Pages

Saturday, December 4, 2010

దొరికి పోతున్న మీడియా

మీడియా నిష్పాక్షికత గురించి నిత్యం కబుర్లు వినిపిస్తూనే వుంటాయి.అదేదో నిష్కామకర్మగా నివేదించడానికే అంకితమైందన్నట్టు మాట్లాడుతుంటారు. కాని వాస్తవంలో ధనాఢ్యవర్గాలు ఆధిపత్య శక్తుల ప్రయోజనాలనే మీడియా ప్రతిబింబిస్తుందని నిస్సందేహంగా నిరూపించే పరిణామాల పరంపర ఇటీవల చూస్తున్నాము. ఇవన్నీ మీడియా వర్గస్వభావాన్ని తేట తెల్లం చేస్తున్నాయి. అది అన్నిటికీ అతీతమైనట్టు నిష్పాక్షికమైనట్టు వినిపించే కథనాల లోగుట్టు తేలిపోతున్నది. సాక్షాత్తూ దేశ రాజధానిలో న్యూఢిల్లీ ప్రెస్‌ క్లబ్‌లోనే నీరా రాడియా టేపులపై మీడియా హేమాహేమీలు సాగించిన సంవాదాల వెనక సామాజిక సత్యాలు చాలా వున్నాయి.అంతకు ముందు సాక్షి సోనియా గాంధీకి సంబంధించి ప్రసారం చేసిన కథనాలపై ప్రకంపనాలు కూడా ఈ కోణం నుంచి పరిశీలనార్హమే అవుతాయి.
ముందు స్థానికమైంది గనక సాక్షి కథనాలతో మొదలు పెడదాం. సోనియా గాంధీ నాయకత్వం లోపభూయిష్టమని ఆమె వల్లనే అధికార పక్షం అపజయాల పరంపరకు గురవుతుందని సాక్షి కథనం సారాంశం.ఈ విధంగా ప్రసారం చేయడం అపరాధమేమీ కాదు.అలా అనుకునే ప్రచారం చేసే హక్కు ఎవరికైనా వుండొచ్చు. కాని సాక్షి ఛానల్‌లో ఈ కథనం ప్రసారమయ్యే నాటికి జగన్‌ కాంగ్రెస్‌ ఎంపిగా వుండటమే వివాదానికి అంత వివాదానికి కారణమైంది. మంత్రులు కూడా వెళ్లి ధర్నాలు చేయడం పత్రికా స్వేచ్చకు ఆటంకం అన్న విమర్శ సమాజానిక సంబంధించినదైతే రాజకీయ ప్రయోజనాల కోసం మీడియాలో కథనాలు ప్రసారం చేయడం అనేది వారి ఆంతరంగిక విషయం. గతంలో కూడా తెలుగు నాట పత్రికాస్వేచ్చకు యాజమాన్య స్వేచ్చకు మధ్యన ఎడతెగని వివాదాలు నడిచాయి. వాస్తవంలో మీడియాకు వర్గ స్వభావం వుంటుంది.కమ్యూనిస్టులు తప్ప మరెవరూ బహిరంగంగా చెప్పి పత్రికలు ఛానళ్లు నడిపించడం అరుదైనా ఎవరు ఎలా ప్రచురణలు ప్రసారాలు చేస్తారనేది అందరికీ తెలిసిస విషయమే. వైఎస్‌.రాజశేఖరరెడ్డి అధికారంలో వున్నన్నాళ్లు ఆ రెండు పత్రికలు అంటూ వాటిపై దాడి చేస్తూనే వుండేవారు.మార్గదర్శి వివాదం వచ్చినపుడు కూడా మీడియాను ఉపయోగించుకోవడం వంటి ప్రస్తావనలు నడిచాయి.ఆనాటి ప్రెస్‌ అకాడమీ దీనిపై చర్చలు కూడా నిర్వహించింది. సమస్య ఏమంటే సాక్షి విషయానికి వచ్చే సరికి ఈ రెండవ భాగం అంటే యాజమాన్యం స్వభావానికి సంబంధించిన అంశాన్ని కొందరు పాత్రికేయ నాయకులు అస్సలే పట్టించుకోకపోవడం! ఏదైనా ప్రసారం చేయడానికి గల హక్కును సమర్థిస్తూనే దాని నేపథ్యాన్ని కూడా చెప్పక పోతే ఇక విమర్శనాత్మక విశ్లేషణాత్మక ధర్మం ఏమయ్యేట్టు? దీనిపై జగన్‌ చూపిన పట్టుదల ఆ తర్వాత ఏకంగా పార్టీ నుంచే బయిటకు నడవడం బట్టి ఆ కథనం వ్యూహాత్మకమైనదని స్పష్టం అవుతుంది. కనక ఆ హక్కును గౌరవించడంతో పాటు దానిలోని రాజకీయ ఆధిపత్య వ్యూహాలను కూడా జనం గుర్తించవలసి వుంటుంది.
