షను ఉపేక్షించిన సర్కారు పట్ల ప్రధాన ప్రతిపక్షం ఎలాటి వైఖరి అనుసరిస్తుంది అవిశ్వాసం వంటి వ్యూహాలు చేపడుతుందా? అప్పుడు మరెన్ని రాజకీయ ప్రకంపనలు కలుగుతాయి?ఇవన్నీ నిరాధారమైన ప్రశ్నలు కావు. నిజంగా ఆలోచింపచేసే అంశాలు. సమస్యల పరిష్కారంలో గాని సంక్షోభ నివారణలో గాని సర్కారీధీశుడు ó ఏమేరకు సఫలమవుతారో చూడాలి.
తక్షణమే ఏం జరిగినా జరక్కపోయినా ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని కూడా అనిశ్చితి వెంటాడటం అనివార్యంగా అగుపిస్తుంది. డిసెంబరు నెల ముగిసిపోతున్న కొద్ది ఉద్రిక్తతలు పున:ప్రారంభమవుతాయా అన్న ఆందోళన అందరిలో నెలకొని వుంది. ఇప్పుడు అధికార పీఠాన్ని పరిరక్షించడం కోసం అధిష్టానం ప్రాంతాల రేఖలు పాటించక తమ వారందరినీ రావించి సంప్రదిస్తున్నది. మందలిస్తున్నది. ఇందులో ఏ కాస్త శాతమైనా మొత్తం తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం చేసి వుంటే ఎన్నో అపార్థాలు అనర్థాలు తప్పిపోయేవి. జస్టిస్‌ శ్రీకృష్ణ తన వైఖరిని చూచాయగా చెప్పారు గాని కేంద్రం మాత్రం ఇంకా మూసిన పిడికిలి విప్పడం లేదు. టిఆర్‌ఎస్‌తో సహా వివిధ రాజకీయ శక్తుల వ్యూహ ప్రతివ్యూహాలు వివిధ ప్రాంతాల భావోద్వేగాలు కూడా ఆ కారణంగానే ఒకింత ఉత్కంఠ భరితమవుతున్నాయి. వీటితో నిమిత్తం లేకుండా ధర్నా చౌక్‌లో అన్ని తరగతుల ఉద్యోగ శ్రామిక వర్గాలు ఉద్యమాలతో వూపేస్తున్నాయి. రైతాంగం రగిలిపొగిలి పోతున్నది. పోలీసు అధికారులు కూడా ఈ సంధిగ్ధ సంధ్యలో సంక్లిష్ట వ్యాఖ్యలతో సంవాదానికి అవకాశమిచ్చి సర్దుకుంటున్నారు. ఏమైనా కరిగిపోతున్న కాలం అందరికీ అనేక పాఠాలు నేర్పింది. ఎవరి లక్ష్యాలు ఏవైనా బాధ్యతగా సంయమనంగా వ్యవహరించడం అవసరమన్నది అన్నిటికన్నా పెద్ద పాఠం. విశాల జనరాశుల శ్రేయస్సు అన్నిటికన్నా ముఖ్యం. అందులోనూ అతలాకుతలమైన రైతును ఆదుకోవడం తక్షణావశ్యం.

1 comment:

  1. please watch
    http://bookofstaterecords.com/
    for the greatness of telugu people.

    ReplyDelete