సాక్షి మాత్రమే కాక ఇతర మీడియా సంస్థలకు కూడా ఇది ఏదో రూపంలో వర్తిస్తుంది. వారి వారి ప్రాధాన్యతలు ప్రాథమ్యాలు ప్రయోజనాలతో ముడిపడి వుండవనుకోవడం భ్రమ మాత్రమే. మిగిలిన వ్యాపార సంస్థల్లానే మీడియాను కూడా స్పష్టమైన రాజకీయ ఆర్థిక వ్యక్తిగత ప్రయోజనాలు శాసిస్తుంటాయి. అవి నిరంతరం ప్రజల హితం వైపే వుంటాయన్న హామీ ఏమీ లేదు.యాజమాన్య దృష్టికోణాన్నే ప్రతిబింబిస్తాయి. ఉదాహరణకు సాక్షిలో నెల రోజుల కిందటైతే ఇలాటి కథనాన్ని వూహించగలిగేవారం కాదు. అంతర్జాతీయంగా అమెరికా సామ్రజ్యవాదానికి వంత పాడినా దేశంలో కార్పొరేట్‌ ప్రపంచీకరణను ఆకాశానికెత్తినా మీడియాకు స్పష్టమైన దృక్పథం వుంటుంది. అవినీతి కుంభకోణాల వెలికి తీతలోనూ పరిశోధనాత్మక జర్నలిజంలోనూ హెచ్చు తగ్గులు ముందు వెనకలు వుండటానికి కారణమిదే. అసలు దేశంలోనే ఈ వరవడికి మూలకారకుడుగా అతి ప్రచారం పొందిన అరుణ్‌శౌరి తానే మంత్రి కావడం, సెంటూర్‌ హౌటళ్ల అమ్మకాలలో ఆరోపణలకు గురి కావడం దేనికి నిదర్శనం? పత్రికా సంపాదకులు ప్రముఖ విలేకరులు కార్పొరేట్‌ సంస్థల బాధ్యతలు తీసుకోవడం, మళ్లీ వచ్చి మీడియా సారథులు కావడం ఈ నాడెంత తేలికై పోయింది? ఇందులో ప్రయోజనాల ఘర్షణ( కాన్ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌)వుండదా?ఇప్పుడు అమెరికాలో వికీలీక్స్‌ ద్వారా వెల్లడవుతున్న భయానక సత్యాలను గతంలో ఏ పెద్ద అంతర్జాతీయ పత్రికా పరిశోధకుడు ఎందుకు బయిటపెట్టలేదు? 2జి స్ప్రెక్ట్రమ్‌పై సీతారాం ఏచూరి రెండేళ్ల కిందటి నుంచి పదే పదే లేఖలు రాస్తున్నా ఎందుకు మీడియా స్పందించి వివరాలు సేకరించలేదు? మౌలికంగా మన మీడియా ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకం కాదు గనకే! పాలకపక్షాల మధ్య దోబూచులాటలో అటూ ఇటూ తిప్పడం తప్ప మౌలికంగా ప్రజాధనాపహరణం గురించి చెప్పడం దానికి నచ్చదు.అన్నిటికన్నా పెద్ద కార్పొరేట్‌ ప్రయోజనం మీడియాధిపతులకే వుంటుంది.- కనీసం జాతీయంగా.భవిష్యత్తులో విదేశీ పత్రికలు కూడా వచ్చేస్తే మరెంత దారుణంగా వుండేది వూహించుకోవలసిందే. అమెరికా మేధావి మీడియా అధ్యయన వేత్త నామ్‌ చామ్‌స్కీ చెప్పిన అంగీకారసృష్టి(మ్యానుఫాక్చరింగ్‌ కన్సెంట్‌) పాత్రను మీడియా ఎలా పోషిస్తున్నది తెలిపే ఉదాహరణలే ఇవన్నీ. అవినీతి సరళీకరణ విధానాలలో అవిభాజ్య భాగమని చెప్పే బదులు వ్యక్తులకు పరిమితం చేసి వ్యవస్థను కాపాడుతుంటారు.
కార్పొరేట్‌ లాబీయిస్ట్‌ నీరా రాడియా ఈ విషయంలో ప్రసరించిన ప్రభావాన్ని చూస్తే మీడియాలో వారి చొరబాటు ఎంతగా వుందో తెలుస్తుంది. 2 జి స్పెక్ట్రమ్‌ తీగలాగి డొంక కదిలించడం గాక దానిలో నిందితులైన వారి పదవులను పరిరక్షించే పని మీడియా ప్రముఖులకు అప్పగించబడటం వూహకందని విషయంలా అనిపించవచ్చు గాని వాస్తవంలో ఇలాటివి జరుగుతూనే వుంటాయి. ఈ విషయాలు ఔట్‌లుక్‌ ప్రచురించడంలోనూ అవతలి పక్షం హస్తం వుందడని అనుకోలేము.ఏమైన ఒకసారి బర్ఖాదత్‌,వీర్‌సంఘ్వీలతో నీరా రాడియా ఫోన్‌సంభాషణలు బయిటకు వచ్చాక ఏ విధమైన సమర్థనలు నిలిచేవి కావు. ఇవి యథాలాపంగా జరిగిన సంభాషణలు కాదు, క్రమబద్దంగా కొనసాగాయి. ప్రతిపాదనలు హామీలు బేరసారాలు మంతనాల ప్రస్తావనలు వీటిలో వున్నాయి.సిఎన్‌ఎన్‌ఐబిఎన్‌ అధినేత, ఎడిటర్స్‌ గిల్డ్‌ అద్యక్షుడు రాజ్‌దీప్‌ సర్దేశాయి ప్రెస్‌క్లబ్‌ గోష్టిలో ఈ ప్రస్తావన వచ్చినపుడు నిర్ధారించుకోకండా టేపులు ప్రచురించారని, లేదా ఈర్షాసూయలతో ప్రచురించారని చెప్పడం మరింత నిరసనకు దారి తీసింది. చివరకు ఆయన తన మాటలు వెనక్కు తీసుకోక తప్పలేదు.
అయితే సమస్య వారికే పరిమితమైంది కాదు. మన మీడియా అన్న పుస్తకంలో ఈ రచయిత చర్చించినట్టు, మీడియా మాయాజాలంలో నామ్‌ చామ్‌స్కీ స్పష్టం చేసినట్టు మీడియాను సవ్యంగా అర్థం చేసుకుంటేనే పుంఖానుపుంఖంగా వెలువడే దాని ప్రసారాలను విమర్శనాత్మకంగా స్వీకరించగలుగుతాము. నీర క్షీర న్యాయంగా సత్యాసత్యాలను విడదీసి చూడగలుగుతాము.
కొసమెరుపు: గతంలో బ్రిటిష్‌ యువరాజు చార్లెస్‌ డయానాల పెళ్లి కథల చుట్టూ ప్రదక్షిణలు చేయించి ఆ పైన వారు విడిపోయాక డయానా వ్యక్తిగత జీవిత కథనాలకోసం వెంటాడి వేధించడం పొరబాటేనని ఆమె పదవ వర్ధంతి సందర్భంలో బ్రిటిష్‌ మీడియా ఆత్మ విమర్శ చేసుకుంది. కాని ఇప్పుడు ఆమె కుమారుడు విలియమ్స్‌ ప్రేమ పెళ్లి కథల విషయంలోనూ అదే పునరావృతమవుతున్నది. మన రాష్ట్రంలో ఇటీవల ఒక యువ హీరో నిశ్చితార్థం కూడా ఇలాగే అనుమతించకపోయినా అనేక ఛానళ్లు వెంటబడి ప్రసారం చేశాయి. నిజంగా ఇవన్నీ ప్రజలకు అవసరమా? శ్రీశ్రీ అన్నట్టు-
ఆ రాణిప్రేమపురాణం
ఈ ముట్టడికైన ఖర్చులూ
మతలబులూ కైఫీయతులు
ఇవి కావోరు చరిత్ర సారం!
తాజ్‌మహల్‌ నిర్మాణానికి
రాళ్లెత్తిన కూలీలెవ్వరు?
ప్రభువెక్కిన పల్లకి కాదోరు
అదిమోసిన బోయీలెవ్వరు?
అయితే పల్లకి తయారు కాకముందునుంచే దాని కథలలో ముంచి తేల్చే ఈ రోజుల్లో ఈవాక్యాలు మరింత సత్యం కదూ? 4-12-10

2 comments:

  1. being a media person u r right but our media itself is acting as deaf in 95% cases sir ji...

    ReplyDelete
  2. మా గురువుగారే ఏకీభవించాక నేను చెప్పేదేముంది? వైస్ మెన్ థింక్ అలైక్. నేను నా ఆపరేషన్ ఇండియా2000 పథక అమలుకు నిదుల సమీకరణార్థం ఇచ్చిన సలహాల్లో ఒకటి "ప్రభుత్వమే ఒక దిన పత్రిక కలిగి ఉండాలి.ప్రభుత్వ ప్రకటనలు అందులో మాత్రమే వెలుబడాలి.ప్రతి రోజు దేశంలోని ప్రఖ్యాత జర్నలిస్టు ఒకరు జంబ్లింగ్ పద్దతిలో దానికి ఎడిటర్ షిప్ వహించాలన్నదే

    ReplyDelete